`ముంచుడే ఆ కోడలు పని!?
`మునుగోడులో కూడా అంతే! మరో హుజూరాబాద్ చేయాల్సిందే!
`తేల్చేడు లెక్కలు లేనట్టే!
`మునుగోడులో గెలుసుడు కాంగ్రెస్ కు కష్టమే!
`హుజూరాబాద్ రాజకీయం రేవంత్ మునుగోడులో ఆడుతున్నట్టే!
`అదంతా చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే!
`మునుగోడులో కాంగ్రెస్ ను ముంచడమే గురుదక్షిణే!
`కాంగ్రెస్‌కు రేవంత్ నాయకత్వం శాపగ్రస్థమే?
`హుజూరాబాద్‌లో మూడు వేలతో సరి…!
`మునుగోడులో ఆరు వేలు దాటకుండా చూడాలి మరి?
`కోడలుగా కాంగ్రెస్ కు కొరివిపెట్టడానికే..నా!?
`కాంగ్రెస్‌ను ఖతం పట్టించడానికే రేవంత్ కంకణం!
`చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ యాక్షన్!
`చంద్రబాబు చలవతో మునుగోడులో రేవంత్ ప్లాన్…
`మునుగోడులో గెలిపించి, బిజేపి కి దగ్గర కావడం చంద్రబాబుకు అవసరం.
`అది అమలు చేయడం రేవంత్ కర్తవ్యం.
`స్రవంతికి డిపాజిట్ రాకుంటే బిజేపి గెలుస్తుంది?
`స్రవంతికి డిపాజిట్ వస్తే టిఆర్ఎస్ గెలుస్తుంది?
`కాంగ్రెస్ కు మునుగోడు ఓడిపోయే సీటే…!
`బిజేపిని గెలిపిస్తే చంద్రబాబుకు మేలే!
`ఈడీ రూపంలో సీనియర్లను మునుగోడుకు దూరం చేసింది రేవంతే?
`చంద్రబాబు సూచన మేరకే ఈడిని ఉసిగొల్పిన బిజేపి ?
`సీనియర్ల దూరంతో స్రవంతిని ఒంటరి చేయడమే రేవంత్ లక్ష్యం!
`అంతిమంగా కాంగ్రెస్ ఓటమే రేవంత్ పుంజీతం!
`తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేయడమే చంద్రబాబు పంతం?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఇంటికొచ్చిన కొత్త కోడలు దీపం పెడుతుందనే అందరూ అనుకుంటారు. కాని కొంప తగలెట్టేందుకు వచ్చిందని ఇల్లు కాలిపోతే గాని తెలియదంటారు. ఇది అచ్చంగా కాంగ్రెస్‌లో వినిపిస్తున్న మాట. రాష్ట్ర కాంగ్రెస్‌ను కాపాడేందుకు వచ్చినట్లు చెబుతున్న పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీని పతనం చేసి, పాతాళానికి తొక్కేడానికే వచ్చాడన్న మాట సర్వత్రా వినిపిస్తుంటే నిజమా? అనిపించకమానదు. ఏ సీనియర్ నాయకుడిని కదిలించినా ఇదే మాట చెప్పకుండా వుండలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో చేరలేదంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం కూడా పార్టీలో చేరలేదనే మాటలే వినిపిస్తున్నాయి. కేవలం చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసమే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి, పగ్గాలు అందుకున్నాడని అంటున్నారు. అందుకు అనేక కారణాలు కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాలు ఎంత చెప్పినా పార్టీ అధిష్టానం దృష్టికి పోకుండా, వారు వినకుండా రేవంత్‌నే నమ్ముతున్నారని మధనపడుతున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్చి మాణిక్యం ఠాకూర్ పూర్తిగా రేవంత్ మాయలో పడిపోయి, ఆయన కనుసన్నల్లో మాత్రమే పనిచేస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనలను పలు మార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, తమ తప్పులే అక్కడ కనిపించేలా రేవంత్ చూసుకుంటూ, తమను వెర్రి వెంగలప్పలను చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. ఇలాగే వదిలేస్తే ఎన్నికల నాటికి పూర్తిగా కాంగ్రెస్‌ను నట్టెట ముంచి కోలుకోకుండా చేసి, సాఫీగా రేవంత్ తప్పుకోవడం చూస్తామని సీనియర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తాము అధిష్టానానికి ఎంత చెప్పాలని చూసినా, ఎంత మొత్తుకుంటున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అవుతోందని మధనపడుతున్నారు.ఇంతకీ రేవంత్‌కు కాంగ్రెస్ మీద కక్షఎందుకు? అన్నదానిపై కూడా కాంగ్రెస్‌లో ఆదినుంచి చర్చే జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సోనియాగాంధీని అనేక రకాలుగా తిట్టిన రేవంత్‌కు ఉన్న ఫలంగా పార్టీమీద ప్రేమ పుట్టుకురావడంపై అనేక అనుమానాలున్నాయి. పక్కాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే వ్యూహంలో భాగంగానే చేరాడంటున్నారు. నిజానికి రేవంత్ వేసే ప్రతి అడుగు చంద్రబాబు కోసమే అని చెబుతున్నారు. ఆయన ఆనందం కోసమే అంటున్నారు. అందుకు వారు చెప్పే విషయాలు కూడా ఆసక్తికరంగా వుంటున్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి మునుగోడులో చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలం చేకూర్చుతున్నాయి. తనను కాంగ్రెస్‌లోకి పంపించింది చంద్రబాబే అని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే తనకు తానుగా స్వయం నిర్ణయం తీసుకోలేని వ్యక్తినని తనే ఒప్పుకున్నట్లైంది. అయినా తన రాజకీయ జీవిత నిర్ణయం అన్నది తన వ్యక్తిగతమైన నిర్ణయం.
అది నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పడం మానేసి, నన్ను చంద్రబాబు కాంగ్రెస్‌లోకి పంపించారని అన్నాడు. అంటే తాను చంద్రబాబుకోసమే రాజకీయం చేస్తున్నానని భహిరంగంగా చెప్పినట్లే లెక్క. మరి చంద్రబాబు కాంగ్రెస్‌పార్టీకే ఎందుకు రేవంత్‌ను పంపారన్నదానిపై కూడా అనేక చర్చలున్నాయి. నిజానికి చంద్రబాబుకు రాష్ట్ర విభజన సుతారం ఇష్టం లేదు. కలలో కూడా ఆయన రాష్ట్ర విభజన కోరుకోలేదు. కాని తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ కోసం ఉత్తరం రాశాడు. తన రాజకీయ జీవితం కోసమే 2009లో టిఆర్ఎస్తో జతకట్టాడు. ఆ ఎన్నికల్లో గెలిచి తన దృషతరాష్ట్ర కౌగిలిలో టిఆర్ఎస్ను నలిపేద్దామనుకున్నాడు. కాని చంద్రబాబు గెలవలేదు. తెలుగుదేశంపార్టీని అటు ఆంధ్రాలో నమ్మలేదు..ఇటు తెలంగాణలో నమ్మలేదు. తెలుగుదేశాన్ని గెలిపించలేదు. దాంతో ఆనాడు గూడుకట్టుకున్న కోపం ఆయనకు ఇంకా చల్లారలేదు. ప్రతిసారి ఎలా తెలంగాణను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూనే వున్నారు. కుయుక్తులు పన్నుతూనే వున్నారు. 2009 డిసెంబర్9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన వెంటనే అర్ధరాత్రి చంద్రబాబు దుష్టరాజకీయం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ను కూడా తన కుటిల రాజకీయంలో కలుపుకున్నారు. నాటి ఆంధ్ర ఎమ్మెల్యేలు, మంత్రుల చేత రాజీనామాలు చేయించారు. ప్రకటించిన తెలంగాణను వెనక్కి వెళ్లేలా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇక సాకారం కాదన్న భ్రమల్లోనే ఆయన వుంటూ వచ్చారు. అయినా 2014లో తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. ఇదే చంద్రబాబుకు నచ్చంది…ఎనాటికైనా మళ్లీ తెలుగుజాతిని ఏకం చేయాలి. తెలుగు రాష్ట్రాలను కలపాలి. అన్నదే చంద్రబాబులో వున్న కుత్సితం. అది నెరవేరాలంటే తెలంగాణలో రాజకీయ అలజడి రేపాలి. ఓటుకు నోటు అన్నదానితో, నాడు ఎమ్మెల్యేను కొని అరాజకీయం చేద్దామనుకున్నాడు. కాలం కలిసిరాలేదు. రేవంత్ మాటలు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ నమ్మలేదు. రేవంత్‌ను అడ్డంగా ఇరికించాడు. జైలుకు పంపించాడు. దాంతో చంద్రబాబులో మరింత కసి పెరిగింది. తెలంగాణ రాజకీయాలను ఎలాగైనా గుప్పిట్లో పెట్టుకోవాలని, తన రాజకీయ జీవితాన్ని సమాధి చేసిన కాంగ్రెస్‌ను మట్టుబెట్టడమే లక్ష్యంగా శపథం పూనాడు. రేవంత్‌ను మరోసారి రంగంలోకి దింపాడు. కొంత కాలం పాటు కాంగ్రెస్‌తో చంద్రబాబు సఖ్యత నటించాడు. బిజేపికి వ్యతిరేకంగా నాటకమాడాడు. రేవంత్‌ను కాంగ్రెస్‌లో హీరోను చేశాడు. ఇప్పుడు ఆ గురుదక్షిణ తీర్చుకునేందుకు రేవంత్ కాంగ్రెస్ పని పట్టడం మొదలుపెట్టాడు.
అన్నది కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో జోరుగా సాగుతున్న చర్చఇదే…తొలి అడుగులోనే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను కనిపించకుండా చేసేశాడు.అందరూ రేవంత్ మూలంగా హుజూరాబాద్ గెల్చుకుంటామన్న ఓ వైపు ధీమాను వ్యక్తం చేస్తుంటే, మరో వైపు హుజూరాబాద్ ఎన్నికపై ఆది లోనే చేతులెత్తేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. ఒకింత అనుమానాలు వ్యక్తమయ్యేందుకు కారణమయ్యాడు. అయినా కాంగ్రెస్ సీనియర్లు ఓర్చుకుంటూనే వచ్చారు. కాని ఒక్కొ అడుగులో ఒక్కొ సీనియర్ పని పడుతూ, పార్టీకి వారిని దూరం చేస్తూ, కాంగ్రెస్‌లో సీనియర్ అన్న పదం వినిపించకుండా చూస్తూ వస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ అన్నది మర్రి చెట్టులాంటిది. చిన్న ఊడ భూమిని తాకినా మళ్లీ చిగురిస్తుంది. అందుకు సీనియర్లు లేని పార్టీగా చేసి, అప్పుడు నిండా ముంచే ఎత్తుగడ కోసం రేవంత్ తన వంతు రాజకీయం ఒక రకంగా సక్సెస్‌గానే చేస్తున్నాడు. కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తున్నాడు. ఇప్పుడు మునుగోడులో నిండా ముంచి కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేసే పనిలో వున్నాడు. ఓ వైపు పాల్వాయి స్రవంతిని రెచ్చగొడుతూ, మరో వైపు సీనియర్ల చేత పట్టుబట్టించి, స్రవంతికి టిక్కెట్ వచ్చేలా చేశాడు. అంటే కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా చేసేందుకు ఏత్తేశాడు. మునుగోడులో ఎలాగూ స్రవంతి గెలిచే అవకాశం లేదు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం పట్టుబట్టేందుకు ఆస్కారం లేకుండా చేశాడు. పైగా చంద్రబాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్‌కు కనీసం ఆరు వేల ఓట్లు దాటకుండా చూసుకోవాలి. అన్నది పక్కాగా అమలు చేస్తున్నాడు. ఇదీ అసలైన లెక్క…
మునుగోడులో టిఆర్ఎస్( బిఆర్ఎస్) గెలవాలంటే కాంగ్రెస్‌కు డిపాజిట్ రావాలి.
కాంగ్రెస్‌కు డిపాజిట్ వస్తే టిఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే..అవుతుంది. ఈ విషయం రేవంత్‌కు తెలుసు. చంద్రబాబుకు మరీ తెలుసు. అక్కడ బిజేపి గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు రావొద్దు. బిజేపిని గెలిపించే బాధ్యత తీసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే రేవంత్ సీనియర్లు మునుగోడు వైపు రాకుండా చూసుకుంటున్నారు. హుజూరాబాద్‌లో అమలు చేసిన రాజకీయమే ఇక్కడా అమలు చేస్తున్నాడు. మధుయాష్కీ నేతృత్వంలో మునుగోడు కమిటీ వేసినట్లే వేసి, ఆయనను మునుగోడు వైపు చూడకుండా చేశాడు…ఆయనలో కూడా అసంతృప్తిని రగిలించాడు. ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీకిచెందని నేతలపై ఈడీ కేసులు కొత్త తరహా రాజకీయాన్ని నెరిపేందుకు రేవంత్ కుట్ర చేశాడన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మునుగోడు వైపు సీనియర్లుచూడకుండా వారు ఈడీ కేసుల కలకలంలో వుంటే చాలు…కాంగ్రెస్ ఓడిపోవడం తధ్యం…? అసలు నేషనల్ హెరాల్డ్ కేసుకు, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేతలుకు ఏం సంబంధం అన్నది ఎంత జుట్టుపీక్కున్నా ఎవరికీ అర్ధం కావడంలేదు. అలా చంద్రబాబు చేత బిజేపిని ఉసిగొల్పి, ఈడిని రంగంలోకి దించి, మునుగోడులో కోలుకోకుండా చేసి, బిజేపికి బలం చేకూర్చడమే రేవంత్ లక్ష్యం. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసమే ఈ తతంగం…! పాపం కాంగ్రెస్ నేతలు ఈ విషయం అధిష్టానానికి చెప్పలేక, చెప్పినా నమ్ముతారో తెలియక, తమలో తాము చెప్పుకుంటూ కుమిలిపోతున్నారు…కాంగ్రెస్ మునిగిపోతుందని మధనపడుతున్నారు…తమ గోడు అరణ్య రోధనౌతుందని ఆవేదన చెందుతున్నారు.