మేపుడు మా వళ్ల కాదు!

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల వేడుకోలు.

`సీనియర్లు కూడా ఇదే మాట అంటున్నారు.

`ఇప్పుడే టికెట్లు ప్రకటించొద్దు.

`ఆశావహులుగానే ఖర్చు తట్టుకోలేకపోతున్నాం.

`ఇప్పటికే తడిసి మోపెడౌతుంది.

`టికెట్లు ప్రకటిస్తే హారతి కర్పూరమే.

`ఊపిరి కూడా సలపనంత తలనొప్పి వచ్చుడే!

`ఇది రేవంత్‌ కు అనుకూలంగా మారింది.

`ఆశావహులతో బేరంతో మరింత లాభమే!

`టికెట్‌ వస్తుందో రాదో అనుకునే వారు ప్రకటిస్తే బాగుండంటున్నారు.

`కచ్చితంగా వస్తుందనుకునే వారు ఇప్పుడే ప్రకటించొద్దంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మేపుడు మా వల్ల కాదు…ఈ మాటలు అంటుంది ఎవరో కాదు? సాక్ష్యాత్తు రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధులు. మా జీవితం కార్యకర్తల కోసమే…మా రాజకీయం కార్యకర్తల కోసమే..మా పదవులు ప్రజల కోసమే..మా కార్యకర్తలంటే మాకు ప్రాణం. వాళ్లంతా మా కుటుంబ సభ్యులతో సమానం. వాళ్లు లేకుంటే మేము లేనే లేము. వాళ్ల త్యాగమే మా రాజకీయ జీవితం. మమ్ములను కంటికి రెప్పలా కాపాడుకునే కార్యకర్తలను మేం గుండెల్లో పెట్టుకుంటాం. వారిని ఆదుకుంటాం. వారికి చేయూత నిస్తాం. వారి కోసం ఏదైనా చేస్తాం..ఎంత దూరమైన వెళ్తాం..ఇలాంటి మాటలు వినీ వినీ నమ్మీ. నమ్మీ ఊడిగం చేసే కార్యకర్తలు ఒక్కసారి నాయకుల మనసులో మాటలు కూడా తెలుసుకోండి. మీ ముందు ఏం చెబుతున్నారో…మీరు లేనప్పుడు ఏం చెబుతున్నారో… ముఖస్తుతి కోసం మీమ్మల్ని ఎలా మాయ చేస్తున్నారో…మీరు పక్కకు జరిగిన తర్వాత ఎలా తిడుతున్నారో కూడ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే వుంది. పార్టీలు కావాలి. పార్టీలో పదువులు కావాలి. ప్రజాప్రతినిధులు కావాలి. కార్యకర్తలందరూ తనవైపే వుండాలి. గ్రూపులు వుండడానికి వీలు లేదు. అందరూ నాకే జై కొట్టాలి. నేను ఇంట్లో నుంచి బైట అడుగు పెట్టింది మొదలు, మళ్లీ ఇంటికి చేరుకునే దాకా జై కొట్టాలి. నోరు నొప్పి పెట్టినా సరే జిందాబాద్‌లు కొట్టాలి. ఆకలి గురించి ఆలోచించకూడదు. దాహమౌతుందని చెప్పకూడదు. కాని రోజంతా ఊడిగం చేయాలి. నాయకుడు ఇంటికి చేరుకునేదాకా ఆయన వెంట తిరగాలి. ఆ రాత్రి ఇంటికి వెళ్లి వున్నదో లేనిదో తినాలి. లేకుంటే పస్తులుండాలి. కంటిమీద సరిగ్గా కునుకురాకుండాచూసుకోవాలి. తెల్లారకముందే మళ్లీ నాయకుడి ఇంటి ముందు వాలిపోవాలి. ఇదేనా కార్యకర్త అంటే.. వారికి జీవితం లేదా? వాళ్లవి జీవితాలు కావా? వారికి కుటుంబాలుండవా? వాళ్లు అసలు మనుషులే కారా? వారికి ఆకలి దప్పులు వుండవా? వారి సమస్యలు నాయకులకు పట్టవా? అవును పట్టవు. ఎందుకంటే కార్యకర్త వున్నది కేవలం జిందాబాద్‌లు కొట్టడానికి మాత్రమే..నాయకుడు వస్తున్నాడంటే చాలు ఆయన కోసం రోజంతా ఊడిగం చేయడానికే…ఇదే నేటి రాజకీయాలలో కార్యకర్తల పరిస్ధితి..దుస్తితి.
మాకు ఎన్నికల్లో టికెట్‌ కావాలి.
ఎంతైనా ఖర్చు చేస్తాం..శక్తికి మించైనా ఖర్చు చేస్తాం..కాని ఇప్పుడే టిక్కెట్లు ప్రకటించొద్దు..ఇదీ కాంగ్రెస్‌,బిజేపి పార్టీలో నాయకులు అంటున్న మాట…మొన్నటిదాకా అసలు టికెట్లకోసం పోటీ వుంటుందో లేదో అనుకున్నారు. అది బిజేపిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో కొద్దో గొప్పొ పోటీ కనిపిస్తోంది. కాని టికెట్లు ఇప్పుడే ప్రకటించడం మాత్రం వద్దన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా కార్యకర్తలను మేపుతున్నాం. ప్రజలకు ఏదో ఒక సాయం చేస్తూనే వున్నాం. ఊరూరు తిరుగుతున్నాం. గడపగడపకు చేరుకుంటున్నాం. పార్టీలు సభలు ఏర్పాటు చేస్తే ప్రజలను , కార్యకర్తలను తీసుకొస్తున్నాం. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూనే వున్నాం. అయితే ఇప్పటికిప్పుడు టికెట్లు ప్రకటిస్తే మాత్రం ఇక రోజూ జరగాల్సిన జాతరను భరించలేం. ముఖ్యంగా కార్యకర్తలను మేపడం మా వల్ల కాదు. ఇదీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లు కూడా చెబుతున్న మాట. ఇంత కాలం పదవులు వెలగబెట్టిన వాళ్లు, మంత్రులుగాపనిచేసిన వాళ్లు, మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లు కూడా ఇ దే మాట మాట్లాడడం అంటే విడ్డూరం. ఎమ్మెల్యే కావాలన్న ఆశ వున్నకొత్త నాయకులు ఎన్నికల దాక ఖర్చులను వాయిదా వేసుకోవాలన్న ఆలోచనతో చెబుతున్నారంటే ఒక అర్ధముంది. కాని సీనియర్‌ నాయకులు కూడా ఇదే మాట చెప్పడం అంటే కార్యకర్తలకు ఆయా పార్టీలలో ఎంత విలువుందో అర్ధం చేసుకోవచ్చు.
కార్యకర్తలంటే నాయకులకు మరీ అంత చులకన భావమా?
కార్యకర్తలు తమ జీవితాలు త్యాగం చేసేదే నాయకుల కోసం. వాళ్లు ఏం పని చేస్తారో తెలియదు. వున్నకాడికి వ్యవసాయం చేసుకొని మిగతా సమయమంతా నాయకుల కోసమే కేటాయిస్తారు. కుటుంబంలో ఏదైనా అత్యవసరమైన పనులున్నా సరే నాయకులు వస్తున్నారంటే వెళ్తారు. నాయకులు రమ్మంటే వెళ్తారు. అలాంటి కార్యకర్తలు లేకుండా ఎన్నికల ప్రచారం అన్నది జరిగే సమస్యే లేదు. కాని ఆ కార్యకర్తలచేత పని కావాలి. అసలు నాయకులు కార్యకర్తలకు చేసేదెంత? వచ్చిన వారికి రెండు పూటల భోజనం తప్ప మరేం వుండదు. అడపా దడపా దావత్‌ల పేరుతో కొంత ఖర్చు. ఒక వ్యక్తి ఒక రోజు ఏదైనా పని చేసుకున్నా ఎంతో కొంత సంపాదించుకుంటాడు. కాని ఒక కార్యకర్త నాయకుడి వెంట తిరిగి తన జేబులోనుంచే నాలుగు రూపాయలు ఖర్చు చేసుకుంటాడు. ఎక్కడైనా అనుకోకుండా ఖర్చు చేయాల్సి వస్తే కార్యకర్తే తన జేబులోనుంచి ఖర్చు చేస్తుంటాడు. నియోజకవర్గంలోని ఏదైనా గ్రామంలో ఎవరినైనా ఆదుకోవాల్సి వస్తే నాయకుడు ఫలాన వ్యక్తికి వెళ్లి సాయం చేయమని చెబుతాడు. చేతులు దులుపుకుంటారు.. ఇలాంటి నాయకులు కూడా వున్నారు. పేరు పెరుమళ్‌ది..ఆరగంపు అయ్యవారిది అన్నట్లు పేరు మాత్రం నాయకుడిది. జేబుకు చిల్లు మాత్రం కార్యకర్తది. ఇలాంటి పరిస్ధితులు ఎదుర్కొన్న కార్యకర్తలు కొన్ని వేల మంది వున్నారు. నాయకుడు ఏనాడైనా ఆదుకోకపోతాడా? ఏదైనా పదవి ఇప్పించకపోతాడా? రాజకీయంగా ఎదగకపోతామా? అన్న కోరిక కార్యకర్త జీవితాన్ని చిద్రం చేస్తుంది. పార్టీజెండా మోస్తూ, నాయకుడి పల్లకి మోస్తూ, ఏదైనా నామినేటెడ్‌ పదవి అయినా దక్కకపోతుందా? అనుకొని దశాబ్ధాల తరబడి ఊడిగం చేస్తే వారికి ఇచ్చే పదవి కేవలం రెండేళ్లు. అది కూడ ఎంత మందికి వస్తుంది? అది కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే…అధికారంలోకి వచ్చిన పార్టీలు అలాగే వున్నాయి…రాని పార్టీలు అవే గతంలో అనుసరించాయి. కార్యకర్తలుగా మిగిలిపోతూ, కనీసం సానుభూతికి కూడా నోచుకొని ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
కనీసం ఎన్నికల సమయంలోనైనా మాకేంటి? అని అడగండి?
రాజకీయం అన్నదానికి సేవ అన్న పర్యాయ పదం ఏనాడో కనుమరుగైంది. ఇప్పుడు రాజకీయం అంటేనే వ్యాపారం. అంతే కాదు వారసత్వ సంపదగా మారుతున్న వైనం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలే మర్చిపోతున్నారు. బాండ్‌ పేపర్లు రాసిచ్చి మరీ తూచ్‌ అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల సమయంలోనైనా కార్యకర్తలందరూ ఏకతాటి మీద వుండండి. విభజించి పాలించే నేతలు చెప్పే చెప్పుడు మాటలు నమ్మకండి. వారి వలలో చిక్కకండి. ఇప్పుడేం చేస్తావు? గెలిస్తే ఏంచేస్తావు? అన్నదానిని ముందే అడగండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే కార్యకర్తలను నాయకులు మనుషులుగా కూడా చూడడం లేదు. ముందు అది తెలుసుకోండి. పశువులను మేపంలేం అన్నంత సులువుగా, కార్యకర్తలను మేపలేమని నాయకులు మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే మా దాన సంగతి ఏమిటన్నదానిపై నిలదీయండి? అప్పుడుగాని కార్యకర్తలంటే నాయకులకు భయం రాదు…లేకుంటే మీ ఊడిగం జీవితాంతం ఆగదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *