`నిజాలు చెప్పలేక అసత్యాలను నమ్ముకున్న కుటిల రాజకీయాలు
`ఫేక్ న్యూస్ సృష్టించి, నమ్మించేందుకు ఎంచుకున్న బిల్డప్ బాబాయిలు.
` అధికారంలో లేకున్నా అవీ ఇవీ అంటూ అచ్చికబుచ్చిక హామీలు….
`వచ్చేది మేమే అంటూ బచ్చకాయల ప్రసంగాలు…
`కాంగ్రెస్‌కు కాసుల కష్టమంటూ చూసినట్లు గందరగోళాలు…
`టిఆర్‌ఎస్ కు కమ్యూనిస్టులు దూరమంటూ గోబెల్స్ ను మించిన కోతల కూతలు…
` ఇవన్నీ వింటున్న జనం నవ్వుకుంటున్నారు….
`రాజగోపాల్ రెడ్డి అత్యాశను ఎండగడుతున్న ప్రజలు….
`బహిరంగంగానే గ్రామాల్లో తిడుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అబద్దాలతో రాజకీయాలు చేయొచ్చని, అసత్యాలు ప్రచారం చేయొచ్చని, గెబెల్స్‌ను మించిన అర్ధసత్యాలు ఎన్నికల నాడు విసృతంగా వాడుకోవచ్చని బిజేపి నిరూపిస్తోంది. అదే పంధాను దేశమంతా అమలు చేస్తున్నట్లు వుంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సమయంలో తెలంగాణ మోడల్‌ను చూపించి ప్రచారం చేసుకున్న సంగతి చూసిందే…శ్రీశైలం ప్రాజెక్టును చూపించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రాజెక్టులంటూ ప్రచారం చేసుకున్నారు…సాక్ష్యాత్తు ప్రధాని మోడీ కూడా తెలంగాణలో మిషన్ కాకతీయ మూలంగా మళ్లీ కళకళలాడుతున్న వరంగల్ చెరువును తామే బాగు చేశామనేలా అర్ధమొచ్చేలా చెప్పుకున్న విషయంకూడా విధితమే…ఇలా ఏడాది పొడవునా అన్నీ ఫేక్ వార్తలు సృషించి, ఎన్నికల నాడు విచ్చలవడిగా వాటిని వాడుకోవడం బిజేపికి అలవాటైనట్లుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో ఏంచెప్పాలో అర్ధం కాక, అబ్రకదబ్ర విద్యలు ప్రదర్శిస్తూ రాజకీయం చేస్తున్నట్లుంది. మీడియాను ఎన్నికల సమయంలో తన ఇష్టాను రీతిన వాడుకుంటూ మైండ్ గేమ్ రాజకీయాలు సాగిస్తోంది. ఇది టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంటున్న మాటలే కాదు ప్రజలు కూడా చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాసుల లేమితో కొట్టుమిట్టాడుతున్నదన్న ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నిండేలా చేస్తోంది. నాయకులు, కార్యకర్తలు తమ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని, పార్టీ ప్రచారానికి దూరమయ్యే ఎత్తుగడలు బిజేపి వేస్తోంది. నాయకులు, కార్యకర్తలే ప్రచారానికి దూరమైతే, ప్రజలు కూడా ముందుకు వచ్చేందుకు వెనకాడుతారన్నది బిజేపి అంచనా…! కాంగ్రెస్‌పార్టీని డిఫెన్స్‌లో పడేస్తే తప్ప, ప్రజల ఆలోచన దోరణి మారదన్నది బిజేపి కుటిల ప్రయత్నంగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఫేక్ వార్తలు సృష్టించి టిఆర్‌ఎస్‌కు వామపక్షాలకు దూరం పెరిగినట్లు కొత్త అసత్య వార్తలు సృష్టిస్తున్నారు. గురువారం మునుగోడులో నామినేషన్ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సాగిన ర్యాలీలో మంత్రులు కేటిఆర్, జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌లతోపాటు, జీపుపై సిపిఐ, సిపింఎం నాయకులు కూడా వున్నారు. అయినా బిజేపి అబద్దాలైనా ప్రచారం చేసి గెలవాలన్న ఆలోచనతో, ఫేక్ స్టోరీలు సృష్టించి, సోషల్ మీడియా వేధికగా ఇలాంటి అబద్దాలను నమ్ముకొని ప్రచారం చేస్తోంది. ఎన్నికల వేళ గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యమనుకునే రాజకీయాలు నడుస్తున్న రోజులు. అసలు రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేసినట్లు? అన్నదానిపై జరగాల్సిన చర్చను పక్కదారి పట్టించి, ఉప ఎన్నిక తెచ్చి తన బలం పెంచుకోవడం కోసం బిజేపి వేసిన ఎత్తులను ప్రజలు బాగానే గమనిస్తున్నారు. మూడేళ్ల కిందట రాజగోపాల్ ఏం మాట్లాడాడు?
ఏం చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాడు? అన్నది ఓసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడు నియోజవర్గంలోని చండూరు మండల అభివృద్ధి కోసం ఇచ్చిన ఎన్నికల హామీలను ఓసారి పరిశీలిద్దాం…గట్టుప్పల్‌ను ప్రత్యేకంగా మండలం చేయిస్తానన్నాడు. కాని నాలుగేళ్లలో ఆయన చేసిన పోరాటం లేదు. ఉద్యమం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది లేదు. కాని ప్రజలు చేసిన ఉద్యమం మూలంగా ప్రభుత్వం ఇటీవల ఆ మండలాన్ని ప్రకటించింది. ప్రజల కోరిక నెరవేర్చింది. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు కూడా రాజగోపాల్‌రెడ్డి వెనుకాడడం లేదు. ఇక చండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, నిర్మాణం, మోడల్ స్కూలు నిర్మాణం అన్నాడు. కాని అదీ చేయలేదు. చండూరు మండలంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయిస్తానన్నాడు. కాని ఆ వైపు అడుగులు వేయలేదు. ప్రభుత్వం దృష్టికి తేలేదు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీని ఎప్పుడో మర్చిపోయాడు…వ్యాపారాలు మాత్రం పెంచకుంటూ వెళ్లాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెండలమ్మ చెరువు మరమ్మత్తులుపూర్తి చేయించి, గొల్ల గూడెం, పుల్లం, బంగారిగడ్డ, తాస్కాని గూడేలంకు సాగునీరు అందిస్తానన్నాడు. కాని వాటి కోసం ప్రభుత్వాన్ని కలిసింది లేదు. వాటి గురించి కొట్లాడిరదిలేదు. ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టింది లేదు. వెంకన్న గూడెం నుంచి కొండా పురం వరకు ఫీడర్ చానల్ పూర్తి చేసి, కొండాపురం, పుల్లం, బోడంగిపర్తి గ్రామాలకు సాగునీరందిస్తానన్నాడు. శభిలేటి వాగునుంచి కస్తాల చెరువులోకి ఫీడర్ చానల్ ద్వారా నీరు అందేలా చూస్తానాన్నాడు. గెలిచి తానిచ్చన హమీలు రాజగోపాల్‌రెడ్డి విస్మరించాడు. పనులు గాలికి వదిలేశాడు. ప్రతిపాదనలు ఏనాడు సిద్దం చేసింది లేదు. కనీసం అధికారుల దృష్టికైనా తీసుకెళ్లలేదు. ప్రభుత్వానికి విన్నవించింది లేదు. ఎన్నికల సమయంలో ప్రజలు తాను ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందు వుంచింది లేదు. తన వ్యాపార సామ్రాజ్య వి స్తరణ కోసం మాత్రం పనిచేసుకుంటూ వెళ్లాడన్నది చుండూరు ప్రజల మనోగతం. ఇదిలా వుంటే కొత్తగా ఏర్పాటైన చుండూరు మున్సిపాలిటీని సుందరీకరణ చేస్తానంటూ చెప్పిన మాటలు కూడా ఆయన నిలబెట్టుకోలేదు. చండూరు నుంచి తమ్ముల పల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిపిస్తానన్నారు. కాని అది దిక్కులేదు.దేవుడి మీద కూడా ప్రేమ లేదు. పుల్లెమల నుంచి బోడంగిపర్తి, పుల్లెంనుంచి తస్యానిగూడెం, బోరంగి పర్తి, నుంచి శిర్ధేపల్లి, దోని పాముల నుంచి జోగి గూడెం, అక్కడినుంచి తిమ్మారెడ్డి గూడెం, నెర్మట నుంచి శేరి గూడెం వరకు, ఉడుతల పల్లి నుంచి దుబ్బ గూడెం, రెగట్టే వరకు రోడ్డు నిర్మానం చేస్తానాన్నాడు. అంతే కాకుండా కస్తాల నుంచి, చొప్పది గూడెం, పోచంపల్లి వరకు కూడా రోడ్డు నిర్మాణం చుండూరు మండలానికి రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన హామీలు. సొంత నిధులు వెచ్చించైనా పూర్తి చేస్తానని చెప్పిన మాట. ఈ హమీలలో కొన్ని తాను సొంత నిధులతో చేపడతానని కూడా రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో పనులు చేసే బాద్యత నాది…ఇదీ నా విజన్ అని చెప్పి చేతులెత్తేసిన ఘనత రాజగోపాల్‌రెడ్డిది. అచ్చం నిజామాబాద్ ఎంపి అరవింద్ కూడా పసుపు బోర్డు ఏర్పాటు గురించి ప్రజలకు బాండ్‌పేపర్ రాసిచ్చినట్లే ఇక్కడ కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు తన సొంత నిధులతో మునుగోడు అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేశారు. ప్రజలచేత ఓట్లేయించుకున్నాడు. గెలిచాడు. ఇప్పుడు తన వల్ల కావడం లేదని, ప్రభుత్వం సహకరించడం లేదన్న అపవాదును టిఆర్‌ఎస్ మీదకు తోసేసి, 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బిజేపిలో చేరాడు…స్యయంగా ఆయన కూడా ఇటీవల చెప్పుకున్న మాట…ఆయనతోపాటు ప్రజలు చెప్పుకుంటున్న మాట…ఛీ…ఛీ అంటున్న మాట!మునుగోడు ప్రజలను నమ్మించి, బుట్టలో వేసుకొని 2018 ఎన్నికల్లో గెలిచి, కారు జోరులోనూ, బలంగా వీచిన టిఆర్‌ఎస్ గాలిని తట్టుకొని గెలుస్తూ వస్తున్నానని చెప్పాడు. తాను బలమైన నాయకుడినని నమ్మించాడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో డిల్లీ పరిచయాలను ఆసరా చేసుకొని బిజేపికి అనుకూలమైపోయాడు. మూడేళ్లుగా బిజేపి వైపు చూస్తున్నాడు. కాంట్రాక్టు ఓకే అయితే గోడ దుంకేందుకు సిద్ధమన్నాడు…అన్నీ కుదిరాయి…కాంట్రాక్టు సొంతమై బిజేపిలో చేరాడన్నది కంటి ముందు కనిపిస్తున్న నిజం. దాంతో మునుగోడు అభివృద్ధి పట్టించుకోలేదు. కాని ప్రభుత్వం సహకరించలేదు. అన్న మాట చెప్పి ప్రజలను మరోసారి ఏమార్చేందుకు, నమ్మించేందుకు, వంచించేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాడు. కాని మరి ఇప్పుడు గెలిచి ఏం చేస్తానన్న మాట మాత్రం రాజగోపాల్‌రెడ్డి చెప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిజేపి అన్న ఒక్క మాట తప్ప మరో మాట చెప్పుకోవడానికి ఏమీ లేదు…ఇదేనా ప్రచారమంటే..ఇంతేనా ఎన్నికలంటే…తాను గెలిచేందుకేనా రాజకీయాలంటే అని ప్రజలు నిలదీస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిని కడిగేస్తున్నారు. తాజాగా ఓ గ్రామ ప్రజలు రాజగోపాల్ రెడ్డి రావొద్దని నినాదాలు చేసిన వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారంలో వున్నాయి.