ఆఖరుకు అద్దంకే అడ్డంకా!?
శ్రవణ్ ను సాగనంపి సాధించిందేమిటి?
రేవంత్ తో చెడి శ్రవణ్ దూరం!
కోమటి రెడ్డి కోపానికి అద్దంకి బలి?
ఏ పార్టీ లోనూ చెల్లుబాటు కాని బడుగుల మాట
అద్దంకి క్షమాపణ చెప్పినా వదిలేయరా?
రేవంత్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి లేడా?
అలా అయితే జగ్గారెడ్డి మీద ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలి?
ఇప్పటికీ వెనక్కి తగ్గని జగ్గారెడ్డి?
అద్దంకి అంటే అంత అలుసైపోయాడా?
నల్గొండ ఏమైనా గుత్తకు తీసుకున్నారా?
దేశంలో 75 వసంతాల స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ…కాంగ్రెస్‌లో బడుగులకు నోరు లేకుండా చేస్తున్నారు…పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమనే మాటలు కేవలం ఉన్నత వర్గాల నేతలకే అని రుజువు చేస్తున్నారు? బడుగులకు మాట్లాడితే చాలు వారి నోరు ఎలా మూయించాలో అన్నది వెంటనే నిర్ణయం తీసుకుంటున్నారు? పేదవాడి కోపం పెదవి చేటు అని పూర్వ కాలం నుంచి అంటున్నదే…చెప్పుకుంటున్నా…ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిజం చేస్తున్నారు. అంతే కాదు అసలు బడుగు నేతలు మాట్లాకుండా నోరు నొక్కేస్తున్నారు. నోరు కుక్కెస్తున్నారు…ఒక రకంగా చెప్పాలంటే కుట్టేస్తున్నారు. నోరు దాటి మాటలు రాకుండా చేస్తున్నారు. నాలుకను మడతపెడుతున్నారు. మారు మాట మాట్లాడకుండా చేస్తున్నారు. ఒక వేళ పెదవి దాటి పెద్ద మాట మాట్లాడితే చాలు…పార్టీలో కూడా వుండకుండా చేస్తున్నారు. రాజకీయాలు చేయకుండా చేస్తున్నారు? పార్టీలో కొనసాగకుండా సస్పెండ్ చేసేదాక ఉన్నత వర్గాల నేతలు బీష్మించుకు కూర్చుకుంటున్నారు. ఇంతకీ అద్దంకి చేసిన తప్పేమిటి? ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పార్టీ లైన్లోనే ఆయన మాట్లాడాడు. పార్టీకి నష్టం జరగొద్దనే చెప్పాడు. కాకపోతే దాన్ని కొంత కటువుగా చెప్పాడు. ఆయన వాడిన పదం ఎన్నడూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాడందా? రేవంత్ రెడ్డి మాట్లాడందా? తెలంగాణలో ఆ పదం అందరూ మాట్లాడేదే? కాకపోతే భహిరంగంగా అందరూ బుద్దిమంతులే..!
చండూరు సభలో ప్రజలను చూసిన సంబరమో! పార్టీగకి ప్రజాభినం తగ్గలేదన్న ధైర్యమో! కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీకి దూరమైనా ప్రజల్లో పార్టీకి ప్రజాదరణ తగ్గలేదన్న సంతోషమో గాని అద్దంకి పరిధి దాటే మాట్లాడాడు? అనుకుందాం? కాని ఆయన ఒకటికి నాలుగు సార్లు క్షమాపణ చెప్పాడు. అదంతా మీడియాలో కనిపిస్తున్నదే…! అద్దంకి చెప్పే క్షమాపణలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ కనిపించడం లేదట! ఇది మరీ విచిత్రంగా వుంది. మొగుడు కొట్టిందానికి కాదు గాని, తోడి కోడలు నవ్వినందుకు ఎక్కువ బాధపడిరదని ఓ సామెత. అచ్చం కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ కూడా అలాగే వుంది. వెంకటరెడ్డి దృష్టిలో అద్దంకి దయాకర్ చాలా చిన్న నాయకుడే…! ఆ అద్దంకి మీద అంత గద్దింపు అవసరమా? అద్దంకి దయాకర్ ఇప్పటికే పదే పదే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా అంత కక్షెందుకు? ఆయనను సస్పెండ్ చేయించాలన్న పట్టుదల ఎందుకు? పెద్ద మనసు చేసుకొని క్షమించొచ్చు కదా? మరి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో పట్టీపట్టనట్లు మాట్లాడడం కూడా బడుగులకు అన్యాయం చేయడానికి ఆ సామాజిక వర్గమంతా ఎప్పుడూ సిద్దంగానే వుంటుందన్న పరోక్ష సంకేతాలు పంపడం కాదా? నిన్నటి దాకా పార్టీలో రేవంత్‌ను సీనియర్లంతా తూర్పారపడుతున్నా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన నేతల్లో అద్దంకి దయాకర్ ఒకరు. ఆయన మొదటినుంచి రేవంత్‌కు అనుకూలంగానే వున్నారు. ఆ అనుకూలంలోనే రేవంత్ నాయకత్వాన్ని సవాలు చేసిన వారి గురించి ఓ మాట పరుశంగా మాట్లాడాడు. అది కూడా తప్పేనా? నిజానికి ఇంత కాలం రేవంత్ అండ చూసుకొనే అద్దంకి దయాకర్ స్వేచ్ఛగా మాట్లాడగులుతున్నాడన్న ఆలోచన అందరిలోనూ వుంది. మరి అలాంటి అద్దంకి దయాకర్‌ను రేవంత్‌కాపాడుకుంటాడా? లేక పార్టీలో అద్దంకే అడ్డంకి అన్నట్లు వ్యహరిస్తాడా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిత్యం రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నేతల కోసం పార్టీలో అండగా వున్న అద్దంకి దయాకర్‌ను దూరం చేసుకొని, రెడ్డి, రెడ్డి ఒకటే అన్న సందేశం పంపుతారా? అన్నది కూడా తెలియాల్సివుంది.
ఇప్పటికే దాసోజు శ్రవణ్ పార్టీ విడిచి వెళ్లిపోయాడు. సరే ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీని వదిలాడనేది ఓ ప్రచారం. కాదు…లెక్కల్లో తేడాలే దాసోజును బైటకు పంపే పొగ పెట్టేలా చేసిందనేది మరో వివాదం..! రేవంత్‌కు అండగా వున్న నేతల్లో దాసోజు శ్రవణ్ కూడా ఒకరు. పార్టీలో సీనియర్లంతా రేవంత్‌ను గుక్కతిప్పుకోండా చేస్తున్న సమయంలోనూ అండగా నిలిచిన నేతల్లో దాసోజు కూడా వున్నాడు. పార్టీ పరమైన విషయాల్లో చాలా వరకు రేవంత్‌రెడ్డికి చేదోడువాదోడుగా దాసోజు వున్నాడనేది కూడా నిజం. కాకపోతే పార్టీని అడ్డంపెట్టుకొని రేవంత్ ఎంచుకున్న కొన్ని ప్రైవేటు అంశాలే దాసోజును బైటకు వేళ్లేలా చేశాయన్న ప్రచారం పార్టీలో కూడా బాగానే జరుగుతోంది. రియలెస్టేట్ విషయాలేవైనా ముందు దాసోజుతో రేవంత్‌రెడ్డి ఓ మూడు నాలుగు రోజులు ప్రస్తావించేలా చేసేవాడు? తర్వాత నేరుగా రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగేవాడు? ఆ విషయంలో కొంత కాలం సఖ్యత బాగానే సాగినట్లుంది? కాకపోతే జూబ్లీహిల్స్‌లో రెడ్ ఫోర్టు అక్భర్ చెందిన స్ధలం విషయంలోనే ఇద్దరికీ మధ్య చెడిరదనేది ఓ వాదన. పైకి ఎంతో మాట్లాడగలిగే దాసోజు ఈ విషయంలో అసలు విషయం చెప్పలేక కూడా నోరు కట్టేసుకున్నాడనేది కూడా చెప్పుకుంటున్నారు. గుట్ట, గుడి వివాదంలో దాసోజు వెలుగులోకి తెచ్చిన తర్వాత రేవంత్ రంగంలోకి దిగారు. అక్కడ జరిగిన లావాదేవీల్లో దాసోజుకు మొండి చేయి మిగిలిందని తెలుస్తోంది? అప్పటినుంచి ఆయనను రేవంత్ దూరం పెడుతూ వచ్చాడన్నది కూడా చర్చలో వున్న మాట? అంటే రేవంత్ చెప్పిందల్లా? మాట్లాడడానికి పనికొచ్చిన దాసోజు వాటా కోరుకోవడం తప్పైపోయిందా? బైట వారి మీద పనికొచ్చే వాయిస్ రేవంత్ ముందు మాట్లాడడానికి పనికిరాకుండాపోయిందా? దాసోజు వెళ్తుంటే ఎందుకు ఆపలేపోయారు? గతంలో ఎమ్మెల్యేలు వెళ్తుంటే ఆపలేకపోయారని మాట్లాడిన వారు దాసోజు వెళ్తుంటే ఎందుకు సంప్రదింపులు జరపలేదు. అంటే ఆయన అవసరం పార్టీకి చాలైందా? ఉద్యమకారుడైన దాసోజును కాదని పార్టీలోకి కొత్తవారిని తెచ్చి ఆయనకు పొగ పెట్టడం కరక్టేనా? నిజానికి రేవంత్‌కన్నా ముందు నుంచి పార్టీకోసం నోరేసుకొని ఎంతో పనిచేసిన నాయకుడు దాసోజు. కాని ఆయన మాటే చివరికి ఆయనకు పనికి రాకుండాపోయింది? ఆయన రాజకీయానికి అడ్డంకిగా మారింది? ఇదేనా కాంగ్రెస్ పార్టీలో బడుగులకు వున్న విలువ అన్నది తేల్చాల్సింది ఎవరు?
తాజాగా చెరుకు సుధాకర్ కూడా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చెరుకు సుధాకర్ కూడా స్పందించారు. చెరుకు సధాకర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన తెలంగాణ ఇంటిపార్టీని కూడ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో పిడి. యాక్టు కింద అరెస్టైన ఏకైక నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన నాయకుడు చెరుకు సుధాకర్. ఆయన కూడా మునుగోడు టిక్కెట్టు ఆశిస్తున్నాడు. ఇటీవల పార్టీ కూడా ఆయనతో చర్చించింది. కాకపోతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయనపై చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో కలకలం సృషించాయి. దాంతో తాను రాజకీయాలు మొదలుపెట్టిన నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగులు కూడా వేసుకోలేదని చెరుకు సుధాకర్ చురకలంటించారు. ఇలా బడుగుల నేతలను ఎక్కడికక్కడ నోరు మూయించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో విజయవంతంగా కొనసాగుతోందని కూడా చెప్చొచ్చు. ఇదిలా వుంటే నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు ఎంత మంది గౌడ సామాజిక వర్గ నాయకుల రాజకీయ జీవితాలతో ఆడుకున్నారో వివరాలు కూడా వెల్లడిస్తూ పెద్ద ఎత్తున వారిపై విసృత ప్రచారం సాగుతోంది. బాధితుల పేర్లతో సహా మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి వ్యతిరేకులు బాగానే ప్రచారం చేస్తున్నారు.
ఎక్కడ అద్దంకి దయాకర్ తన డిమాండ్లను ముందు పెడతాడో అన్న అనుమానంతో ముందే మల్లు రవి, బెల్లయ్య నాయక్ లాంటి వారిని పంపి, పార్టీ ఒక వేళ క్రమశిక్షణా చర్యలు చేపట్టినా కొంత సంయమనంతో వుండాలని సూచించడమేనా? బడుగులకు మాటకు వున్న విలువ. అద్దంకి దయాకర్ తెలంగాణ వచ్చాక, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తూ, ఏకంగా ఓ సినిమా కూడా నిర్మాణం చేస్తున్నాడు. పార్టీకోసం శ్రమిస్తున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు. ఉమ్మడి రాష్ట్రంలోనే మాల మహానాడు అధ్యక్షుడుగా పనిచేసిన నాయకుడు. గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోకవర్గం నుంచి విజయం ముద్దాడేదాకా వెళ్లి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన నాయకుడు. ఒక దశలో అద్దంకి దయాకర్ గెలిచాడన్న వార్తలు కూడా వచ్చిన సందర్భం. అలాంటి నేతను దూరం చేసుకోవడం కూడా పెద్ద పని కాదని కాంగ్రెస్ నిరూపించుకుంటుందా? ఇప్పటికే వి. హనుమంత రావు లాంటి సీనియర్ నాయకుడి మాటకూడా కొంత కాలంగా మూగబోయినట్లే కనిపిస్తోంది. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లాంటి వారి మాట కూడా పెద్దగా ఎక్కడా వినిపించకుండాపోతోంది. అంటే పార్టీలో నోరేసుకుంటే ఉన్నత సామాజిక వర్గ నేతలు ఎంత మాట్లాడినా తప్పుకాదు. వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు వుండవు. ఆ దిశగా ఆపార్టీ ఆలోచన కూడా చేయదు. పార్టీలైన్ పరిధి దాటి మాట్లాడే ఉన్నత సామాజిక వర్గ నేతలకు అన్నీ మినహాయింపులే కాని, బడుగులకే సన్నాయి నొక్కులా? మాటలకు పరిధులా? నోరు మూసేయడాలా? ఇంకెన్ని రోజులు ఉతన్నతవర్గాల ఆధిపత్యం. ఓట్లు బగుడులవి…సీట్లు ఉన్నత వర్గాలవి…? ప్రశ్నించేవారి బడుగులు బైటకు…ఉన్నతవార్గలే పాలకులు…ఇదేనా నీతి…ఇంకా ఎంతకాలమీ దుర్నీతి!?