వాళ్లు నమ్మదగినవాళ్లే కాదని ముందే చెప్పాం!

టిఆర్‌ఎస్‌ పెద్దలు వినలేరు?

ఈటెల మోసాలు ఎనాడో బైటపెట్టాం?

ప్రభుత్వం పట్టించుకోలేదు?

ఉద్యమ కారుడి ముసుగులో పెంచుకున్న వ్యాపారం గురించి రాశాం!

పౌరసరఫరాల శాఖను మేస్తున్నాడని చెప్పినా వినపడలేదు?

అసైన్డ్‌ భూముల బాగోతం ఏనాడో చెప్పాం! మీరు కదల్లేదు?

ఈటెల పోలీసులను పురిగొల్పి కేసులు పెడితే ఎదుర్కొన్నాం?

బెదరకుండా, అదరకుండా ఈటెల అవినీతి మరింత బైట పెట్టాం!

గటిక విజయ్‌ కుమార్‌ గురించి ముందే హెచ్చరించాం!

సిఎంవోలో సాక్షిగా అక్రమాలకు తెరతీశాడని చెప్పాం!

వినిపించుకోలేదు సరికదా!

నేటిధాత్రి ఎమ్‌ప్యానల్‌ మెంటు ఆపారు?

బొంతు గురించి ఎన్నో సార్లు రాశాం…ఎప్పుడో పుట్ట పగలడం ఖాయం?

నమ్మిన వాళ్లను ముంచి, బిజేపిలో చేరితే సచ్చీలురౌతారు?

పార్టీలో ఇలాంటి వాళ్లు చాలా మందే వున్నారు?

వారిని గుర్తించి ప్రజల ముందు వుంచుతాం…

జనం గుండెల్లో అక్షర నాదం…నేటి ధాత్రి అక్షర వేదం.

వాళ్లు నమ్మదగిన వాళ్లే కాదని ముందే చేప్పాం…! ప్రజల సొమ్ము తింటున్నారు. కోట్లు కూడేసుకుంటున్నారు. ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారు. పైరవీలతో పైసాపైసా వెనకేసుకుంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో కోట్లకు పడగలెత్తుతున్నారు. నమ్మకం వున్న చోటే మోసానికి తావుంటుందని నిరూపిస్తున్నారని నేటిధాత్రి ఎంతో కాలంగా చెబుతూనే వస్తోంది. కాని నేటిధాత్రి అక్షరాలది అరణ్య రోధనే అయ్యింది. పట్టించుకున్నవారు లేరు…కనీసం వాటిని గురించి ఆరా తీసిన వాళ్లు లేరు. నిజాలు చెప్పిన నేటిధాత్రినే ఇబ్బందులకు గురిచేసే పనులు చేస్తున్నా, పాలక పక్షం పెద్దలు పట్టించుకోలేదు. వారినే నమ్మారు…. అక్రమార్కుల గురించి ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నేటిధాత్రి అక్షరాలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాకా ఈ అవినీతి పరులు చేరనివ్వలేదు. నమ్మి దగ్గర పెట్టుకున్న వాళ్లే నిమ్మించి గోతులు తీస్తుంటే కనుక్కోలేకపోయారు. నిజాలు చెప్పిన నేటిధాత్రి మీద క్షక్ష్య పెంచుకున్నారు. ఆఖరుకు చెప్పుకోవడానికి ఎంత సిల్లీగా వుంటుందంటే అక్రిడిటేషన్‌ కార్డు సైతం ఆపించారు…హెల్త్‌ కార్డు జారీ చేయలేదు…ఆసుపత్రిలో వైద్యం అవసరం వచ్చినప్పుడు కూడా సాయం అందుకుండా చేశారు..అలాంటి వారు ప్రభుత్వ సిఎంవో కార్యాలయంలో తిష్ట వేసుకొని కూర్చొని నేటిధాత్రిని అణచివేసే కుట్ర చేశారు. అయినా పార్టీ పెద్దలు, పాలక పెద్దలు వారినే నెత్తిన పెట్టుకున్నారు. నిజాలు చెప్పిన వాళ్లు విరోధులయ్యారు. 

ప్రభుత్వానికి తలవంపులు తెస్తున్న వారు ఆప్తులయ్యారు. అందలమెక్కారు. ఒక్కసారిగా వారి అసలు స్వరూపం తెలిసి అవాక్కయ్యారు. అదేదో నేటిధాత్రి చెప్పినప్పుడే కదిలితే, తేరుకుంటే ఎంతో బాగుండేది. ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదాకా కళ్లు తెరవలేకపోయారు. ఈటెల రాజేందర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. సిఎంలో సిపిఆర్వోగా పనిచేసిన గటిక విజయకుమార్‌ విషయంలోనూ అదే జరిగింది. ముందు నుంచి హెచ్చరిస్తున్న నేటిధాత్రి చెప్పిన విషయాలే నిజాలయ్యాయి. ఉద్యమకాలం నుంచి ఎంతో నమ్మి, ఆయనను పక్కన పెట్టుకొని, ఆయన కోసం కొందరిని పక్కన పెట్టి మరీ నమ్మితే ఈటెల రాజేందర్‌ చేసిందేమిటో తెలిసే వరకు కాలం ఎప్పుడో చేయిదాటిపోయింది. ఈటెల రాజేందర్‌ వ్యాపారం సామ్రాజ్యం ఎంతో పెరిగిపోయింది. ప్రభుత్వాలు తేల్చలేనంత దూరం వెళ్లిపోయింది. ఈటెల రాజకీయం కూడా ఏకు మేకైంది…ఈటెల మంత్రిగా తన ప్రస్ధానం మొదలైన నాటి నుంచి చేస్తున్న జిత్తులు రాస్తూనే వున్నాం. అసైన్డ్‌ భూముల ఆక్రమణ గురించి నేటిధాత్రి చెప్పింది. సివిల్‌ సప్లయ్‌ శాఖలో జరిగిన అవినీతిని మొత్తం బైట పెట్టింది. పార్టీకి నిజాలు చెబుతూ, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా వుండాలని ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. నేటిధాత్రి వార్తలు ఆనాడు అబద్దాలుగా కనిపించాయి. కాని అవే నిజమయ్యాయి. 

అవినీతి పరుడైన ఈటెల మూలంగా నేటిధాత్రి ఎదుర్కొన్న కేసులు, ఎదరైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈటెల రాజేందర్‌ పోలీసులను పురిగొల్పి కేసులు నమోదు చేస్తే, ఆనాడు బిజేపి నేతలే అన్యాయమన్నారు. తెలంగాణలోని 23 జిల్లాల్లో ఏక కాలంలో ఈటెల అక్రమాలపై ధర్నాలు చేశారు..కాని అదేంటో ఆ ఈటెల రాజేందర్‌నే బిజేపి పెద్దలు అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌పై మాట్లాడేందుకు ఒక అస్త్రంగా ఈటెలను వాడుకుంటున్నారు. ఇవి నైతికతను ఆపాదిస్తాయా? అన్నది బిజేపి పెద్దలే ఆలోచించుకోవాలి. అవినీతి పరుడుని తేలిన మరుక్షణం ఆయన బిజేపిలో చేరి తనంత సచ్చీలుడు లేడని కితాబిచ్చుకుంటున్నాడు. అక్రమ ఆస్ధులను పేదలకు పంచుతున్న ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ము కాకులెత్తుకుపోతున్నట్లు నానా యాగీ చేస్తున్నాడు. అక్రమ సంపాదనదారుడు ఈటెలే గాయి, గాయి చేస్తున్నాడు. తన ఆస్ధులు లాక్కుంటున్నారంటూ అపవాదులేస్తున్నాడు… ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీదనే పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నాడు. పుట్టింది టిఆర్‌ఎస్‌లో, పెరిగింది టిఆర్‌ఎస్‌లో…అక్రమ సంపాదనాపరుడై బైటకు వెళ్లగొడితే తేలు కుట్టిన దొంగలా వుండాల్సిన వాళ్లే, అరుస్తున్నారు..ఆగమాగం చేస్తున్నారు…ప్రభుత్వ పెద్దల మీదనే బురద జల్లుతున్నారు. నమ్మించి మోసం చేసే నైజం ఈటెలదని నేటిధాత్రి ఎంత చెప్పినా వినిపించుకోని వాళ్లు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాలేదా? 

ఎంతో నమ్మి, పక్కన పెట్టుకుంటే సిఎంపిఆర్వో గటిక విజయ్‌కుమార్‌ చేసిందేమిటి? ప్రభుత్వానికి సేవ చేయాల్సిన సమయంలో, పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో, అన్నీ వదిలేసి ఆస్ధులు కూడబెట్టుకునే పనిచేస్తున్నాడంటే ఒక్కరైనా విన్నారా? ఒక్కరైనా నేటిధాత్రి నిజాలను ఆలకించారా? కనీసం ఎందుకు ఇలా నేటిధాత్రిలో కథనాలొస్తున్నాయన్నదానిపై ఆరా తీశారా? లేదు! ఓ వైపు గటిక విజయ్‌ కుమార్‌ అక్రమాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి తెస్తుండడంతో అతను నేటిధాత్రి మీద కక్ష్య పెంచుకున్నాడు. సమాచార శాఖలో పత్రికను అడ్డుకునే ఎత్తుగడలు వేశాడు. నేటిధాత్రిని అణిచే కుట్రకు తెరతీశాడు. అయినా నేటిధాత్రి వెరవలేదు. బెదరలేదు. ఎట్టకేలకు నేటిధాత్రి కథనాలు నిజమయ్యాయి. గటిక విజయ్‌కుమార్‌ సిఎంవోను నుంచి సాగనంపబడ్డాడు. కాని ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని వదిలేశారు. దాంతో ఆయన కూడేసుకున్న సొమ్ముతో తమ్ముడిని బిజేపిలోకి పంపించే యోచన చేస్తున్నాడు. బిజేపిలో చేరి సచ్చీలుడుగానే కాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా గటికి విజయ్‌కుమార్‌ పావులు కదుపుతున్నాడు. 

                  ఒకనాడు ఒక సామాన్యమైన జర్నలిస్టు. జీతం మీద ఆధారపడి జీవనం సాగించే జర్నలిస్టు కొంత కాలం పాటు సిఎంవోలో పనిచేస్తే వందల కోట్ల ఆస్ధులు సంపాదించొచ్చా? సహజంగా జీతంతో జీవితం వెల్లదీసే ఉద్యోగులు ఒక్క నెల జీతం ఆలస్యమైతేనే ఆగమాగమౌతారు. అలాంటిది గటిక విజయ్‌కుమార్‌ను సింఎంవోతోపాటు, విద్యుత్‌ శాఖ ఉద్యోగం కూడా కోల్పోయి ఎంతో కాలమైతుంది. అయినా ఆయన ఎక్కడా ఎలాంటి పని చేయడంలేదు. అంటే ఎంత వెనకేసుకుంటే అంత నిశ్చింతగా బతకుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఎన్నికల మీద దృష్టిపెట్టినట్లు, టిఆర్‌ఎస్‌ మీద పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందకు బిజేపిని ఎంచుకొని, తనపై కేసులు కాకుండా చూసుకొని రాజకీయాలు చేయడానికి సిద్ధమౌతున్నాడని సమాచారం. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దల ఉదాసీనత మరోసారి ప్రస్పుటంగా కనిపిస్తోంది. జర్నలిస్టుగా పనిచేసినంత కాలం లేని ఆస్ధులు ఐదేళ్లపాటు సిఎంపిఆర్వోగా పనిచేయగానే వచ్చాయంటే ఏ తరహా పైరవీల వ్యాపారం సాగించాడో అర్ధం చేసుకోవచ్చు. ఎంత సక్రమ సంపాదనా పరుడైనా వందల కోట్లు ఐదేళ్ల కాలంలో సంపాదించడం అన్నది కుదిరేపని కాదు. అక్రమార్జన వుంటే తప్ప వందల కోట్లు సంపాదించుకోవచ్చని గటిక విజయ్‌కుమార్‌ నిరూపించినట్లే లెక్క. 

అలాగే గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా వుండి చేసిన అక్రమాలపై కూడా నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన కథ కూడా కంచికి చేరింది. కాని ఆయన ఇప్పుడు తనంత గొప్ప నాయకుడు లేడన్నట్లు రాజకీయ వేదిక కోసం ఆరాపడుతున్నాడు. బిజేపి వైపు చూస్తున్నాడు. ఇలా ప్రభుత్వంలో పనిచేస్తూ మేయర్‌ పాత్ర పోషిస్తూ బొంతు రామ్మోహన్‌ చేసిన అక్రమాలపై నేటి ధాత్రి ఎన్ని వివరాలు చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో తన సంపాదన కూడా పాపం పెంచుకున్నట్లు పెంచుకున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నదే…కాని టిఆర్‌ఎస్‌ పెద్దలు మాత్రం కదలడం లేదు. ఏదో ఒకనాడు బొంతు కూడా తాను సచ్చీలుడిననే పాత్రలో దూరిపోయే సమయం కూడా పెద్దగా దూరం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. అవినీతి పరులపై నేటిధాత్రి అక్షరాలు ఇంత వరకు వృధా కాలేదు. గతంలో జయశంకర్‌ భూపాల పల్లి జిల్లా కలెక్టర్‌ అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చి, జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టడానికి కూడా నేటిధాత్రే కారణమన్న సంగతి తెలిసిందే…! అడుగడునా ఆటంకాలు ఎదురైనా, అక్రమార్కులను వదలిపెట్టకుండా, నిప్పులాంటి నిజాలను అక్షరాలుగా మలిచి, ప్రపంచం ముందు వారిని దోషులుగా నిలబెట్టిన చరిత్ర నేటిధాత్రిది…ఉద్యమ కాలంగా ఉద్యమాన్ని భుజాన మోసి, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రగతి కోసం సాగుతున్న అక్షర యజ్ఞమే నేటిధాత్రి….! మా అక్షరాల నైజం నిజం…మేం చెప్పదలుకున్నది చెబుతాం…నిజాలు వెలుగులోకి తెస్తాం… ప్రజల ముందు వుంచుతాం…! తెలంగాణ కోసం కొట్లాడిన అక్షరాలు…తెలంగాణకు అన్యాయం చేసే వారిని కూడా వదిలిపెట్టదు…! మా అక్షర ప్రయాణం ఎంతో కఠిన తరం…అయినా అలవోకగా అక్షరాలు పేర్చి, అవినీతిని చీల్చి చెండాడుతాం..వెలుగురేఖలు ప్రసరించేందుకు దివిటీలమౌతాం.. నిరంతరం జనం గుండెల్లో అక్షర నాదం చేస్తూనే వుంటాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!