
హన్మకొండ:నేటిధాత్రి
జిడబ్ల్యూఎంసి లో జరిగిన అవినీతికి భాద్యులు ఎవరు అని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. శనివారం 31 వ డివిజన్ , హంటర్ రోడ్డు జేపీనగర్ లో అవినీతి తిమింగాలన్ని శిక్షించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ బల్దియాపై అవినీతి ఆరోపణలు నిత్య కృత్యంగా మారాయి. ఇందుగలడు అందులేడందువా అన్నట్లుగా అన్ని విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతున్నదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయన్నారు. కేవలం కొంతమంది అధికారుల చేతివాటంతో పాలనా వ్యవహారాలు గాడి తప్పుతున్నాయని అధికారుల అక్రమాలతో సామాన్య ప్రజానీకం కష్టనష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, ప్రజారోగ్య విభాగాలకు చెందిన కొందరు అధికారులు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు బల్దియా కార్యాలయంలోనే దుమ్మెత్తిపోసిన ఘటనలు చాలా ఉన్నాయన్నారు. బల్దియా అధికారులు కొంతమంది భూ ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బల్దియాలో అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారులు ఏసీబీకి అడ్డంగా దొరికిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అయినా బల్దియా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని విమర్శిస్తున్నారు. గతంలో ఇంటి నంబర్ కేటాయింపు విషయంలో ఆర్,ఐ తో పాటు ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. బల్దియా ఎన్ని అక్రమాలు జరుగుతున్న పట్టిచుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమైయ్యారని అన్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంగా కోట్లల్లో వసూలు చేసి ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు గమనించాలని అన్నారు. బల్దియా లో 2 కోట్లా 31 లక్షల అవినీతి చేసినా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అన్వేష్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అలాగే అన్వేష్ వెనకాల ఉన్న చేతులను కూడా వెలికితీసి భవిష్యత్తు లో మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అలకుంట్ల యకయ్య, దూడపాక రాజేందర్, నోముల కిషోర్, కంచర్ల కుమరస్వామి, అలకుంట్ల యకయ్య, పల్లకొండ శ్రీకాంత్, చేరిపెళ్లి కుమరస్వామి, రాజు, భారతి, స్రవంతి, నవ్య తదితరులు పాల్గొన్నారు.