భూముల చెరకు తహసీల్దారే అండ!

`స్వయంగా ప్రభుత్వ భూములు దారాదత్తం!

`ఆ జిల్లాలో వందల ఎకరాలు మాయం!

`ఎవరు ఎక్కువ ముట్టజెప్పితే వాళ్లకే పట్టా!

`ఒకప్పటి జిల్లా కలెక్టర్‌ అండ!

`ఆ కలెక్టర్‌ అవినీతిలో తహసీల్దారు కు వాటా!

`అప్పటి కలెక్టర్‌ అవినీతి మీద నేటిధాత్రి వరుస కథనాలు!

`కలెక్టర్‌ కు స్థాన చలనంతో సర్థుకున్న తహసీల్దారు!

`ఆ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ తహసీల్దారు బదిలీ!

`ఎమ్మార్వో కు ఆర్‌ ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సహకారం.

`దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు!

`ఇప్పుడున్న కలెక్టర్‌ ఆ తహసీల్దారు తప్పులు తవ్వుతున్నాడు?

`ఆస్తుల మళ్ళింపులో తహసీల్దారు బిజీబిజీ!

`ప్రభుత్వ భూముల అప్పగింతతో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 ఓ జిల్లా పాలనాధికారి అండదండలతో కంచె చేనుమేసిన చందంగా, ప్రభుత్వ భూములను దోచుకునే వారికి ఓ తహసీల్దారు ధారాదత్తం చేశాడు. ప్రభుత్వ జాగలు కాపాడాల్సిన కుర్చీలో కూర్చొని, వాటిని అడ్డూ అదుపు లేకుండా అప్పగింతల కార్యక్రమం మొదలుపెట్టి ఆస్థులు పోగేసుకున్నాడు. ప్రభుత్వ భూములను అప్పనంగా పట్టాలు చేసి, అమ్మకాలకు దారి చూపాడు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత కల్గిన అధికారే పప్పు బెల్లంలాగా భూములు అమ్ముకోవడం నేరం. ప్రభుత్వ భూములను రికార్డులను నుంచి తొలగించడం దివాళాకోరుతనం. తన కుర్చీకి అధికారం, చేతిలో పెన్ను వుంది కదా? నన్నెవరూ ప్రశ్నస్తారు? అనుకొని పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగితే దొంగతనం ఆగుతుందా? తప్పు చేయకుండా ఆదర్శంగా వుండాల్సిన స్థాయిలో వున్నవారు, అడ్డమైన పనులు చేస్తుంటే ఎలా? తన కింద పని చేసే అధికారులు అవినీతికి పాల్పడితే శిక్షించాల్సిన స్థానంలో వున్న అధికారి అడ్డదిడ్డంగా అక్రమ సంపాదనకు ఎగబడితే ఇలాగే వుంటుంది. ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మండల రెవిన్యూ అధికారిగా( తహసీల్దారు) ప్రజల పన్నుల నుంచి వేలకు వేల జీతాలు తీసుకుంటూ, కక్కుర్తి పెరిగి, సంపాదనకు మరిగి ప్రభుత్వ భూములు అమ్ముకానికి పెట్టాడు. కమీషన్లతో కోట్లు సంపాదించాడు. అసలు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులు కొనకూడదు. కానీ ఆ తహసీల్దారు మాత్రం ఏకంగా ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసి, పట్టాలు చేయడం నేర్చుకున్నాడు. ఇంకేముంది ఆ జిల్లాలో వున్న అనేక ప్రభుత్వ భూములు మాయమయ్యాయి. 

భూముల చెరకు తహసీల్దారే అండ!

 ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలనుకునే వారికి ఆ తహసీల్దారు అన్ని పనులు సమకూర్చిపెడతారు. దగ్గరుండి అన్ని పనులు చేసి పెడతారు. అందుకు ఎవరు ఎక్కువ తూకం ఇస్తే వాళ్లకు కావాల్సిన భూమిని ధారాదత్తం చేసేస్తాడు. అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు, ప్రభుత్వ భూములు అడిగిన వారి పేర రాయించేస్తుంటాడు. నిజానికి అతను చేయాల్సిన పనేమిటి? చేస్తున్న పనేమిటి? గొంగలకు సద్దికట్టే పని పెట్టుకున్నాడు. కాపాడడం వదిలేసి పంచడం అలవాటు చేసుకున్నాడు. సహజంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ వున్నాయనే సంగతి ఒక్క రెవెన్యూ శాఖకు తప్ప మూడోకంటికి తెలియదు. మన కళ్లముందు వుండే భూమి కూడా అది ప్రభుత్వ భూమి అవునా, కాదా అని నిర్ణయించేది తహసీల్దారే. ఇంకే ముంది రికార్డులన్నీ తన అధీనంలోనే వుంటాయి. అతన్ని కాదని ఫైళ్లను పరిశీలించడం ఎవరి వల్లా కాదు. ఇక తహసీల్దారు తర్వాత ఉద్యోగులు ఎలాగూ అతని చెప్పు చేతుల్లోనే వుంటారు. కాదనే ధైర్యం వున్నా అధికారం వారికి వుండదు. దాంతో తహసీల్దారులు కొందరు ఆడిరది ఆట, పాడిరది పాటగా ఆస్థులు సంపాదిస్తున్నారు. కోట్లు కూడబెట్టుకుంటున్నారు. తిలా పాపం తలా పిడికెడు. ఈ అవినీతి తహసీల్దారు కు అదే మండలం లోని ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేట్లు మూడో కంటికి తెలియకుండా పనులు చక్కబెడుతుంటారు. వాళ్ల వాటా వాళ్లు పుచ్చుకుంటారు. 

ఒకప్పటి జిల్లా కలెక్టర్‌ అండ! 

ఈ తహసీల్దారుకు ఒకప్పటి ఆ జిల్లా కలెక్టర్‌ ఆశీస్సులు మెండుగా వుండేవి. ఆ కలెక్టర్‌ జిల్లా స్థాయిలో చూసుకుంటే ఈ తహసీల్దారు మండల స్థాయిలో చూసుకునేవారు. పైగా కింద నుంచి కూడా వాటాలు పై స్థాయికి చేరుతుండేవి. ఆ కలెక్టర్‌ కు కూడా వాటా అందుతుండేది. అందుకే ఇక తహసీల్దారు ముందూ వెనక చూడలేదు. ఏకంగా కలెక్టర్‌ ఆశీస్సులే వుండగా, దోపిడీకి అడ్డూ అదుపు వుంటుందా? తన పరిధిలో ప్రభుత్వ భూముల లెక్కలు ముందు పెట్టుకొని, పంచుడు పని మొదలుపెట్టాడు. ఇక అప్పటి కలెక్టర్‌ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో నేటిధాత్రి వరుస కథనాలు! ప్రచురించింది. దెబ్బకు జిల్లా వదిలిపెట్టి వెళ్లల్సివచ్చింది. ఆ కలెక్టర్‌ ఆ జిల్లాలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా, మహిళా ఉన్నతోద్యోగులను వేధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో మంది మహిళా అధికారులు బయటకు వచ్చి నేటిధాత్రి తో వారి బాధలు పంచుకున్నారు. వాటిని నేటిధాత్రి ప్రచురించడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. ఆ కలెక్టర్‌ కు స్థాన చలనం తప్పలేదు. జిల్లా పాలనాధికారిగా వుంటూ, పై స్థాయిలో తనకు పలుకుబడి వుందని చెప్పుకునే వారు. ప్రతి పనిలోనూ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యారు. అలాంటి ఆ ఐఏఎస్‌ కు ఈ తహసీల్దారు అత్యంత నమ్మకస్తుడయ్యాడు. కలెక్టర్‌ అండతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే కలెక్టర్‌ కు స్థానచలనం జరగడంతో తనకూ ఇబ్బంది తప్పదని ముందే గ్రహించిన తహసీల్దారు సర్థుకున్నాడు. ఆ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ తహసీల్దారు బదిలీ చేయించుకున్నాడు. అ జిల్లా నుంచి వెళ్లిపోతే చేసిన తప్పులన్నీ మాసిపోతాయనుకున్నాడు.

కానీ ఆట ఇప్పుడు మొదలైంది.  

ఇప్పుడున్న కలెక్టర్‌ ఆ తహసీల్దారు తప్పులు తవ్వుతున్నాడు.ఆ జిల్లా ఏర్పాటు తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటనపై కలెక్టర్‌ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. గతంలో జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, వాటి అమలు, జరిగిన అవినీతి వంటి అన్ని విషయాలు కలెక్టర్‌ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో గతంలో పని చేసిన సదరు తహసీల్దారుపై ఉద్యోగులు సైతం అనేక రకాల విషయాలు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఏ తహసీల్దారు మీద లేని ఆరోపణలు ఈ ఒక్క అధికారి మీదే ఎందుకొస్తున్నాయని ఆరా తీస్తే అతని బాగోతాలన్నీ వెలుగుచూశాయని చెప్పుకుంటున్నారు. అతని అవినీతిపై పూర్తి స్థాయి నివేదిక కూడా తయారైంది. ఇక చర్యలకు ఉపక్రమించడమే తరువాయి అన్నది ఆ జిల్లా కార్యాలయంలో చెబుతున్నారు. ఆ జిల్లా నుంచి తెలివిగా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని వెళ్లానని , కొత్త చోట కూడా ఇలాంటి పనులే మొదలు పెట్టాడు. తాను చేసిన తప్పులన్నీ తూచ్‌ అనుకున్నాడు. కానీ ఆ జిల్లా కలెక్టర్‌ ఈ తహసీల్దారు బాగోతాలు తవ్వుతుండడంతో గొంతులో వెలక్కాయపడ్డట్లైంది. ఈ సమాచారం ఉప్పందండంతో అడ్డదిడ్డంగా సంపాదించిన సంపాదన ఎలా కాపాడుకోవాలో అన్న పనిలో సదరు తహసీల్దారు వున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల మళ్ళింపులో తహసీల్దారు బిజీబిజీ!అనేది వెల్లడౌతోంది. ఈ తహసీల్దారు చేసిన అక్రమాలపై పూర్తి వివరాలు సాక్ష్యాదారాలతో సహా త్వరలో…. మీ నేటిధాత్రిలో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!