మోడి ముచ్చట చప్పగా! కేసిఆర్ కొట్లాట గట్టిగా!!

డబుల్‌ ఇంజన్‌ అనగానే సరిపోతుందా?

రాష్ట్రానికి ఏం చేయకుండానే గెలుస్తారా?

లెక్కలు లేని మాటలు చెప్పగానే చాలా?

ఇవ్వాల్సింది ఇవ్వలేదన్నట్టు కాదా?

ఇద్దామన్న ఆలోచన కూడా లేనట్టు కాదా?

పది లక్షల సభ అన్నారు…ఏం చేశారు?

ఆ మాత్రం జనానికే మురిసిపోతూ సంబరపడ్డారు?

జనాన్ని చూసి మంత్రముగ్థులైనట్టున్నారు?

ఉత్త చేతులు చూపించి, ఊపి,ఊపి వెళ్లిపోయారు?

చెప్పేదంతా వేధాంతం కాదు…వినేదంతా భాగవంతం కాదు…చెప్పేవాళ్లు వేధాంతులు కాదు…వినే వాళ్లు వెర్రి వెంగలప్పలు అసలే కాదు….వాళ్లు తెలంగాణ ప్రజలు. చైతన్య వంతులు…పోరాట యోధులు…ప్రపంచ చరిత్రలోనే యాభై ఏళ్లలో రెండు సార్లు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమ పోరాటం ఘనత తెలంగాణ సమాజానికిది…అందుకే నొప్పింపక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్న సుమతీ శతక పద్యం ప్రధానమంత్రి మోడీకి తెలిసినట్లుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా ఇబ్బందే అనుకున్నారో ఎమో? ఇక్కడ మాట్లాడడానికి ఏమీ లేదనుకున్నారో ఏమోగాని, తనదైన శైలిలో ఘాటు టేకుండా మాట్లాకుండానే వెళ్లిపోయారు..? ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడినా తెలంగాణకు ఏమిచ్చామన్నదానిని సైతం క్లారిటీగా చెప్పలేకపోయారు. ఏం చెప్పినా ఇబ్బందే అనుకున్నట్లున్నారు. తెలంగాణ ప్రజలు ముందు అబద్దాలాడితే నమ్మరనుకున్నట్లున్నారు. ఎక్కడ బావ అయినా వంగతోట కాదనట్లు ఎక్కడికెళ్లి ఏది చెప్పినా విన్న జనం వేరు. తెలంగాణ ప్రజలు వేరు అన్నది మోడీకి బాగా తెలిసినట్లుంది. అందుకే చెప్పడానికి నిజాలేమీ లేక, అబద్దాలు చెప్పడానికి నోరు రాక, చెప్పాలన్నా, ఏమీ లేక ఉత్త చేతులు ఊపితే చాలనుకున్నారు. 

వంగీ వంగీ దండాలు పెట్టి, నోటితో చెప్పలేని క్షమాపణలు చేతులు ఊపడం ద్వారా అర్ధం చేసుకొమ్మని చెప్పినట్లు చేశారు. ఇంతకీ ఇరవై ఏడు నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోడీ చెప్పిన మాటలు వింటే విచిత్రమనిపిస్తాయి. తెలంగాణలో 2015లో పునర్‌ప్రారంభపనులు మొదలైన రామగుండం ఎరువుల ప్యాక్టరీ ఏడేళ్లు గడిచినా, ఇంకా పునరుద్దరణ పనులే జరుగుతున్నాయిని స్వయంగా ప్రధాని మోడీ ఒప్పుకున్నట్లైంది. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి వుంటే ఒక ఫ్యాక్టరీ పనులు ప్రారంభించడానికి ఏడేళ్లు పడుతుందా? అయినా ఇంకా అది పూర్తయినట్లుగాని, త్వరలో ప్రారంభిస్తామని కాని చెప్పలేదు. పనులు జరుగుతున్నాయన్న మాటలు మాత్రమే చెప్పారు. అంటే తమ అశక్తిని, చిత్తశుద్ది లేమిని బైటపెట్టుకున్నారు. ఇక తెలంగాణలో ఏడేళ్ల కాలంలో 115 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పూర్తి చేశామన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రోజుకు కనీసం 10 నుంచి పదిహేను కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కాని తెలంగాణలో ఏడేళ్లుగా పూర్తి చేసింది కేవలం 115 కిలో మీటర్లు మాత్రమే అని స్వయంగా ప్రధాని చెప్పారు. ఏడేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే ఎంత పూర్తయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణకు ఇస్తామన్న కాజిపేట రైల్లే కోచ్‌ ఫ్యాక్టరీనే గురజాత్‌కు తరలించుకుపోయిన వారు, తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తారని ఆశించడం కూడా అవివేకమే అవుతుంది. 1853 ఎప్రిల్‌ 13 ఇండియాలో తొలి రైలు బొంబాయి నుంచి ధానేకు నడిచింది. ఆ తర్వాత యుద్ద ప్రాతిపదికన రైల్వే వ్యవస్ధను నిర్మాణం చేశారు. దేశమంతా రైల్వే లైన్‌ పూర్తి కావడానికి ఈ లెక్కన పూర్తి కావాలంటే ఎంత సమయం అయివుండాలి? కాని 1873లో తెలంగాణలో కూడా పూర్తి స్ధాయి రైల్వే లైన్‌ పూర్తయింది. 

ఇక తమిళనాడు, నాటి ఆంధ్రప్రదేశ్‌ లో అప్పటికే రైల్లే పనులు పూర్తయ్యాయి. ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు. మిషనరీ సరఫరా లేదు. కేవలం మ్యాన్‌ పవర్‌ మాత్రమే. పైగా రైలు పట్టాలకింద వాడేది కలప. దేవదారు వృక్షాలు తెచ్చి, నూనెలో నానబెట్టి, కొనేళ్ల తర్వాత వాటిని ఎండబెట్టి, ఇలా ఎంతో కాలం పట్టేది. అలాంటిది దేశంలో 1957లో ప్రారంభమైన తిరుబాటు కాలానికే దేశంలో అనేక ప్రాంతాలకు రైల్వే లైన్‌ ఏర్పాటు చేయబడిరది. ఒక వేళ బ్రిటీష్‌ కాలంలో ఇలా ఏళ్ల తరబడి వంద కిలోమీటర్లు పూర్తి చేసి వుంటే ఇప్పటికీ మన దేశంలో సగం కాదు కదా…పావు వంతు రైల్లే లైన్‌ కూడా పూర్తి కాకపోయేది. కేవలం 115 కిలోమీటర్ల రైలు మార్గం గురించి ఒక ప్రదాని మోడీ చెప్పడం విడ్డూరం. దేశానికి అవసరమైన వ్యాక్సిన్‌ ఇచ్చామని, రేషన్‌ ఇచ్చామని దేశమంతా ఇదే చెప్పుకుంటూ పోయి, పబ్బం గడపడం తప్ప మరేమైనా వుందా? ఉప్పల్‌ ఎలివేటేడ్‌ కారిడార్‌ ఒక్కటిచ్చి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం హాస్యాస్పదంగా వుంది. దేశంలో హైవేల నిర్మాణం జరుగుతున్న దశలో భాగాంగానే తెలంగాణకు కూడ రోడ్లు వచ్చాయి. అయినా వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటూనే, టోల్‌ వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోతుందో కూడా ప్రధానిచెప్పి వుంటే బాగుండేది…కాని ఆ పని చేయలేదు…ప్రసంగం అంత గొప్పగాసాగలేదు. కాని అంతకు ముందు మాట్లాడిన బిజేపి నాయకులు ఆకాశంలో సంచరించినంత పనిచేశారు. ఆ నాయకులే అంత మాట్లాడితే ఇక మోడీ ఎంత మాట్లాడతారో అని అందరూ అనుకున్నారు. అందరి ఊహలు తలకిందులు చేసినట్లు మోడీ ప్రసంగం కార్యకర్తలను ఉత్సాహ పరిచే రీతిలో సాగించారే గాని, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు తీయడానికి కూడా ప్రధాని మోడీ సాహసించలేదనే చెప్పాలి. 

ఇక ముఖ్యమంత్రి కేసిఆర్‌ విషయానికి వస్తే ఈసారి ఆయన తనదైన శైలిలో ప్రధాని మోడీ హైదరాబాద్‌లో వుండగానే ప్రశ్నల జడివాన కురిపించారు. ఇంత కాలం మోడీ వస్తున్నాడనగానే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాడంటూ బిజేపి చేసిన పసలేని విమర్శలకు ధీటైన సమాధానం చెప్పారు. ఫెడరల్‌ స్పూర్తిలో ఎవరి స్ధానం ఎలా వు ండాలో బిజేపికి గుణపాఠం చెప్పినంత పనిచేశారు. సరిగ్గా బిజేపి కార్యవర్గ సమావేశాల కాలంలోనే రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత సిన్హా కార్యక్రమం టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్‌ కాషాయ మయం ఏనాడు కాలేదని నిరూపించడానికి మొత్తం గులాబి మయం చేశారు. బిజేపికి స్ధానం లేదని తెలపడానికి ఎక్కడా హోర్డింగ్‌ కూడా పెట్టుకోలేనంత స్పేస్‌ కూడా మిగల్చలేదు. ఇదిలా వుంటే మోడీ ఎక్కడో వుంటే, ఎక్కడో కాదు…మోదీ హైదరాబాద్‌కు వస్తున్నాడని తెలిసే బైబై అంటూ ప్రచారం సాగించారు. ఇంతకన్నా మోడీని కేసిఆర్‌ వ్యతిరేకిస్తున్నాడని చెప్పడానికి మరొక సంకేతం లేదు. అంతే కాదు మోడీ అంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఏ ఒక్క క్షణం కూడా భయం లేదని చెప్పడానికి కూడా ఇదే నిదర్శనమని కూడా చెప్పొచ్చు. ఇక ఇదిలా వుంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ జలవిహార్‌లో చేసిన ప్రసంగం దేశమంతా చూసింది. ప్రధాని మోడీని దేశంలోని ఏ నాయకుడు పట్టనంత తూర్పార పట్టిండు. ప్రపంచంతో మనం ఎందుకు పోటీ పడ లేకపోతున్నామో…బిజేపి చేస్తున్న మోసమేమిటో అన్నీ పూసగుచ్చినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ లోపాలను ఒక్కొక్కటి ఉల్లిగడ్డ మీద పొట్టు ఒలిచినట్లు ఒలిచి వివరించారు. సంపద సృష్టి లేకుండాపోగా, ఉన్న సందనను కేంద్ర ఎలా అమ్ముతున్నారో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేయదంటూనే, వ్యాపారులకు సేల్స్‌ మెన్‌గా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నాడని సూటిగా విమర్శించారు. మేకిన్‌ ఇండియా అంటూ గొప్పలు తప్ప చేసిందేమీ లేదన్నారు. పైగా దేశంలో వున్న పరిశ్రమలు కూడా పారిపోయేలా చేస్తున్నాడని గతంలో మన దేశంలో వున్న కార్ల కంపనీల పేర్లు చదవుతూ అవి తరలిపోయిన విషయం గుర్తు చేశారు. ఒక మార్గదర్శకుడిగా, శాంతి కామకుడిగా ప్రపంచమంతా మన జాతి పిత మహాత్మాగాంధీని కొనియాడుతుంటే, కేంద్ర పెద్దలు మాత్రం ఎలా అవమానిస్తున్నారో వివరించాడు. ఏ ఒక్క విషయాన్ని వదలకుండా, నరేంద్ర మోడీపై ప్రశ్నల రూపంలో నిప్పులు కురిపించారు. ఆయన పరువు మొత్తం గంగలో కలిపారు. ఒక్కొక్క మాట ఒక రాకెట్‌లాగా వదిలారు. మతం పేరుతో బిజేపి చేస్తున్న దారుణాలను ఏకరువు పెట్టారు. మత రాజకీయాలతో దేశంలో ఎలా ప్రజల జీవితాలను బిజేపి నాయకులు అస్తవ్యస్థం చేస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే గంటకు పైగా కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. నిలబెట్టి కడిగేశారు…తనేంటో చూపించారు. తాను వ్యతిరేకించడం మొదలు పెడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని నిరూపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పతనం చేయాలని చూస్తున్న బిజేపిని కేంద్రంలో కూల్చడం ఖాయమని సవాలు చేశారు. తనదైన శైలిలో బెబ్బులిని మరిపించినంత పనిచేశారు… కేసిఆర్‌ రాజకీయ గర్జన ఎలా వుంటుందో రుచి చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!