ఘనంగా అసెంబ్లీ టైగర్ ఓంకార్ వర్ధంతి
నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలుపెంచిన నేత మద్దికాయాల ఓంకార్ అని ఎంసిపిఐ యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అన్నారు. ఎంసిపిఐ యు పార్టీ అధినేత దివంగత మాజీ ఎమ్మెల్యే ఓంకార్ 14 వ వర్ధంతి పక్షోత్సవాలలో భాగంగా శనివారం దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో తడుక కౌసల్య అధ్యక్షతన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల రూపశిల్పి,అసెంబ్లీ టైగర్ అమరజీవి మద్దికాయల ఓంకార్ తన రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్య విలువలను పెంచిన మార్క్సిస్ట్ నేతగా ఎదిగారని, రాజకీయ శిక్షణ తరగతులలో ఉపాధ్యాయునిగా బోధిస్తున్న సమయంలో భారత రాజ్యాంగ ప్రాధాన్యతను, ప్రజాస్వామ్య ప్రాధాన్యతను కార్యకర్తలకు లిఖితపూర్వకంగా నోట్ పుస్తకాలలో వ్రాయించి వివరించే వారని, తద్వారా ప్రతి కార్యకర్త తన హక్కులను విధులను గురించి అవగాహన చేసుకొని, బూర్జువా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలలో కార్యకర్తలు ప్రజలు ఓంకార్ గారికి మద్దతుగా నిలిచే వారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, గోనె సుదర్శన్ రెడ్డి, ఎలకంటి చిన్న ఎల్లయ్య, నాగేల్లి భాస్కర్, కౌసల్య, కృష్ణవేణి, దండు చిన్న సారయ్య తదితరులు పాల్గొన్నారు.