-సొంత పార్టీలో రగులుతున్న కుంపటి?
– సీనియర్లలంటే లెక్కేలేదండి?
-బండితో నలుగుతున్న పువ్వు?
– వచ్చిన అవకాశం సద్వినియోగంలో బండి ఫెయిల్?
– ఒంటెద్దు పోకడలతో తంటాలు?
– ఆది నుంచీ బండిమీద విమర్శలే?
-నోటి దురుసు వ్యాఖ్యలు… పసలేని వాదనలు?
– ప్రతిసారీ జైలు సిద్ధమంటూ వ్యాఖ్యానాలు?
– బండి వ్యాఖ్యలతో ఇతర వర్గాలు దూరం?
– సీనియర్లు అసంతృప్తికి ఇదొక కారణం?
– సీనియర్లంటే లెక్కలేని తనం?
– సీనియర్లను పక్కన పెట్టేంత పెత్తనం?
-జిల్లా నాయకుల నియామకాలలో సీనియర్లకు సంకటం?
-బండి దూకుడు బిఆర్‌ఎస్ కు వరం?
-తొలగిపోతున్న బండి మబ్బులు?
హైదరాబాద్,నేటిధాత్రి:
కొండ అద్దమందు కొంచెమై వుండదా? అని పెద్దలెందుకన్నారో…బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ను చూస్తే అదే అనిపిస్తుందని బిజేపి నేతలే అంటున్నారు. రాజకీయాల్లో కొన్ని అవకాశాలు కొందరికి ఎందుకు వస్తాయో తెలియదు? అనుకోని అవకాశాలు చాలా విచిత్రంగా వస్తాయి. అలా వచ్చిన అవకాశాలను చాలా పదిలంగా వాడుకొని, పైకొచ్చినవారు చాల మందే వున్నారు. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకొని, కలిసొచ్చిన రాజకీయం జీవితం మళ్లీ మొదటికి తెచ్చుకున్నవాళ్లు కూడా చాలా మందే వున్నారు. అలాంటి కోవకే బండి సంజయ్ వస్తాడా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి బండి సంజయ్ కిందిస్ధాయి నుంచి ఎదిగిన నేత. అంత వరకు ఓకే…కాని ఆయనకు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. కార్పోరేటర్‌గా వున్న బండిసంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసొచ్చింది. కాని గెలవలేదు. అలా గెలవకపోవడం కూడా బండికి వరంగా మారింది. అదృష్టం కలిసొచ్చింది. ఆ క్షణం పడిన బాధకు మంచి, రెట్టించిన సంతోషం దక్కింది. ఎంపి పదవి వరించింది. ప్రజల ఆశీస్సులు అందాయి. పార్టీ పెద్దలు కూడా మెచ్చారు. ఇదే సమయంలో పార్టీ బండి సంజయ్ కలలోకూడా ఊహించని పార్టీ అధ్యక్ష పదవి వచ్చి వాలింది. నిజానికి బండి సంజయ్ ఒక్కసారి ఎమ్మెల్యే కావలనుకున్నాడు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆ కల నెరవేరకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. కార్యకర్తల సమక్షంలో దుఖించాడు. ఆయనతోపాటు కార్యకర్తలు కూడ ఏడ్చారు. కట్ చేస్తే ఇదంతా డిల్లీ పెద్దల దాకా చేరింది. ఆ ఏడుపే బండికి కలిసొచ్చింది. ఆయనను ఎంపినిచేసింది. అలా ఒక్కొసారి ఓడుపు కూడా కలిసొచ్చినవాళ్లు వున్నారని చెప్పుకోవడానికి బండి సంజయ్ ఉదంతం కనిపిస్తుంది. అదేంటో వచ్చే అవకాశాలు కూడా అలా తన్నుకుంటూ వస్తాయన్నట్లు వచ్చి వాలిన అధ్యక్షపదవి చేపట్టిన కొద్ది కాలానికే బండిలో కూడా మోనోపలి పెరిగిందనేది పార్టీలో చెప్పుకుంటున్న మాట.
ఇక పార్టీ బరువు బాధ్యతలు మోయడం నా వల్ల కాదు అనుకుంటూ ఎన్నోసార్లు మెరపెట్టుకున్నా లక్ష్మణ్‌ను పార్టీ అలాగే కొనసాగించింది.
చివరికు తన ఆరోగ్యం సహకరించడంలేదని పార్టీకి నివేదించడంతో తప్పని పరిస్ధితుల్లో మాత్రమే బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఈ సమయంలో కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒక దశలో దుబ్బాక శాసనసభ్యుడు రఘునందర్ పేరు బాగా వినిపించింది. అయితే ఆయన అప్పటికే గొప్ప మాటకారి అన్న పేరు బాగా నాటుకుపోయింది. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపిగా, కనీసం ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. కాకపోతే పలుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా వుంటే అప్పుడే ఎంపిగా ఎన్నికైన నిజామాబాద్ ఎంపి. ధర్మపురి పేరు కూడా అప్పట్లో బాగానే వినిపించింది. అదేంటో పార్టీ అధ్యక్షపదవి ఎంపిక జరిగిన సమయంలో ధర్మపురి అరవింద్ దూకుడు స్వభావం వున్న నాయకుడు నాయకుడు అన్న ముద్ర బలంగా వుంది. అందువల్ల అరవింద్‌తో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు? అని అధిష్టానం ఆలోచించింది. కొంత సౌమ్యుడుగా వున్న బండి సంజయ్‌ని ఎంపిక చేస్తే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. అప్పటి నుంచి బండికి దూకుడు పెరిగింది. భ్రేకులు లేకుండా పోయాయి. ఏమాటకామాట చెప్పుకోవాలి. బండి సంజయ్ వల్లనే పార్టీ ఇప్పుడు ఈస్ధితికి చేరుకున్నది చెప్పడంలో ఎలాంటి శషభిషలు అవసరంలేదు. కాకపోతే ఆ దూకుడే మళ్లీపార్టీకి కష్టాలు తెచ్చిపెడుతోందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు బండి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా కూడా మారిందంటున్నారు.
ఇటీవల బండి దూకుడు అధికార బిఆర్‌ఎస్ మీదనే కాకుండా, సొంత పార్టీ నేతల మీద కూడా కనబర్చుతున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు.
పార్టీలో నాయకుల మధ్య కూడా పొగ పెట్టడంలో బండి సంజయ్ ఆరితేరినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఓ ఇద్దరు నేతల ఆర్ధిక సంబంధాలను ఆసరా చేసుకొని వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు కూడా బండి సంజయ్ కారణమన్న మాటలు వినిపించాయి. అత్తమీదకు కోడలును, కోడలు మీదకు అత్తను ఎగేసినట్లు ఆ ఇద్దరి నేతలకు చెప్పాల్సిందంతా చెప్పి, నూరిపోశానడి అంటుంటారు. అందుకే ఇద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఇక ప్రతి దగ్గర హిందుత్వానికి తాను ప్రతీకగా ప్రచారం చేసుకుంటే ఎవరూ అడ్డుచెప్పకపోవచ్చు. కాని బిజేపి కేవలం హిందుత్వానికి ప్రతీక అన్నంత దోరణిలో, శివం, శవం అన్నది పెద్దఎత్తున వివాదాలకు తెర తీసింది. దాంతో కొందరు నాయకులు బండి సంజయ్‌ను సూటిగానే వ్యతిరేకించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అనేక సంక్షేమ పధకాల లబ్ధిదారుల్లో అన్ని వర్గాల శ్రేణులున్నారు. వారి సంక్షేమం కోసం కూడా బిజేపి పనిచేస్తుందన్న సంకేతాలు పార్టీ పంపాల్సిన అవసరం వుంది. కాని అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు పార్టీ దూరమయ్యే ప్రమాదముందని ఆక్షేపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న పార్టీగా బిజేపి ప్రజలకు చేరువ కావాలి. కొన్ని వర్గాలకే పరిమితయ్యేలా బండి వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. సామెతలైనా వాడాల్సిన చోట వాడాలని, అన్నింటికీ అన్వయించలేమన్న సోయి లేకుండా ఒక ఎంపి ఎలా మాట్లాడతాడని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడ పెద్దతెత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దానితోపాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్‌ఎంపి. అరవింద్ ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్ లిమిట్స్ గురించి కూడా మాట్లాడాడు. ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన పవర్ పవర్‌సెంటర్ కాదన్న మాట అరవింద్ అన్నాడు. అంతే కాకుండా ఆయన కవిత విషయంలో అన్న మాటను సమర్ధించడం లేదన్నారు. ఆమాట వెనక్కి తీసుకోవాలని కూడా సూచించారు. ఇలాగే ఆయన వ్యవరిస్తే పార్టీకి నష్టమేర్పడుతుందన్న మాట కూడా అరవింద్ అన్నారు. ఇలా పార్టీలోని చాలా మంది కూడా బండికి సూచించారు.
ఇదే ఊపు మీద ఊపు పార్టీలో కూడా నిరసన స్వరాలు మరిన్ని పెరిగితే గాని బండికి ఉద్వాసన జరగదన్న నిర్ణయంలోనే చాలా మంది సీనియర్లు వున్నట్లు కూడా తెలుస్తోంది.
రాష్ట్రంలో బిజేపి కొంత బలపడిరదని చెప్పడంలో సందేహం లేదు. రెండు ఎన్నికలు గెలిచారు. ఇటీవల ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో బాగానే కార్పోరేటర్ సీట్లు సాధించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బండి సంజయ్ ఒంటెద్దుపోకడలు సీనియర్లకు ఆశని పాతంగా మారుతున్నాయి. ఒక వేళ ఎన్నికల బండిసంజయ్ నేతృత్వంలో వెళ్తే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు, పార్టీ గెలిస్తే, సీనియర్లందరినీ కాదని ఆయనకు సిఏం చేయొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఇప్పుడే బండిని నిలువరిస్తే తప్ప, ఆయన భవిష్యత్తులో ఆయనకు ఎదురు లేకుండాపోతుంది. కాని బండి నోటి దురుసు కూడా పార్టీకి తీరని నష్టం కూడా తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి క్రూయిషియల్ సమయంలో అన్ని వర్గాల నాయకులను, ప్రజలను కలుపుకుపోయే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు బిజేపిని ఆదరిస్తున్న సమయంలో బండి దూకుడు స్వభావం ఎన్నికల వేళ కష్టాలు తెచ్చిపెట్టకుండా వుండాలంటే రాష్ట్ర పార్టీ బాధ్యుడిని మార్చాలన్న డిమాండ్ బాగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా తన బలం పెంచుకోవడం కోసం సీనియర్లను, పక్కన పెట్టడాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేపోతున్నారు.