`ఇరు శిబిరాల మనసులో ఒకటే వుంది?
`ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది.
`మమ్మల్ని పట్టించుకోవడం లేదని వీళ్లకుంది?
`ఇక్కడ అందరూ ఒక్కటే అని వాళ్లంటోంది?
`వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని వాళ్లకుంది?
`మేము షార్ప్ అని వీళ్లకుంది?
`లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది!
`పోతా అనుకునేవారిని ఆపేదేముంది?
`బండి సంజయ్ మాటలు ఆజ్యం పోసినట్లైంది!
`ఇప్పుడేం జరగనుంది?
`అంతటా ఆసక్తి నెలకొన్నది!
`ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది?
హైదరబాద్,నేటిధాత్రి:
రాష్ట్ర బిజేపిలో పలు శిబిరాలు వున్నా, తెరమీదకు మాత్రం ఇరు శిబిరాలు ఇటీవల బాగా వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కు పార్టీలో ప్రాధాన్యత పెరుగుతోందన్నప్పుడల్లా బిజేపిలో అలజడి మొదలౌతోంది. నిజానికి ఈటెల రాజేందర్ బిజేపి చేరిన నాటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి. ఆనాడు ఈటెల రాజేందర్ వస్తే బాగుంటుందని, రావాలని కోరుకున్న వారు కూడా ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బిజేపిని వాడుకోలేదు. ఆ సమయంలో బండి సంజయ్ యాత్రలో వున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి ప్రచారం అవసరం రాలేదు. బిజేపి అగ్రశ్రేణి నేతలెవరూ వచ్చింది లేదు. పైగా వాళ్లు రావొద్దనే ఈటల కూడా సూచించారు. తమకు శ్రమ తప్పుతోందని, ఇక్కడికి ఇదే మంచిది అన్నట్లు బిజేపి పెద్దలు కూడా భావించారు. కానీ ఆ గెలుపు ఖాతా బిజేపి లో పడలేదు. కేవలం ఈటెల రాజేందర్ వ్యక్తి గత ప్రతిష్ఠ మూలంగానే గెలవడం జరిగిందనేది జగమెరిగిన సత్యం. అయితే ఈటెల రాజేందర్ గెలిచాక పార్టీలో ఆయన కు కీలక స్థానం కల్పిస్తారని అందరూ ఊహించారు. కానీ అదేదీ జరగలేదు. కనీసం అసెంబ్లీలో బిజేపి పక్ష నాయకుడుగా కూడా గుర్తించడానికి పార్టీకి మనసు రాలేదు. నిజానికి ఈటెల రాజేందర్ మనస్తత్వానికి బిజేపి పార్టీ తగదు. ఆయనే అనేక సార్లు చెప్పిన విషయం ఒకటుంది. తనకు రాజకీయాలలోకి రాకముందు గుడికి వెళ్లే అలవాటు లేదు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం, రాజకీయాలు సాగుతున్న తరుణంలో ఏ గ్రామానికి వెళ్ళినా ముందు గుడికి తీసుకెళ్లడం జరిగేది. దాంతో ప్రజల అభిప్రాయం, మనో భావాలను గౌరవించడం అలవాటైందని చెప్పారు. అలాంటి ఈటెల రాజేందర్ బిజేపి మనుగడ అంటే కష్టమే. అయినా కొనసాగాలనే నిర్ణయించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఒక దశలో ఈటెలపై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తర్వాత పరిస్థితులు సర్థకున్నాయి. ఆ తర్వాత ఈటెల పట్ల పార్టీలో కొంత వ్యతిరేకత మెల్లిగా మొదలైంది. పనిలో పనిగా ఈటెల రాజేందర్, మాజీ ఎంపి. వివేక్ వెంకటస్వామి వ్యవహారం తెరమీదకు తెచ్చారు. ఈటెల వ్యక్తిత్వాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేశారు. అప్పటికీ ఈటెల ఇమిడిపోయేందుకే నిర్ణయించుకున్నారు. అనువుగాని చోట అధికుల మనరాదు..అనేది గుర్తు చేసుకుంటూ వచ్చినట్లున్నారు. అయితే బిఆర్‌ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బయటకు పంపించడంతో ఈటెల తనకు పని దొరికింది అనుకున్నారు.
చేయాల్సినంత కృషి చేశారు. కానీ వ్యవహారం సాగలేదు. చేరికల కమిటీ పేరు మీద నమ్మకంతో ఎవరూ రావడం లేదు. అదే సమయంలో ఈటెల రాజేందర్ ఖమ్మం వెళ్లి పొంగులేటిని కలవడం తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడం వివాదాలు ముదిరి పాకాన పడ్డాయన్నది అందరికీ అర్థమైంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత బిజేపి గ్రాఫ్ పడిపోవడం, బిజేపి లో ఈటెలకు ప్రాధాన్యత పెరుగుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇక్కడ కూడా ఈటెల స్వయం కృతాపరాధం మళ్ళీ ఆయనను మొదటికి తీసుకొచ్చింది. పొంగులేటి, జూపల్లి ని నేను బిజేపి లోకి రావాలని కోరితే, నాకే కౌన్సిలింగ్ ఇచ్చారని అనడంతో బిజేపి పని అయిపోయిందని ఈటెల నే స్వయంగా ప్రకటించినట్లైంది. తన అశక్తతను బైట పెట్టుకున్నట్లైంది. అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చేరికల కమిటీ అనేది వుండదు అని ఈటెల అన్నారు. అంటే నర్మగర్భంగా తాను అసంతృప్తి తో వున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది. ఇది బిజేపి అసలు శ్రేణులకు నచ్చలేదు. వాళ్లు జీర్ణించుకోలేదు. ఈటెల మీద ఆఫ్ ద రికార్డు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యల దుమారం ఎంత దూరం పోతుందో అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈటెల రాజేందర్ తో పాటు, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక జట్టుగా మారారన్నది ఓ ప్రచారం. ఇద్దరూ అసంతృప్తి గానే వున్నారు. అందుకే ఇరు వర్గాల మనసులో ఒకటే వుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
కర్ణాటక ఎన్నికల తర్వాత తన ప్రాభవం తగ్గుతుందేమో?
అన్న భావన బండి సంజయ్ లో మొదలైనట్లు తొలుత ప్రచారం మొదలైంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఈటెల పదే, పదే డిల్లీ ప్రయాణం, కేంద్ర బిజేపి శిబిరంలో ఏదో జరుగుతోందనేది విసృత చర్చకు దారి తీసింది. ఈటెల కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇక అప్పగించినట్లే అన్నది కూడా వినిపించింది. అంతకు ముందు బండిని తొలగించి, ఈటెలతో భర్తీ చేస్తారని కూడా వినిపించింది. ఇది బండి సంజయ్ శిబిరంలో కలకలం రేపింది. ఆ తర్వాత ఈటెల పక్క చూపులు అనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది.
మమ్మల్ని పట్టించుకోవడం లేదని సాక్షాత్తు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి తోడు బిజేపిలో కొత్త నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు ప్రత్యేకంగా వుండవన్నది తేల్చి చెప్పారు. ఇక్కడ అందరూ ఒక్కటే అని బండి వర్గం కరాఖండిగా చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని కూడా అసలైన బిజేపి వాదులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేము షార్ప్ అని ఈటెల వర్గానికి వుంది. అయినా మాలో ఎలాంటి దూరం లేదు… లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది! ఇలాంటి సమయంలో బండి సంజయ్ పోతా అనుకునేవారిని ఆపేదేముంది? అని ప్రకటన చేశారు. బండి సంజయ్ మాటలు ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లైంది! ఇప్పుడేం జరగనుంది? అనే దానిపై అంతటా ఆసక్తి నెలకొన్నది! ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది? అనే చర్చనే కాదు, కాంగ్రెస్ లో చేరిక ఊహాగానాలే నని రాజగోపాల్ రెడ్డి అంటూనే..ఏదైనా వుంటే చెబుతా? కదా!? అని అన్నారు. దీని భావం విడమర్చి చెప్పాల్సినంత అవసరం వుండదేమో!!