మారకపోతే మార్పు తప్పదు?

 


ఎమ్మెల్యేలూ… వినకపోతే వేటు తప్పదు?
మేలుకోకపోతే టికెట్‌ గ్యారెంటీ లేదు…


దేశంలోనే ఎక్కడా అమలు కాని సంక్షేమ పధకాలు తెలంగాణలో…
చెప్పుకోవడంతో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెనుకంజ…
ఏం చెప్పుకోవాలో తెలియని పార్టీలు దూకుడు?
అన్నీ చేస్తున్న టిఆర్‌ఎస్‌ ఎందుకు మౌనం?
సంక్షేమం అంటేనే తెలంగాణ అన్నది చాటి చెప్పాలి…
చెప్పుకోవడానికి ఏమీ లేని బిజేపిని కట్టడి చేయాలి?
బిజేపి పాలిత రాష్ట్రాల దుస్ధితిని ప్రజలకు వివరించాలి…
నిత్యం ప్రజల్లో వుండాలి…
చేసింది ప్రజలు గుర్తిస్తారని నిర్లిప్తత వద్దు…
ప్రతిపక్షాల అసత్య ప్రచారాల సుడిగుండంలో కొట్టుకుపోవద్దు…


తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కాస్త బద్దకం వీడాలి. అంతా సారే చూసుకుంటారన్నది కొంత వదిలిపెట్టాలి. సార్‌ చూసుకునేది చూసుకుంటాడు. చెప్పాల్సింది చెబుతాడు. కాని ప్రచారం చేయాల్సిన ఎమ్మెల్యేలు పట్టనట్లు కాలం గడిపితే గండం ఎదురైనట్లే…టిక్కెట్ల కోతకు గురికావాల్సిందే…తేరుకోకపోతే టిక్కెట్లు గల్లంతే….ఇది తెలుసుకొని పని చేయడం మొదలు పెట్టాలి. అందుకు అనేక రకాలైన సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. దేశంలో ఎక్కడా అమలు చేయని అనేక పధకాలు ప్రజలకు అందుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రజలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేరు. ఇది చాలు చెప్పుకోవడానికి…కాని ఎమ్మెల్యేల నిర్లిప్తత మూలంగా ప్రతిపక్షాలు గాయిగాయి చేస్తున్నాయి. గత్తర గత్తర చేస్తున్నాయి. జనం ఉక్కిరి బిక్కిరి చేసేవారినే నమ్మేకాలం వచ్చింది. అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారాల్లో ముందుంటున్నాయి. రాష్ట్రంలో యువత ప్రభావం ఎక్కువగా వుంది. గతంలో టిఆర్‌ఎస్‌కు ఉద్యమ నేపథ్యం ఎంతో పనికొచ్చింది. తర్వాత సంక్షేమం బాగా ఉపయోపడిరది. కాని కొత్త తరం వచ్చింది. యువతరాన్ని ఆకర్షించే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. దూరపు కొండలు నునుపు. యువత కూడా అదే నమ్ముతుంది. ఆకాశంలో మబ్బును చూసి ముంతఒలుకపోసుకుంటే ఏమౌతుందో తెలియని తనం యువతరానిది. ప్రతిపక్షాల వారికి అసలు సంగతి తెలియదు. తెలంగాణ రాష్ట్రం అన్నది ఎలా వచ్చింది? అరవై ఏళ్లలో రాని తెలంగాణ ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఎంత కొట్లాడితే వచ్చింది? ఒక్కడుగా మొదలైన కేసిఆర్‌ ఎన్ని కోట్ల మంది కేసిఆర్‌లను తయారు చేస్తే తెలంగాణ వచ్చిందన్నది నేటి యువతరానికి తెలియదు. తెలంగాణ సాధనలోనే రెండు దశాబ్దాలు గడిపోయాయి. తర్వాత మరో దశాబ్ధం పూర్తి కావొస్తోంది. ఒక దశలో తరం మారుతుంది. కొత్త తరం వస్తుంది. అలాగే తెలంగాణ వచ్చిన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అమలౌతున్నాయన్నది నిన్నటి తరానికి మాత్రమే తెలుసు. కాని నేటి తరానికి వాటి విలువ తెలియాలంటే ఎమ్మెల్యేలు, టిఆర్‌ ఎస్‌ నాయకులు విసృతంగా ప్రచారం చేపట్టాలి. లేకుంటే ప్రతిపక్షాలు చెప్పే మాటలే యువత వింటుంది.
ఒకటా…రెండా ఇలా చెప్పుకుంటూ పోతే: తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. ఒకనాడు కరంటు గోస. నీళ్ల గోస. పంటకు పెట్టుబడి గోస. ఎరువుల గోస. ఇలా ఒకటి కాదు రెండు కాదు…అనేక సమస్యలు ఎదుర్కొన్నది నిన్నటి తెలంగాణ. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో కొత్త ఊపిరి నందుకున్నది నేటి తెలంగాణ. దీన్ని ప్రధానంగా నేటి తరానికి చెపాల్సిన అసవరం వుంది. ఒకప్పుడు వ్యవసాయానికి కూడా విద్యుత్‌ బిల్లులు వుండేవి. అయినా రోజుకు కనీసం మూడు గంటల నిరంతర విద్యుత్‌ అందేది కాదు. ఐదు నిమిషాలు,పది నిమిషాల కోసారి పోయి వచ్చే కరంటుతో రైతులు పడ్డ గోసలు నేటి తరానికి తెలియాలి. వేళా పాలా లేని కరంటు కోసం, మడి ఎండిపోకుండా రైతులు పడిన తిప్పలు చెప్పాలి. ఎండాకాలంలో ఆ మాత్రం కూడా కరంటు రాక పైర్లు ఎండిపోయిన సంగతి తెలియాలి. ఆరు గాలం కష్టం చేతికందకుండాపోయిన సందర్భాల గురించి వివరించాలి. కరంటు తిప్పలు ఇలా వుంటే, పైరు ఎండిపోకుండా డీజిల్‌ ఇంజన్లు కిరాయికి తెచ్చి పంటలు కాపాడుకున్న సందర్భాల గురించి చెప్పుకోవాలి. ఎండిపోయిన బావులు, అడుగంటిన బోర్ల గురించి కూడా వివరించాలి. ఇప్పుడు ఏ రైతన్నా నీరు లేదన్న మాట చెప్పుకుంటున్నాడా? కరంటు లేదన్న మాట వివినిపిస్తున్నాడా? అర్ధరాత్రి బావుల దగ్గరకు వెళ్తున్నాడా? గతంలో రైతు వ్యవసాయం తప్ప మరో పని చేసుకునే అవకాశం లేదు. ప్రతి నిమిషం బావుల దగ్గరే గడపాల్సి వచ్చేది. కాని ఇప్పుడు రైతుకు ఆ సమస్య లేదు. అటు సాగు, ఇటు పాడి, ఇంకా చెప్పాలంటే రియలెస్టేట్‌ వ్యాపారిగా కూడా నాలుగు రకాల సంపాదనల వెసులుబాటు రైతుకు కల్గింది. ఇది నేటి తరానికి తెలియాలి.
రైతు సంక్షేమ ప్రభుత్వం: గతంలో చినుకు పడిరదంటే రైతు అప్పుకోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్దితి. ఎంత వడ్డీకి సొమ్ము తెచ్చుకోవాలో తెలియని అయోమయం. అప్పు చేయలేక, పంటలు పండిరచలేక విలవిలలాడిన రోజులున్నాయి. సాగు చేయలేక వలసలు పోయిన దినాలున్నాయి. కాని ఇప్పుడు వాన చినుకులతోపాటే, రైతుకు రైతు బంధు వస్తుంది. ఒక భరోసా కల్పిస్తోంది. ఎకరానికి నాలుగువేల చొప్పున అందుతోంది. రెండు పంటలకు కలిపి ఎనమిది వేల రూపాయలు వస్తున్నాయి. దాంతో రైతుకు పెట్టుబడి సమస్య లేకుండాపోయింది. గతంలో ఎరువుల కోసం క్యూలు… పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు చూసిన రైతులున్నారు. కాని ఇప్పుడు ఆ సమస్యలేదు. అన్ని తట్టకొని రైతు పంటలు పండిస్తే , అమ్మిన ధాన్యానికి డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని స్ధితి ఒకనాడు. కాని ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ప్రభుత్వమే రాష్ట్రం మొత్తం మీద ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏటా ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఇలా ధాన్యం కొనుగోలు ఘనత ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి, వంటి వినూత్నమైన పధకాలు అమలౌతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రెండు వందలనుంచి రెండువేలకు: ఒకప్పుడు రెండు వందల రూపాయల పించన్‌ ఇచ్చి అదే మహాద్భాగ్యంగా చెప్పుకున్న రోజులున్నాయి. పార్టీలున్నాయి. కాని ఇప్పుడు తెలంగాణలో ఆసర ఫించన్లు సుమారు 56లక్షల కుటుంబాలకు అందుతున్నాయంటే మామూలు విషయం కాదు. వీటికి తోడు వికాలంగుల పించన్లు, ఒంటరి మహిళల పించన్లు, బీడి కార్మికుల పింఛన్లు…ఇన్ని రకాల పించన్లు ఏ బిజేపి పాలిత రాష్ట్రాలలోనైనా అమలౌతున్నాయా? అన్నది జనానికి తెలియాలి. మాయా మాశ్చీంద్ర మామ మాటలతో రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు ప్రతిపక్షాలు కట్టగట్టుకొని వచ్చినా ప్రజలు మోస పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌ నాయకులపై వుంది. ఒక్క విషయం మీకు మీరుగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు పని చేయడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారే గాని, ఎక్కడా ఎమ్మెల్యేలు వారిని మోసం చేశారనో, కుంభకోణాలు చేశారన్న ఆరోపణలు పెద్దగా లేదు. ఇది ఒక్కటి మళ్లీ టిఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించడానికి..? మసిబూసి మారేడు కాయ చేసి, ప్రజల దృష్టిని మళ్లించి, తిమ్మిని బమ్మిని చేసే ప్రతిపక్షాలలో బిజేపి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలి. ఏ మాత్రం ఎమ్మెల్యేలు వెనుకబడినా మీ సీటు గల్లంతే…టిక్కెట్ల కోతలో మీరు ముందున్నట్లే…తస్మాత్‌ జాగ్రత్త…! చేస్తున్నదే చెప్పుకోండి…అభివృద్ధినే వివరించండి. ప్రతి పక్షాల లాగా లేనివి చెప్పాల్సిన అసవరం లేదు. జరుగుతున్న ప్రగతి చెప్పుకుంటే చాలు…మళ్లీ టిఆర్‌ఎస్‌ తిరుగులేదు…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!