కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి.గోపి
జమ్మికుంట కరీంనగర్ జిల్లా నేటిధాత్రి :
భారీ వర్షాల దృష్యా లొతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి. గోపి అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హోసింగ్ బోర్డ్ కాలనీని సిపి సుబ్బారాయుడు, ఆర్డీఓ హరిసింగ్ ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు వెళ్లగా.. కాలనీ పరిసరాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను గురించి వాకబు చేశారు. రానున్న 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా వెంటనే వారిని ఆయా ప్రాంతాల నుండి తరలించడానికి అవసరమైన సహాయక చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇంకా పొంగిపొర్లడానికి సిద్ధంగా ఉన్న వాగులు, కాలువలు వద్ద ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని పరిశీలించాలని, నీటి ఉధృతికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గురించి తెలుసుకుంటు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, పోలీస్ అధికారులందరు వారిపరిధిలోనీ సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని. సహాయక చర్యలు అందించడానికి సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. రోడ్ల పై నుండి వరద నీరు ప్రవహించే మార్గాలలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. ఈ పర్యటనలో హుజురాబాద్ ఆర్డీఓ హరిసింగ్, ఎసిపి జీవన్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, తహసీల్దార్ బండిరాజేశ్వరి, సిఐ బర్పటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.