`రెడ్డి వర్సెస్ కాపు?
`ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాపులు?
`కంటగింపుగా మారుతున్న రాజకీయాలు?
`రెడ్డి నేతలంతా ఏకమౌతున్నారు?
`కాపులకు ఎదగకుండా రచన చేస్తున్నారు?
`పథకం ప్రకారం రెడ్డి నేతల చేరికలు కొనసాగిస్తున్నారు?
`బిసి.సామాజిక వర్గాలను దూరం పెడుతున్నారు?
`బిజేపిని వీడుతున్న వారంతా బిసి లే?
`చేరుతున్న వారిలో ఎక్కువ రెడ్డి లే?
`సంజయ్ ఆధిపత్యానికి అడ్డకట్ట కోసమే?
`బిసిలు బలపడితే రెడ్డిల ఆధిపత్యానికి గండే?
`ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యత తగ్గుతోంది?
`రెడ్డి లంతా ఏకమైతే బలం, బలగం వారిదే?
`ఎన్నికలు సమీపిస్తున్న వేళ బండిని తగ్గించాల్సిందే?
`బండిని తప్పించేలా ఎదిగితే ఇంకా మంచిదే?
`అంతర్గత పోరు…తెరమీద కొట్లాట షురూ!
`జిల్లాలోనూ రెడ్డిలకే ప్రధాన్యం?
`ఆది నుంచి వారిదే పెత్తనం?
`కాపులు కాపుకాసేనా? రెడ్డిల కింద నలిగిపోయేనా!?
హైదరబాద్,నేటిధాత్రి:
అగ్రకులాలు ఆధిపత్యం ముసుగులో బలహీన వర్గాలకు సానుభూతి తప్ప ప్రోత్సాహం లేదు. మాటల మాటున దాగి వున్న ఆదరణ, చేతల్లో వుండదు. ఏ రాజకీయ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లే బిజేపిలో కూడా బలహీన వర్గాల నేతలపై ఎప్పటికప్పుడు పెత్తనం చేసేందుకు, వారిని ఎదగకుండా చూసేందుకు, అణచివేసే రాజకీయాలే కనిపిస్తున్నాయి. దేశంలో బీసినేత నరేంద్ర మోడీ నాయకత్వం అని గొప్పలు చెప్పుకుంటూ, రాష్ట్రంలో మాత్రం బడుగు నేతలకు ప్రాధాన్యమివ్వడం లేదు. నిజానికి బిజేపికి ఉన్నత వర్గాల నాయకులు నాయకత్వం వహించిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా బిజేపి ముందుకు పడలేదు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బి టీమ్‌గా వుండేందుకే ఓ పెద్ద నాయకుడు బిజేపిని ఎదగనీయలేదన్న ఆరోపణలు అనేకం వున్నాయి. అయన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత సామాజకవర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఒకనాడు ఎన్టీఆర్‌కు, తర్వాత చంద్రబాబు నాయుడుకు సహకారం అందించే రాజకీయం చేశారే గాని, బిజేపి బలపడేందుకు ఏనాడు కృషి చేయలేదన్న విమర్శ వుంది. అంతే కాదు ఆ నేత జాతీయ స్ధాయి పార్టీ పగ్గాలు చేపట్టినా దక్షిణాదిన పార్టీ ఎదుగులలో ఒక్కఅడుగు కూడా ముందుకు పడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్ధితి కొనసాగింది. అయితే జాతీయ స్ధాయిలోనూ ఓ దళిత నేత బిజేపి పార్టీ పగ్గాలు చేపట్టి, పార్టీని పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెహల్కా డాట్.కామ్ పేరుతో కేసుల్లో ఇరుక్కున్నారు. ఆనాడు కూడా సొంత పార్టీ నేతలే అన్యాయం చేశారన్న అపవాదు వుండనే వుంది. దళిత నేత కావడం వల్లనే ఆనాడు ఆ నాయకుడు ఎదిగితే పార్టీలో ఆయన ఆధిపత్యం కింద పనిచేయలేని అగ్రకులాల కుట్ర రాజకీయమే ఆ నేత పతనానికి కారణం అన్న విమర్శలు అనేకం వున్నాయి. ఆ తర్వాత బిజేపి ఆ పార్టీనేతను పట్టించుకోకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురై, మరణించారన్న వార్తలు అందరూ విన్నవే. ఏది ఏమైనా బిజేపి కూడా అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే అగ్ర కులాల పెత్తనం చట్రంలో ఇరుకున్నదని చెప్పడానికి అనేక సందర్భాలున్నాయి. ఇక తాజాగా రాష్ట్రంలోనూ బిజేపిలో అగ్రకుల పెత్తనం సాగేందుకు అనేక కుట్రలు సాగుతున్నాయన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అగ్ర కుల పెత్తనమే సాగుతూ వచ్చింది. అయినా వారి నాయకత్వంలో పార్టీ ఎదిగినట్లు చరిత్ర లేదు. కాని బండారు దత్రాత్రేయ లాంటి నాయకుడు అధ్యక్షుడు వున్నప్పుడు పార్టీ కొంత పటిష్టంగా మారింది. ఇక లక్ష్మణ్ అధ్యక్షుడుగా వున్న సమయంలోనూ ఆయనకు కూడా పెద్దగా ఎవరూ సహకరించలేదు. ఆయనను కూడా అనేకసార్లు దింపేసే కుట్ర చేశారు. కాకపోతే కాలం అనుకూలంగా లేదన్న కారణంలో బిజేపి పగ్గాలు నిర్వహించేందుకు కొంత కాలం ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో బిజేపి కొంత బలపడిరదన్న సంకేతాలు వున్నాయి. నాయకుల్లో కూడ నమ్మకాలు పెరిగాయి. దాంతో మళ్లీ కథ మొదటికి తీసుకురావాలని చూస్తున్నారు. బిసి నాయకత్వాన్ని ఎలా అణచివేయాలా అన్నది రచిస్తున్నారు.
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా, బండి సంజయ్ వచ్చిన తర్వాతే బిజేపికి తెలంగాణలో జవసత్వాలు వచ్చాయి.
పార్టీ బలం పెరిగింది. గతంలో కనీసం కార్పోరేటర్లుగా పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్ధితి నుంచి పెద్దఎత్తున పోటీ పెరిగేదాకా బిజేపి ఎదిగిందంటే కారణం బండి సంజయ్. ఒక రకంగా బండి సంజయ్ చేసే రాజకీయ విన్యాసం, మాట కారి తనం, తిమ్మిని బమ్మిని చేయగలిగే నేర్పరితనం బిజేపిలో ఏ ఒక్క నాయకుడి దగ్గరలేదు. ఇది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎందుకంటే ఎవరైతే పెత్తనం కోసం ఆరాటపడుతున్నారో, అంతర్లీనంగా పోరాటం చేస్తున్నారో, అధిష్టానం వద్ద పలుకుబడిని ఉపయోగించాలని చూస్తున్నారో వారెవరికీ ప్రజల్లో గుర్తింపు లేదు. నాయకత్వంలో జోష్ లేదు. ప్రజలను ఆకట్టుకునేంత మాట కారి తనం లేదు. సానుభూతిని సంపాదించే డైలాగ్‌లు కొట్టే నేర్పరితనం లేదు. ఈ విషయంలో బండి సంజయ్ అందరికన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడని చెప్పొచ్చు. కొన్ని సార్లు పార్టీని బండి సంజయ్ వ్యాఖ్యలు ఇరుకున పెట్టే పరిస్ధితులు సృష్టించినా, ఏదైనా నెగిటివ్ అవుతుందని అనుకునే ప్రతి పని ఆయనకు పాజివివ్‌గా మారుతుండడంతో, అగ్ర కుల నాయకులకు మింగుడు పడడం లేదన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. నిజానికి బండి సంజయ్ చేసే వ్యాఖ్యలన్నీ వివాదాస్పమౌతుండడం పెద్ద విచిత్రం. అవే మళ్లీ కొంతకాలానికి బండికి అనుకూలమైపోవడం, ఆయన నాయకత్వం మరింత బలపడడం చూస్తూనే వున్నాయి.
ఇలా ప్రతీ సందర్భం బండి సంజయ్‌కు అనుకూలంగా మారుతుండడం కూడా అగ్ర కుల నేతలకు మింగుడు పడడం లేదు.
గతంలో కల్వకుంట్ల కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక బండి సంజయ్‌ను ఇరుకున పెట్టొచ్చు అని అందరూ అనుకున్నారు. పైగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ అధ్యక్షుడి మార్పు ఖాయమన్న ప్రచారం సాగించి, బండిని సాగనంపాలన్న కలలు బాగానే కన్నారు. కాని వారి కలలు నెరవేరడం లేదు. గతంలో ఓసారి బిజేపి జాతీయ స్ధాయి సమావేశాల ముగింపు తర్వాత జరిగిన భహిరంగ సభలో బండి సంజయ్‌ను ప్రధాని నరేంద్రమోడీ మెచ్చుకోవడం ఒక రకంగా అగ్ర కుల నేతల్లో కలవరానికి కారణమైంది. ఇక ఇటీవల పదోతరగతి పరీక్ష పేపర్ లీకేజీ కేసు బండి మెడకు బాగానే చుట్టుకున్నన్నదని సంబరపడ్డ అగ్ర కుల నేతలకు మరోసారి షాక్ అయ్యింది. అది కూడా జాతీయ స్ధాయి నేతలు బండికి పూర్తి స్ధాయి మద్దతు లభించడంతో అగ్రకుల సామాజిక వర్గ నేతలు దిక్కు తోచని స్దితిలో వున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఆగుతాయని ఎవరూ అనుకోవడం లేదు. బిజేపిలో గత కొంత కాలంగా చేరుతున్న నేతల పరపంరను బాగా పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువగా క్యూ కడుతున్నారు. బిజేపిలో చేరిన బిసినేతలు అనేకం వెనక్కి వచ్చేశారు. అంటే బిజేపి రాష్ట్ర అధ్యక్షుడుగా బిసి నాయకుడు వున్నప్పటికీ బిసి నేతలను కాపాడుకునే పరిస్దితి లేకుండాపోతోందన్న ఆందోళన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు బండి సంజయ్ తన పదవి కాపాడుకోవడంతోపాటు, పార్టీ పటిష్టం కోసం చేస్తున్న ప్రయాత్నాలను కూడా ఇరుకున పడేలా చేస్తున్నది కూడా బిజేపిలో వున్న పెద్దలే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు బిజేపిలో బిసిల నేతల మనుగడ, ఎదుగుదల ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు.