చొరవ చూపిన వినోద్ కుమార్…
ఆదరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్…
స్పందించిన మంత్రి జగదీష్‌రెడ్డి…
సమన్వయం చేయడంతో పెద్ది దోస్తీ….
అందరికీ వారధిగా నేటిధాత్రి…
అటు బాధితుల సమస్యలు….వింటూ..
ఇటు నాయకులకు వారి బాధలు తెలుపుతూ…
200 మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్న దృక్పధం…
కల సాకారం దిశగా పడుతున్న అడుగులు
నేటిధాత్రి కృషికి బాధితుల కృతజ్ఞతలు…
ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదలు….
శుభకృతితో వారికి ఇక శుభారంభం కావలని కోరుకుందాం….
ఆశ చిగురించడం అంటే ఇదే….వారిలో ఒక నమ్మకం కలగడం అంటే ఇదే…కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కకపోవచ్చు. కొన్ని సార్లు మనసులో తలుకున్నప్పుడే నెరవేరొచ్చు. దాన్ని అదృష్టమంటారో…లేక మరేమంటారో గాని సంతోషం నిండడం ముఖ్యం. కల నెరవేరడం ఆనందం. కళ్లముందు భవిష్యత్తు మళ్లీ ఆశాజనకంగా కనిపించడం అన్నది గొప్ప అనుభూతి సాక్ష్యాత్కారం. తాము వెతుకుతున్న తీగ కాలికి తగలడం అంటే నేటిధాత్రిని ఆశ్రించడమే అంటూ హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రయత్నం ఫలించింది. అది ప్రభుత్వ పెద్దలదాక వెళ్లింది. వారి పరిశీలకు నోచుకున్నది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. పాలకపక్షం పెద్దల్లోకూడా బాధితులైన హోంగార్డులకు న్యాయం చేయాలన్న ఆకాంక్ష కనిపించింది. పదేళ్లగా పడుతున్న ఇబ్బందులు కూడా మర్చిపోయేలా నేతలు స్పందించడం అన్నది కూడా బాధితులకు ఆనందాన్ని తెచ్చింది.
గత పదేళ్లుగా ఉద్యోగాలు పోయిన నాటినుంచి రోజూ తిరుగుతూనే వున్నారు. సభలు, సమావేశాలంటూ ఏదో హడావుడి చేస్తూనే వున్నారు. కాని కాలం గడుస్తున్న కొద్ది ఆశలు ఆవిరైతూ వచ్చాయి. అటు ఉద్యోగ సాధన, ఇటు కుటుంబ పోషణ. ఈ రెండూ ఏకకాలంలో చేసుకుంటూ పోతే తప్ప భవిష్యత్తు లేదు. పగలంతా కుటుంబపోషణ కోసం కూలీ, నాలీ పనులు చేసుకున్నారు. సమయం చిక్కినప్పుడల్లా మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇలా తిరుగుతూనే వున్నారు. కూలీ,నాలితో వచ్చే డబ్బులతో అటు కుటుంబానికి, ఇటు ఉద్యోగ ప్రయత్నాలకు ఖర్చు చేస్తూ బతుకులీడుతున్నారు. ఏన్నటికైనా మళ్లీ ఖాకీ దుస్తులు వేసుకోకుండాపోతామా? అన్న ఆశతోనే ఎదురుచూస్తున్నారు. అయితే వీళ్లు తమ కోర్కెల సాధనలో కూడా సమయం చాలా కోల్పోయారు. ఉద్యోగాలు తొలగించిన నాడే ప్రతిఘటించాల్సి వుండేది. కాని ఆ పని చేయలేదు. కారణం ఏదైనా! ఇంత కాలానికి వారికి ఒక దారి దొరికనట్లైంది. వారి కళ్లలో ఆనందం కనిపించే రోజులు సమీపించే మాటలు వినిపిస్తూ వస్తున్నాయి. గత వారం రోజులగా వారి జీవితాలకు కొత్త వెలుగులు వచ్చే అవకాశం కనిపిస్తోందన్న నమ్మకం వారిలో కల్గుతోంది. మీరు త్వరలో మంచి శుభవార్త వింటారు. మీరు ప్రగతిభవన్‌కు వచ్చే సమయం ఆసన్నం కావొచ్చు. మీ ఆశలు నెరవేరేమార్గం కనిపించొచ్చు. అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో వారిలో గతంలో ఎన్నడూ లేని భరోసా కనిపించింది.
నేటిధాత్రి దగ్గరకు వచ్చిన నాటినుంచి…: కాలం కలిసొస్తే చాలు…సాగాల్సిన పనులన్నీ సజావుగా సాగుతాయంటే ఇదేనేమో! గతంలో ప్రతిపక్ష పార్టీల నేతలచుట్టూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులను కలిశారు. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ కృతికి ఆ మంత్రం చెప్పాలని పెద్దలు ఊరికే అనలేదు. ఆఖరుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వద్దకు వెళ్లారు. నేటిదాత్రి అక్షరాలు ఒక దిశ, దశను మీకు చూపించే ప్రయత్నాలు చేస్తాయని వారికి చెప్పారు. కొంత కాలంగా నేటిధాత్రిని కలుస్తూ వచ్చిన హోంగార్డుల సమస్యలను విని నేటిధాత్రి చలించింది. వారికి ఏదైనా దారి దొరికేలా చూడాలని అక్షర సంకల్పం మొదలు పెట్టింది. పదేళ్ల క్రితం అన్యాయంగా ఉద్యోగాలు కోల్పోయారు. వారి తరుపున నాడు మాట్లాడిన వారు లేరు. వారికి అండగా నిలిచిన వారు లేరు. ఉద్యోగ సంఘాలు మద్దతుగా రాలేదు.
ఏం జరుగుతుందో తెలిసే లోపే వారి జీవితాలకు కొలువులు లేవు. జీతాలు రావన్న నిజం తెలుసుకున్నారు. అయితే అప్పుడప్పుడూ మళ్లీ వారి చేత బందోబస్తు లాంటి పనుల నిర్వహణ అప్పగించడంతో వారి ఆశలు సజీవమే అనుకున్నారు. కాని ఎండమావులౌతాయని అనుకోలేదు. రాను రాను ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఆ కొలువులు మావి కావన్న నిర్ణయానికి వచ్చారు. కాని అందులో కొందరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా వీలు చిక్కినప్పుడే కాదు, వీలు చేసుకొని మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్లు నేటిధాత్రిని కలవడం జరిగింది. వారి సమస్యలు అక్షరబద్దం చేసింది. నేటి ధాత్రి వారు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. మొదటిసారి నేటిదాత్రి సూచనల మేరకు నడుచుకున్నారు. ప్రభుత్వ పెద్దలను కలిశారు. వారికి వారి సమస్యలు విన్నవించారు. వారిని కూడా కదిలించగలిగారు. వారి సమస్య పరిగణలోకి తీసుకునేలా చేశారు.
నిన్నటిదాకా ఆవేదనతో కళ్లలో కన్నీళ్లు చూసిన వాళ్లు, ఆనందంతో కూడ ఆనంద బాష్పాలు చూస్తామని అనుకోలేదని చెప్పుకుంటున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్పందించడం జరిగింది. వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతో ఇప్పటికే రాష్ట్ర డిజిపికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. హోంగార్డుల సమస్యలను వెంటనే అధ్యయనం చేయాలని కోరడం జరిగింది. అదే విధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వారికి ఎంతో భరోసా కల్పించడం జరిగింది. మంచిరోజులోస్తాయని ఆయన స్వయంగా చెప్పడం కూడా జరిగింది. మరో మంత్రి జగదీష్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడతామని అన్నారు. వీరందరినీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికూడా సమన్వయం చేయడానికి ముందుకొచ్చారు. నమ్మకం అన్న మాట కూడా మనిషినే కాదు, జీవితాలను నిలబెడుతుందనడానికి ఇదే నిదర్శనం. రేపటి తరానికి ఒక సంకేతం…ఇది నేటిధాత్రి అక్షర విజయం. ఒక కదలికను తెచ్చిన వేళా విశేషం. ఏది ఏమైనా 200 కుటుంబాల్లో మళ్లీ తెలుగు సంవత్సరాధి శుభకృతి నుంచి మంచి రోజులు మొదలు కావాలని మనసారా కోరుకుందాం…