`ఆ జిల్లాలో ఏళ్లుగా సాగుతున్న దారుణం!
`ఖాకి ముసుగులో కీచక తోడేలు!
`అరణ్యంలో అ(స)బలల ఆక్రందన!
`ఎవరికి చెప్పుకోలే ఆందోళన!
`పెద్దోళ్లకు చెప్పినా మిగిలేది అరణ్య రోధనే..నా!
`కీచకుడిని తప్పించుకోలేక విలవిలలాడుతున్నారు?
`పక్కనే వుండే మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
`అరణ్యంలో జంతువులకు భయపడని వాళ్లు నరరూపజంతువును చూసి వణికిపోతున్నారు.
`నిత్యం కబలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
`మృగం నుంచి తప్పించుకోలేక, కొలువులు వదులుకోలేక, కుమిలిపోతున్నారు..
`ఎవరికి చెప్పుకోలేక కుంగి కృషించిపోతున్నారు.
`ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా ఉద్యోగి పిటిషన్ ఇచ్చినా జాప్యమేనా?
`శాఖ పెద్దలున్నది సర్థుబాటు చేసేందుకేనా?
`మహిళా విద్యావంతులు, ఉద్యోగులకు కూడా వేధింపులు తప్పవా!
` అడవికాపాడే కొలువులో తనువు దహిస్తున్నా భరిస్తున్నారు!
`కాపురాలు కూలిపోయే ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్నారు!
`ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినదిన గండంగా బతుకుతున్నారు!
`దిక్కుమాలిన సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నారు.
`ఆడవారిగా పుట్టినందుకు నరకం అనుభవిస్తున్నారు!
`కొలువులు చేస్తే బతుకు బంగారమౌతుందనుకుంటే, భ్రష్టు పట్టిస్తున్నారు?
`ప్రాణాలు కాపాడే కొలువులో వుండి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
మానవ సమాజమా! మృగాల రాజ్యమా? ఎక్కడ చూసినా ఆడవారికి వేధింపులేనా! చిత్రహింసలేనా! ఆకాశంలో సగం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి? సమాజంలో జరుగుతున్నదేమిటి? ఆడవారికి మిగులుతున్నదేమిటి? ఎంతటి స్థాయిలో వున్నా ఆడవారికి స్వేచ్చ లేదు… రక్షణ లేదు. విద్యావంతమైన సమాజం మరీ దిగజారిపోతోంది. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్థలో అదే జరిగి, రక్షణ కల్పించాల్సిన చోట కూడా ఆడవారికి వేధింపులే మిగిలితే, ఆక్రంధనలే నిత్యకృత్యమైతే ఇక సమాజం మనుగడెందుకు? మనం మనుషులమని చెప్పుకోవడం ఎందుకు? చట్టాలు చచ్చు బండలైపోతుంటే ఆడవారి జీవితాలకు భరోసా ఎప్పుడు? కంచె చేను మేసే అన్నట్లు ఆడపిల్ల అయితే చాలు కబలిస్తాం…అనే మృగాల మధ్య అబల బతికేదెలా? ఆమెకు మనసుండదా? తనువు దహించుకోవాల్సిందేనా! కామపు చూపులకు లొంగిపోవాల్సిందేనా? వెకిలి చేష్టలు దిగమింగుకోవాల్సిందేనా? లైంగిక చేష్టలకు తలొగ్గాల్సిందేనా! హృదయం కాలిపోతున్నా భరించాల్సిందేనా? ఏ శాఖలో చూసినా కీచక పైచాశికత్వం కనిపిస్తూనే వుంది. విద్యా బుద్దులు చెప్పాల్సిన చోట విపత్కర పరిస్థితులే…సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన వ్యవస్థలో కాటేసేవారే… ఎక్కడా మహిళా లోకానికి స్వేచ్చ లేదు…ఎక్కడా ఆడవారికి గౌరవం లేదు.
ఖాకీ దుస్తులేసుకున్న కామాంధుడు?
కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులను కాల్చుకుతింటుంటాడు?…చెప్పినట్లు వినకపోతే వేపుకుతింటున్నాడు?….వేధించి, వేధించి వారికి నరకం చూపిస్తున్నాడు?…అర్థరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా రావాలంటాడు?…భర్త పక్కనుండగానే ఫోన్ చేసి రమ్మంటాడు?…లేకుంటే ఉద్యోగం ఊడుతుందని బెదిరిస్తుంటాడు!…ఏకంగా భర్తలకే చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు!!…వాళ్ల జీవితాలలో కల్లోలం సృష్టిస్తున్నాడు…ఎంత ఉన్నత చదువులు చదువుకుంటే ఏం లాభం? ఉద్యోగం చేస్తుంటే ఏం ప్రయోజనం… మగాడన్న అహంకారం ముందు, ఆడది నలిగిపోవాల్సిందే…నా?
ఉమ్మడి ఆదిలాబాదు నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లా అది.
ఆ జిల్లాలో వున్న అడవి రక్షణలో వాళ్లంతా బాధ్యులు…ఉద్యోగులు. ఉన్నత విద్యావంతులు. అయితేనేమీ…ఆడ…మగ…తేడ! ఇక సమానానికి దిక్కెక్కడిది…మహిళా ఉద్యోగులకు విలువెక్కడిది…రక్షణ ఎక్కడిది..! ఉన్నతాధికారి పురుషుడైతే చాలు కిందిస్థాయిలో మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోంది? స్వేచ్చ లేకుండా చేస్తున్నారు? మహిళా ఉద్యోగులు వున్నది..పై స్థాయిలో వున్న అధికారులు ఏం చెప్పినా చేయడానేకేనా? ఇదేనా…నవ సమాజం… ఎక్కడుంది మానవ సమాజం.
ఆ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కీలక బాధ్యుడతను….కామానికి ప్రతిరూపం…
ఉద్యోగి రూపంలో కొనసాగిస్తున్న కిరాతకం… కనపడిన ప్రతి ఆడది కావాలనుకునే రకం…ఇక తన పరిధిలో పని చేసే మహిళా ఉద్యోగులకు నిత్య నరకం…అయినా పై స్థాయిలో లేదు చలనం…డిపార్ట్మెంట్ లో అందరికీ తెలిసిన నిజం…అయినా నోరు తెరిచేందుకు ఎవరూ ఇష్టపడని వైనం…పై వాళ్లంతా అతన్ని వెనకేసుకొస్తున్నారనేదే అందరిలో వున్న అనుమానం… ఎంత కాలానికి ఆగుతుందో ఈ ఘరోం…మాకు ఎప్పుడు మంచి రోజులొస్తాయా అని ఎదురుచూస్తున్న మహిళా ఉద్యోగలోకం…కనికరం లేని శాఖలో పని చేస్తున్నందుకు బతుకంతా చేదు అనుభవం… ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు…కొన్నేళ్లుగా సాగుతున్న దారుణం…పాపం మహిళా ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తమను తాము సముదాయించుకోలేక, దారుణాలను దిగమింగుకోలేక, దినమొక గండంగా బతుకుతున్నారు. బలౌతున్నారు. చెప్పుకోలేని నిప్పుల సెగను అనుభవిస్తున్నారు. పడుతున్న ఇబ్బందులు ఇంట్లో కూడా చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరుకే ఉద్యోగులు కానీ మహిళలైన పాపానికి నిత్యం చస్తూ బతుకుతున్నారు. పై స్థాయి అధికారులకు మొరపెట్టుకోలేక, చెప్పినా ప్రయోజనం లేక నరకం చూస్తున్నారు. బతుకును వెల్లదీయలేక తల్లడిల్లిపోతున్నారు. అడవిలో వుండే క్రూర మృగాలకు కూడా భయపడని ఆ మహిళా ఉద్యోగులు, ఆ కీచకుడిని చూస్తే వణికిపోతున్నారు. తమ జీవితాలను నాశనం చేస్తున్నా భరిస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో ఆ తల్లులు సమిధలౌతున్నారు. ఎదురు తిరలేక, కాదనలేక కారడవిలో తనువు దహిస్తున్నా పంటి బిగువున, కంటి దారలు ఆవిరి చేసుకుంటున్నారు. కళ్లలో కరుగుతున్న ఆశలు, పరాయివాడి చేతిలో నలుగుతున్నందుకు విలవిలలాడుతున్నారు.
కానీ ఒక్కరు ధైర్యం చేశారు.
ఇక భరించడం తన వల్ల కాదని ఎదురుతిగారు. హైదరాబాదు కు వెళ్ళి శాఖ పెద్దలను కలిశారు. తన గోడును వినిపించారు…న్యాయం చేస్తామని పెద్దలు చెప్పి పంపించారు. వారం గడుస్తోంది…అయినా పెద్దలు కదిలింది లేదు…ఆమెకు న్యాయం జరిగింది లేదు. పైగా ఆమెకు మరిన్ని వేధింపులు మొదలైనట్లు సమాచారం… ఈ విషయం ఇప్పటి వరకు బైటకు పొక్కకుండా అటవీ శాఖ మొత్తం గోప్యంగా వుంచారు. కానీ నేటిధాత్రికి ఈ విషయం తెలిసింది…దాంతో వివరాలు సేకరించేందుకు నేటిధాత్రి అనేక ప్రయత్నాలు చేసింది… ఆ శాఖ పెద్దలతో మాట్లాడాలని ప్రయత్నించింది. అధికారులు అందుబాటులోకి రాలేదు..కానీ విషయం నేటిధాత్రికి తెలిసిందని ఉన్న ఫలంగా జిల్లాలో ఆ శాఖ బాస్ హుటాహుటిన హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి, చర్చించినట్లు సమాచారం… ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేని మహిళా ఉద్యోగి చేసిన పిర్యాదు వెనక్కి తీసుకునేలా పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా శాఖ పెద్దలు స్పందించి, కీచకుడిపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇంకా అతని దుశ్చర్యలను ప్రోత్సాహిస్తున్నట్లే అవుతుంది. అక్కడ పని చేయాలంటే మహిళలు భయపడాల్సి వస్తుంది…కొలువులు వదిలేసుకొని వెళ్లిపోవాల్సి వస్తుంది. చట్ట ప్రకారం అలాంటి వారికి శిక్ష పడకపోతే, మరింత మంది తయారయ్యే ప్రమాదముంది.