అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు
చూచి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మున్సిపాలిటి పరిదిలోని నాయిని చెరువు నుండి అర్ధరాత్రి సమయంలో అడ్డు-అదుపు లేకుండ అక్రమంగా మట్టిని తోడేస్తున్నా సంబంధిత అధికారులు చూచిచూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మికుంట మండల వ్యాప్తంగా చెరువులు, కుంటలనే బేదాలు లేకుండ ఎప్పుడు పడితే అప్పుడు మట్టి అక్రమంగా తోడేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. దీని పై పలుమార్లు ” నేటిధాత్రి ” లో కథనాలు వచ్చినప్పడికి సంబంధిత అధికారులలోపల చలనం కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపద్యంలో.. పోలీస్, రెవెన్యు శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఎన్నికల నియమాలు అమలు చేస్తున్న నేపద్యంలో.. ఇదే అదునుగా భావించిన మట్టి అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో జమ్మికుంట నాయిని చెరువు శివారు మాచనపల్లి రోడ్ నుండి ఆక్రమంగా జెసిబిలతో మట్టిని కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి కొడుతున్నారు. యదేచ్ఛగా రాత్రి సమయంలో మట్టిని అక్రమంగా తోడేస్తూ… ఉదయం వేళలో వారి వారి పనులలో ఉంటుండడంతో ఇది సంబంధిత అధికారులకు తెలిసినప్పడికి వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్షలకు తావిస్తుంది. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా ఇలాంటి అక్రమ మట్టి తవ్వకాల పై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉండగా.. వారు ఎన్నికల హడావుడిలో ఉండడంతో ఇదే అదనుగా భావించి ఇష్టానుసారం చెరువులను తోడేస్తున్నట్లు పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. అడ్డు-అదుపు లేకుండ చెరువుల నుండి మట్టిని అక్రమంగా తోడేస్తుండడంతో పెద్ద పెద్ద గొయ్యిలుగా మారి వర్షాలు కురిసిన సమయంలో ఆయా గుంతలలో నీరు చేరడంతో అటువైపుగా వెలుతున్నవారు ప్రమాదాల బారిన పడి గతంలో మృతి చెందిన సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. దీని పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్ట సారించి రాత్రి వేళలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి. అక్రమంగా మట్టి తరలించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటే కొంత అదుపులోకి వస్తుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇట్టి విషయం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉండగా.. వారు మాముళ్ళ మత్తుకు అలువాటు పడి అటువైపుగా తగు చర్యలు చేపట్టడం లేదనేది జగమెరిగిన సత్యం.