నగరంలోని ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించి,కుటుంబాన్ని ఓదార్చిన ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చిన మంత్రులు కేటీఆర్, గంగుల,ఎంపీ రవిచంద్ర
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నగరానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తాడిశెట్టి జగదీష్ కుమార్ నారాయణపురం మండలం పుట్టపాకలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందారు.పుట్టపాకలో ఆదివారం ఆయన ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడగా,టీఆర్ఎస్ నాయకుడు గంధం నాగేశ్వరరావు కారులో వెంటనే నల్లగొండ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ నగరం హస్తినాపురంలోని పయనీర్ ఆస్పత్రికి తరలించగా, ఆయన అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గత వారం రోజులుగా చురుగ్గా పాల్గొన్న ఆయన వయస్సు 56ఏండ్లు,రామంతాపూర్ ఆర్టీసీ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఆయనకు భార్య పద్మజ, కుమారులు సచిత్ కుమార్,,తరుణ్ కుమార్ లు ఉన్నారు.మునుగోడులో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తంలతో కలిసి ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు.టీఆర్ఎస్ లో చురుకైన కార్యకర్తగా పేరున్న జగదీష్ అకాల మృత్యువు లోనుకావడం పట్ల మంత్రులు కేటీఆర్,గంగుల కమలాకర్,ఎంపీ రవిచంద్రలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న ఆయన పెద్ద కుమారుడు సచిన్ ను వెంటనే ఇండియాకు రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వారు హామీనిచ్చారు.