`రండి…చూసుకుందాం!
`మీరో మేమో తేల్చుకుందాం!!
` బిజేపిది ఉరుకులాట ఉత్తశాటే…!
`పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లు లేరు!
`ఇసొంటి అదిరింపులెన్నో చూసి తెలంగాణ తెచ్చింది టిఆర్‌ఎస్ !
`బిజేపి ఉడుత ఊపులు తెలంగాణలో పనిచేయవు.
` తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం.
`దొంగ దెబ్బలు కాదు…ఎదురొడ్డి సవాలుకు రండి.
`ఎన్నికలలో పోటీ చేద్దాం సిద్ధంగా వుండండి.
` బిజేపి తాకత్ ఎంతో తేలిపోతుంది?
`బిజేపి తహతహ గుల తీరిపోతుంది?
` టిఆర్‌ఎస్ ది అభివృద్ధి నినాదం.
` బలమైన తెలంగాణ వాదం.
` బిజేపి ది విచ్చిన్న వాదం…చిచ్చులు పెట్టడం!
` ప్రభుత్వాలు కూలదోయడం…
`మత రాజకీయాలు కాదు, మానవత్వపు విలువలు ముఖ్యం.
`కులాల కుమ్ములాటలు కాదు, కలిసి బతికే సమాజం బలం.
`పట్టుమని పది సీట్లలో బిజేపికి బలం లేదు.
`బిజేపిలో అద్దె నాయకులకు గెలిచేంత సీన్ లేదు.
`వంద ఎమ్మెల్యేల బలమున్న టిఆర్‌ఎస్ ను ఢీ కొనడం అంత తేలికకాదు.
` కోరికోరి కొరివితో తలగొక్కుంటున్న బిజేపి.
` టిఆర్‌ఎస్ ను రెచ్చగొట్టి మరింత పాతాళానికి…
` వాపు ఎప్పుడూ బలుపు కాదు..
`బిజేపికి దక్షిణాన చోటు లేదు.
`తెలంగాణలో ఎప్పటికీ అధికారం సాధ్యం కాదు!
హైదరాబాద్,నేటిధాత్రి:
బిజేపి నాయకులు బాగా ఉబలాటపడుతున్నారు. లేని బలం ఊహించుకుంటున్నారు. ఉత్తరాధి రాష్ట్రాలలో అధికారం గుంజుకున్నట్లు తెలంగాణలో కూడా లాక్కుందామని చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను అస్థిరపర్చాలని చూస్తున్నారు. ఆ అవకాశం వారికి ఇవ్వొద్దంటే, భవిష్యత్తులో మళ్ళీ బిజేపి తోక జాడిరచొద్దంటే ముందస్తుకు వెళ్లాల్సిందే. భయపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బిజేపికి తగినబుద్ది చెప్పాలంటే ముందస్తు ఎన్నకలకు వెళ్లాలి. అదే బిజేపికి సరైన గుణపాఠం. లేకుంటే బిజేపి చేసే అబద్ధాల ప్రచారాలు ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం వుంది. రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్న బిజేపిని మరో సారి చిత్తుగా ఓడిస్తే దాని దూకుడుకు కళ్లెం వేయలేం. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్ మనసు మాటగా తెలుస్తోంది.
రండి…చూసుకుందాం!
బిజేపి బాగా తొందరపడుతోంది. రండి…మీ సంగతేందో, మీ బలమెంతో తేలిపోతుంది. దేశకాలమాన పరిస్థితులు చూసుకుంటూ కూడా మారని బిజేపి తో ఎంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిది. అందుకే మీరో మేమో తేల్చుకుందాం!! అనే నిర్ణయానికి కేసిఆర్ వచ్చినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కూడా సరైన సమయానికే ఎన్నికలకు వెళ్తామని కేసిఆర్ సూచించారు. ఎంత రెచ్చగొట్టినా కేసిఆర్ ముందస్తు ప్రకటనకు రావడం లేదని బిజేపి మధనపడుతోంది. ఒక రకంగా రగిలిపోతోంది. గతంలో ఎదురులేదని మందస్తుకు వెళ్లిన కేసిఆర్, ఇప్పుడు బిజేపికి భయపడుతున్నాడన్న ప్రచారం మొదలుపెట్టింది. అంతే కాకుండా కేంద్రం నుండి ఈడీ, ఐటిలను వినియోగిస్తోంది. టిఆర్‌ఎస్ పార్టీని అబాసుపాలు చేసేందుకు ఎత్తులు వేస్తోంది. దీన్ని ఆదిలోనే ఎదుర్కోవాలని కేసిఆర్ చూస్తున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే బిజేపిది ఉరుకులాట ఉత్తశాటే…!
రాష్ట్రలో బలడ్డామంటూ కలలు గంటోంది. బిజేపి రాష్ట్ర నాయకులు కేంద్ర పెద్దలను ఏమార్చుతున్నారు. ఎవరికి వారు క్రెడిట్ కోసం తహతహలాడుతున్నారు. ఆధిపత్య పోరు కూడా మొదలుపెట్టారు. డిల్లీ పెద్దలను మాయచేస్తున్నారు. వారికి భ్రమలు కల్పిస్తున్నారు. అవి నిజమని బిజేపి పెద్దలు పరుగులు తీస్తున్నారు. వారిని బొక్కబోర్లా పడేస్తేగాని మళ్ళీ టిఆర్‌ఎస్ జోలికి, తెలంగాణ జోలికి రారు.బిజేపి పిట్ట బెదిరింపులు మరీ విచిత్రంగా వుంటాయి. ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తూనే, ప్రజలను రెచ్చగొట్టే దుర్మార్గపు చేష్టలను అనుసరిస్తుంటారు. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో తొలుత మాకేం సంబంధం అన్నారు. నిందితుల తరుపున బిజేపి కోర్టుకు వెళ్లింది. ఇక ఐటి వచ్చే..ఈడీ వచ్చే అంటూ నిత్యం పిట్ట బెదిరింపులతో ప్రజల్లో గందరగోళం నెలకొనేలా చేస్తుంటారు. బిజేపి ఇప్పుడు చేస్తున్నటువంటి అదిరింపులు, బెదిరింపులు టిఆర్‌ఎస్ కు కొత్త కాదు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నదేమీ లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టిన నాటి నుంచి వింటున్నవే…టిఆర్‌ఎస్ గొంతు పిసికేస్తామన్నారు. టిఆర్‌ఎస్ ఎంత కాలం నడుస్తుందో చూస్తామన్నారు. ఎన్నికలలో జిత్తులు చేశారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేను ఆనాడు కూడా ఉద్యమానికి దూరం చేశారు. వారిని టిఆర్‌ఎస్ కు దూరం చేశారు. కాంట్రాక్టులిచ్చి కేసిఆర్ ను రాజకీయంగా వారిచేతనే తిట్డించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా ఆనాడు కూడా ఆ ఎమ్మెల్యేను కొనుగోలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆగం చేద్దామనుకున్నారు. అలాంటి నాయకులు ఎంతో మంది చెల్లాచెదురైపోయారు. కేసిఆర్ తెలంగాణ సాధించడంతో కుటిల నాయకులు రాజకీయలకే దూరమయ్యారు. ఒక్క దెబ్బతో కొన్ని వందల మంది కాంగ్రెస్ నాయకుల రాజకీయ జీవితాలు సమాధి అయ్యాయి. ఇప్పుడు టిఆర్‌ఎస్ తో గోక్కొని బిజేపి అదే దారిలో నడిచేందుకు సిద్దమౌతోంది.
బిజేపి ఉడుత ఊపులు తెలంగాణలో పనిచేయవు. ఇక టిఆర్‌ఎస్ నేతలను పనైపోయింది.
ఈడీ దాడులు మొదలయ్యాయి. ఇక టిఆర్‌ఎస్ కకావికలమే అన్నంత బిజేపి అసత్య ప్రచారాలు ప్రజలు ఎంత మాత్రం నమ్మడం లేదు. పైగా తెలంగాణలో ఇప్పటి వరకు గంగా జమున తెహజీవ్ సంస్కృతి కొనసాగుతోంది. దానిని కలుషితం చేసే మత రాజకీయాలు తెలంగాణలో రుద్దడాన్ని ప్రజలు కూడా అంగీకరించడం లేదు. అందుకే అలాంటి దుష్ట పన్నాగాలు పన్ని తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం అని కేసిఆర్ ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించారు. కనీసం క్షేత్ర స్థాయిలో బిజేపికి కార్యకర్తలు లేరు. రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు. అయినా అ దొంగ దెబ్బ తీస్తాం.ఎమ్మెల్యేలను కొంటాం. అధికారం లాక్కుంటామనడం కాదు. దమ్ముంటే ఎన్నికలలో గెలవండి. ఎదురొడ్డి సవాలుకు రండి అని కేసిఆర్ సవాలు విసిరే అవకాశం కూడా వుంది. ఎన్నికలలో పోటీ చేద్దాం సిద్ధంగా వుండండి. అంతే గాని గాయి గత్తర గాళ్లలాగా చిల్లర రాజకీయాలు చేయడం కాదు. ఎన్నికలలో నిలబడితే కదా.. బిజేపి తాకత్ ఎంతో తేలిపోతుంది? అనేది కేసిఆర్ వేస్తున్న ఎత్తుగడగా తెలుస్తోంది. నిజానికి కేసిఆర్ ముందస్తుకు వెళ్తే బిజేపి దడే…ఇప్పటికీ క్షేత్ర స్థాయి నిర్మాణమే లేదు. ఊహల పల్లకి తప్ప నిజంగా ఊరేగే తాహతే లేదు. ఎన్నికలలోకి దింపితే అప్పుడు బిజేపి తహతహ గుల తీరిపోతుంది? అని కేసిఆర్ వ్యూహాత్మక అడుగులు వేయనున్నాడని తెలుస్తోంది.
టిఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసం.
తెలంగాణ స్వయం పాలన కోసం. అందుకే ఆది నుంచి టిఆర్‌ఎస్ ది అభివృద్ధి నినాదం. బలమైన తెలంగాణ వాదం. అదే టిఆర్‌ఎస్ కు కొండంత బలం. ఎదురులేని రాజకీయం. కేసిఆర్ అపర చాణక్యం. బిజేపి ది విచ్చిన్న వాదం…చిచ్చులు పెట్టడం! ఇది అందరికీ తెలిసిందే. దేశమంతా బిజేపిని తిడుతున్నదే. ప్రభుత్వాలు కూలదోయడం…ఆ స్థానాలలో అక్రమ మార్గంలో అధికారంలో కొనసాగడం చూస్తున్నదే. బిజేపి అంటేనే అన్నది తెలియంది కాదు. మత రాజకీయాలు కాదు, మానవత్వపు విలువలు కావాలి అని చెబుతున్న పార్టీ టిఆర్‌ఎస్. నాయకుడు కేసిఆర్. ఇది బిజేపికి నచ్చనిదైపోయింది. కులాల కుమ్ములాటలు కాదు, కలిసి బతికే సమాజం బలం.
పట్టుమని పది సీట్లలో బిజేపికి బలం లేదు.
బిజేపిలో అద్దె నాయకులకు గెలిచేంత సీన్ లేదు.వంద ఎమ్మెల్యేల బలమున్న టిఆర్‌ఎస్ ను ఢీ కొనడం అంత తేలికకాదు. కోరికోరి కొరివితో తలగొక్కుంటున్న బిజేపి. టిఆర్‌ఎస్ ను రెచ్చగొట్టి మరింత పాతాళానికి వెళ్లడం ఖాయమని తెలిసినా తొందరపడుతోంది. రెండు ఉప ఎన్నికలలో గెలవడమే గొప్పగా భావిస్తున్నారు. భ్రమల్లో తేలుతున్నారు. మరి ఇన్ని ఉప ఎన్నికలలో గెలుస్తున్న టిఆర్‌ఎస్ ముందు కుప్పింగతులు వేస్తున్నారు. వాపు ఎప్పుడూ బలుపు కాదు..బిజేపికి దక్షిణాన చోటు లేదు. తెలంగాణలో ఎప్పటికీ అధికారం సాధ్యం కాదు!
ఒత్తిడి ఎక్కువ కాలం పనిచేయదు.
తిరగబడితే ఎంత ఒత్తిడినైనా చిత్తు చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ అదే చేయాలనుకుంటున్నాడు. కొడితే పడేందుకు ఇది గాంధీ కాలం కాదు. నీతివంతమైన రాజకీయాలకు గాంధీ సిద్దాంతాలు అనుసరిస్తున్నవారు లేరు. ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి. పిచ్చిపట్టిన వాళ్లకు షాకే ఇవ్వాలి. అందుకే ఏదో పొడిచేస్తాం…అధికారంలో వచ్చేస్తాం…టిఆర్‌ఎస్ ను దింపేస్తాం…కుటుంబ పాలన కూలదోస్తాం…ఎమ్మెల్యేలను బెదిరిస్తాం…ఈడీ, ఐటిలతో బెంబేలెత్తిస్తాం…మా గట్టుకొస్తే మంచిగ చూసుకుంటామంటూ బిజేపి ఎత్తులను చిత్తు చేసేందుకు కేసిఆర్ నడుం బిగించారు. తెలంగాణ రాష్ట్రాన్నే ఎన్నికల రాజకీయానికి, ఉద్యమ పోరాటానికి లంకెపెట్టి సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు బిజేపి కుప్పిగంతులు సాగుతాయా? సిద్దాంతాల రాజకీయాలు పోయాయి. రాద్దాంతాల రాజకీయాలొచ్చాయి. ఎత్తిపొడుపుల మాటలొచ్చాయి. రాజకీయాలలో మంచి మర్యాద లేని రోజులొచ్చాయి. అందుకే బిజేపికి దేశంలో నూకలు చెల్లనున్నాయి.