అవినీతికి తెగబడినవాళ్లు లీగల్ నోటీసులతో తప్పించుకోలేరు?
నేటిధాత్రి నిజాలకు నిలువెత్తు నిదర్శనం
అక్రమాలను ఎన్నడూ సహించేది కాదు?
అవినీతి పరులను ఉపేక్షించేది కాదు?
పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోదు?
అక్షరాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడుతుంది!
కంచే చేను మేసినట్లు అధికారులు వ్యవహరిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
శాఖలను అవినీతికి అడ్డాలుగా మార్చిన వారు తప్పించుకోలేరు?
అక్రమ రిజిస్ట్రేషన్లు ఇప్పటికైనా ఆపకపోవడాన్ని ఏమంటారు?
బాధితులకు న్యాయం జరిగేదాకా నేటిధ్రాత్రి నిద్రపోదు!
అవినీతి పరులను శిక్షించేదాకా నేటిధాత్రి విశ్రమించదు.
నిజం ఎప్పుడూ ప్రచారంలోనే వుండాలి. లేకుంటే అబద్దాన్నే నిజమని నమ్మే ప్రమాదముందని డాక్టర్. బాబా సాహెబ్ అంబెద్కర్ ఏనాడో చెప్పాడు. మీడియా అంటే దాని మీద అవగాహన లేని వాళ్లు చాలా మంది వుంటారు. వారు చేసే విచిత్రమైన ఆలోచనలు వింతగా వుంటాయి. మీడియా అన్నది హంస లాంటింది. అది ఎప్పుడూ నిజాన్ని మాత్రమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తప్పులను ఎత్తి చూపుతోందంటేనే నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లు లెక్క. పాలు,నీళ్లను వేరు చేసినట్లే, తప్పులు, ఒప్పులను పక్క పక్కన చేర్చి చూపించడమే మీడియా కర్తవ్యం. మీడియా ఆ బాధ్యతనుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. అది సాధ్యం కాదు కూడా. అందుకే నిజాలు చెప్పే మీడియా అంటే తప్పుడు పనులు చేసేవారికి నచ్చదు. తమ తప్పులను వేలెత్తి చూపడం తప్పుడు మనుషులకు గిట్టదు. సమాజంలో సామ్యవాదం కోసం పనిచేసేదే మీడియా. సమాజంలో అన్ని వర్గాల అభ్యున్నతే మీడియా లక్ష్యం.
అంతే కాని దోచుకునేవారికి కొమ్ము కాయడం అన్నది ఏ మీడియా చేయదు. నేటిధాత్రి దిన పత్రిక పురుడుపోసుకున్న నాటి నుంచి కూడా ఎక్కడ అన్యాయాన్ని సహించలేదు. ఎక్కడ అక్రమాన్ని ఉపేక్షించలేదు. ఎంత పెద్ద నాయకుడైనా విడిచిపెట్టలేదు. ఎంతటి ఉన్నతాధికారి చేసిన తప్పులనైనా ప్రపంచానికి చాటకుండా ఊరుకోలేదు. నిజాన్నే మీడియా సమర్ధిస్తుంది. అన్యాయాన్ని ప్రతి క్షణం ఖండిస్తుంది. జనానికి చేరవేస్తుంది. అలాంటి నిజాలను దిగమనించుకోలేని వారు చూసే ఆరోపణలు మీడియాకు కొత్తకాదు. ఏ ఆరోపణలకు మీడియా తలొంచేది కాదు. అందుకే నిజానికి శత్రువులెక్కువ. అబద్దానికి మిత్రులెక్కువ. నిజాలు రాసే పత్రికలపై దుష్ట ప్రచారాన్ని ఏడాడు జనం నమ్మరు. నిజం మాట్లాడలేని వ్యక్తికి కోపమెక్కువ. నిజం చెప్పకపోతే పత్రిక ప్రజల ఆదరణ తక్కువ. ఈ రెండిరటి సంఘర్షణే సమాజ సంక్షేమం. అది ఎప్పుడూ నేటిధాత్రి వదిలిపెట్టదు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వెర్రి వేషాలు వేసేవారిని అసలే వదిలిపెట్టదు. పరిశోధనాత్మక జర్నలిజం అన్నది మీడియాకు పెద్ద సవాలు. ఈ విషయంలో అవరోధాలు ఎదరౌతాయని తెలిసి కూడా చేసే సాహసం. అలాంటి సాహసాలు మీడియాకు కొత్తకాదు. నేటిధాత్రికి అసలే కొత్త కాదు. ప్రజలకు నిజాలు చెప్పడంలో ఎల్లప్పుడూ నేటిధాత్రి ముందుంటుంది. నేటిధాత్రి అనేది నిప్పుకణం. దానికి చెదపట్టించాలని చూలా మంది చూశారు. కాని కుదరలేదు. నేటిధాత్రి మీద నిందలేస్తే నిప్పుతో తల గోక్కున్నట్లే..! అయినా నిజాయితీ పనిచేయండని చెప్పడం కూడా నచ్చకపోతే అవినీతి అధికారులు ఉద్యోగాలు వదిలేసుకోవాలి. సామాజిక సృహ వున్న ఎంతో మంది నవతరం యువత ఉద్యోగాలు లేక అల్లాడుతోంది. కాని అంది వచ్చిన అవకాశాలతో ఉద్యోగాలు పొందిన వాళ్లు కొందరు అవినీతికి పాల్పడడమే దురదృష్టకరం. అవినీతి చేయడం తమకు కలిసొచ్చిన అదృష్టం అన్నట్లుగా నిత్యం లంచం లేనిదే పట గడవదన్నట్లు పనిచేస్తున్నవారినెవరినీ నేటిధాత్రి వదిలిపెట్టదు.
ఒక అధికారి మీద ఆరోపణలు ఊరికే రావు. తెలిసీ తెలియకుండా జరిగిన తప్పులను ఎవరూ వెలెత్తి చూపించరు. మీడియా దాకా రాదు. కాని కొందరు అధికారులు పనిగట్టుకొని చేసే అవినీతి మూలంగానే అది పది మందినోటిలో నానుతుంది. బాధితుల ద్వారా మీడియాకు చేరుతుంది. అది అవినీతి అక్రమాలు మీడియాలో వార్తలౌతాయి. నేను చేసేది చేస్తా? రాసేందుకు మీరెవరు? అని ఉన్నతోద్యోగులు ప్రశ్నించడం అంటేనే విచిత్రం. వారి దౌర్భాగ్యానికి నిదర్శం. మీడియా మీద పరువు నష్టం దావాలు అనేవి ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటున్నారు. కాని తాము సచ్చీలురమని ప్రకటించుకునేందుకు తాము ఎలాంటి తప్పు చేయలేదని ఎంక్వరీ చేయండని మాత్రం అడగడం లేదు. అంటే తాము తప్పు చేశామని అంగీకరించినట్లే…మనోభావాలు అన్నవి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు మాత్రమే వుంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు చెల్లించే పైసా, పైసా పన్నులతో నెలనెల జీతాలు తీసుకుంటూ, వారిని నిత్యం గోస పెడుతూ, వారిని నిండా ముంచుతామంటే మీడియా కళ్లు మూసుకొని వుంటుందా? నిజాలు రాకుండా వుంటుందా? కలుగులో దాగి చేస్తున్న అక్రమాలను బైట పెట్టకుండా వుంటుందా? అదే నేటిధాత్రిచేసింది. అందుకు కేసులు నమోదు చేస్తాం…పరువు నష్టందావాలేస్తామంటే ప్రజలు హర్షించరు. ఆ మనోభావాలు నేటిధాత్రికి అంతకన్నా ఎక్కువే వుంటాయి. ఎందుకుంటే నేటిధాత్రి ప్రజల గొంతుక. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల వేధిక.
ములుగు సబ్‌రిజిస్ట్రార్ నేటిధాత్రి మీద చేసే ఆరోపణలను జనం వింతగానే తీసుకుంటున్నారు. నేటిధాత్రి ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏం జరుగుతోందన్నదానిపై వరస కథనాలు రాస్తోంది. అందులో నిజాలు లేకుంటే బహిరంగంగానే వాటిని ఖండిరచొచ్చు. కాని ఇంత వరకు సబ్ రిజిస్ట్రార్ ఆ పని చేయలేదు. ఎందుకంటే అలా ప్రకటించాల్సివస్తే, తనమీద తనే విచారణ చేయమని ఉన్నతాధికారులకు సవాలు చేసినట్లౌతుంది. అదే జరిగితే తాను చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లన్నీ బైటకు వస్తాయి? ఉద్యోగ ప్రమాణాలు పాటించాల్సిన చాలా మంది ఉద్యోగులు రాజకీయ నాయకుల దారిలో నడవాలనుకుంటున్నారు. అది తెలిసి చేస్తున్నారో,తెలియక చేస్తున్నారో గాని, నాయుకులు వేరు…ఉద్యోగులు వేరు. ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయినా ఆయన పదవీ కాలం ఐదేళ్లే…ప్రతి ఐదేళ్లకోసారి గెలవాల్సిందే. ఆ సమయంలో తప్పులు చేసినా,చేయకపోయినా ఆరోపణలు వస్తే స్పందించాల్సిందే! ఒత్తిడిని బట్టి విచారణ కోరాల్సిందే..! ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఎక్కడో వుండే మంత్రి రాజీనామా చేస్తాడు. అదే ప్రజాస్వామ్య సూర్తి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని వేమన ఏనాడో చెప్పారు. కొందరు ఉద్యోగుల పరిస్దితి అలాగే వుంది. నేటి ధాత్రి రాసే ప్రతి అక్షరం ఒక నిబద్దతతో కూడుకున్నదే. ములుగు సబ్‌రిజిస్ట్రార్‌కార్యాలయంలో ఎప్పుడు ఏంజరిగిందన్నదానిపై స్పష్టమైన ఆధారాలతో వార్తలు ప్రచురిస్తోంది. ఓ వైపు నేటిధాత్రి రాస్తూనే వున్న కాలంలోనే తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే వ్యవస్ధ కళ్లు మూసుకుంటుందా? ఆ శాఖ దృష్టికి రాకుండాపోతుందా? కింది నుంచి పై స్ధాయిదాకా నేటిధాత్రి అందర్నీ నిద్రలేపుతోంది. ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే ప్రతి అంశం పై స్ధాయి దాకా అందరకీ ఆధారాలను పక్కాగా పంపించడం జరుగుతోంది. అది తెలియక పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, సబ్ రిజిస్ట్రార్ పనిగట్టుకొని చేస్తున్న అక్రమాలు ఎవరికీ తెలియవనుకుంటే పొరపాటు. చర్యకు ప్రతి చర్య వుంటుంది. నేటిధాత్రికి అక్షర పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా తెలుసు. ఇలా తప్పులు చేసే వారే బెదిరింపులకు గురి చేస్తామంటే వెనుకడుగు అలవాటు నేటిధాత్రికి లేదు. నోటీసులతో పవిత్రమైన అక్షర యజ్ఞం చేస్తున్న నేటిధాత్రిని బెదిరించాలని చూస్తే కుదరదు. నోటీసులు నేటిధాత్రి కూడా పంపగలదు. అయినా మీడియాకు ఐట ఆక్టును ఆపాదించడం కుదరదు. అయినా జరిగిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో తొందపాటుకు గురై నోటీసులు పంపాల్సిన సమయంలో కేసులు నమోదు చేయించి, ప్రచారం చేసుకోవడం కూడా నేరమన్న సంగతి సదరు సబ్ రిజిస్ట్రార్ తెలుసుకోవాలి. పరువు నష్టం అన్నది నేరం చేసిన వారు చెప్పాల్సిన మాటలు కాదు. సామాన్యులను వేధించినట్లు ఆరోపణలున్న వారు కాదు మధనపడాల్సింది. తాను చేసిన రిజిస్ట్రేషస్లు అక్రమం కాదని, అన్నీ సక్రమమే అని రుజువు కావాలంటే తనపై తాను ఎంక్వరీకి శాఖ పెద్దలను కోరడం తప్ప మరో మార్గం లేదు. కాని అది వదిలేసి నిజాలు రాసిన మీడియాను తూర్పారపడతా? అంటే కుదురుతుందా?