మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్‌.

`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం.

`జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం.

`తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్‌.

`స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన.

`పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి.

` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి.

`మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి.

`మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి.

`రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి.

`జాతి జీవనాడిలో కలకలం రేపాలని చూస్తున్నాయి.

`తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నాయి.

`త్యాగధనుల త్యాగాలను సైతం మలినం చేయాలని చూస్తున్నాయి.

`రెప్ప పాటు కాలం కూడా ఆదమర్చిపోవద్దు.

`చైతన్య వంతమైన తెలంగాణ సమాజంలో సంకుచితాలకు తావులేదు.

`సంక్షేమ తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూస్తున్న వారి ఉచ్చులో యువత పడొద్దు.

`పెడదారిలో రాజకీయం చేయాలని చూస్తున్న వారి మాయలో పడొద్దు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక్కసారి చేసిన పొరపాటు 58 సంవత్సరాల పాటు అనుభవించాం. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిరది. ఆనాడే మనం మోసపోయాం. దోపిడీకి గురయ్యాం. శాపగ్రస్త జీవితాలు అనుభవించాం. తెలంగాణ కోల్పోయిన అస్ధిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో కాలం పోరాడాల్సివచ్చింది. ఎంతో మందిని కోల్పోవాల్సివచ్చింది. ఎంతో మంది త్యాగాలు చేయాల్సివచ్చింది. తెలంగాణ కొన్ని తరాలు వేధన అనుభవించింది. ఈ చరిత్రంతా మన కళ్లముందే కనిపిస్తోంది. వాటిని తల్చుకుంటే ఇప్పటికీ నా కళ్లలో నీటి సుడులు తిరుగుతుంటాయని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్‌ మాట్లాడుతూ ఎన్నటికీ తెలంగాణలో అశాంతి, అలజడులు రావొద్దు. కళ్లోలంలోకి జారి పోవద్దని తెలంగాణ సమాజానికి సూచించారు. ఎంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామో, అంతే వేగంగా ప్రగతిని కొనసాగించాలన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర గొప్పగా ఆవిషృతం కావాలి.అందుకు తెలంగాణ ఉజ్వల పాత్రను పోషించాలి. భారత జాతి సమైక్యత, సమగ్రత కోసం , అభ్యున్నతి కోసం మన వంతు కృషి చేద్దామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్నారు. పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చీలికకు దుష్టపన్నాగం పన్నుతున్నాయి. సామాజిక సంబంధాల మధ్య ముళ్ల కంపలు నాటుతున్నాయి. మనుషుల మధ్య విద్వేశపూరిత మంటలు రగిలిస్తున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. జాతి జీవనాడిలో కలకలం రేపుతున్నాయి. మానవత్వాన్ని కబలించే కుట్రలు చేస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలవాల్సిన సెప్టెంబర్‌ 17ను సైతం వక్రీకరిస్తున్నారు. చరిత్రను కలుషితం చేస్తున్నారు. విచ్చిన్న కరశక్తులుగా మారుతున్నారు. చిల్లర రాజకీయాల కోసం ప్రజల మధ్య దూరం పెంచే కుయుక్తులు పన్నుతున్నారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించే కుటిల రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ త్యాగాలను సైతం మలినం చేస్తున్నారు. ఎంతో క్రియాశీలకమైన, చైతన్యవంతమైన మేధో సంపత్తి కల్గిన తెలంగాణ సమాజాం అప్రమత్తంగా వుండాల్సిన సమయమిది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా వుండాలి. రెప్ప పాటు కాలం ఆదమర్చినా తెలంగాణ సమాజం కల్లోలంలోకి కూరుకుపోయే ప్రమాదం వుందని ముఖ్యమంత్రి కేసిఆర్‌ హెచ్చరించారు.ఒకసారి కాదు, మూడు సార్లు తెలంగాణ సమాజమంతా ఏకమై పోరాటం చేసిన చరిత్ర ప్రపంచంలో ఒక్క తెలంగాణదే. 

భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటంతోపాటు, ఇండియా జాయిన్‌ ఉద్యమం, 1969 ఉద్యమం, తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన ఉద్యమాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిచారు. తెలంగాణ అస్తిత్వ, రైతాంగ పోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణ రెడ్డి నుంచి మొదలు కొని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎంతో మంది తెలంగాణ వీరులను ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్మరించుకున్నారు. ఆదిలాబాద్‌లో జల్‌, జంగిల్‌, జమీన్‌ పేరుతో పోరాటం సాగించిన తెలంగాణ యోధుడు కొమరంభీమ్‌, వరంగల్‌ జిల్లాలో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటాలు గుర్తు చేశారు. తెలంగాణ స్టేట్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసి, జాయిన్‌ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన రామానంద తీర్ధ రగిలించిన స్వాతంత్య్ర ఉద్యమాలను ప్రస్తావించారు. గ్రంధాలయ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించిన మట్టి మనుషులు పుస్తకం రచయిత వట్టికోట అల్వారు స్వామితో చైతన్యం గురించి వివరించారు. తెలంగాణ టైగర్‌ నల్లా నర్సింహులు, భీమ్‌ రెడ్డి నర్సింహారెడ్డి వంటి యోధుల పోరాటాలను, త్యాగాలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ గుర్తు చేశారు. వారి త్యాగాలను కొనియాడారు. వారి పోరాట స్పూర్తి రగిలించిన చైతన్యం మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఎంత ఉపయోగపడిరదో చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను చేసిన పోరాటం గురించి వివరించారు. తానే స్వయంగా పూరించిన తెలంగాణ పోరాట శంఖం మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి, మరణం అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించిన విధం ప్రజల కళ్లముందే వుందని గుర్తు చేశారు.

తెలంగాణ సాధించున్నాక తెలంగాణ రాష్ట్రంలో అమలౌతున్న ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ వివరించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా పురోగమిస్తోతందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలు ఏం కలలు గన్నారో, ఆ తెలంగాణ ఆవిషృతమౌతోందన్నారు. తెలంగాణ సిద్ధించిన తొలి ఏడాదిలోనే తెలంగాణలో చిమ్మచీకట్లను పారద్రోలిన, విద్యుత్‌ వెలుగులు నిండిన తెలంగాణ ఆవిషృతం గురించి వివరించారు. దేశానికే తెలంగాణ ఒక టార్చి బేరర్‌గా నిలిచిందన్నారు. తాగు, సాగు నీటిరంగంలో ఎదురైన సవాళ్లును తెలంగాణ ఎలా అధిగమించిందో చెప్పారు. ప్రజా సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి ఎలా ఆదర్శంగా నిలుస్తుందో వివరించారు. పారిశ్రామిక, ఐటి, ఫార్మా రంగాలలో తెలంగాణ ఎన్ని అధ్భుతాలను సృష్టించిందో చెప్పారు. సంపదనను పెంచాలి.

ప్రజలకు పంచాలనే లక్ష్యంతో పేదిరిక నిర్మూలన, సమసమాజ నిర్మాణం పేరుతో సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిన సంగతిని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో అతి తక్కువ కాలంలో తెలంగాణలో ఆవిషృతమైన విజయం దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలో రైతాంగానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసిఆర్‌ అన్నారు. అంతే కాదు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో నేడు సస్యశ్యామల తెలంగాణగా వర్ధిల్లుతోందని సిఎం అన్నారు. అనేక రైతు విధానాలను అమలు చేయడం వల్ల తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు సాగుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు. పంటల దిగుబడి విపరీతంగా పెరిగి, తెలంగాణ సమృద్ధి రాష్ట్రంగా విలసిల్లుతోందన్నారు. విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసకొచ్చిన ఘనత కూడా మనదే అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణమే కాదు, ఆరోగ్య రంగంలో తెలంగాణ అధ్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. ఇలా తెలంగాణ అన్ని రంగాల్లో అధ్భుతమైన ప్రగతితో దూసుకుపోతుంటే బిజేపి చేస్తున్న రాజకీయ కుయుక్తుల గురించి పరోక్షంగా ప్రస్తావించి ఆ పార్టీని తూర్పారపట్టాడు. అసలు తెలంగాణలో జాతీయ సమైక్యత ఆవశ్యకతను వివరిస్తూనే తెలంగాణ గురించి పూర్తి చరిత్రను ప్రజల ముందుంచారు. భూస్వాముల కాలం నుంచి పోరాట యోధులను పోరాటాలను గుర్తు చేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపిన చైతన్య దీప్తిలాంటి నాయకుల సేవలు స్మరిస్తూ వచ్చారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా వర్ధిల్లుతున్న సమయం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను ఆంధ్రలో కలపడం మూలంగా తెలంగాణకు జరిగిన నష్టం గురించి వివరించారు. 58 ఏళ్లపాటు పడిన కష్టాల గురించి, అనుభవించిన గోసల గురించి సిఎం. ఏకరుపెట్టారు. తర్వాత 1969లో ఉద్యమం, 2001 టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత జరిగిన ఉద్యమాలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణసాధించి సాగింగిన ప్రగతిని మన కళ్లముందు ఆవిష్కరించారు. బిజేపి చేస్తున్న రాజకీయ విన్యాసాలను కూడా వివరించారు. ప్రజలను అప్రమత్తంగా వుండాలని కూడా సూచించారు. చైతన్యం నిండిన తెలంగాణ సమాజాన్ని ఎవరూ మోసం చేయలేరని కూడా సిఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!