ముప్పైకి పైగా మూడినట్లే?

` జనం మెచ్చని వాళ్లను మార్చుడే?

` హాట్రిక్‌ కొట్టుడే!

` కొందరు ఎమ్మెల్యే హాట్రిక్‌ హాంఫట్టే!

` ప్రభుత్వం మళ్ళీ వస్తుంది…అందుకు సహకరించాల్సిందే!

` ప్రజలతో సక్కగ లేకనే సీట్లు గల్లంతు?

` వివాద ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే?

` పార్టీ శ్రేణులను నుంచి తీవ్ర ఒత్తిడి.

` ప్రజల నుంచి కూడా వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందే?

` లేకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లే!

` లేని బలం వారికి కట్టబెట్టినట్లే…

`నియోజకవర్గాలను అప్పనంగా వాళ్ల చేతికిచ్చినట్లే…

` కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహం కూడా కొంప ముంచనుంది.

` రెండు ధఫాలు ఏలారు…ఈసారి కొత్త వాళ్లకు అవకాశం కల్పించండి!

` ఈ ఎన్నికలలో త్యాగాలకు సిద్ధం కండి!

`మళ్ళీ ప్రభుత్వం వచ్చాక త్యాగాలు చేసిన వారికి పదవులు గ్యారెంటీ!

` కొందరు ఎచ్చులకు పోతే మొదటికే మోసం!

`పక్క చూపులు చూస్తే అసలుకే మోసం!

` వివాదాల సుడి గుండాలలో వున్న వాళ్లెవరో అందరికీ తెలుసు…

`వాళ్లంతా పార్టీ క్షేమం కోసం మనసలుకుంటే అందరికీ మేలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున పోటీ చేసే అభ్యర్థులలో ప్రస్తుత ఎమ్మెల్యేలలో కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలకు మూడినట్లే అనే సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి హెచ్చరిస్తూనే వున్నారు. మన మీద అచంచలమైన నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి రెండోసారి బంపర్‌ మెజారిటీ ఇచ్చారు. మనం ఎంతో ఒదిగివుండాల్సిన సమయం. ప్రజలకు మరింత చేరువకావాలి. ఎప్పుడూ ప్రజల్లో వుండాలి. నియోజకవర్గానికే పరిమితం కావాలి. అసెంబ్లీ సమావేశాలప్పుడు తప్ప ఎప్పుడూ జనానికి అందుబాటులో వుండాలని చెప్పారు. ఈ విషయం అనేక సార్లు గుర్తు చేశారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు మారలేదు. వారిలో మార్పు రాలేదు. ప్రజలకు అందుబాటులో లేరు. పైగా ఎప్పుడూ ఏదో ఒక వివాదం మూటగట్టుకుంటూ వచ్చారు. తాజాగా కూడా సిఎం. కేసిఆర్‌ హెచ్చరించారు. అయినా కొందరికి చెవికెక్కలేదు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ రహస్యంగా చేయించిన సర్వేలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టడమే మేలని భావిస్తున్నారట.

జనం మెచ్చని వాళ్లను మార్చుడే? 

అన్న మాట కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొందరితో అన్నట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే వివాదాలున్నాయో అక్కడ సీట్లు మార్చి హాట్రిక్‌ కొట్టుడే! అన్న కసితొ కేసిఆర్‌ వున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పటికీ టిఆర్‌ఎస్‌ మీద నమ్మకం చెక్కు చెదరలేదు. ప్రతి పక్షాలు చెప్పే మాటలన్నీ నమ్మాల్సిన పని లేదు. మీడియా ప్రచారంలోనూ నిజం లేదు. గత ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రచారం జరిగింది. కానీ ఏమైంది. ప్రతి పక్షాలే చెల్లా చెదురయ్యాయి. ప్రజలు మళ్ళీ టిఆర్‌ఎస్‌ కే పట్టం కట్టారు. ప్రతిపక్షాలన్నింటినీ ప్రజలే కట్టగట్టి బంగాళాఖాతంలో విసిరేశారు. గత ఎన్నికలలో కూడా మూకుమ్మడి దాడి చేశారు. ప్రతిపక్షాలన్ని జెండాలు, ఎజెండాలు ఏకం చేసుకొని వచ్చాయి. కేసిఆర్‌ ను ఓడిరచడమే ఏకైక లక్ష్యంగా ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ను ఎదుర్కొన్నారు. మళ్ళీ కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జట్డుగా వస్తున్నారు. మళ్ళీ కేసిఆర్‌ ను ఓడిరచడమే ఎజెండా అంటున్నారు. అంతే కాని ఆ పార్టీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఏం చేయాలన్నదాని మీద క్లారిటీ లేదు. ఆయా పార్టీల నాయకుల మధ్య సయోధ్య లేదు. ఏకాభిప్రాయం అసలే లేదు. ఐక్యత చూపలేరు. ఆధిపత్య పోరు ఆపలేరు. ఎవరికి వారే నాయకులు. ఎవరి పెత్తనం వారిదే. అలాంటి వారి చేతిలో అధికారం పెడితే ఎలా వుంటుందో ప్రజలకు తెలుసు. ఆ ప్రజలకున్న క్లారిటీ టిఆర్‌ఎస్‌ నేతలకు కూడా ఇప్పుడు కావాలి.

కొందరు ఎమ్మెల్యే హాట్రిక్‌ హాంఫట్టే! మేం ఇప్పటికే రెండు సార్లు గెలిచాం.

 మూడో సారి కూడా మాకే కావాలి. మేం తప్ప పార్టీకి దిక్కులేదనే దిక్కుమాలిన లాజిక్‌ లు కొందరు మానుకోవాలి. నాకే టికెట్‌ కావాలన్న పట్టుదల మానుకోవాలి. పార్టీ అధికారంలో వుంటే ఎవరి నాయకత్వానికి ఢోకా వుండదు. లేకుంటే అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం చేసినవాళ్లవుతారు. ఉద్యమ సమయంలో త్యాగాలు చేసినట్లే ఇప్పుడు మరొకసారి త్యాగాలకు ముందుకు రావాలి. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఇది ప్రజలు ఇస్తున్న భరోసా. తాడు బొంగరం లేని పార్టీలు చెప్పే మాటలు అధికారంలో వున్న టిఆర్‌ఎస్‌ నేతలు వినడం విడ్డూరం…బిజేపిని ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరు. దేశంలో బిజేపి సుమారు పదిహేడు రాష్ట్రాలలో అధికారంలో వుంది. ఆయా రాష్ట్రాలలో ఎక్కడైనా తెలంగాణలో అమలౌతున్న ఫథకాలున్నాయా? ప్రజలకు బిజేపి గురించి పూర్తిగా తెలుసు. కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వుంటూ చేస్తున్న నిర్వాకాలు ప్రజలు చూస్తున్నదే…అనుభవిస్తున్నదే…నోట్ల రద్దుతో మొదలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఎంతకీ తగ్గని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, మూడు రెట్లు పెరిగిన సిలిండర్‌ భారం ప్రజలు అనుభవిస్తూనే వున్నారు. బిజేపి నేతలు కూడా ఈ ధరల భారం మోస్తున్న వాళ్లే…కేంద్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణలో ప్రాజెక్టులకు సహకరించలేదు. విభజన హామీలు అమలు చేయలేదు. జిఎస్టీ బాదుడు ఆపడం లేదు. ఆఖరుకు పెరుగు కూడా జిఎస్టీ లేకుండా కొనలేం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. బిజేపికి ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. ఈ సమయంలో టిఆర్‌ఎస్‌ నేతలు మాకే టికెట్లు అంటూ మొండి పట్టుదలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చొద్దు. ఎవరికిచ్చినా వారి గెలుపుకు, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ సహకరించాల్సిందే!

మా సీట్లే ఎందుకు కోత పెడుతున్నారు…మాకేం తక్కువ.

 ఇక్కడ కాకపోతే మరో దగ్గర అని దిక్కుమాలిన లాజిక్కులు చెప్పకండి. ప్రజలకు కొందరు ఎమ్మెల్యేలంటే అసలే పడడం లేదు. వారి పని తీరు నచ్చడం లేదు. గత ఎన్నికలలో కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను చూసే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరినీ ప్రజలు గెలిపించుకున్నారు. ఈసారి కొంచెం కష్టం. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు కూడా నిజమని నమ్ముతున్న వాళ్లు కూడా కొంత పెరుగుతున్నారు. అలాంటి వాళ్లు పూర్తిగా టిఆర్‌ఎస్‌ కు దూరం కావొద్దు అనుకుంటే కొందరికి టికెట్‌ కట్‌ చేయాల్సిందే. ప్రజలతో సక్కగ లేకనే సీట్లు గల్లంతు? అనే ఎవరూ మర్చిపోవద్దు. వివాద ఎమ్మెల్యేలను పక్కన పెట్టాల్సిందే? అని పార్టీ శ్రేణులను నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా ఇదే జరిగింది. ముందు మునుగోడులో అభ్యర్థి విషయంలో పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అభ్యర్థిని మార్చితే తప్ప గెలవలేమనే అందరూ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కే ఇచ్చారు. ఇందులో ఎంతో రాజకీయ చాణక్యం దాగి వుంది. ఒకవేళ ప్రజల నమ్మకం కేసిఆర్‌ మీద సన్నగిల్లితే కూసుకుంట్ల ప్రభాకర్‌ ఓడిపోతాడు. అభ్యర్థితో మాకు లెక్క లేదు. మా నాయకుడు కేసిఆర్‌ అనుకొని ఓట్లేస్తారా? లేదా! అన్నది తేలిపోతుంది. అదే నాయకుల మాటలకు తలొగ్గి అభ్యర్థిని మార్చితే కేసిఆర్‌ భయపడ్డాడనే సంకేతాలు వెళ్తాయి. ఏది ఏమైనా ప్రజల్లో టిఆర్‌ఎస్‌ పై నమ్మకం చెక్కు చెదరలేదని నిరూపించాలనుకున్నాడు. ప్రభాకర్‌ అభ్యర్థిత్వాన్ని ముందే ఖరారు చేశారు. నిష్టూరం అనిపించినా సరే గాని ఏ టిఆర్‌ఎస్‌ నాయకుడు కూడా మునుగోడులో గెలుస్తున్నామని ఘంటా ఫథంగా చెప్పలేకపోయారు. కేవలం నేటిధాత్రి మాత్రమే ఖచ్చితంగా టిఆర్‌ఎస్‌ విన్‌ అనేది మొదటి రోజు నుంచీ చెబుతున్నది. టిఆర్‌ఎస్‌ గెలుస్తుందన్న నమ్మకం ఉప ఎన్నికలోనే లేని నాయకులు తమపై తాము అతి విశ్వాసం తగ్గించుకోవడం మంచిది. 

కొందరు ఎమ్మెల్యే మార్పును అందరూ స్వాగతించాల్సిందే… ప్రజల నుంచి కూడా వస్తున్న సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిందే? లేకుంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లే!

 లేని బలం వారికి కట్టబెట్టినట్లే…నియోజకవర్గాలను అప్పనంగా వాళ్ల చేతికిచ్చినట్లే… కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహం కూడా కొంప ముంచనుంది.రెండు ధఫాలు ఏలారు…ఈసారి కొత్త వాళ్లకు అవకాశం కల్పించండి!ఈ ఎన్నికలలో త్యాగాలకు సిద్ధం కండి! మళ్ళీ ప్రభుత్వం వచ్చాక త్యాగాలు చేసిన వారికి పదవులు గ్యారెంటీ! కొందరు ఎచ్చులకు పోతే మొదటికే మోసం!పక్క చూపులు చూస్తే అసలుకే మోసం! వివాదాల సుడి గుండాలలో వున్న వాళ్లెవరో అందరికీ తెలుసు…

వాళ్లంతా పార్టీ క్షేమం కోసం మనసలుకుంటే అందరికీ మేలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!