మాజీ మేయర్‌ ఆలోచనే శాపమైందా?

`సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాయమంటే…మున్సిపల్‌ కమీషనర్‌ కు రాశాడు?

`అప్పటికీ ఉద్యోగులు చెబుతూనే వున్నారు?

`సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాస్తే ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి!

`నాకు లెటర్‌ రాయించమంటే కమీషనర్‌ కు లెటర్‌ రాస్తే నేనేం చేయాలని ఇంజనీర్‌ ప్రశ్నించారు!

`ఇప్పుడు నేనేం చేయలేనని సీనియర్‌ ఇంజనీర్‌ చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. 

`వారి జీవితాలకు దిక్కులేకుండా పోయింది.

`మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ హామీ ఇచ్చినా, మేయర్‌ నిర్ణయం వల్ల ఆగమ్యగోచరమైంది.

`తెల్లారితే అప్పాయింట్‌ మెంట్‌ లెటర్లు రెడీ అనుకున్నారు.

`ఉదయమే గుళ్లకు వెళ్ళి పూజలు చేశారు. 

` కేటిఆర్‌ కు కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలు కూడా తయారు చేయించారు.

`మేయర్‌ ఆగం చేశాడు!

`అధికారులు చేతులెత్తేశారు!

`ఫైలును పెండిరగ్‌లో పెట్టారు!

`అప్పటి నుంచి పాపం తొలగింపబడిన ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు?

`ఇప్పటికైనా అధికారులు కనికరించండి.

` కేటిఆర్‌ హామీని అమలు చేయండి!

`వారి జీవితాలకు దారి చూపండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కొండ నాలుకకు మందేయమంటే వున్న నాలుక ఊడగొట్టారని అని సామెత. సరిగ్గా ఇలాంటి సంఘటనే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో జరిగింది. మాజీ మేయర్‌ ఆలోచనే శాపమైంది? అనేది గృహ నిర్మాణ సంస్థ నుంచి తొలగింపబడిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఒప్పంద ఉద్యోగుల ఆవేదన. అప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రాదేయపడుతూ వస్తున్నారు. ఏళ్లుగా రోజులు లెక్కబెట్టుకుంటూ ఆశలు తీరుతాయన్న నమ్మకంతో కనిపించిన నాయకుడిని వేడుకుంటున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఫైలు కదులుతుందంటే సంతోషపడుతున్నారు. ఆగిందంటే దిగులు చెందుతున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఆకలి దిగమింగుకుంటున్నారు. కుటుంబాలు పస్తులుంటున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇతర పనులు చూసుకుందామంటే నాయకుల హమీ మీద నమ్మకం వుంది. ఇవాళ కాకపోతే రేపు అన్న విశ్వాసం పెరుగుతుందే తప్ప తగ్గలేదు. ఎదురొచ్చిన నేతలందికీ వారి గోడు వినిపిస్తూనే వచ్చారు. వాళ్లు కూడా తమ వంతు సహాయకపాత్ర పోషించారు. దాంతో ఆ ఒప్పంద ఉద్యోగుల సమస్య మంత్రి కేటిఆర్‌ దాకా చేరింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. వారికి న్యాయం చేస్తామని చెప్పిన నాయకుల అభ్యర్థన మన్నించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ప్రకటించారు. వారికి న్యాయం చేయమని వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కు సూచించారు. ఇక మాకు కొలువులు వచ్చినట్లే, మా జీవితాలు ఓ దారిలో పడ్డట్టే అనుకున్నారు. కానీ ఉపద్రవం ముంచుకొచ్చి మొదటికే మోసం వస్తుందనుకోలేదు. జీవితాలు ఆగమౌతాయని ఊహించలేదు. మేలు చేసే రూపంలో నాయకుల అవగాహనా రాహిత్యం మూలం దిద్దుకోలేని నష్టాలు ఇతరులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఇదే మరి. ఆరేళ్లుగా కాళ్లరిగిపోయేలా తిరిగి, తిరిగి, తమ సమస్యను ఓ కొలిక్కి తెచ్చుకుంటే మొత్తం మంట గలిపినట్లైంది. నమ్మితే నిండా మునిగినట్లైంది. ఆశలు ఆవిరైపోయి, అంధకారం మిగిలింది. మళ్లీ మొదటి కొచ్చిన సమస్య తో లబోదిబోమంటున్నారు. దిక్కుతోచని స్థితిలోకి ఆ ఉద్యోగులు నెట్టివేయబడ్డారు. ఇకనైనా ఎవరైనా కరుణించి కాపాడండని కనిపించిన నాయకులందరినీ వేడుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లి, న్యాయం చేయమని అడిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మేయర్‌ చేసిన చిన్న పొరపాటు మాకు గ్రహపాటును మిగిల్చిందని చెప్పి, కరుణించి, మాకు దారి చూపండని తమ గోడు చెప్పుకోవాలనుకుంటున్నారు. 

ప్రొసీడిరగ్స్‌ వరంగల్‌ ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 51 మందికి కొలువు ఫైనల్‌ చేశారు.

 మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో తీర్మానాలు జరిగాయి. 51మంది పేర్లు కూడా మినట్స్‌ బుక్‌ లో చేర్చడం జరిగింది. ఆ ఉద్యోగులను ఇంజనీరింగ్‌ విభాగంలోకి తీసుకోవడానికి సీనియర్‌ ఇంజనీర్‌ అంగీకారం కూడా తెలిపారు. ఆ తర్వాత ఈ ఉద్యోగులు వెళ్ళి సీనియర్‌ ఇంజనీర్‌ ను కలిశారు. అప్పటి మేయర్‌ గుండా ప్రకాశ్‌ చేత ఓ లెటర్‌ తీసుకురమ్మని సీనియర్‌ ఇంజనీర్‌ ఆ ఉద్యోగులకు సూచించడం జరిగింది. దాంతో మేయర్‌ గుండా ప్రకాశ్‌ ను ఉద్యోగులు కలిసి విషయం వివరించారు. తమకు కొలువులు రావాలంటే సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాయాలని కోరారు. తాను ఒక ఇంజనీర్‌ కు లెటర్‌ రాయడమేమిటనుకున్నాడో ఏమో కాని, కమీషనర్‌ పేరు మీద లెటర్‌ రాయడం జరిగింది. అప్పటికీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే వున్నారు. అయినా గుండా ప్రకాశ్‌ వినలేదు. కమీషనర్‌ కు లెటర్‌ రాసి, వారి చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు. పైగా నేను రాసిన లెటర్‌ తో మీ కొలువులు వచ్చినట్లే అని నమ్మించాడు. ఉద్యోగుల విన్నపాన్ని కాదని మున్సిపల్‌ కమీషనర్‌ కు రాశాడు!

నాయకులు తాము చెప్పిందే వేదం…

పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని చెప్పడం పరిపాటే. ఇక్కడా అదే జరిగింది. ప్రభుత్వ వ్యవహారం అన్నాక కొన్ని నిబంధనలు వుంటాయి. వాటిని అనుసరించి నడుచుకోవాల్సిన అవసరం వుంటుంది. అందుకు భిన్నంగా సితే మొదటికే మోసం వస్తుంది. సీనియర్‌ ఇంజనీర్‌ కు లెటర్‌ రాస్తే ఉద్యోగాలు ఎప్పుడో వచ్చేవి! సరిగ్గా అదే జరిగింది. ఇంజనీర్‌ కు కోపమొచ్చింది. సహజంగా జరిగేదే ఇది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదంటే ఇలాగే వుంటుంది. 51 మంది బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని సీనియర్‌ ఇంజనీర్‌ భావించాడు. కానీ ప్రొసీజర్‌ ముందుకు సాగకుండా మేయర్‌ గుండా ప్రకాశ్‌ ఒక రకంగా అడ్డుపుల్ల వేశాడు. అది తెలిసి చేసినా,తెలియక చేసినా నష్టపోయింది మాత్రం ఆ ఉద్యోగులే. 

నాకు లెటర్‌ రాయించమంటే కమీషనర్‌ కు లెటర్‌ రాస్తే నేనేం చేయాలని ఇంజనీర్‌ ప్రశ్నించారు! తాము ఎంత చెప్పినా మేయర్‌ వినలేదని వారు సీనియర్‌ ఇంజనీర్‌ కు వివరించారు. మరి నేనెలా ప్రొసెడిరగ్స్‌ ఇవ్వడం జరుగుతుంది? లెటర్‌ కమీషనర్‌ పేరు మీద వుండగా, కమీషనర్‌ ఫైల్‌ అటాచ్‌ చేయాలి. ఆ అధికారం నాకెలా వుంటుంది. మొదటికే మోసం జరుగుతుంది. పైగా తాను పరిధి దాటినట్లౌతుంది. కమీషనర్‌ ఆదేశాలు పాటించాల్సిన ఇంజనీర్‌ ని. నేను కమీషనర్‌ పేరు మీద ఆర్డర్లు ఇవ్వడం కుదరదు. ఇప్పుడు నేనేం చేయలేనని సీనియర్‌ ఇంజనీర్‌ చేతులెత్తేశాడు. మీకు వీలైతే మేయర్‌ చేత మళ్ళీ ఉత్తరం తీసుకురండి. లేకుంటే ఈ లెటర్‌ తీసుకెళ్ళి కమీషనర్‌ కు ఇవ్వండి. అక్కడి నుంచి ఆదేశాలు అందితే అప్పుడు ఆలోచిస్తాను. అని ఇంజనీర్‌ చెప్పడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. వారి జీవితాలకు దిక్కులేకుండా పోయింది. అప్పటి మున్సిపల్‌ కమీషనర్‌ ఉద్యోగుల ఫైలును స్టడీ చేయడానికే చాలా కాలం పట్టింది. ఇందులో లొసుగులున్నాయని చెప్పి, పక్కన పెట్టడం జరిగింది. నిజానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దాదాపు 128 మంది ఒప్పంద ఉద్యోగులు గృహ నిర్మాణ శాఖలో పని చేసే వారు. వారిలో చాలా మంది ఇతర పనులు చూసుకున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయలేదు. కానీ 51 మంది మాత్రం ఆనాటి నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఆ లిస్టే మంత్రి కేటిఆర్‌ సమక్షంలో ఆమోదం జరిగిందనేది తెలుస్తోంది. కాకపోతే కమీషనర్‌ అసలేం జరిగిందో నాకు తెలియాలి? అనడంతో కథ మళ్ళీ మొదటి కొచ్చింది. అక్కడే ఆగిపోయింది. 

వీళ్లకు ఉద్యోగాలు ఇస్తారు కదా! మరి నేను మాట ఇస్తున్నాను. 

మీరు సూచించడంతోనే నేను కూడా సరే అంటున్నానని ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో మంత్రి కేటిఆర్‌ ప్రకటించారు. ఆ సమయంలో అందరూ తలూపారు. ఇక తమకు ఉద్యోగాలు వచ్చినట్లే అని 51 మంది ఎంతో సంతోషించారు. మొదటి నుంచి ఆ ఉద్యోగులకు సాయం చేస్తున్నందున అధికారుల మీద నమ్మకంతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఓ ప్రెస్‌ నోట్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఒప్పంద ఉద్యోగులకు రేపటి లోగా అప్పాయింట్‌ మెంట్‌ లెటర్లు తయారౌతున్నాయని చెప్పారు. కానీ అప్పాయింట్‌ మెంట్‌ సంగతి దేవుడెరుగు. మేయర్‌ చేసిన పనికి అక్కడే ఆగింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ హామీ ఇచ్చినా, మేయర్‌ నిర్ణయం వల్ల ఆగమ్యగోచరమైంది. కడియం శ్రీహరి లాంటి నాయకులు కూడా రేపే మీ ఆర్డర్లు అన్నారు. తెల్లారితే అప్పాయింట్‌ మెంట్‌ లెటర్లు రెడీ అనుకున్నారు. ఉదయమే గుళ్లకు వెళ్ళి పూజలు చేశారు. కేటిఆర్‌ కు కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలు కూడా తయారు చేయించారు. మేయర్‌ తో ఉత్తరం రాయించి తీసుకొచ్చి, ఆ చేత్తో లెటరిచ్చి, ఈ చేత్తో అప్పాయింట్‌ మెంట్‌ లెటర్లు తీసుకుందామనుకున్నారు. కలలు కల్లలయ్యాయి. కొలువులు కంటికి కనపడకుండా పోయాయి. మొరో, మొరో మొత్తుకొని చెప్పినా, గుండా ప్రకాశ్‌ వినకపోవడం వారికి శాపంగా పరిణమించింది. 

మేయర్‌ ఆగం చేశాడు! 

ఇదే అదునుగా అధికారులు చేతులెత్తేశారు. ఫైలును పెండిరగ్‌లో పెట్టారు! అప్పటి నుంచి పాపం తొలగింపబడిన ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు?

 ఇప్పటికైనా అధికారులు కనికరించండి. తోటి ఉద్యోగులు అన్నదైనా ఆలోచించండి. పదేళ్లపాటు ఒప్పంద కొలువైనా, ప్రభుత్వం కనికరించకపోతుందా అన్న నమ్మకంతో పని చేశారు. అంత కాలం ప్రభుత్వ పర్యవేక్షణలో కొలువు చేసి, మళ్ళీ జీవితాలు మొదటికి రావడం ఎవరికైనా ఇబ్బందే. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఎంతో సహకరించారు. ఈ ఉద్యోగుల ఫైల్‌ తిరిగి, తిరిగి ఉద్యోగుల చేతికి అప్పాయింట్లు అందిస్తుందనుకుంటే, ఎప్పుడూ అధికారుల టేబుళ్ల మీదే తిరుగుతోంది. ఇకనైనా ఆ ఫైలుకు మోక్షం కలగనీయమని వేడుకుంటున్నారు. 

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటిఆర్‌ హామీని అమలు చేయండి! 

ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థానం మంత్రి కేటిఆర్‌ ది. అసలు ఆయన మాటంటేనే జీవోతో సమానం. అయినా అధికారులు ఆ ఫైల్‌ ను ముందుకు వెళ్లకుండా చేయడం సరైంది కాదు. మేయర్‌ పొరపాటు చేశాడు. ఇక దానికి పరిష్కారమే లేదా? ఆ ఉద్యోగులు కాళ్లరిగేలా ఏళ్ల తరబడి తిరుగుతూనే వుండాలా? ఇప్పటికే ఆరేళ్లు గడిచిపోతున్నాయి. వారికి భరోసా ఇచ్చే నాధుడే లేడా! వారి జీవితాలకు దారి చూపండి. సాటి ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులైనా పట్టచుకొని సమస్య తీరేందుకు సహకరించండని బాధితులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!