హైదరాబదాద్,నేటిధాత్రి:
వాళ్లు వారసులు కాదు…సైనికులు…అవును…తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో ఆ నలుగురు వున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను విశ్వవ్యాప్తం చేయడంలో ముందున్నారు. తెలంగాణ ఉద్యమ రూపాలను, స్వరూపాలను భుజాన కెత్తుకున్నారు. దశాబ్ధ కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేశారు. రాజకీయాల కోసం ఏం మాట్లాడినా చెల్లుతుందన్న భావనతో కొందరు కుత్సిన నాయకులు చేసే వ్యాఖ్యలు పక్కన పెడితే, ఉద్యమ రాజకీయ, పోరాట పంధాను ఎంచుకొని వారు సాగించిన పోరాటం అంతా ఇంతా కాదు. ఒక్కొక్కరు ఒక్కొరకంగా తెలంగాణ ఉద్యమాన్ని పరివ్యాప్తం చేయడం కోసం విశేష కృషి చేశారు. ఆ నలుగురు… పార్టీకి నాలుగు మూల స్ధంభాలు. కల్వకుంట్ల తారక రామారావు,హరీష్‌రావు, కవిత,సంతోష్‌రావు. వీళ్లను రాజకీయ వారసులు అంటే ఏ తెలంగాణ వాది ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్లు పార్టీకి క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేశారు. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ విధాత, ప్రగతి ప్రధాత ముఖ్యమంత్రి కేసిఆర్ మనో బలం ఆ నలుగురు. తెలంగాణ ప్రగతి కాంక్షకు వారు ప్రతీకలు. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం ఉవ్వెత్తున సాగేందుకు సహకరించారు. ఒక్కొక్క అడుగు తెలంగాణ కోసం వేశారు. తెలంగాణ కోసమే తమ జీవితాలను మమేకం చేసుకొని దశాబ్ద కాలం పాటు ఉద్యమానికి అంకితమయ్యారు. ఉద్యమమే ఊపిరిగా బతికారు. అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు అనేకం వెళ్లడిరచారు. ఒక ఉద్యమకారుడు మరో ఉద్యమ కారుడికి కితాబివ్వడం అంటేనే గొప్ప విషయం. తాను ఓ సీనియర్ నాయకుడిగా, సీనియర్ ఎమ్మెల్యేగా, క్రియాశీలక తెలంగాణ ఉద్యమ కారుడిగా, పోరాటయోధుడుగా, ప్రస్తుతం మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న కొప్పుల ఈశ్వర్ ఆ నలుగురు ఉద్యమ ప్రస్ధానంపె నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు చెప్పిన ఆసక్తికరమైన వివరాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం….
కేటిఆర్…ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో డైనమిక్ మంత్రి, యువకుడు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురించి ఈ తరం ప్రజలకు తెలియాల్సిన విషయాలు అనేకం వున్నాయి. ఉన్నత విద్యావంతుడు. పైగా సమాజం మీద ఎంతో అవగాహన వున్న నాయకుడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిన నాయకుడు. మన రాష్ట్రంలో ఎలాంటి ప్రగతి కావాలో తెలిసిన నాయకుడు. ప్రజలకు ఎలాంటి పథకాలు కావాలో అవగాహన వున్న నాయకుడు. ముఖ్యంగా తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు. పురపాలికలను పరుగులు పెట్టిస్తున్న ప్రగతి సాధకుడు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, మన దేశంలోనే ఇంతటి డైనమిజమ్ వున్న నాయకుడు మరొకరు లేరు. ఆయన ఆంగీకం, వాచకం, పెద్దట పట్ల ఆయనకుండే గౌరవం గురించి కూడ చెప్పుకోవాలి. అనేక బాషలలో ఆయన దిట్ట. అనర్గళంగా సాత్విక తెలుగు బాషే కాదు, తెలంగాణ యాసతోపాటు, గ్రాంధికం కూడా మాట్లాడడంలో దిట్ట. ఇక ఇంగ్లీషు బాషలో మంచి పట్టున్న నాయకుడు. జాతీయ భాష హిందీతోపాటు, ఉర్ధూలో కూడా గుక్క తిప్పుకోకుండా మాట్లేడేవక్త. ఎక్కడికెళ్తే అక్కడ ఆ ప్రజలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడడం కేటిఆర్‌కే చెల్లింది. ఈ తరం యువ నాయకుల్లో ఇంత పరిణతి వున్న నాయకుడు మరొకరు కనిపంచరు. ఎంత ఎదిగినా ఒదిగి వుండే నాయకుడు కేటిఆర్. అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగం. విలాసవంతమైన జీవితం. అయినా అవేమీ ఆయనకు నచ్చలేదు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టం చూసి ఆయన కూడా చలించిపోయారు. తెలంగాణ ప్రజలు నిత్యం అర్ధాకలితో బతుకుతూ, సాగు కష్టమై, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తూ, అభివృద్ధిలో వివక్షను ఎదుర్కొంటూ, అన్ని రంగాల్లో వెనకబాటును అనుభవిస్తున్న తెలంగాణ కోసం నావంతు కృషి నేను చేస్తానని వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి తోడుగా నిలిచారు. ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారు. అమెరికా జీవితాన్ని వదిలేసి వచ్చి, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఎండనక, వాననక, పగలు,రాత్రి లేడా లేకుండా ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో ఉద్యమ సైనికుడిగా నిరంతరం ఉద్యమంలో మమేకమై ప్రజల్లో చైతన్యం నింపారు. తెలంగాణ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. తండ్రి కేసిఆర్ సాగిస్తున్న తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వామ్యమై ఉద్యమాన్ని, పోరాటాన్ని వారసత్వంగా పుచ్చుకున్నాడు. పోరాట యోధుడు అనిపించుకున్నాడు. తెలంగాణ ఉద్యమం ఒక యజ్ఞంలా సాగించిన వారిలో కేటిఆర్ ఒకరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడూ తాను కేసిఆర్ కొడుకును అన్నది ఎక్కడా కనిపించకుండా, సామాన్యుడిగా ప్రజలతో మమేకమైన నాయకుడు కేటిఆర్. ఉద్యమ సమయంలో అనేక సార్లు నిర్భందాలను ఎదుర్కొని, జైలుకెళ్లిన సందర్భాలు అనేకం వున్నాయి. తాను కేసిఆర్ కుమారుడైనా, ఉద్యమ నాయకత్వపాత్రతోనే తన అస్ధిత్వాన్ని నిరూపించుకున్న నాయకుడు కేటిఆర్. 2014 వరకు ఆయన సామాన్యకార్యకర్తగానే వ్యవహరించేవారు. కేటిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఒకరుగానే మసలుకున్నారే గాని, తాను గొప్ప అన్నది ఎక్కడా చూపించుకోలేదు. తెలంగాణలో ఉద్యమ కాలంలో జరిగిన వంటా వార్పు వంటి వినూత్నమైన కార్యక్రమాల నిర్వహనలో కేటిఆర్ ముందు వరసలో వున్నారు. అందరికంటే ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల నిర్వహన చేపట్టారు. అంతే కాదు కేటిఆర్ సతీమణి శైలిమ, కేటిఆర్ మాతృమూర్తి శోభమ్మ, చివరికి చిన్న పిల్లాడైన హిమాన్షును వంటా వార్పు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయం చాల మందికి తెలియదు. మొత్తం కుటుంబం తెలంగాణ ఉద్యమానికి అంకితమైంది. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు అయిన తర్వాత పార్టీ కార్యకర్తల శ్రేయస్సును కూడా చూసుకున్నాడు. రాజకీయం అంటే కనీస అవగాహన, అర్ధం కూడా తెలియని వాళ్లు ఎంతోమంది మిడిసిపడుతున్న రోజులవి. కాని కేటిఆర్ ఎంత ఎదిగినా, ఎంత ఒదిగి వుంటారో ప్రజలకు తెలుసు. ఒక్కసారి ఆయన ప్రజల్లో మమేకమైన తీరును చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రజల్లో ఎంతో అవలీలగా కలిసిపోతారు. అది ఉద్యమ స్వరూపం నేర్పిన మంచి ఆదర్శంలో ఒకటని కూడా చెప్పొచ్చు. ఇక మంత్రిగా జిల్లా పర్యటనల్లో వున్నప్పుడు ప్రభుత్వం తరుపున అందుతున్న పధకాలపై కూడా ఆయన నేరుగా ప్రజల స్పందన తెలుసుకుంటారు. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో ఇళ్లనుంచి బైటకు రావడానికి ఎంతోమంది జంకిన సమయంలో మంత్రిగా, కేటిఆర్ చూపిన చొరవ సామాన్యమైంది కాదు. ఉద్యమ సమయంలో ఎంత ధైర్యంతో పోరాటం చేశారో…కరోనా సమయంలో కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు భరోసా నింపడం కోసం పనిచేశారు. ప్రజలకు వైద్యం అందేందకు కృషి చేశారు. ప్రజలను ఇళ్లనుంచి బైటకు రావొద్దని ప్రభుత్వం తరుపున చెప్పి, వారికి అవసరమైన సదుపాయల కల్పనను స్వయంగా పర్యవేక్షించిన ఏకైక నాయకుడు కేటిఆర్. మేం కూడా ప్రజలకు ఆ సమయంలో ఎంతో చేసినా, కేటిఆర్ చూపించిన తెగువ మాత్రం అనితరసాధ్యమైంది. అర్ధరాత్రి కరోనా సమయంలో ఓ బిడ్డ పాల కోసం ఏడుస్తున్నాడని తెలిసి, జిహెచ్‌ఎంసి డిప్యూటీమేయర్‌ను పంపి వారికి పాలు అందించిన మానవతా మూర్తిగా అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అందుకే ఆయనను యువత డైనమిక్ లీడర్ అంటారు. నిజానికి తెలంగాణ ఉద్యమం ఉదృతమైన తర్వాత జాతీయ స్ధాయిలో తెలంగాణ ఉద్యమానికి అవసరమైన చేదోడు వాదోడుగా కేసిఆర్‌కు ఉన్నత విద్యావంతుడైన ఉద్యమకారుడు అవసరమయ్యాడు. ప్రపంచ జ్ఞానం మెండుగా వుండడమే కాదు, ప్రపంచ దేశాలలో ఏం జరుగుతోందన్న దానిపై పూర్తి స్ధాయి అవగాహన వున్న నాయకుడు కేటిఆర్. అందుకే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలంగాణ ఉద్యమానికి అవసరమైనప్పుడు కేటిఆర్ ఆ రకంగా కూడా కృషి చేశారు. ఇటు క్షేత్ర స్ధాయిలో ఉద్యమం..మరో వైపు దేశ వ్యాప్తంగా నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని గురించి విశదీకరించే పని కూడా కేటిఆర్ చూసుకోవడం జరిగింది. అంతే కాని ఉన్న ఫళంగా వచ్చి కుర్చీలో కూర్చోలేదు. ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారు. ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నారు. గొప్ప నేతగా ఎదిగారు.
హరీష్‌రావు: ముఖ్యమంత్రి కేసిఆర్ అడుగు జాడల్లో నడుస్తూ, తెలంగాణ ఉద్యమ పోరాటంలో తొలి అడుగులు వేసిన ఉద్యమ సైనికుడు హరీష్‌రావు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు కొన్ని నెలల ముందునుంచి సిద్దం చేసిన యాక్షన్ ప్లాన్‌లో భాగస్వామి హరీష్‌రావు. తొలి కార్యకర్త కూడా ఆయనే అని చెప్పాలి. అప్పటికే కేసిఆర్‌తో ఎంతో మంది మేధావులు కలిసి వచ్చినా పార్టీపరంగా క్రియాశీలకపాత్ర పోషించిన వారిలో హరీష్‌రావు మొదటి వ్యక్తి అనే చెప్పాలి. ఆ తర్వాతే ఎవరైనా అన్నది కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ కొన్ని నెలల పాటు సాగించిన చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలలో హరీష్‌రావు సహాకారం చాలా విలువైంది. కేసిఆర్ చెప్పిన ప్రతి పనిని తుచ తప్పకుండా అనుసరించి, పాటించి అమలు చేసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా యుక్త వయసులో ఏ వ్యక్తికైనా తన వ్యక్తి గత జీవితం, సంతోషం, సరదాలు మీద కలలు కంటుంటారు. కాని హరీష్‌రావు జీవితం మొత్తం తెలంగాణ ఉద్యమమే కనిపిస్తుంది. తెలంగాణ ఆకాంక్షనే వుంటుంది. నిజానికి ఆయనకు ఊహ తెలిసినప్పటికే తెలంగాణ భావన మది మొత్తం నిండిపోయింది. ఆది నుంచి కేసిఆర్‌తో వుండడం, ఆయనతో సాన్నిహిత్యం, కేసిఆర్‌భావజాలం చూస్తూ పెరిగిన వ్యక్తి హరీష్‌రావు. అందువల్ల ఆయనకు సహజంగానే తెలంగాణ అన్నది నరనరనా జీర్ణించుకుపోయి వుంటుంది. అందుకే ఎంతో గొప్ప గుణం, విభిన్నమైన మనస్తత్వం, ప్రజలతో మమేకమయ్యే జీవన విధానం అలవడిరది. అంతే కాదు అలాంటి జీవితాన్ని ఎంచుకోవాలంటే కూడా ఎంతో దైర్యం కావాలి. పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలి. అన్నింటికీ సిద్దపడి ముందుకు రావాలి. ఎంతో విజ్ఞత వుంటే తప్ప యుక్తవయసులో ఉద్యమ స్వరూపానికి తోడుగా నిలవడ లేరు. ఇక కేసిఆర్ తెలంగాణ ఉద్యమం పూర్తి స్దాయిలో మొదలుపెట్టాక, హరీష్‌రావు కూడా తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశాడు. విమర్శల కోసం ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా, హరీష్‌రావుసాగించిన ఉద్యమ ప్రస్ధానం ఇప్పటికీ, ఎప్పటికీ కళ్లముందు కదులుతూనే వుంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్లేవారో..ఎప్పుడు నిద్రపోయేవారో…ఎప్పుడు నియోజకవర్గంలో వుండేవారో…ఎప్పుడు ఉద్యమంలో పాల్గొనేవారో అంతా కలగా వుండేది. ఎక్కడ చూసినా హరీష్‌రావే కనిపించేవారు. ఎంత ఉద్యమం చేసినా ఏనాడు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయలేదు. అభివృద్ధి మా ప్రాంత హక్కు…తెలంగాణ మా జన్మ హక్కు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు హరీష్‌రావు అని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ ఉద్యమంలో నేనూ ఆది నుంచే వున్నప్పటికీ, మా పాత్ర జిల్లా వరకు, ఉత్తర తెలంగాణ వరకు పరిమితమైంది. కాని హరీష్‌రావు పాత్ర మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ప్రతి విషయాన్ని , సందర్భాన్ని స్వయంగా పంచుకున్న అనుభవం నాకు వుంది. ఉద్యమ ప్రస్ధానంలో ఎన్నికల బాధ్యత అన్నది ఎంతో కీలమైంది. దాన్ని హరీష్‌రావు ఎంత బాద్యతగా నిర్వర్తిస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం వేరు…ఉద్యమ కాలంలో ఎన్నికల ప్రచారం వేరు. అడుగుడుగునా ఆటంకాలు. తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించే ప్రయత్నం చేసేవాళ్లు కాచుకొని కూర్చునే వాళ్లు… పైగా తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకులు చేసే కుట్రలు… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భం కత్తి మీద సామే…ముఖ్యంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భాలలో హరీష్‌రావు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. తాను రాజీనామా చేసినా, తన గెలుపే కాదు…మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకొని, ముందుకు నడిచిన నాయకుడు హరీష్‌రావు. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా పరిస్ధితులు తారుమారయ్యే అవకాశాలున్న రోజులవి. ప్రజలను ఎంతో నమ్మకంగా తెలంగాణ ఉద్యమం వైపు మళ్లిస్తున్న కాలంలో అటు తెలంగాణ వాదులు, ఇటు మేధావులతో మమేకమైన సాగడం అన్నది ఎంతో ఓర్పుతో కూడుకున్నది. అప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని ఉప్‌మని ఊదేద్దామని చూసే వారూ చూస్తూనే వున్నారు. జలదృష్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని అప్పటి ప్రభుత్వం ఏకంగా ఆ నివాసాన్ని కూడా కూల్చేసింది. పార్టీకి నీడ లేకుండా చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో కేసిఆర్ ముందకు సాగడంలో హరీష్‌రావు పోషించిన పాత్ర చాలా విలువైంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు , నాయకులను పలుచన చేద్దామని డేగ కళ్లతో అప్పటి పాలక, ప్రతిపక్ష పార్టీలు చూసేవి. వాటిని తట్టుకుంటూ, ఎదుర్కొంటూ, నాయకులను కాపాడుకుంటూ , వారి ఆటలు సాగకుండా పార్టీని సైతం రక్షించుకున్నవారిలో హరీష్‌రావు ఒకరు. టిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్టు మీద గెలిచి, తెలంగాణ వాద ముసగు వదిలసే ఉద్యమానికి ద్రోహం చేసిన వాళ్లు కూడా వున్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా వుండడంలో హరీష్‌రావు క్రియాశీలకపాత్ర పోషించారు. అనేక మందిని పార్టీలోకి తీసుకురావడంలో కూడా ఎంతో కృషి చేశారు. అందుకే ఆయనను ట్రబుల్‌షూటర్ అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత వచ్చిన తొలి స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో కేసిఆర్ విసృతం ప్రచారంలో వుంటే, హరీష్‌రావు ఊరూర తెలంగాణ జెండా ఎగరేసే పనిలో నిమగ్నమై, పార్టీ ఊరూరికి విస్తరించడంలో హరీష్‌రావు బలమైన ముద్ర వేశారు. మొదటిసారి కేసిఆర్ సిద్దిపేట నుంచి వరంగల్‌కు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆ సమయంలో ముందు ప్రతి ఊరిలో హరీష్‌రావు పార్టీ జెండా ఆవిష్కరిస్తూ వెళ్లడం, కేసిఆర్ సైకిల్ యాత్ర సాగడం ఇప్పటికీ నాటి ఉద్యమారులకు గుర్తే వుంటుంది. ఆ తర్వాత సభల నిర్వహణ బాధ్యతలు కూడా హరీష్‌రావు మీదే పడేది. తొలిసారి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సింహ గర్జన్ దగ్గర నుంచి మొన్న జరిగిన ఖమ్మం బిఆర్‌ఎస్ తొల సభ వరకు ఆయన చేపట్టిన సభలన్నీ విజయవంతమైనవే. ఇక వరంగల్‌లో మహాగర్జన పేరుతో సుమారు 15 లక్షల మందితో సభ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లోనే కాదు, ఇప్పటికీ ఆ సభ ఒక చరిత్ర. భవిష్యత్తులో కూడా అలాంటి సభల నిర్వహన ఎవరూ చేయలేదు. అలాంటి గొప్ప సభల ఏర్పాటులో హరీష్‌రావు తీసుకున్న చొరవను అందరూ ప్రశంసించాల్సిందే…ఉద్యమ ప్రస్ధానంలో ప్రతిపాత్రలో, ప్రతి యాత్రలోనూ హరీష్‌రావు చూపే ఆసక్తి అందరినీ ఆకట్టుకునేది. ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరూ సభలు నిర్వహించిన వారే…హరీష్‌రావు మూలంగా తొలి నాళ్లలో పెద్దఎత్తున యువత పార్టీ వైపు ఆకర్షితులయ్యారంటే అతిశయోక్తికాదు. అంతే కాదు అభివృద్ధి విషయంలో కూడా హరీష్‌రావు పాత్ర మమ్మల్నందరినీ ఆశ్చర్యానికి గురి చేసేది. నిత్యం ప్రజల్లో వుండడమే ఆయనకు ఇష్టం. అటు ప్రజాక్షేత్రంలోఉద్యమం, ఇటు శాసన సభలో అభివృద్ధిపై పట్టుపట్టడం, అనేక అంశాలపై ప్రభుత్వంతో పోరాటం చేయడం రెండు రకాల వైవిధ్యభరితమైన పాత్ర ఆయన పోషించారు. అయినా ఎక్కడా అలసిపోయేవారు కాదు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ ఆక్టివ్‌గా వుండడం ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. అటు శాసన సభ సమావేశాలు జరుగుతున్న సేపు సభలో, సభ విరామం ప్రకటించగానే ప్రజా క్షేత్రంలో వుండడం అందరి వల్ల అయ్యే పని కాదు. ఉద్యమ కాలంలోనే సిద్దిపేట అభివృద్ధికి హరీష్‌రావు బలమైన పునాదులు వేశారు. ప్రగతి బాటలు తెరిచారు. ఇక మంత్రిగా ఆయన ఎనలేని సేవలు చేస్తున్నారు. ఉద్యమం చేశాం…తెలంగాణ సాధించాం అని రెస్టు తీసుకున్న సందర్భం లేదు. ఊపిరి పీల్చుకున్న గడియ లేదు. తీరికన్నది లేకుండా ప్రజలకు సేవ చేయడమే హరీష్‌రావుకు ఇష్టం. అభివృద్ధిని కూడా ఉద్యమ ఆకాంక్షలకు ప్రతీకగానే నిర్వర్తిస్తున్నారు. ఇక ఇతర నేతలతో ఆయన ఒదిగిపోయి వ్యవహరించే హుందాతనం మంచినేతగా, మనసున్న మనిషిగా ఎదిగేందుకు ఎంతో దోహడపడిరది. సిద్ధిపేటలో ఏకంగా ఏడువందల రోజులకు పైగా దీక్షా సదస్సులు నిర్వహించిన ఘనత ఒక్క హరీష్‌రావుకే దక్కింది. అలాంటి నేతను వారసుడు అనడం కన్నా, ఉద్యమ కారుడుగానే తెలంగాణ సమాజం గుర్తించి గుండెల్లో పెట్టుకున్నది. సిద్ధిపేట అంతగా ఆయనను ప్రేమిస్తోంది.
కల్వకుంట్ల కవిత: తెలంగాణ బాషలోని కమ్మదనాన్ని ఉద్యమానికి అద్దారు. బతుకమ్మ ప్రపంచానికి పరిచయం చేశారు. , యాస ఆమెకు కొట్టిన పిండి. పూల పండుగకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింపిన నిండుదనం ఆమె. ప్రకృతిని పూజించే పండుగను ఉద్యమానికి తోడు చేసి, బతుకమ్మను ఉద్యమ స్వరూపంచేసింది ఆమె. పాటలతో చైతన్యాని, బతుకమ్మ ఆటలతో పోరాట పటిమను కలగలపి, చరిత్రలో కనీవినీ ఏరగని రీతిలో ట్యాంక్ బండ్‌ను పూల వనం చేసి, ఉద్యమ స్వరూపానికి నిలువెత్తు సాక్ష్యమైన నిలిచింది ఆమె. సాదాసీదా ఆహార్యానికి నిదర్శం ఆమె. ఆపన్నులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. అక్కా అని పిలిస్తే చాలు ఆదుకుంటుంది. మానవత్వానికి ప్రతిరూపం. మంచి తనానికి నిలువెత్తు రూపం. తెలంగాణ ఆకాంక్షకు బలమైన నిర్వచనం. తెలంగాణ కోసం మడమ తిప్పనిపోరాటం. దూం దాం కార్యక్రమాలైనా, వంటా వార్పులైనా, దేశ దేశాల్లో బతుకమ్మలైనా, తెలంగాణ జిల్లాలకు బతుకమ్మ వేదికలైనా అన్నీ ఆమె…అన్నింటా ఆమె…తెగువకు ప్రతిరూపం. తెగించి కొట్లాడిన నిలువెత్తు పోరాట రూపం… ఆమె కల్వకుంట్ల కవిత. మహాళా తెలంగాణ పోరాట గీతిక. తెలంగాణ ఉద్యమ పతాక ఆడ పిల్లలు ఆస్ధుల్లో వాటాలు కోరుతుంటారు. కాని ఈ ఆడపిల్ల తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కోరారు. పోరాటంలో భాగంకోరారు. తాను తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. తండ్రిని మెప్పించారు. ఒప్పించారు. తెలంగాణ ఉద్యమ కదన రంగాన దూకారు. ఉద్యమం అంటే, పోరాటం అంటే కళ్లకు చానా చిన్నదిగా కనిపించొచ్చు. దిగితే గాని లోతు తెలియదు. మహిళలు రాజకీయాల్లో సాగడం వేరు. ఎన్నికల రాజకీయాల్లో ప్రచారాలు వేరు. కాని ఉద్యమ పంధాలో కొనసాగడం అంటే కత్తి మీద సాములాంటిది. ఓ వైపు కుటుంబం. మరో వైపు సామాజిక బాధ్యత. ఇలా రెండిరటినీ సమత్యుల్యం చేసుకుంటూ ఉద్యమ కదనరంగంలో నిలవడం అంటే మాటలు కాదు. అలాంటి పోరాటంలో తనేంటో నిరూపంచుకొని, తెలంగాణ బతకమ్మకు పర్యాయంగా మారిన కల్వకుంట్ల కవిత…తెలంగాణ ఉద్యమ పతాక… అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అమెరికాలో వుంటున్న కవిత తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ నాయకుడిగా ఆయన ఆధ్వర్యంలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం చూసి, తాను కూడా తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనుకున్నది. తెలంగాణ ఉద్యమంలో తాను పాలుపంచుకుంటానని నిర్ణయించుకున్నది. ఈ విషయం అందరకీ చెప్పి, అందిర్నీ ఒప్పించి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. అయితే ఆమె ఓ వైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. కేవలం కేసిఆర్ కూతురుగా కాకుండా ఆమె ప్రత్యేక ఉద్యమ స్వరూపాన్ని నిర్మించుకున్నది. అందులో భాగంగా తొలుత నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం, అక్కడ మౌలిక సదుపాయల కల్పన వంటివాటిపై దృష్టిపెట్టింది. కొన్ని గ్రామాల పిల్లలకు ఉచిత విద్యనందించే బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. ఇదే సమయంలో తెలంగాణ యువత ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నప్పటికీ సరైన అవకాశాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె గ్రహించారు. అసలు తెలంగాణ ఉద్యమం సాగుతున్నదే నియామాకాలలో జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ…రాష్ట్రంలో ద్వితీయ శ్రేణిపౌరులుగా తెలంగాణలోనే వారికి సరైన అవకాశాలు లేకుండాపోవడంతో వారికి ఎలాగైనా ఉద్యోగ కల్పనకు కృషిచేయాలని నిర్ణయించున్నారు. ఐటి కంపనీలు తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనలో చెప్పే ఏకైక సాకు స్కిల్‌డెవలప్ మెంటు.. అందుకే ఆమె పెద్దఎత్తున తెలంగాణ యువతకు స్కిల్ డెవలప్ మెంటు కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎంతో మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కలిగేలా చేశారు. ఇలా సాగుతున్న తరుణంలో ఆమె స్వచ్ఛంధ స్వంస్ధ ‘తెలంగాణ జాగృతి’ విస్తరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ సంస్ధకు ప్రతినిధుల యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వుంటూనే, నిత్యం జాగృతి కార్యక్రమాలకు హజరౌతూ, తెలంగాణపై యువతలో చైతన్యం నింపారు. వారిలో సామాజిక బాధ్యత వైపు నడిపించారు. ఆ సమయంలో తెలంగాణ జాగృతి అన్నది గొప్ప శక్తిగా మారింది. ప్రతి సమస్యపై స్పందించడం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం తెలంగాణ జాగృతి వంతైంది. ఇక తెలంగాణ యాసకు, బాషకు జరుతున్న అన్యాయంపై ఆమె గళమెత్తింది. సినిమాల్లో తెలంగాణయాసను విలన్లకు ఆపాదించడం, లేక కమెడియన్లతో ఎద్దేవాలు చేయించడం వంటివి చేస్తుండేవారు. అదే సమయంలో కొన్ని సినిమాల్లో తెలంగాణపై వాడిన పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సినిమాల విడుదలను సైతం శాసించగలిగారు. అప్పటినుంచి సినిమాల్లో హీరోలకు సైతం తెలంగాణయాసను జోడిరచే సినిమాలు రావడం అన్నది కవిత చేసిన పోరాటంలో బాగమనే చెప్పాలి. 2006 ఉప ఎన్నికలతో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమ స్వరూపాలు, జాగృతితో పల్లె జీవనంలో వెలుగులు, యువతకు ఉద్యోగ కల్పనలో నైపుణ్య శిక్షణలు చేస్తూ వచ్చిన కవిత, 2006 కేసిఆర్ రాజీనామా చేయడంతో వచ్చిన కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో ఆమె విసృత ప్రచారం సాగించారు. ఇల్లూ ఇల్లు తిరిగి తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించారు. ఆనాడు మంత్రి సత్యనారాయణ చేసిన ఛాలెంజ్ అన్నది తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి చేసిన కుయుక్తులను ఎత్తిచూపిస్తూ, కేసిఆర్ గెలుపు తెలంగాణకు మలుపు అన్న స్లోగన్‌తో అటు ఉద్యమ పథం, ఇటు రాజకీయచదరంగాన్ని చూశారు. బతుకమ్మకు నిండుదనం: ప్రకృతిని కొలవడం సహజం. ప్రకృతి అందించే ఆహారాన్ని తినడం తెలుసు. కాని ప్రకృతి అందించే పువ్వును గౌరమ్మగా చేసి, తెలంగాణ మహిళా సమాజం భక్తిప్రపత్తులతో బతుకమ్మను పేర్చి ఆడుకోవడం అన్నది ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. పంటలు చేతికొచ్చి, ప్రకృతి పచ్చని సోయగాన్ని నింపుకొని, చెరువులన్నీ నీళ్లతో నిండుకొని వున్న వేళ ప్రకృతి ప్రసాదించే పూలవనాన్ని ఒక్క దగ్గర చేర్చి ఆటలాడి, పాటలు పాడి, కొలిచి, వాటిని చెరువులో నిమజ్జనం చేయడం అంటే చెరువు కలుషితం కాకుండా, చెరువును మంచినీటికి కోసం సిద్ధం చేయడం అన్న సైన్స్‌ను కనుగొన్న గొప్ప సంస్కృతి మనది. ప్రతి ఏటా ప్రకృతిని పదిరోజుల పాటు కొలుచి, పోయిరావామ్మా అంటూ…మళ్లీ మళ్లీ పిలుచుకంటూ పండగ నిర్వహించుకోవడం ఆనవాయితీ. అలాంటి బతుకమ్మను ఉద్యమ స్వరూపం చేసిన ఘనత కవితకే దక్కింది. అంతకు ముందు బతుకమ్మను ఒక పండుగానే చూసేవారు. కాని కవిత మాత్రం బతుకమ్మను ఉద్యమానికి ప్రతీక చేశారు. మహిళలను చైతన్యపరిచారు. ఐక్యం చేశారు. తెలంగాణ మహిళా సమాజంలో తెలంగాణ ఉద్యమానికి సన్నద్దంచేశారు. ప్రత్యక్ష్యంగా తెలంగాణ మహిళలు తెలంగాణ కోసం కొట్లాడేలా చేశారు. తెలంగాణ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో బతుకమ్మ పండగను ట్యాంక్ బండ్ మీద నిర్వహించిన ఘనత మాత్రం కవితకే దక్కుతుంది.
జోగినపల్లి సంతోష్ రావు: తెలంగాణ ఉద్యమకారులలో సంతోష్ రావు ఒకరు. తెలంగాణ ఉద్యమంలో 2001లోనే అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి అటు పార్టీ బాధ్యతలు కూడా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మీడియా ఆవశ్యకత అవసరం ఏర్పడడంతో నమస్తే తెలంగాణ దిన పత్రిక, టి. న్యూస్ ఛానల్ నిర్వహణ బాధ్యత కూడా చేపట్టారు. తెలంగాణ సాంస్కృతిక విప్లవానికి ప్రాణం పోశారు. అటు క్షేత్ర స్థాయి ఉద్యమ పర్యవేక్షణతో పాటు, మీడియా పరంగా ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా నడు చుకుంటూ, ఆయన పర్యవేక్షణ అంతా సంతోష్ రావు చూసుకునే వారు. హైదరాబాదు లో అయినా, డిల్లీలో అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ ఎవరెవరిని కలవాలి అన్న విషయాలు చూసుకునే వారు. నిత్యం కేసిఆర్ తోనే వుండేవారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు తోడుగా వుంటున్నారు. ప్రగతి భవన్ కార్యకలాపాలను చక్కదిద్దుతూ వుంటారు. అదే సమయంలో ఆయన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో గొప్పది. 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే వరకు మీడియా బాధ్యతలు పూర్తి స్థాయిలో చూసుకునే వారు. ఇప్పుడు అటు కేసిఆర్ నిర్ణయాల అమలు బాధ్యత తో పాటు, రాజ్యసభ సభ్యుడిగా విధులు కొనసాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సంతోష్ రావు ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన గుర్తింపు వచ్చింది. ఆయన విసిరే గ్రీన్ ఛాలెంజ్ కు స్పందించి, సెలబ్రిటీలు విరివిగా మొక్కల పెంపకం చేపట్టడం గమనార్హం. తెలంగాణ కు వచ్చే ప్రతి సెలబ్రిటీ కూడా మొక్కలు నాటకుండా వెళ్లరు. ఇదే సంతోష్ రావు వృక్ష వేదం పుస్తకం రూపొందించాడు. దానిని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే హరిత హారం ఒక విప్లవంగా విజయవంతం కావడంలో సంతోష్ రావుది కీలకపాత్ర. మేడ్చల్ జిల్లాలోని కీసర ప్రాంతంలో సుమారు రెండు వేల ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకొని మొక్కలు నాటే యజ్ఞం మొదలుపెట్టారు. ఇలా ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని ఆరాధించడం అందరికీ అలవాటు చేయడంలో సంతోష్ రావు వేసిన బాటలు సత్పలితాలిస్తున్నాయి. భవిష్యత్తు తెలంగాణకు వరంగా మారుతున్నాయి.