ప్రభుత్వ పధకాల కారును గట్టెక్కిస్తాయా?
టిఆర్‌ఎస్ ధీమా ఏమిటి?
బిజేపి చూపిస్తున్న అత్యుత్సాహం జనం నమ్ముతారా?
రాజగోపాల్‌రెడ్డిని మళ్లీ విశ్వసిస్తారా?
ధర పెరుగుదల బిజేపి మీద ప్రభావం చూపకపోవచ్చా?
బిజేపి ధైర్యంలో నిజముందా? నాయకుల ప్రకటనల్లో బలముందా?
కాంగ్రెస్ చతికిల పడుతుందా? నిలబడుతుందా?
మొన్నటి సభ ప్రభావం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే అవకాశం వుందా?
రేవంత్ వేగంపరుగులు పెడుతుందా? మొదటికే మోసం వస్తుందా?
నల్లగొండ కాంగ్రెస్ సీనియర్లు కోమటిరెడ్డి సోదరులను వ్యతిరేకిస్తారా?
నిజాలెలా వున్నాయి? ప్రచారాలు ఎలా సాగుతున్నాయి?
హైదరాబాద్,నేటిధాత్రి: ఆలోచనలను అంచనా వేయలేకపోవచ్చు. వేగాన్ని ఆపలేకపోవచ్చు. కాని అడుగులు లెక్కబెట్టగలం. ఎటు పడుతున్నాయో చెప్పగలం. ఇప్పుడు రాజకీయాలలో ఇదే ముఖ్యం. మునుగోడు రాజకీయాలు ఎలాగూ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్ధేశం చేస్తాయని చెప్పడంలో సందేహంలేదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గపడుతున్న సందర్భంలో జరిగే ఉప ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికల్లో కూడా వుండొచ్చు. అయితే ఇలా గతంలో జరిగిన సందర్భాలలో కూడా ఆరు నెలల్లో ప్రజల ఆలోచనల్లో మార్పులు వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆ వెంటనే స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ఆ రాజీనామా ఆమోదం తెలిపినట్లు స్పీకర్ కార్యాలయం సర్కులర్ జారీ చేసింది. ఇది బిజేపి ఊహించంది కాదు. స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి అంత తొందరగా రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తారని ఊహించలేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఒక వేళ పెండిరగ్‌లో పెడితే ప్రభుత్వం భయపడుతుందని ప్రచారం చేసుకోవచ్చని బిజేపి ఆలోచన చేసింది. కాని ప్రభుత్వం బిజేపి ఆలోచనలు తలకిందులు చేస్తూ, స్పీకర్ ఆమోదంతో ఉప ఎన్నికకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినట్లైంది. దాంతో ఒక్కసారిగా రాజకీయాల్లో స్ధబ్దత మాత్రం నెలకొన్నదనే చెప్పాలి. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక రావాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చూస్తోందని చెప్పడంలో సందేహం లేదు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం అందుకు సంకేతంగానే భావించాలి. ఈ మధ్య కాలంలో బిజేపి బలం పెరిగినట్లు సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మునుగోడు ఉప ఎన్నికను ఒక ఆసరాగా వాడుకోవాలని టిఆర్‌ఎస్ చూస్తోంది. మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం అప్పుడే ఫోకస్ పెట్టింది. రూ.25 కోట్లు విడుదల ప్రకటన కూడా చేసేసింది. అంటే మునుగోడులో ప్రభుత్వం కూడా సై అంటే సై అనేందుకు సిద్దంగానే వుందన్న సంకేతాలు పంపినట్లైంది. ఎన్నికలకు టిఆర్‌ఎస్ రెడీ అని చెప్పకనే చెప్పినట్లైంది. పైగా చౌటుప్పల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫార్మా హబ్‌ల ఏర్పాటు వంటివి పెద్దఎత్తున వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే కూడా కొంత పారిశ్రామికంగా ముందంజలో వుంది. మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు గెలిస్తే కొంత ఉపయోగం వుంటుందన్న ఆలోచన కూడా ప్రజలు చేసే అవకాశం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పధకాలు కూడా అక్కడ కూడా పెద్దఎత్తున లబ్ధిపొందుతున్నవాళ్లు వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలౌతున్న కొన్ని పధకాలను ఓసారి విశ్లేషిస్తే రాష్ట్రంలో అమలౌతున్న చాల కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్న సంగతి అందిరికీ తెలిసిందే. రైతు బంధు మే 10 2018న ప్రభుత్వ ప్రకటించింది.
రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతు భీమా సుమారు 60 లక్షల మందికి చేయడం జరిగింది. రుణమాఫీ 40లక్షల మంది రైతులకు జరిగినట్లు సమాచారం. ఉచిత విద్యుత్ దాదాపు 26లక్షల మంది రైతులకు అందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 16లక్షల రైతులకు ఉచిత విద్యుత్ అందేది. ఇప్పుడు మరో పది లక్షల మందికి అదనంగా అందడమే కాకుండా, ఇరవై నాలుగు గంటలు సరఫరా అవుతోంది. 2021 ఆగష్టు నెల 5న మొదలైన దళిత బంధు ఇప్పటికీ రాష్ట్రంలో 30,480 కుటుంబాలకు సాయం అందింది. అందుకోసం ప్రభుత్వం రూ.2257కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం అమలులో వుంటుంది. దేశంలో ఎక్కడా లేని కేసిఆర్ కిట్ పధకం 2017లో మొదలు పెట్టిన నాటినుంచి ఇప్పటి వరకు సుమారు 13లక్షల మందికి అందినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్ర్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకు అందించడం జరిగింది. ఆసరా పించన్లు రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 40లక్షల మందికి అందుతోంది. ఇంకా 10లక్షల మందికి అందజేసే ఆలోచనలో ప్రభుత్వం వుంది. బీజేపీ దూకుడును ప్రజలు ఆదరిస్తున్నారా? అనుసరిస్తున్నారా? విశ్వసిస్తున్నారా?అన్నది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పలేనిది.
ప్రచార ఆర్భాటం పటోటోపం బాగానే వుంది. కాని క్షేత్రస్ధాయిలో రాజగోపాల్‌రెడ్డి బలం మీదే ఆధారపడి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం రావడం అన్నది బిజేపి బలహీనతే అని చెప్పొచ్చు. ఎందుకంటే దుబ్బాకలో అదే పరిస్ధితి. రఘునందర్ మీద వున్న సానుభూతి మాత్రమే బిజేపిని గట్టెక్కినా అది బిజేపి ఖాతాలో పడిరది. కాకపోతే జనానికి తెలుసు. నాయకులకు తెలుసు. ఇక హుజూరాబాద్ అన్నది పూర్తిగా ఈటెల రాజేందర్ మీద వున్న సానుభూతి మూలంగానే బిజేపి గట్టెక్కింది. ఆ ఎన్నికల సందర్భంలో ఈటెల రాజేందర్ ఎక్కడా బిజేపి నినాదం గురించి గాని, బిజేపి సిద్ధాంతాల గురించిగాని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం గురించి ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఎంత సేపు తనకు జరిగిన అన్యాయం తప్ప మరో మాట మాట్లాడలేదు. అంతకు ముందు కనీసం మూడు వేల ఓట్లు కూడా రాని బిజేపికి ఈటెల రాజేందర్ బలంతో తోడు కావడం వల్ల ముప్పై వేల మెజార్టీదాకా వెళ్లింది. బిజేపి బిఫామ్ మీద ఈటెల పోటీ చేయడం వల్ల అది కూడా బిజేపి ప్రచారానికి బాగానే ఉపయోగపడిరది. ఇలా ప్రచారం చేసుకోవంలో బిజేపి కూడా ఆరితేరిందని చెప్పడానికి ఈ రెండు సంఘటనలు చాలు. అయితే గత ఎన్నికల్లో మునుగోడులో ఆరు వేల ఓట్లు వచ్చిన బిజేపికి ఈసారి రాజగోపాల్ రూపంలో ఓట్ల వర్షం కురుస్తుందా? లేదా? అన్నది మాత్రం క్షేత్రస్ధాయిలో కనిపించడం లేదు. ఇదిలా వుంటే దేశంలో పెరుగుతున్న ధరల పెరుగుదల అన్నది బిజేపి మీద ఎంత మేర ప్రభావం చూపుతుందనేది కూడా ఈ ఎన్నికల్లో కూడా తేలడానికి అవకాశం వుందనే చెప్పాలి. గతంలో సిలిండర్‌కు దండం పెట్టి ఓట్లేయాలన్న టిఆర్‌ఎస్ ఆ ప్రచారం మళ్లీ ముందుకు తీసుకురాక మానదు.ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందనేదే అందరిని తొలుస్తున్న ప్రశ్న.
గత ఎన్నికల్లో ఎంతో కొంత కాంగ్రెస్ బలంగా లేకపోతే రాజగోపాల్‌రెడ్డి గెలిచేవారు కాదు. ఆయన స్వంత బలం అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నా, కాంగ్రెస్ పట్ల కోమటి రెడ్డి కుటుంబానికి అప్పట్లో వున్న అంకితభావం కూడా పనిచేసిందనే చెప్పాలి. పైగా 2014 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ గెలిచింది. ప్రజలు కూడా కొంత ఆ విషయంలో మార్పు కోరుకున్నారు. అంతే కాని పూర్తిగా రాజగోపాల్ రెడ్డిని మాత్రమే గెలిపించాలన్న ఆలోచనలో ప్రజలు ఓట్లు వేయలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి స్ధాయిలో పనిచేశారన్నది మాత్రం ఇక్కడ స్పష్టమైంది. మరి ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఆలోచనలో పడేస్తోంది. ఎంత లేదన్నా కోమటి రెడ్డి సోదరుల ప్రభావం ఉమ్మడి నల్లగొండ మీద బాగానే వుంటుంది. దాని నుంచి బైట పడడం అంటే రేవంత్ రెడ్డి మీద అంతకన్నా గొప్ప నమ్మకం కాంగ్రెస్ శ్రేణుల్లో కలగాలి.