రేవంత్‌ రాజేసిన రెడ్డి కుంపటి?

కాంగ్రెస్‌ కొంప కొల్లేరు?

సీనియర్లలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం?

ఒంటరైన రేవంత్‌ రెడ్డి?

మరోసారి దూకుడు పెంచిన సీనియర్లు..

అదును కోసం సీనియర్లు చూస్తున్నారు?

తనకు తానే రేవంత్‌ ఇరుకున పడ్డారు?

ఇప్పుడు వెనక్కి తీసుకున్నా రేవంత్‌ను ఇతర వర్గాలు నమ్మరు?

రెడ్డి పేరుతో లెక్కేసి కొట్టాలనుకున్నాడు…

లెక్క తప్పి తిప్పలు తప్పించుకునేందుకు అమెరికా వెళ్లాడు?

రేవంత్‌ను విడిచిపెట్టే ప్రసక్తి లేదంటున్న సీనియర్లు?

                            రేవంత్‌ నాయకత్వం పార్టీకి నష్టమంటున్న ఇతర వర్గాలు?

                           తెలంగాణలో కులం కుంపటి రాజేయాలని చూసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి సొంత పార్టీలోనే అలజడి చెలరేగింది. ఆఖరకు రేవంత్‌కు పదవికే ఎసరొచ్చే పరిస్ధితి తెచ్చుకున్నట్లైంది. ఎక్కడ రేవంత్‌ దొరకుతాడా అని ఎదరుచూస్తున్న సీనియర్లకు రేవంతే అస్త్రం అందించినట్లైంది. తాను ఏది చేసినా చెల్లుతుందనుకున్నప్పుడు తప్పటడుగులు పడడం సహజం. కొంప మునగడం ఖాయం. రేవంత్‌ రెడ్డి రాజేసిన కుంపటి ఇప్పట్లో ఆరేది కాదు… రేవంత్‌ను పిపిసినుంచి దించేదాకా ఆగేది కాదని అంటున్నారు. ఎక్కడ రేవంత్‌ రెడ్డి దొరకుతాడా? ఎదురుచూస్తున్న పార్టీ సీనియర్లకు ఇప్పుడు మంచి అవకాశం దొరికినట్లైంది. గతంలో ఎన్నడూ తెలంగాణలో కుల రాజకీయాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు ఎంతో కాలం నుంచి వున్నా, అవి తెలంగాణ దాకా రాలేదు. తెలంగాణలో కుల రాజకీయాలకు స్ధానం లేదు. తెలంగాణలో ఆది నుంచి కులాలకు, మతాలకు అతీతరమైన సమాజ నిర్మాణం జరిగింది. నిజాం పాలనలో అణిచివేతకు గురైన వర్గాలలో అన్ని వర్గాలున్నాయి. దాంతో అన్ని సామాజిక వర్గాలలో ఐక్యత కనిపించింది. నిజాంకు అడుగులకు మడుగులొత్తిన వారే, కాదు నిజాం ను ఎదిరించిన వారిలో అందరూ వున్నారు. అందుకే తెలంగాణలో కులాల మధ్య కుంపట్లు లేదు. చుండూరు లాంటి ఘటనలు తెలంగాణలో ఎక్కడా కనిపించవు. కాని కొత్తగా అలాంటి వాతావరణం తెచ్చేలా, వచ్చేలా రేవంత్‌ వ్యాఖ్యలున్నాయనడంలో సందేహంలేదు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు ఆధిపత్య రాజకీయాలకు పాటు పడలేదు. కాని కొత్తగా రేవంత్‌ కొత్త సూత్రాలు తెచ్చిపెట్టి విభజన రాజకీయాలను తెచ్చిపెట్టారు. సమాజంలో చీలికకు దారి తీసే పరిస్ధితి తెచ్చిపెట్టారు. అది తెలంగాణ సమాజాన్ని కలుషితం చేస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు..! ఇప్పటికైనా రేవంత్‌ రెడ్డి సన్నాయి నొక్కులు ఆపాలి. తన వ్యాఖ్యలు తప్పని చెప్పడం లేదు. అంటే తాను చేసిన వ్యాఖ్యల మర్మం సరైనవే అన్నట్లే వుంది. అవే సంకేతాలే ఇంకా పంపుతున్నట్లు లెక్క. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా సీరియస్‌గా ఆలోచించకపోతే మరోసారి పార్టీకి తీరని నష్టం తప్పదు. 

                         ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచి నీలం సంజీవరెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, నేదరుమల్లి జనార్ధన్‌రెడ్డి, రెండు సార్లు కోట్ల విజయభాస్కరెడ్డి, రెండు సార్లు, మర్రి చెన్నారెడ్డి, రెండు సార్లు రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎటు చూసినా రెడ్డిల పాలనే కనిపిస్తుంది. మధ్యలో ఇతర కులాలకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులైనా ఎంత కాలం పనిచేశారో తెలియందా? పి.వి. నర్సింహారావును పట్టుమని పదిహేను నెలలు కూడా పరిపాలన చేయనీయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుతో అప్పటిదాకా ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణారావును రాజకీయాల్లో లేకుండా చేశారు. ఇందిరాగాంధీని కాదని ఏకంగా రెడ్డి కాంగ్రెస్‌ ఏర్పాటు చేసుకున్నార. ఏమైంది రెడ్డిలంతా ఆ పార్టీలో చేరారా? చెన్నా రెడ్డి లాంటి వారు ఇందిరా కాంగ్రెస్‌కు నాయకత్వం వహించి, అందర్నీ కలుపుకుని పోవడం వల్లనే కాంగ్రెస్‌ ఆనాడు బతికి కట్టింది. లేకుంటే ఏనాడో కాంగ్రెస్‌కు నూకలు చెల్లేవి. ఆనాడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డిల మితి మీరిన అవకాశవాదం, అహంకారమే కాంగ్రెస్‌లో చీలికకు కారణమైంది. ఇప్పుడు సరిగ్గా అదే రేవంత్‌ తెలంగాణలో మొదలు పెట్టారు. 

                     అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి మల్లారెడ్డికే సహకరించని రేవంత్‌, ఇతర రెడ్డిల బాగు కోరుకుంటాడా? కాంగ్రెస్‌లోనే సీనియర్లు జనారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారినే కలుపుకుపోలేని రేవంత్‌ ఇతరులను ఎదగనిస్తాడా? రెడ్డిలమంతా ఏకం కావాలంటే ప్రజలు నమ్ముతారా? ఈ లాజిక్‌ రేవంత్‌ ఎలా మిస్‌ అయ్యాడో అర్ధం కానిది. రాజకీయమంటే పంచుకునేందుకు ఆస్ధులు కాదు. పదవుల పందేరం. అందులో ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరుతారు? నాయకత్వాల కోసం పోటీ పడతారు. అంతే కాని మొత్తం రెడ్డిలకు ప్రతినిధిగా ఏ ఒక్క నాయకుడిని ఆ సామాజిక వర్గం గుర్తించదు. అంగీకరించదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రేవంత్‌ పదువుల నిర్వహించాడు. ఆనాడు తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ అభ్యున్నతి కోసం ఆరాటపడిరదెంత? పోరాటం చేసిందెంత? తెలంగాణ సమాజంలో 12శాతం వున్న రెడ్డిల అభ్యున్నతి కోసం రూ.5వేల కోట్లు ఏటా కేటాయింపులంటే సాధ్యమయ్యే పనేనా? మరి సమాజంలో 60 నుంచి 65శాతం వున్న బిసిలు, 15శాతం వున్న ఎస్సీలు, 8శాతం వున్న ఎస్టీల అభ్యున్నతి కోసం ఎంత కేటాయించాలో కూడా రేవంత్‌ రెడ్డి లెక్కలు చెప్పాలి. ప్రతి రెడ్డికి పదెకరాలు కావాలనుకుంటే, మరి ఇతర సామాజిక వర్గాలకు అవసరమైన భూమి ఎలా అన్నది కూడా రేవంత్‌ చెప్పాలి. తాను కాంగ్రెస్‌పార్టీని లీడ్‌ చేస్తున్నాని, తన సామాజిక వర్గం మేలు కోసమే తానున్నానట్లు ప్రకటిస్తే, మితగా వర్గాలు ఏం కావాలి? ఇతర వర్గాలకు సున్నం పెట్టుడే అని చెప్పకనే చెప్పినట్టా? భవిష్యత్తులో ఇతర సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేయకుండా వుంటారా? ముందే చెప్పి, మరీ బడుగులకు వాతలు రుచి చూపించరా? 

                         ఇప్పటికైనా తెలంగాణ సమాజం , ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీలో నాయకులు కూడా తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాంగ్రెస్‌లో ఇంత కాలం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన సీనియర్లు గొంత సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మాట్లాడలేకపోతే భవిష్యత్తులో మాట్లాడడానికి ఏమీ వుండదు. అందుకే ఇప్పుడే మేలుకోవాలి. రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేదాకా వదలొద్దు. క్షమాపణ చెబుతారా? లేదా అన్నది ముందు తేల్చాలి. అంతే కాదు…ఇక్కడ మరో విషయం కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇద్దరు నేతల పంచాయితీ కూడా కులానికి రుద్దకూడదు. మంత్రి మల్లారెడ్డి, రేవంత్‌ రెడ్డిల మధ్య పంచాయితీ రాష్ట్ర రాజకీయాలకు ముడిపెట్టొద్దు. తెలంగాణ సమాజాన్ని చీల్చొద్దు. తనపై రేవంత్‌ దాడి చేయించారని ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి కూడా చట్టపరమైన చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదు. ఒక ప్రతిపక్ష నేత తనను ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పడం తన బలహీనతలను బైట పెట్టుకోవడం కాదా? అంతే కాదు తనపై జరిగిన దాడిలో ఇతర సామాజిక వర్గాలవారు ఆ సభలో దూరినట్లు అర్ధమొచ్చే విధంగా వున్న మంత్రి వ్యాఖ్యలు చేయడం వల్ల టిఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టే ప్రమాదం లేకపోలేదు. 

                       అందువల్ల మల్లారెడ్డి కూడా ఈ విషయంలో స్పష్టతనివ్వాలి. ఆధిపత్య పోరులో ఒకరినొకరు రాజకీయంగా ఎన్ని విన్యాసాలు వేసుకున్నా ఫరవాలేదు. కాని మొత్తం తెలంగాణ సమాజాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడుకుంటాం…వారిని ఓట్ల కోసమే వాడుకుంటాం…కుర్చీలెక్కి మేమే కూర్చుంటాం…పెత్తనం మేమే చేస్తాం…ఆస్ధులు కూడబెట్టుకుంటాం… భూములన్నీ ఆధీనంలో పెట్టుకుంటామన్న అర్ధమొచ్చే భావనలు తుడిచేసుకోండి. అయినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో రైతు బంధు వల్ల లబ్ధిపొందుతున్నవారిలో రెడ్డి సామాజిక వర్గమే ఎక్కువ. రాష్ట్రంలో 85శాతం వున్న ఇతర వర్గాలవారి చేతిలో వున్నదానికి మించి రెడ్డిల చేతిలోను భూమంతా వుంది. అసలు తలదాచుకునేందుకు చోటు కూడా లేని వారు ఎంతో మంది బడుగులలో వున్నారు. మరి అలాంటి వారిని వదిలేసి, తెలంగాణలో పెత్తనం మన చేతిలో వుండాలి…పాలకులుగా మనమే వుండాలి…మన సామాజిక వర్గ ప్రజలందరికీ పదెకరాల స్ధలంవుండాలంటే, ఓట్లేసి గద్దెనెక్కించేవారు ఏం కావాలి? పెత్తనం చేద్దామనుకునేవారికే అంతంత ఆశలుంటే, ఓట్లేసేవారి అంతకు మించి ఆశలు వుండడం సహజమే కదా! అయినా పది శాతానికి మించని వారికి పెత్తనం అందించడం కన్నా, ఎనభైశాతమున్న వారు ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైందన్నది గుర్తించాలి. ఐక్యత ప్రదర్శించాలి. ఇంత టెక్నాలజీ,విద్యావంతమైన సమాజంలో కూడా మన కులం వున్నదే పాలించేందుకు అన్నంత ధోరణిలో నాయకులు వుంటే, ఇంకా వందల సంవత్సరాలైనా బడుగులకు రాజ్యాధికారం రాదు…వారు పాలకులు కాలేరు…ఉన్నత సామాజిక వర్గాలను గద్దెనెక్కించడానికి, వారి పల్లకీలు మోయడానికి తప్ప బడుగులు ఎందుకూ పనికిరాకుండాపోతారు…ఇదే వారి ధైర్యం…మరి ఇప్పుడు బడుగులేం చేస్తారన్నదే ఇక్కడ ప్రశ్న…కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందన్నదే చర్చ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *