యాంకర్‌ తెలివి తెల్లారినట్లే వుంది?

 

`ఆ యాంకర్‌ అతి తెలివి ఛానల్‌ కు చేటు!?

` తన పరువు తాను తీసుకున్న యాంకర్‌!

`అరకొర జ్ఞానం అసలుకే మోసం!

`అల్పులకు అందలం…చరిత్రకు మంగళం!

` నోరుంది కదా! అని అడిగే ముందు అన్ని విషయాలు తెలుసుకోవాలి.

` నాయకులను తప్పుదోవ పట్టించి, అబద్దాలు నిజాలు చేయలేరు!

`కోట్ల విజయభాస్కరరెడ్డి ఏ పదవులు చేపట్టారో తెలుసా?

` ఎంతో తెలిసినట్లు బిల్డప్పు యాంకర్లు?

` ప్రశ్నించే ముందు చరిత్ర తెలుసుకోవాలి.

`ఒక మంత్రిని ఇంటర్వూ చేసినప్పుడు చరిత్రను వక్రీకరించొద్దు!

`చరిత్రకు మరకలంటించొద్దు!

`చరిత్రపై అవగాహన లేని జర్నలిస్టుల వల్ల సమాజానికి చాలా నష్టం!

` ఇటీవల మంత్రి కేటిఆర్‌ ఇంటర్వూలో యాంకర్‌ తప్పుడు ప్రశ్నలు?

` కోట్ల విజయభాస్కరరెడ్డి రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి?

`అడిగే ముందు కనీస అవగాహన ఎంతో ముఖ్యం?

` తొలుత1982 నుంచి 83 వరకు, తర్వాత 1992 నుంచి 1994 వరకు సిఎం గా పని చేశారు.

`అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ మంత్రి రాజీనామా చేయలేదు?

`నేదుమల్లి జనార్ధన రెడ్డి ఇంజనీరింగ్‌ , మెడికల్‌ సీట్ల విషయం ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి!

` ఎక్సైజ్‌ కాంట్రాక్టులు మంత్రులకు కేటాయింపులు సిఎం కు ముడుపులు అందినట్లు పెద్ద ఎత్తున ఆరోణలు చేశారు.

`దాంతో నేదురుమల్లి జనార్ధనరెడ్డి రాజీనామా చేయడం జరిగింది?

`చరిత్ర తెలియక తెలంగాణ సమాజాన్ని తప్పు తోవ పట్టించే ప్రయత్నం?

`ఇంకా తెలంగాణపై విషం చిమ్మడం వారి అతి తెలివికి నిదర్శనం?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                 

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా…అని అన్నట్లు…న్యూస్‌ ఛానళ్ల యాంకర్లకు నోరుంటే చాలు..ఆంధ్రా అయితే చాలు..ఈ రెండు క్వాలిఫికేషన్లు వుంటే చాలు. రాజకీయాలు అవసరంలేదు. చరిత్ర మీద అవగహన వుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అదే సాగుతోంది. తెలంగాణ మీద ఇప్పటికీ ఎలా విషం చిమ్మాలో ప్రయత్నం కొనసాగుతూనే వుంటుంది. తాము చెప్పిందే నిజమనట్టు నమ్మించడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఆనాడైనా, ఇప్పుడైనా తెలంగాణ సమాజానికి శాపంగా పరిణమించింది. నాలుకను రెండు సార్లు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు సూచించారు. ఒకటి తినేటప్పుడు, రెండోది మాట్లాడేటప్పుడు. రెండోది ఆంద్రా యాంకర్లకు అవసరం లేదన్నట్లుగా మారిపోయింది. నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం మళ్లీ మొదలుపెట్టారు. గతంలో 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఇలాగే తమ నోటి నుంచి వచ్చిందే మాట…మేం చూపిందే బాట…అన్నట్లు బరితెగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రనిధులను అవమానపర్చి, తెలంగాణలో బాయ్‌కాట్‌కు గురైన ఛానల్‌ అది. అయినా దానిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే అలాంటి ఛానళ్లలో ఎంత మేదావులైనా తెలంగాణ వారికి అందలం వుండదు. గుర్తింపు కనిపించదు. కాని ఆంధ్రా అయితే చాలు..అక్షరం సరిగ్గా రాకున్నా ఫరవాలేదు. అక్షరం సక్కగ తెలియకుడా ఫరావాలేదు. చరిత్ర అంతకన్నా అవసరం లేదు. మాకున్న తెలివి తెలంగాణ వారికి వుండదన్న అహంబావం ఇంకా వారిలో వున్నట్లుంది. అందుకే ఇంకా అతి తెలివితేటలను ప్రదిర్శిస్తూనే వున్నారు. అక్షర పరిజ్ఞానం లేకపోయినా, నాలుక సామార్ధ్యం మీద ఆధారపడి కాలం వెల్లబుచ్చడం, అదే గొప్ప అనంతగా భావించడం ఆది నుంచీ వారికి అలవాటే…తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో తెలిసి కూడా వారి అతి తెలివి ప్రదర్శన ఆపడం లేదు.

తాజాగా రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఓ ఛానల్‌ యాంకర్‌ గతంలో మంత్రులు రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు.

ఎవరు రాజీనామా చేశారు? అంటూ మంత్రి కేటిఆర్‌ సదరు యాంకర్‌ను ప్రశ్నిస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి అన్నారు. నిజానికి మంత్రి ఆ సమయంలో కొద్దిగా ఆలోచిస్తే ఆ యంకర్‌ పరువు అక్కడే పోయేది. కాని ఆ సమయంలో మంత్రి కేటిఆర్‌కు గుర్తుకు రాకపోవచ్చు. అంతే కాని మంత్రికి తెలియని విషయాన్ని తాను చెప్పినట్లు సదరు యాంకర్‌ ఏదో సాధించినంతగా నేను నిరూపించాన్నంత గర్వం చూపించారు. చరిత్ర మీద, తెలుగు రాజకీయాల మీద కనీసం అవగాహన లేని ఆ యాంకర్‌ అడిగిన ప్రశ్నే తప్పు. అందుకు మళ్లీ తానే చెప్పిన సమాధానం శుద్ద తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయి. కాని ఏనాడు వాటిపై చర్యలు లేవు. ఎందుకంటే బోర్డులో వుండేవారు చేసే తప్పుడు పనులవి. ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నట్లు మంత్రి కేటిఆర్‌కే పాఠాలు చెప్పినట్లు ముఖ కవలికలు మార్చాడు. తనకు తెలియనిది అబద్దమైన విషయం చెప్పడం ఆ యాంకర్‌ అతి తెలివికి నిదర్శనం. ఉమ్మడిరాష్ట్రంలో ఓ సందర్భంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఏకంగా ఓ జపాన్‌ను చెందిన ఓ బోగస్‌ కంపనీకి రూ.3కోట్లు చెల్లించడం జరిగింది. ఆ సమయంలో స్వయంగా మంత్రి బొత్స పోనాయ్‌..ఏటి సేత్తాం..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా ఏ ఒక్క ఛానల్‌ మాట్లాడలేదు. కాని ఇప్పుడు ఓ ఆంద్రా చరిత్రను పుక్కిట పట్టుకున్నట్టు నోటికి ఏది వస్తే అది చెప్పి ఆ యాంకర్‌ జర్నలిజం పరువు తీశాడు. 

 కోట్ల విజయభాస్కర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

 కేర్రదంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారంలోకి రావడానికి ముందు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు. అదేంటో గాని మళ్లీ 1994 లో కూడా ఆయనే సిఎంగా వున్నారు. రెండుసార్లు ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీకి అధికారం అందించారు. అలాంటప్పుడు పేపర్ల లీకేజీ ఎక్కడిది. ఆయన రాజీనామా చేసిందెక్కడ? అసలు ఆ యాంకర్‌కు తెలిసినచరిత్రేమిటి? సరే..ఇదిలా వుంటే 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురు మల్లి జనార్ధనరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కనీసం అది తెలుసా? ఆ రోజుల్లో ఇంజనీరింగ్‌ ,మెడికల్‌ ప్రైవేటు కాలేజీల్లో క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం కల్పించాడు. అది చట్ట విరుద్దం. నేరం కూడా..? అలాంటి కాలేజీలు వసూలు చేసిన ఫీజుల్లో వాటాలుతీసుకున్నాడని నేదురుమల్లి మీద పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయా కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. పేద విద్యార్ధులకు ఇంజనీరింగ్‌, వైద్య విద్యను దూరం చేశారు. అంతే కాదు ఆ రోజుల్లో రూ.5లక్షలు ఒక్క సీటు కోసం క్యాపిటేషన్‌ ఫీజు అంటే పెద్ద అమౌంట్‌. అంతలా అవినీతికి పాల్పడడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు, నాటి కాంగ్రెస్‌ నేతలు కూడా నేదురుమల్లి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా అప్పటి మంత్రులకు ఎక్జైజ్‌ కు చెందిన టెండర్లు అలాట్‌మెంటులో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది అప్పడు అభియోగం. దానితోపాటు ఆ కాలేజీలన్నీ ఇలా ఎక్జైజ్‌ వ్యాపారులైన మంత్రులకే కేటాయించారు. ఇలా విద్యావ్యవస్ధను భ్రష్టుపట్టించిన చరిత్ర ఆంధ్ర పాలకులది. ముఖ్యమంత్రి స్ధానంలో వుండి నేదురుమల్లి తన బంధువుల అమ్మాయికి మెడికల్‌ సీటు ఇప్పించారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానం నేదురమల్లిని అధికారంలో నుంచి దింపేసి, కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ అసలు చరిత్ర. ఇది కాకుండా 1985లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఓ పదో తరగతి పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగాయి. ప్రత్యక్షంగా అప్పటిమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమేయం వుందన్న వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అంతే కాకుండా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రాంతంనుంచి వచ్చిన వారికి తెలంగాణలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున ఎలాంటి పరీక్షలు లేకుండానే లెక్చరర్లుగా ఉద్యోగ నియామాకాలు చేశారు. అది అప్పట్లో వివాదమైంది. దాంతో మంత్రిగా వున్న గాలిముద్దుకృష్ణమ నాయుడు రాజీనామా చేశాడు. కాని ఎన్టీఆర్‌ ఒప్పుకోకుండా కొంత కాలానికి విద్యాశాఖను మార్చి అటవీ శాఖను అప్పగించారు. ఇదీ అప్పట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఇలాంటి అన్యాయాల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలుపెట్టింది. ఆనాడు నోరు మెదపని సీమాంద్ర మీడియా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని , వికాసవంతమైన తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికైనా మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పే ఆంధ్రా ఛానళ్ల మాటలు నిజాలు ఎప్పుడూ కావు. విలువలు లేని వ్యక్తులు జర్నలిజంలో చేరి సమాజాన్నే తప్పుదోవ పట్టించడం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వున్న పార్టీలు కూడా ప్రభుత్వం మీద సీమాంధ్ర మీడియాచేసే అసత్యాలను బాధ్యత కల్గిన తెలంగాణ పార్టీలు కూడా వ్యతిరేకించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!