మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట…

`తెలంగాణలో బలమైన పార్టీ మాదే…

`తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే…

`అన్ని సర్వేలు మాకే అనుకూలం…

`సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి.

`ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు…

`ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు?

`డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు?

`గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!

 `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు.

`రైతు బంధు, రైతు భీమా మరే రాష్ట్రంలో కనిపించదు?

`దళిత బంధు ఒక్క తెలంగాణ లోనే అమలు…

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ ప్రధాని అయితే దేశమంతటా ఈ పథకాలు అమలౌతాయని ఎదురుచూస్తున్నారు?

`అలాంటిది మునుగోడు గెలవడం మాకు నల్లేరు మీద నడక…

`ప్రజలంతా మా వైపే….

`ప్రతిపక్షాల హడావుడి, గోల తప్ప మరేం లేదు…

`ఎమ్టీ వెసెల్స్‌ మేక్‌ మచ్‌ నాయస్‌…సామెత ప్రతిపక్షాలకు అన్వయించుకోవచ్చు?

`వారిని నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు…

`రేవంత్‌ రెడ్డి ప్రచారానికి పోతే మహిళలు ముఖం మీదే వెళ్ళిపొమ్మని చెప్పారు?

`రాజ్‌ గోపాల్‌ రెడ్డి నాంపల్లి గ్రామానికి వెళ్తే ఎందుకొచ్చావని నిలదీశారు?

`ఈ రెండు సంఘటనలు చాలు కారుకు ఎదురులేదని చెప్పడానికి…

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. ఎదురు లేదు. ప్రతిపక్షాలకు అసలు తెలంగాణలో తావు లేదు. ప్రజలు వారిని నమ్మే పరిస్ధితి అసలే లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. దేశం మొత్తం మీద కేసిఆర్‌ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేదు. తెలంగాణ అమలౌతున్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న పధకాలలో కనీసం పదో వంతు సంక్షేమ పథకాలు కూడా మరే రాష్ట్రంలోనూ లేవు. అమలు కావడం లేదు. అలాంటిది మునుగోడు ఉప ఎన్నికపై తర్జన భర్జన ఎందుకు? మునుగోడు మాదే…గెలిచేది మేమే…ప్రతిపక్షాలకు మునుగోడులో స్ధానమే లేదు. బిజేపికి క్షేత్రస్ధాయి బలం లేదు. బలగం లేదు. యంత్రాగం లేదు. కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రజల్లో నమ్మకం లేదు. ఆయనపై విశ్వాసంలేదు. ఆయన పార్టీ ఎందుకు మారిండో మునుగోడు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. ఇక ఆయన కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంత కోపంతో వున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య నాంపల్లి అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్ధులంతా తరిమేసినంత పనిచేశారు. ఆయనను కనీసం పది నిమిషాలు కూడా అక్కడ వుండన్విలేదు. అలాంటిది తాను మళ్లీ గెలుస్తానన్న భీరాలు తప్పతే, గెలిచేది లేదు. ఆయనకు ఓట్లు పడేది లేదు. ఇక కాంగ్రెస్‌ పరిస్ధితి అంతకన్నా మెరుగైన పరిస్దితి కూడా ఏమీ లేదు. ఆ పార్టీకి నాయకత్వం లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఎలాంటి సీన్‌ లేదు. మొన్ననే రేవంత్‌రెడ్డి మునుగోడులోని ఓ తండాకు ప్రచారం పేరుతో వెళ్తే ఏం జరిగిందో తెలిసిందే. రేవంత్‌ రెడ్డి ముఖం పట్టుకొని ఓ మహిళ ఇక్కడి నుంచి వెళ్లిపో… అని గర్జించింది. ఆ కోపం చూసి అక్కడినుంచి రేవంత్‌ రెడ్డి జారుకోవడం తనవంతైంది. కాంగ్రెస్‌ నాయకుల ముందు ఆయన పరువు పోయినంత పనైంది. అదంతా మీడియాలో వచ్చిందే…జనమంతా చూసిందే… కాంగ్రెస్‌కు మింగుడుపడందే…ఆదిలోనే రేవంత్‌ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూసిందే…అయినా పార్టీ అంతా లుకలుకలే…అంతే కాదు ఆపార్టీకి చెందిన స్టార్‌ క్యాంపైనర్‌ తమ్ముడే బిజేపి తరుపున పోటీ చేస్తున్నాడు. అన్న వెంకటరెడ్డి తన తమ్ముడికి ఓట్లేయాలని కోరుతున్నారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇంకే ముంది కాంగ్రెస్‌కు మునుగోడులో ఏం మిగిలింది. రాజగోపాల్‌ రెడ్డి రూపంలో వున్నదే పోయింది. కొత్త గా కాంగ్రెస్‌కు వచ్చేదిలేదు. ఆ పార్టీకి ఓట్లు పడేది లేదు….అయినా మేం మెహర్భానీకి వెళ్తాం…తమను తాము మోసం చేసుకుంటామని అనుకుంటే చేసేదేముంది? జనం కూడా ఆ రెండు పార్టీలను చూసి జాలి పడుతున్నారే తప్ప, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలమైన పార్టీ.
త్వరలో జాతీయ స్ధాయిలో వెలుగొందేందుకు సిద్ధమౌతున్న పార్టీ. దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలన్నీ తమ రాష్ట్ర ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణతో సరిహద్దు కల్గిన ప్రాంతాలన్నీ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అంతే కాదు కర్నాకటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపాలని కోరినట్లు వార్తలు చూసిందే. ఎందుకుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం కూడా కర్నాటకలో లేదు. కేసిఆర్‌లా రాజనీతిజ్ఞత వున్న నాయకుడు లేదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేదు. పాలకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు లేదన్నది పొరుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాటే…
మునుగోడు విషయంలో అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా వున్నాయని చెబుతున్నాయి.
అంతే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేయించే సర్వేల్లో కూడా టిఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్‌ సుమారు 41శాతంతో అన్ని పార్టీలంటే ముందుంజలో వుంది. అన్ని సర్వేల్లోనూ ఇదే తేలుతోంది. మునుగోడులో సుమారు 2లక్షల40వేల ఓట్లు వున్నట్లు సమాచారం. అందులో సంక్షేమ పధకాలు అందుకుంటున్న కుటుంబాలన్నీ టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తాయన్నది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే రైతుబంధు నుంచి మొదలు, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, కళ్లుగీత కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు అందుకునే వారు మెజార్టీ ప్రజలున్నారు. వారంతా ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో వున్నారు. ఇక ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాలో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి మరింత పెరిగింది. గతంలో కరంటు లేక ఇన్వర్టర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు వాటి అవసరం లేకుండాపోయింది. నాణ్యమైన కరంటు అందుతోంది. ఇక రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. ఓ వైపు పెరిగిన భూగర్జ జలాలు, మరో వైపు నిరంతరంగా నాణ్యమైన కరంటు…పెట్టుబడి సాయం కింద రైతు బంధు…అన్ని రకాల సౌకర్యాలు గతంలో సమకూర్చాలన్న ఆలోచన చేసిన నాయకుడే లేడు. పాలకులు లేరు. మరి దేశంలోనే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఇక పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదని, ప్రభుత్వం తరుపున కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్‌ పేరుతో లక్షనూటపదహారు రూపాయలు ఇస్తున్నారు. తాజాగా దళిత బంధు పేరుతో ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేసిఆర్‌. మరి అలాంటి టిఆర్‌ఎస్‌ను ప్రజలు కాదనుకుంటారా? బిజేపి, కాంగ్రెస్‌ లాంటి వారిని నమ్మి, మళ్లీ తమ జీవితాలను ఆగం చేసుకుంటారా? గతంలో డెబ్బై ఏళ్ల గోస పడరాని కష్టాలు పడ్డ ప్రజలు, మళ్లీ బిజేపి,కాంగ్రెస్‌లను నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారి మాయ మాటలు వినేందుకు ఇష్టపడడం లేదు. నిజంగా బిజేపికి ప్రజల మీద ప్రేముంటు, ప్రేద ప్రజలను ఆదుకోవాలనుకుంటే పెరుగుతన్న నిత్యావసర ధరలేమిటి? పెట్రోలు, డీసెల్‌ పెంపులేమిటి? గ్యాస్‌ ధర నియంత్రణ లేకుండా పెరుగుడేమిటి? ఇదేనా బిజేపికి ప్రజల మీద వున్న గౌరవం. ఓ వైపు జిఎస్టీ పేరుతో బాదుడు…మరో వైపు దేశం కోసం, ధర్మం కోసమంటూ సమాజాన్ని చీల్చుడు…మతం పేరుతో బిజేపి రాజకీయాలు ఎంతో కాలం సాగవు…
ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశంలోనే ప్రస్తుతం వున్న రాజకీయ నాయకుల్లో తిరుగులేని నాయకుడు.

ఎదురు లేని నాయకుడు. ఏ రాష్ట్రంలో కనిపించని ప్రగతిని తెలంగాణలో చూపించిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రంవచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇక మిగిలిపోయిన పనులంటూ లేకుండా అనేక పనులు పూర్తి చేశాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణమే జరగదని చెప్పి నేలపై, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చూశాడు. సాధ్యం కాదన్న వాటిని సుసాధ్యం చేసి చూపించాడు. అసలు తెలంగాణలో ఇలా నీటి పరవళ్లు చూస్తామని గతంలో ఎవరూ అనుకోలేదు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకెప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. కాకతీయ కాలంలో రూపకల్పన చేసిన చెరువుల ఆనవాలు లేకుండా చేసిన ఉమ్మడి పాలకుల దాష్టికాన్ని దిగమింగుకొని బతికిన తెలంగాణ ప్రజలకు మొత్తం 46వేల పైచిలుకు చెరువులు మళ్లీ గంగాళాలు చేశాడు. నీళ్లతో నింపేశాడు. ఎండాకాలం, వానా కాలం, ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా అన్ని కాలాలు చెరువుల్లో నీటి చుక్క ఇంకిపోకుండా చూసుకుంటున్నారు. మరి ఇలాంటిపరిస్ధితి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వుందా? అంతెందుకు దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రం తమిళనాడు. మరి అక్కడ చెరువులన్నీ ఖాళీ…చెన్నై నగరమే మంచినీటి కోసం కటకటలాడడం చూస్తూనే వున్నాం. కాని మన తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని మిషన్‌ భగీరధ ద్వారా అందిస్తున్నాము. ఇలా దేశమంతా ప్రజలకు మంచినీరు అందించాలన్నదే కేసిఆర్‌ కల. అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించేందుకు సిద్దమౌతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *