పార్టీ పరువు తీయడమే అంతరంగమా?
గోడ దూకడం కోసమే ఎత్తుగడా?
పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలనని సంకేతమా?
ప్రతిపక్షాలు తనవైపు చూడడం కోసమేనా?
అసమ్మతి నేతలతో బొంతు మంతనాలు నిజమేనా?
ఒక్కసారి మేయరైతేనే ఇంత హంగామానా?
ఎంత సంపాదించకపోతే అంత అతివిశ్వాసముండునా?
ఇంత హంగామా ఎవరూ చేయలేదు?
ఉప్పల్ క్రాస్ రోడ్డులో బాణాసంచా…
పొరపాటున మెట్రో స్టేషనుపై నిప్పురవ్వలు పడివుంటే?
నిత్యం సందడిగా వున్న చోట ఏదైనా ప్రమాదం జరిగివుంటే?
రోడ్డుకిరువైపులా ఫ్లెక్సీలు….
గంట పైగా ట్రాఫిక్ జామ్….
నడి రోడ్డు మీద హంగామా…
తిట్టిపోసిన జాతీయ మీడియా…
పార్టీ పరువు బజారుకీడ్చిన బొంతు
బొంతుపై చర్యలుండేనా? ఇంకా వేచి చూసే ధోరణేనా!?
హైదరాబాద్,నేటిధాత్రి:
పదవుల యావ తప్ప ప్రజా సేవ తెలియని వాళ్లంతా నాయకులైతే రాజకీయాలు చేస్తారే గాని ప్రజలనేముద్దరిస్తారని పెద్దలు ఎప్పుడో చెప్పారు…ఇప్పుడు కొందరి వ్యవహారం సరిగ్గా అలాగే వుంది. సహజంగా నాయకుడు ప్రజా క్షేత్రం నుంచి ఉద్భవించాలి. ప్రజా సేవ తెలిసి వుండాలి. ప్రజలకు అడుగడుగునా మేలు చేసే గుణంలో నుంచి నాయకుడు పుట్టాలి. అంతే కాని కలిసొచ్చే కాలానికి నాయకుడైతే, కాలం వెంట పరుగెత్తడం తప్ప, ప్రజల వైపు చూసే అవకాశమే వుండదు. ఉద్యమం పుణ్యమా అని నాయకుడై, జనం నమ్మి గెపిస్తే ప్రజా ప్రతినిధైతే ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా చేశానని చెప్పుకునేందుకు ఒక్కటి కూడా లేని వాళ్లు చాలా మంది వుంటారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సమయంలో స్వలాభం కోసం పనిచేసే వాళ్లు సంపాదనా పరులైనప్పుడు ప్రజలు అన్న పదం కాకుండా, పదవులు అన్న పదమే పదేపదే వినిపిస్తారు. సహజంగా ఏ నాయకుడైనా ప్రజలకు సేవ చేసే బాగ్యం కల్గించాలని కోరుకుంటారు…కాని కొందరు ప్రజల పేరు చెప్పుకొని బాగుపడేందుకు రాజకీయాలు ఉపయోగించుకుంటారు…ఎప్పుడూ ఏదో ఒక పదవి కావాలని కోరుకుంటారు? అందుకు ఎంతకైనా తెగిస్తారు? ఎవరినైనా మోసం చేస్తారు? అలా చాలా మంది వుంటారు..అలాంటి వారిని ప్రజలు దూరం పెట్టాలి. పార్టీలు కూడా వారిని దరి చేరకుండా చూసుకోవాలి. కాని రాజకీయాల్లో వస్తున్న మార్పులు కూడా అలాంటి నాయకులకే అనుకూలమౌతున్నాయి. వారినే అందలమెక్కిస్తున్నాయి. దాంతో వాళ్లు పార్టీ పరువు తీయడానికి కూడా వెనుకాడడం లేదు…? అందుకే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కొందరు నేతలు చేసే పనులు వివాదాస్పదమౌతున్నాయి. పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అలాంటి ఘటనలో బొంతు రామ్మోహన్ పుట్టిన రోజు వేడకులు టిఆర్‌ఎస్‌కు ఇబ్బందిగా పరిణమించాయి.
పుట్టిన రోజు వేడుకలు అందరూ చేసుకోవాలి. ఆడంబరంగా చేసుకోవాలి. కాదని ఎవరికీ అనే హక్కు లేదు.కాకపోతే సమస్యను రోడ్డు మీదకు వచ్చినప్పుడే ఎవరైనా ప్రశ్నిస్తారు? నిలదీస్తారు? నిందిస్తారు? తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తన పుట్టిన రోజుల వేడుకల కోసం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జాతీయ మీడియా తిట్టిపోసేంత? అన్నట్లైంది. నిజానికి అంగరంగ వైభవంగా బొంతు రామ్మోహన్ పుట్టిన రోజు వేడుకలు అని చెప్పాల్సిన మీడియా ఎందుకు తిట్టిపోసింది? అన్నది కూడా పార్టీ ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఒక్కసారి మేయరైనంత మాత్రానా ఇంత హంగామా అవసరమా? అధికార పార్టీ పేరు చెప్పుకొని జాతీయ రహదారి మీద ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం అవసరమా? ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన పుట్టిన రోజున దీవించిన వారికంటే తిట్టిపోసిన వారే ఎక్కువైతే ఆ వేడుకలు చేసుకొని ఏం లాభం? శాపనార్ధాలు పెట్టినంక ఆ వేడుకలకు ఏం పరమార్ధం? ఎంత ఖర్చు చేస్తే ఏం లాభం? రోడ్డు మీద వెళ్లిన ప్రతి ఒక్కరూ తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టినవాళ్లే…తన పుట్టిన రోజు వేడుకల కోసం యాదగిరి గుట్టకు బొంతు రామ్మెహన్ స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి తీసుకెళ్లిన వాళ్లు తిట్టిపోశాక..ఇక పుట్టిన రోజు వేడుకలకు ఏమైనా అర్ధముందా? ఐదు వందలు ఇస్తామని జనాన్ని తీసుకెళ్లి వంద రూపాయలు చేతిలో పెట్టారని మహిళలు దీవెనలు ఇవ్వాల్సిన రోజున శపించేదాకా తెచ్చుకోవడం మూర్ఖత్వం కాదా? అతి విశ్వాసానికి నిదర్శనం కాదా? నడిమంత్రపు సిరి చూసుకొని మిడిసి పడడం కాదా? అని సాక్ష్యాత్తు టిఆర్‌ఎస్ నాయకులే అంటున్నారు. ఇక ఉప్పల్ క్రాస్‌రోడ్డు అన్నది ఎప్పుడే వందలాది మందితో బిజీబిజీగా వుంటుంది. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, సిటీ బస్సులతో ఎప్పుడూ కిక్కిరిసి వుంటుంది. పైగా పక్కనే ఉప్పల్ మెట్రో స్టేషన్ వుండడంతో ఎప్పుడూ ఎంతో రద్దీగా వుంటుంది. అక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ వుంటుంది. అలాంటి చోట వచ్చిపోయే వాహనాలన్నీ ఆపేసి, బాణా సంచా కాల్చడం ఒక రకంగా నేరమే? పైన మెట్రో స్టేషన్ వుంటుంది. పక్కనే పదుల సంఖ్యలో జిల్లా డిపోల బస్సులు, సిటీ బస్సులు కూడా ఆగి వుంటాయి. ఆ పక్కనే తహసిల్ధార్ కార్యాలయానికి వచ్చేవారి వందలాది వాహనాలుంటాయి. దాని ఎదురుగానే పోలీస్ స్టేషన్ వుంటుంది. ఆ పక్కనే మున్సిపల్ కార్యాలయం వుంటుంది. ఏదైనా జరగరానిది జరిగితే, ఒక్క నిప్పురవ్వ ఏ బస్సు మీద పడినా ఎంత ప్రమాదం జరిగేది? నిప్పురవ్వలు మెట్రో స్టేషన్ వరకు చేరితే పరిస్ధితి ఎలా వుండేది? ఈ మాత్రం అవగాహన లేకుండా వేడుకల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం నాయకత్వ లక్షణమా? ఇక రోడ్డుకిరువైపులా వందలాది ప్లెక్సీలు…మరో వైపు గంటల పాటు ట్రాఫిక్ జామ్…? ఇదంతా చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేకాదు, బందోబస్తు కూడా కల్పించడం విడ్డూరం. కొన్నివందల వాహనాల కాన్వాయ్ తో వెళ్లడం, మధ్య మధ్యలో షాంపెన్‌లు పొంగించడం ఇవన్నీ జాతీయ మీడియాలో చూపించడంతో తెలంగాణ పరువు గంగలో కలిపినంత పనైంది. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తీరును ప్రపంచానికి తెలిపినట్లైంది. సహజంగా ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు తెలంగాణలో నాయకులంతా ఇలాగే వుంటారమో అనుకునే అనుమానం, అవకాశం లేకపోలేదు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమై వున్న సందర్భంలో, జాతీయ మీడియాలో టిఆర్‌ఎస్ నాయకుల తీరిదని వార్తలు ప్రసారమౌతుంటే ఆయా రాష్ట్రాలలో కాలు మోపడం సాధ్యమౌతుందా?
ఇదంతా కావాలనే రామ్మోహన్ చేస్తున్నాడనేది చాలా మంది టిఆర్‌ఎస్ నాయకుల వాదన.తాను పార్టీ మారే యోచనతోపాటు, తన బలం, బలగం పార్టీకి కూడా రుచి చూపించాలన్న ఆలోచనతో చేసిందే అంటున్నారు. బొంతు రామ్మోహన్ అతి విశ్వాసం కూడా ఇందుకు నిదర్శనమంటున్నారు. తాను మేయర్‌గా పదవిని నిర్వహిస్తూనే ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. కాని కుదరలేదు. కనీసం మరోసారి మేయర్ పదవి కోరుకున్నాడు. అదీ సాధ్యం కాలేదు..ఆపై ఎమ్మెల్సీ కావాలనుకున్నా జరగేలేదు. తాగాజా రాజ్యసభ ఎంపి కూడా కావాలనుకున్నాడట? అంటే బొంతులోని అత్యాశకు అంతు లేకుండాపోతోందన్నది టిఆర్‌ఎస్ నాయకులే ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీలో తనకు ఏ పదవి దక్కే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆ ఆశ తీరేలా కనిపించడం లేదని అర్ధమైనట్లుంది. అందుకే సమయం అనుకూలిస్తే ఓ జాతీయ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్దం చేసుకున్నట్లు కూడా ఆయన అనుచర గణం చెప్పుకుంటున్నారట. గతంలో టిఆర్‌ఎస్ వెలుగు వెలిగి, బైటకు సాగనంపబడిన నాయకుడితో బొంతుకున్న సత్సంబంధాలు కూడా ఇందుకు కలిసివస్తాయన్న నమ్మకంతోనే బొంతు ఇలా బరితేగింపు కార్యకపాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అధికారపార్టీ నాయకులు చేసే ఏ పనులైనా దాని ప్రభావం పార్టీపై పడడం సహజం. మీడియాలో వివాదం జరగడం…చర్చలకు తావివ్వడం జరిగేదే… దాంతో కావాలనే బొంతు రామ్మోహన్ ఇదంతా చేశాడని కూడా కొందరు టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. తాను కోరుకుంటున్న పదవులు ఇవ్వకుండా తనను పక్కన పెడుతున్నందునే పార్టీ పరువు తీస్తే రెబల్‌గానైనా గుర్తించి, పదవులు ఇస్తారనేది బొంతు ఆలోచన కూడా అంటున్నారు. లేకపోతే పార్టీని వదిలేస్తాడేమో అన్న సంకేతాలు కూడా పంపడానికి అవకాశం వుండేలా కూడా వుంటాయన్నది ఆయన అంతరంగమన్నది చెప్పుకుంటున్నారు. అంతే కాదు అవసరమైతే పార్టీ పెద్దలను కూడా ఎదిరించగలను ? అన్న సంకేతాలు పంపించినట్లే అన్నది కూడా పెద్దలు తెలుసుకునేలా ఆయన వ్యవహారం సాగుతున్నట్లు వినికిడి. పైగా ప్రతిపక్షాలు బొంతు రామ్మెహన్ బలం, బలగం తెలుసుకునేందుకు, పుట్టిన రోజు వేడుకలే ఇంత ఘనంగా చేసుకునేంత వెనకేసుకున్నాడని తెలిస్తే, అడిగిన సీటు ఇస్తారన్న నమ్మకం కూడా ఇక్కడ తెలియజేసినట్లౌతుంది. ఇదిలా వుంటే టిఆర్‌ఎస్‌లో పదవుల కోరుకొని, ఎదరుచూస్తూ ఆశలు తీరక రుసరుసలు వ్యక్తం చేసున్న అసమ్మతి నేతలను కూడా ఏకం చేసి, వారితో మంతనాలు కూడా బొంతు రామ్మోహన్ జరుపుతున్నట్లు కూడా సమాచారం. తనకు దక్కని ఉప్పల్ రాజకీయాలు , కలగాబులగం చేసి, టిఆర్‌ఎస్‌ను ఇబ్బందుల పాలు చేసి, తన ప్రతాపం చూపించాలని బొంతు కంకణం కట్టుకున్నట్లు చెప్పుకుంటున్నారు.