మునుగోడు బడుగులకిస్తే ఒప్పుకోం?

మునుగోడు బడుగులకిస్తే సహించం? రెడ్డి నేతల రహస్య సమాలోచనలు!

కాంగ్రెస్‌లో ఉన్నత వర్గాల సామాజిక వర్గాల ఐక్య సమావేశం?

హైదరాబాద్‌లో రహస్యంగా చర్యలు?

రాత్రికి రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న జిల్లాల నేతలు?

మునుగోడు అయితే పాల్వాయి శ్రవంతికే ఇవ్వాలని కొందరి డిమాండ్‌?

రేవంత్‌ రెడ్డి బడుగుల వైపు అడుగులేస్తున్నట్లు తెలియగానే అలెర్టు?

ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సై అంటున్న నేతలు?

రేవంత్‌ రెడ్డిని మరింత ఉక్కిరిబిక్కిరి చేయాలని రెడ్డి సామాజిక వర్గ నేతలు?

మునుగోడులో పట్టుమని 10వేలు లేని రెడ్డి ఓటర్లు?

మూడు పార్టీలు చీల్చుకుంటే మిగిలేది మూడు వేలు?

అయినా ఎంతో ధీమాతో వున్న రెడ్డి నేతలు?

వారిలో వున్న ఐక్యత బడుగు నేతల్లో లేదా?

అందరం కలిసి సహకరించుకుందామని బడుగు నేతలు ఏకతాటిపైకి రాలేరా?

కాంగ్రెస్‌లో రెడ్డి రాజ్యం సాగాల్సిందేనా?

మునుగోడులో బడుగు నేతలకు టిక్కెట్టు ఇస్తే మేం సహించం…మేం సహకరించం? మేం వారి తరుపున ప్రచారం చేయం? అవసరమైతే తిరుగుబాటు జెండా ఎగరేస్తాం? ఏకంగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డినైనా ఇరుకున పెడదాం…ఎట్టిపరిస్ధితుల్లో మునుగోడులో కొత్తగా పార్టీలోకి చేరిన బడుగు నేతలకు టిక్కెట్టు ఇస్తే సహించేది లేదు? ఇదంతా ఎవరో అంటున్న మాట కాదు…కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లమని చెప్పుకునే కొంత మంది ఉన్నత సామాజిక వర్గానికి చెందిన నేతలు చేస్తున్న హడావుడి. చెబుతున్న మాటల సందడి. కలసి ఐక్యతా రాగం ఆలపిస్తున్న నేతల మాటలవి. ఎట్టిపరిస్ధితుల్లోనైనా మునుగోడులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే ఇవ్వాలి. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె శ్రవంతికే ఇవ్వాలని పట్టుబడుదామని ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. 

మునుగోడులో కనిపిస్తున్న మసలానికి ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పెట్టాలంటే ఆధిపత్య రాజకీయాలకన్నా, బడుగుల టిక్కెట్టు ఇస్తే బాగుంటుందని రేవంత్‌రెడ్డి ఆలోచించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఇటీవల కొత్తగా పార్టీలోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌కు వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత ప్రచారం సాగుతోంది. మరో వైపు ఒక వేళ చెరుకు సుధాకర్‌ కొత్తగా పార్టీలోకి చేరారన్నదే అభ్యంతరమైతే తెలంగాణ జర్నలిస్టు నాయకుడుగా గుర్తింపు వున్న పల్లె రవికుమార్‌కు ఇస్తే ఎలా వుంటుందన్నది కూడా చర్చలో వున్నట్లు తెలుస్తోంది. ఆయననైతే ప్రశ్నించేవారు వుండకపోవచ్చు అన్న అంచనాతో రేవంత్‌ ఆలోచించినట్లు సమాచారం. అయితే మనం ఇలాగే ఆలస్యం చేసినా, చూస్తూ ఊరుకున్నా రేవంత్‌ రెడ్డి తన ఇష్టమైన రాజకీయాన్ని ఆడేందుకు ఎత్తుగడలు వేస్తాడని ఉన్నత సామాజిక వర్గ నేతలు అనుకుంటున్నారట. అందుకే తెలంగాణలో వివిధ జిల్లాల్లో బలమైన నేతలుగా వున్న రెడ్డి, వెలమ సామాజికవర్గ నేతలు కొందరు గురువారం హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జిల్లాల నుంచి నాయకులు ఉదయమే హైదరాబాద్‌ చేరుకుంటే కొందరు నిన్ననే చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాళ్లంతా ఓ హోటల్‌లో గురువారం సుధీర్ఘ మంతానాలు జరిపినట్లు చెప్పుకుంటున్నారు. ఆఖరకు మనలో మనుకు ఎవరికిచ్చినా సరేగాని, బడుగు నేతలకు ఇస్తే ఇక మునుగోడు మన చేతిలో వుండదన్న నిర్ణయానికి కూడా వచ్చారట. మొన్న జరిగిన చండూరు సభకు అవసమైన నిధులు సమకూర్చిన నేత వైపు కూడా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ కొంత మొగ్గు వున్నట్లు కూడా తెలుస్తోంది. అదే నిజమైతే ఆయన కూడా పైకి బడుగుల రాగం జపించి, పార్టీలో ఒత్తిడిని ముందుపెట్టి మళ్లీ రెడ్డిలకే టిక్కెట్టు కట్టబెట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. మునుగోడు చేజారొద్దంటే రెడ్డిలంతా ఏకతాటిపై వుండాలన్న సమ్మతిలోనే వున్నట్లు చెప్పుకుంటున్నారు.

ముందే తెలిసి కుంపటి మొదలుపెట్టిన నేతగా మర్రి శశిధర్‌రెడ్డితో కూడా మునుగోడు నేతల కంటే ముందే ఆయన కూడా నోరు విప్పారంటున్నారు. నిజానికి శశిధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే, రేవంత్‌ రెడ్డి పార్టీలోని అసమ్మతి, కోవర్టు నేతల గురించి మాట్లాడి చాలా కాలమైంది. పైగా హోంగార్డులన్న మాట కూడా వారం రోజులు దాటిపోయింది. మరి ఇప్పుడు సడన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి ఎందుకు తెరమీదకు వచ్చారన్నది కూడా తెలియాల్సివుంది. తెలంగాణ, ఆంధ్రప్రాంతాలు కలిసిన నాడు పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక భూమిక పోషించిన నాయకుడు చెన్నారెడ్డి. అలాంటి నాయకుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. అయినంత మాత్రాన మర్రిచెన్నారెడ్డి పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 1978, 1989 రెండుసార్లు పార్టీ ప్రెసిడెంటుగా వుండి రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా చెన్నారెడ్డిది. అలాంటి నాయకుడికి కూడా పట్టుమని రెండుసార్లు ఏడాది కాలం కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనివ్వలేదు. కాంగ్రెస్‌లో చీలిక వస్తే, ఇందిరా గాంధీకి సపోర్టుగా నిలిచి, పార్టీని గెలిపించిన నాయకుడు. చెన్నారెడ్డికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా ఆయన ఆఖరు వరకు కాంగ్రెస్‌లోనేవున్నారు. ఇలా శశిధర్‌రెడ్డిలాగా ఏనాడు పార్టీమీద మాట్లాడలేదు. చెన్నారెడ్డి మీద వున్న గౌరవంతో శశిధర్‌రెడ్డికి కూడా కాంగ్రెస్‌లో ఎంతో ప్రాధాన్యత కల్పించింది. మంత్రిగా అవకాశం కల్పించింది. యూపిఏ ప్రభుత్వంలో సుమారు ఎనమిదేళ్లు ఆయనకు కేంద్ర విపత్తుల నిర్వహణ సంస్ధ వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించి గౌరవించింది. మరి అలాంటిపార్టీని వదిలేసే ఆలోచన చేస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇలా అగ్ర కుల నేతలు తమకు రాజకీయం అనుకూలమైతేనే కొనసాగుతాం… పెత్తనమంతా మాకే ఇస్తేనే కాంగ్రెస్‌లో వుంటాం ..లేకుంటే మా దారి మేం చూసుకుంటాం!…బడుగులను మా నెత్తిన పెడితే ఊరుకోమన్నంత రాజకీయాలు చేస్తుంటే కూడా బడుగు నేతలు సైలెంటుగా వుండడం కూడా సరైంది కాదు. మొన్నటిదాకా అద్దంకి దయాకర్‌ను ఎంత వేపుకు తినాలో అంత వేపుకుతిన్నారు. ఆయనను ఏకంగా పార్టీ నుంచి పంపిస్తే తప్ప తాను కాంగ్రెస్‌ గురించి ఆలోచించనని వెంకటరెడ్డి తెగేసి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. ఇప్పుడు ఇతర రెడ్డి నేతలు మునుగోడు బడుగులకిస్తే ఊరుకోమంటున్నారు. అంటే కాంగ్రెస్‌లో రెడ్డి రాజ్యమే కొనసాగాలా? బడుగులకు టిక్కెట్టు ఇస్తే సహకరించలేరా? అసలు పట్టుమని మునుగోడులో పది వేల మంది ఓట్లు లేని రెడ్డి నేతలే ఇంతగా ఐక్యత ప్రదర్శిస్తుంటే, 2లక్షల 40వేల ఓటర్లలో మెజార్టీ ఓట్లన్నీ కలిగి వున్న బడుగు నేతల్లో ఎంత ఐక్యత వుండాలి. ఇప్పటికైనా బడుగు నేతలు విభేదాలు మాని, ఐక్యత కనబర్చితే తప్ప, మునుగోడులో బిసిల నాయకత్వం చెల్లుబాటు కాదు…ఆలోచించుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!