‘‘ముంబయికి చెందిన డి- ప్యాక్‌ సొల్యూషన్స్‌’’ తో కలిసి ‘‘నేటిధాత్రి’’ దినపత్రిక చేస్తున్న ‘‘సర్వేలో’’ ఆసక్తి కరమైన విషయాలు.

` పల్లె జనం చెబుతున్న నిజాలు నేటిధాత్రి పాఠకుల కోసం.

కేసిఆరే మా పెద్ద కొడుకు

` ఏ ఎన్నికైనా కేసిఆర్‌ కే వేస్తాం ఓటు.

`ఎవ్వలొచ్చి చెప్పినా ఇనం…` కాంగ్రెస్‌, బిజేపొళ్లను నమ్మం.

` ఇది పల్లె మాట…పల్లె జనం నోట.

`పింఛనిచ్చి బతికిస్తుండు.

`కొడుకు, కోడలు మంచిగ సూసుకుంటున్రు.

`యాల్లకింత బువ్వ పెడుతండ్రు.

`అదంతా కేసిఆర్‌ దయే

`కండ్లకు అద్దాలిచ్చిండు.

`కంటి ఆపరేషన్లు చేయిత్తండు.

`మమనవరాలి పెండ్లికి కళ్యాణ లక్ష్మీ ఇస్తండు.

` రైతు బంధు ఇస్తండు.

`కల్లాలకే ఒచ్చి ఒడ్లు కొంటన్రు.

`పంట నష్టం ఇస్తండు.

` తడిపోయిన వడ్లు కొంటుండు.

` ఇంకేంగావాలే..

`అప్పట్ల గిట్ల ఎవలైన చేశిండ్రా…

`నీళ్లిచ్చిన్రా…రైతు బంధిచ్చిన్రా.

`ఇరవై నాలుగు గంటల కరంటిన్రా

`వడ్లు తడిస్తే కొన్నరా?

` కాంగ్రేసొళ్లు, బిజేపోల్లు చెప్పేటియి ఉట్టి ముచ్చట్లు

`బిజేపోల్లు నూనె ధరలు పెంచిరి.

` సిలిండర్‌ కొనుక్కోకుండ చేశిరి.

` కేసిఆర్‌ మాకు దేవుడు…మమ్ములను కడుపుల వెట్టుకొని చూసుకుంటడు.

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

కేసిఆరే మా పెద్ద కొడుకు. ఈ మాట అంటున్నది సాక్ష్యాత్తు తెలంగాణ పల్లె జనం. తెలంగాణ ప్రజల గుండెల నిండా వున్నది కేసిఆర్‌. రాదనకున్న తెలంగాణ తెచ్చిండు. అందరూ తెలంగాణ వస్తదా? అడిగితే వస్తుంది చూడు…తెస్త చూడు..తెలంగాణతోనే హైదరాబాదులో అడుగుపెడతా! అంటూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన మాట నిలుపుకున్నడు. తెలంగాణ కల నిజం చేసిండు. ఉద్యమ కాలంలో కేసిఆర్‌ ఏం చెప్పాడు. ఎలా ఉద్యమం చేశాడు. ఎంత మందిని ఎదిరించాడు. ఎట్లా కొట్లాడిరడు. పాటకు ఎలా మాట తెచ్చిండు. తన మాటకు ఎలా పదును పెట్టిండు…ఇలాంటి మాటలు ఎవరైనా వినాలంటే పల్లెలకు పోవాల్సిందే. సెల్లు చేతిలో పట్టుకొని సొల్లు చెప్పే వారి అబద్ధాల పోస్టులు చూసుకుంటూ అవే నిజాలని ప్రతిపక్షాలు నమ్మిస్తున్నాయి. కొంత మంది పట్టణ ప్రజలు భ్రమపడుతున్నారు. నిజానికి పల్లె ప్రజలు చెప్పుకునే మాటలు వేరు. సోషల్‌ మీడియా జరుగుతున్న ప్రచారం వేరు. సోషల్‌ మీడియా బతకాలంటే నెగిటివ్‌ ప్రచారం కనిపించాలి. అంతకు మించి మరో లాజిక్‌ లేదు. ఊరన్న తర్వాత ఐనోడుంటడు. కానోడుంటడు. ప్రతిపక్షాల కార్యకర్తలు వుంటారు. ఊరి జనమంతా చెప్పింది ఒక ఎత్తైతే..ఊరిలో వ్యతిరేక ప్రచారం చేసే వాడు ఒక్కడు ఒకెత్తుగా సోషల్‌ మీడియా చూస్తుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పే వారి మాటలను హైలైట్‌ చేస్తే సోషల్‌ మీడియా ఎవరూ పట్టించుకోరు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక్కడిని ఎంపిక చేసుకొని వీడియో తీయడం, జనం మీదకు వదలడం మాత్రమే మనం చూస్తున్నాం… అది నిజమేనేమో? అనుకుంటుంటాం…అదంతా నిజం కాదు. క్షేత్ర స్థాయిలో వున్న వాస్తవం వేరు. ప్రతిపక్షాల సోషల్‌ మీడియా ప్రచారం వేరు. అందుకే ప్రజలకు నిజాలు అందించాలన్న లక్ష్యంతో నేటిధాత్రి దినపత్రిక, ముంబాయి కి చెందిన ధాత్రి గ్రూప్‌ కు చెందిన డి-ప్యాక్‌ సొల్యూషన్స్‌ సంయుక్తంగా చేపట్టిన సమగ్ర సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజలు చెప్పే విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షాలకు చెందిన సోషల్‌ మీడియా అసత్యాలు ప్రచారం చేసి, ప్రజల్ని గందరగోళ పర్చాలని చూసింది. కానీ ప్రజాభిప్రాయం పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తాను నమ్మిన ఆలోచనతో ముందుకు సాగారు. సంక్షేమ పాలకులను ప్రజలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరని ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు తెలుసు. అందుకే ఆయనకు అంత ధీమా. ప్రజల మీద అంత నమ్మకం. 

ముంబై కి చెందిన డీ ప్యాక్‌ సొల్యూషన్స్‌ సంస్థ తో నేటిధాత్రి దినపత్రిక. సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి.

ప్రతిపక్షాలు భరించలేని నిజాలు వినిపిస్తున్నాయి. భమల్లో తేలియాడుతున్న ప్రతిపక్షాలు సోషల్‌ మీడియా వార్తలను చూసి వాతలు పెట్టుకుంటున్నాయి. అవి ఎలా వుంటాయంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో సింపుల్‌గా చెప్పొచ్చు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఆశ వుండాలి. అధికారంలోకి వస్తామన్న నమ్మకం వుండాలి. ఆ పార్టీ శ్రేణులకు విశ్వాసం కల్గించాలి. ఇంత వరకు బాగానే వుంటుంది. తెలంగాణ రాజకీయాల మీద ఆశ పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆయా ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రెండు సార్లు అధికారానికి దూరమైంది. సందిట్లో సడే మియా అన్నట్లు బిజేపి ఆశ పడుతోంది. కానీ కేంద్రంలో అధికారంలో వుండి ప్రజలకు ఏం చేశామన్నది అవలోకనం చేసుకోవద్దా? ప్రజల మనసుల్లో వున్నామా లేదా? అన్నది గ్రహించుకోవద్దా? నోట్ల రద్దు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు. ఆర్థిక వ్యవస్థ ను భ్రష్టు పట్డించారు. జిఎస్టీ తెచ్చి పారిశ్రామిక రంగం నడ్డి విరిచేశారు. సామాన్యుల వెన్ను మీద మోయలేని భారాలు మోపుతున్నారు. ఎంత సేపు ప్రభుత్వానికి ఆదాయ మార్గం వెతకడమేనా? ప్రభుత్వాల పని. సంక్షేమం వద్దా? ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయడానికి లేదని చెప్పి, అనుసరిస్తున్న విధానాలేమిటి? ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం దేనికి? దాని సంకేతం ఏమిటి? కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్థులు దారాదత్తం చేయడం ఏమిటి? ఇవి సామాన్యులకు తెలియవని బిజేపి అపోహపడుతోంది. ప్రజలు ఎంతో విజ్ఞులు. అన్నీ గమనిస్తూనే వుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల బాగా చైతన్య వంతులు. బిజేపి కేంద్రంలో సాగిస్తున్న అప్రజాస్వామిక విధానాలు గమనిస్తూనే వున్నారు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చి పెంచిన ప్రతి పన్ను గురించి ప్రజల్లో విసృతమైన చర్చ జరుగుతోంది. మత రాజకీయం పేరుతో బిజేపి ప్రజలను ఎలా మభ్యపెడుతోందో తెలంగాణ పల్లె ప్రజలు కూడా చర్చిస్తున్నారు. ఈ విషయాలపై నిన్నటి తరంలో ఎంతో అవగాహన వుండడం ఆశ్చర్యకరం. అందుకే తెలంగాణ లో ఇకపై ఏ ఎన్నికైనా కేసిఆర్‌ కే వేస్తాం ఓటు అని నిర్ధ్వందంగా చెబుతున్నారు. అందకు కారణాలు కూడా వివరిస్తున్నారు. ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా ప్రజలే నిజాలు నిగ్గు తేల్చుతున్నారు. అందుకే ఇటీవల బండి సంజయ్‌ రైతులను పరామర్శించడానికి కళ్లాలలోకి వెళ్తే మీరేం సాయం చేస్తారో చెప్పండి? అని నిలదీసినంత పని చేశారు. దాంతో ఎంతో అట్టహాసంగా వచ్చిన బండి సంజయ్‌ అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదీ బిజేపి పరిస్థితి. క్షేత్ర స్థాయిలో జనం బిజేపిని చీకొడుతున్న స్థితి. అయినా రాజకీయం చేయడం పార్టీలు అన్న తర్వాత తప్పదు. కాకపోతే ప్రజలు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అని తేలికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజం మాట్లాడాల్సి వస్తే, వారికి వున్నంత సామాజిక సృహ, రాజకీయాల మీద అవగాహన చదువుకున్న వారికి కూడా వుండదు. పేద ప్రజలకు ఇచ్చే ప్రోత్సాహాలలో అందజేస్తున్న ఆహార పదార్థాలు కూడా ఉచితాలుగా ప్రధానమంత్రి మోడీ గుజరాత్‌ ఎన్నికలలో వర్ణించడాన్ని పల్లె ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు.

అంతే కాదు గుజరాత్‌ ఎన్నికలలో ఉచితాల వల్ల, రైతు రుణ మాఫీల వల్ల దేశానికి భారమని స్వయంగా మోడీ పేర్కొన్నారు. మరి కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అని బిజేపి పెద్దలు ప్రకటిస్తూ ప్రచారం చేస్తున్నారు. సిలిండర్‌ ధరను నాలుగు రెట్లు పెంచి మూడు సిలిండర్లు ఉచితంగా బిజేపి ఇస్తుందంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పటి దాకా కర్ణాటక లో అధికారంలో వున్నదే బిజేపి. ఇంతకు ముందు ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటేలా చేసిన బిజేపి కర్ణాటక లో ఇంటికి అర లీటర్‌ పాలు ఉచితంగా ఇస్తామంటే నమ్ముతారా? అని ఎంతో ముందు చూపుతో తెలంగాణ పల్లెలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ లో అధికారంలోకి వస్తాం…వస్తామని అనుకుంటూనే నడ్డి విరుస్తుంటే జనం నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ముందు ఈ విషయాలు బిజేపి తెలుసుకుంటే మంచిది అని ప్రజలే సలహాలు ఇస్తున్నారు. తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమాలపై ప్రజలు ఎంతో ఆనందంగా వివరిస్తున్నారు. ఇది పల్లె మాట…పల్లె జనం నోట. పల్లెల్లో ఏ వ్యక్తిని కదిలించినా ఇలాంటి విషయాలు అలవోకగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను కొనియాడుతున్నారు. పింఛనిచ్చి బతికిస్తుండు అంటున్నారు. కొడుకు, కోడలు మంచిగ సూసుకుంటున్రు అని మురిసిపోతూ చెబుతున్నారు. యాల్లకింత బువ్వ పెడుతండ్రు అని ఆనందంతో చెబుతున్నారు. తమకు కళ్లు కనపడక మసక మసకతో అడుగులు వేయాలంటే భయపడాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కంటి వెలుగుల కండ్లకు అద్దాలిచ్చిండు. చూపుకు ఇబ్బంది లేకుండా చేసిండు. అని చెబుతున్నారు. అవసరమైన వాళ్లకు కంటి ఆపరేషన్లు చేయిత్తండు. మామమనవరాలి పెండ్లికి కళ్యాణ లక్ష్మీ ఇస్తండు. మాకు రైతు బంధు ఇస్తండు.మా పొలం కల్లాలకే ఒచ్చి ఒడ్లు కొంటన్రు. పంట నష్టం ఇస్తండు.చెడగొట్టు వాన వల్ల తడిసిపోయిన వడ్లు కొంటుండు. ఇంకేంగావాలే..అని స్వయంగా ప్రజలే వెల్లడిస్తున్నారు. అప్పట్ల గిట్ల ఎవలైన చేశిండ్రా… నీళ్లిచ్చిన్రా…రైతు బంధు ఇచ్చిండ్రా అని ప్రశ్నిస్తున్నారు. వడ్లు తడిస్తే కొన్నరా? కాంగ్రేసొళ్లు, బిజేపోల్లు చెప్పేటియి ఉట్టి ముచ్చట్లు. బిజేపోల్లు నూనె ధరలు పెంచిరి. సిలిండర్‌ కొనుక్కోకుండ చేశిరి. కేసిఆర్‌ మాకు దేవుడు…మమ్ములను కడుపుల వెట్టుకొని చూసుకుంటున్నడు. అని పల్లె జనం నిర్భయంగా, గర్వంగా చెబుతున్న నిజాలు ఇవి. కాకపోతే కొందరు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పని తీరును కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్కడైతే వివాదాస్పద నాయకులు ఎమ్మెల్యేలుగా వున్నారో అక్కడ అభ్యర్థులను మార్చాలని ప్రజలే సూచిస్తున్నారు. మళ్ళీ ఎన్ని సార్లైనా బిఆర్‌ఎస్‌ కే పట్టం కడతామంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వమే కావాలంటున్నారు. ఇదీ తెలంగాణ పల్లెల మాట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *