హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలో సగరుల జీవన స్థితిగతులు అగమ్య గోచరంగా మారాయని, సమాజంలో సగరులు సమానత్వ జీవనం కొనసాగించేందుకు బిసి ‘డి’ నుంచి ‘ఎ’ కు
మార్చాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర బిసి కమిషన్ ముందు గోడును వెళ్లబోసుకుంది. బుధవారం తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బిసి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణమోహన్, సభ్యులు కిషోర్ గౌడ్, శుబప్రద్ పటేల్, ఉపేంద్ర లతో
సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది సగరులు నిర్మాణ రంగమే కులవృత్తి గా కొనసాగుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడ్డారని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన సగర సంఘం నాయకులు స్థానికంగా సగరుల జీవన స్థితిగులను కమిషన్ ముందు తెలియజేశారు. ఆదిమానవుడు నాగరికత వైపు అడుగులు వేస్తున్న క్రమంలో మొట్ట మొదటగా భూమండలంపై ఉప్పు పంటను పండించిన తమ పూర్వీకులు ఉప్పు మడులు కట్టడానికి పనిముట్లు తయారు చేసుకొని అప్పటి రాజుల వద్ద చెరువులు,కుంటలు, రహదారులు నిర్మించడం ద్వారా తమకు ఉప్పరి పని (నిర్మాణ) రంగం కులవృతిగా వచ్చిందని తెలిపారు. కాలక్రమేణా సమాజంలో తమ జాతి సంఖ్య తక్కువగా ఉండడం వల్ల తమ కులవృత్తిలో ఇతర కులస్థులు కూడా వచ్చి చేరడం జరిగిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు చారిత్రక కట్టడాలలో, భారీ ప్రాజెక్టులలో, రోడ్ల నిర్మాణాలలో, నివాసాలైన బంగ్లాలను, చివరికి సమాధులను సైతం కట్టి సమాజ నిర్మాతలుగా ఉన్న తమకు నేడు ఉండడానికి నిలువ నీడ లేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని కుల ప్రాతిపదికగా బిసి డి లో చేర్చారని, పలితంగా ఎలాంటి రిజర్వేషన్లు తమ కులానికి రాకపోవడం కారణంగా ఆన్ని రంగాలలో వెనుకబాటుకు లోనయ్యమని బాధ వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అనంత రామన్ కమిషన్ సగరుల జీవిత స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సగరులు బిసి ‘డి’ లో ఉండడం సముచితం కాదని అప్పటి ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. అనంతరం 1986వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్.టి.రామారావు కులాల స్థితిగతులపై అధ్యయనం కోసం మురళీధర్ రావు కమిషన్‌ను ఏర్పాటు చేశారని, మురళీధర్ రావు కమిషన్ కూడా సగరులు దేశ దిమ్మరులని, మట్టి పనులు చేసుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎక్కడ పనులు ఉంటే అక్కడికి వెళ్లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారని, బిసి ‘డి’ నుంచి బిసి ‘ఎ’ జాబితాలోకి మార్చాలని ప్రభుత్వానికి సిఫారసులు చేసిందని తెలిపారు. అప్పటి ఎన్.టి.రామావు ప్రభుత్వంలో సగరులను బిసి ‘ఎ’ జాబితాలోకి మార్చారని, కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. నాటి నుంచి నేటి వరకు సగరులను బిసి ‘డి’ లోనే కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ముందడుగు వేయలేని అణగారిన వర్గంగా తమ కులం మ్రగ్గుతోందని, ఒక వైపు నిర్మాణ కూలీలుగా బ్రతుకును వెళ్లదీస్తూ పిల్లలను చదివించుకోలేని స్థితి, కష్టపడి కొంతమంది పిల్లలను చదివించినా వారికి బిసి ‘డి’ జాబితాలో ఉండటం కారణంగా ఉన్నత చదువులకు సీట్లు రావడం లేదనిఅన్నారు. సగరుల జీవన స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న బిసి డి నుంచి బిసి ఎ లోకి మార్చాలని కోరారు. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బిసి కమిషన్ ను కలిసిన వారిలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర ముఖ్య సలహాదారులు అర్ బి ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు సీతా భద్రయ్య సగర, జై తెలంగాణ టీవి సీఈఓ అస్కని మారుతి సగర, నేటిధాత్రి గ్రూప్స్ ఛైర్మన్ కట్టా రాఘవేంద్రరావు సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పేదబుదుల మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి స్రవంతి సగర, కోశాధికారి పల్లవి సగర, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు పెద్దబుదుల సతీష్ సగర, కోశాధికారి రాము సగర, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రవి సగర, నగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ బాబు సగర, వనపర్తి జిల్లా అధ్యక్షులు తిరుపతయ్య సగర, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు ప్రనీల్ చందర్ సగర, గద్వాల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ సగర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కృష్ణ సగర, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రవి సగర, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కృష్ణ సగర, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ సగర, మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్ సగర, యాదద్రి జిల్లా అధ్యక్షులు నర్సింహ సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ సగర, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య సగర, నారాయణ పేట జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సగర, రాష్ట్ర నాయకులు వెంకట్రావు సగర, సత్యనారాయణ సగర, దేవన్న సగర, శ్రీనివాస్ సగర, విష్ణు సగర, పద్మయ్య సగర, రవికుమార్ సగర, రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు సత్య సగర, విజయలక్ష్మి సగర, సరిత సగర, అలవెలు సగర, చంద్రకళ సగర, వరంగల్ కార్పొరేటర్ కిషన్ సగర, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.