బోయినిపల్లి,నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా
బోయినిపల్లి మండలంలోని స్తంబంపల్లి, బర్గుపల్లి గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న ప్రత్తి, వరి పంటలను
జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం గురువారం
పరిశీలించారు. గత కొద్దరోజులుగా క్రితం కురిసిన అధిక వర్షాల వల్ల ప్రత్తిలో వేరు కుళ్ళు తెగుళ్ళను శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాకుండా ప్రత్తిలో ఆకుమచ్చ, రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని గుర్తించారు. ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ప్రోఫీకోనజోల్ 200 మిల్లీ లీటర్ ఎకరానికి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 600 గ్రాములు ఎకరానికి మొక్క మొదళ్ళ దగ్గర మందును పోయాలని తెలిపారు. రసం పీల్చే పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటరు లేదా ఇమిడాక్లాప్రెడ్ 0.3 మిలీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. వరిలో ప్రధానంగ వచ్చే మొగి పురుగు లక్షణాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. మొగి పురుగు నివారణకు చేపట్టవలసిన చర్యలను తెలియజేశారు. నారుమడిలో పిలక దశలో మొగి పురుగు ఆశిస్తే మొక్కలు
ఎండి చనిపోతాయని, నారు పీకే 7 రోజుల ముందు 2 గుంటల నారు మడికి 800 గ్రాముల కార్బోప్యురాన్ 3జి గులికలను చల్లి నీటిని ఆ మడిలోనే ఇంకెట్లు చేయాలన్నారు. ముదురు నాటు నాటేటప్పుడు నారు కొనలను త్రుంచి వేయాలని, నాట్లు వేసిన 10 నుండి 15 రోజులలో కార్బోప్యురాన్ 3జి గుళికలను ఏకరానికి 10 కిలోల చొప్పున లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు లేదా క్లోరాoత్రనిలిప్రోల్ 0.4 జి గుళికలు 4 కిలోల చొప్పున పిచికారి చేయాలన్నారు. వరిలో బ్యాక్టీరియా ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 లీటర్, ప్లాంటమైసిన్ 0.2 గ్రాం /లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు డా.ఇ.రజినీకాంత్, డా. ఓం ప్రకాష్, డా. బలరాం మరియు డా. లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి, శాస్త్రవేత్త డా. ఏం. రాజేంద్రప్రసాద్, రైతులు పాల్గొన్నారు.