ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
ఘనంగా భగవాన్ దాస్ 92వ జయంతి
కార్మిక నాయకులు, కమ్యూనిస్టు యోధుడు బిఆర్ భగవాన్ దాస్ స్పూర్తితోనే కార్మికుల హక్కుల రక్షణకై పోరాడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.బిఆర్ భగవాన్ దాస్ 92వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం హన్మకొండ అశోక జంక్షన్ లోని బిఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ దాస్ విగ్రహానికి చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు.
పార్టీలు వేరైనా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉక్కు మనిషి బిఆర్ భగవాన్ దాస్ అని, ఆయన స్పూర్తితోనే తాము నిరంతరం కార్మిక, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరంలో భగవాన్ దాస్, కాళీదాస్ పేదలకు ఇండ్ల స్థలాల కోసం పోరాడారని, ఇప్పటికే నిరుపేదలైన గుడిసె వాసులకు ఇండ్ల స్థలాలు ఇచ్చామని, ఇంకా చెరువు శిఖం భూముల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఉన్నందున ఇప్పించ లేక పోయామని, నగరంలో జీవో 58,59 ప్రకారం అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. వారు కన్న కలలు సాగించేందుకు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం అందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాడుతామని చెప్పారు.
బిఆర్ నగర్ లో భగవాన్ దాస్ విగ్రహం పెడతాం
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
వరంగల్ నగరంలోని బిఆర్ నగర్ లో భగవాన్ దాస్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.వరంగల్ నగర ప్రజలకు మంచినీటి సమస్య, పేదల ఇండ్ల స్థలాల కోసం భగవాన్ దాస్ అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి,భగవాన్ దాస్ కుమారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ లెనిన్, కార్పొరేటర్ లు పోతుల శ్రీమాన్, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ లు తాడిశెట్టి విద్యాసాగర్, మాడిశెట్టి శివశంకర్, వీరగంటి రవీందర్, చీకటి ఆనంద్, నాయకులు పులి రజనీకాంత్, నయీం, సిపిఐ జిల్లా నాయకులు మద్దెల ఎల్లేష్, కొట్టెపాక రవి, కండె నర్సయ్య, మాలోతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.