పాడులోకం…పాపపు కాలం!

`కనికరం లేని సమాజం- కదలని మానవత్వం!?

`మహానగరంలో పసిపాపపై పైశాచికత్వం…!

`ఆ తల్లిదండ్రుల ఆక్రందన వినిపించడం లేదా?

`పసిపిల్లల పాలిట పాపాత్ముల పాపపు పనులు?

`అది అంతా ఉన్నత వర్గాలుండే సమాజ సమూహం!

`అక్కడ పసిపిల్లకు అన్యాయం జరిగితే స్పందించలేరా?

`మానవ మృగాన్ని శిక్షించేందుకు కలిసి రాలేరా?

`అబాగ్యులైన ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేరా?

`వారికి ధైర్యం చెప్పి, న్యాయం కోసం అండగా నిలబడలేరా?

`జంతువులకు వున్న రక్షణ ఆడపిల్లకు లేదా?

`ఆడపిల్లగా పుట్టడమే శాపమా?

`ఆడపిల్ల అంటే కామమేనా?

`స్వేచ్ఛగా సమాజంలో బతనివ్వరా?

 `పసిపిల్లలకు రక్షణ లేని విద్యాలయాలెందుకు?

 `సమాజాన్ని ఉద్దరిస్తామని చెప్పే రాజకీయ పార్టీలెందుకు?

 `సామాజిక సేవ పేరుతో ప్రసంగాలు చెప్పే వాళ్లు ఏమయ్యారు?

 `సినిమాలలో నీతులు చెప్పే నటులేమయ్యారు?

 `ఓ హీరో జారిపడితే చూపించిన మానవత్వం, పసి పాపల రక్షణలో చూపరా?

 `లేనివాడి కుటుంబానికి అన్యాయం జరిగితే కలిసి రారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పుణ్య భూమి, ధర్మ భూమి, ధన్య భూమి, వేదభూమి, ఖర్మ భూమి…ఏం పేర్లు…ఇంత గొప్ప పేర్లు ఏ దేశానికి లేవు…ఆడపిల్లలపై అకృత్యాలు ఇంతగా ఏ దేశంలోనూ జరగడం లేదు…అంత గొప్ప మన గొప్ప మన దేశంలో ఆడపిల్లకు పుట్టే హక్కు లేదు. బతికే స్యేచ్ఛ లేదు…అడిగే హక్కు లేదు. నిలదీసే హక్కు లేదు…పుస్తకాలలో మనం గొప్పగా రాసుకున్న హక్కులు పనికొచ్చేది లేదు…సనాతన ధర్మం అనుసరిస్తున్న గొప్ప దేశం మనది. దేశానికి ఏం దరిద్రం పట్టిందో…ఏమో గాని కొన్ని దశాబ్దాలుగా అత్యాచారం అన్నం పద వినకుండా గుడుస్తున్న రోజు లేదు…అభం శుభం తెలియన పసిపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు..ఎక్కడో అక్కడ గుండెలు పండేసే వార్తలు విని తల్లడిల్లిపోవాల్సివస్తోంది… పసిపాలలపై కామపు చూపులేందిరా? దుర్మార్గుల్లారా..? మదమెక్కిన మృగాళ్లారా? ఆడ పిల్ల అంటే సెక్సేనా…! ఆమె మనిషి కాదా? మనలో సగం కాదా?మనకు జన్మనిచ్చే దేవత కాదా? ఆ మహిళ అంటే మనిషి జాతికి మూలం కాదా…! క్షేత్రం కాదా? ఆమె అసలు మనిషే కాదా? మనిషిగా లెక్కలోకే రాదా? ఒక మహిళ రోడ్డు మీద నడవాలంటే కొన్ని వందల, వేల మంది చూసే కామపు చూపుల నుంచి తప్పించుకొని నడవాలా? ఆడపిల్ల రోడ్డు మీద నడవాలంటే సిగ్గుపడాలా? భయపడాలా? ఆందోళనతోనే అడుగులేయాలా? ఎవడు ఎక్కడినుంచి దాడి చేస్తాడో అని క్షణ, క్షణం భయం, భయంగా బతుకుతూ, గుండె దిటువు చేసుకుంటూ వెళ్లాలా? గడప దాటిని ఆడపిల్ల మళ్లీ ఇంటికొచ్చేంత వరకు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూనే బతకాలా? ఏం దౌర్భాగ్యమిది…ఎంత దుర్మార్గమిది…ఇంకా ఏ సమాజంలో బతుకుతున్నాం…అడవికన్నా అద్వాహ్నమైన వ్యవస్థలో జీవిస్తున్నాం…బేటీ బచావో..బేటీ పడావో…అనుకుంటే సరిపోతుందా? రక్షణ అవసరం లేదా? ఆడపిల్ల రక్షణ ప్రభుత్వ బాద్యత కాదా? తాజాగా జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనలో స్కూలు విద్యార్ది అయిన ఓ పసిపాపకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది…అక్షరాల్లో రాయలేనింది… సరిగ్గా మాటలు కూడా రాని వయసు..ఏం చెప్పాలో కూడా తెలియని వయసు..ఆకలేసినా, దెబ్బ తగిలినా ఏడుపే సమాదానమయ్యే వయసు..అలాంటి చిట్టితల్లికి అన్యాయం జరిగింది… అమ్మఒడి తర్వాత ఎవరైనా వేసే తొలి అడుగు బడి వైపు…ఆ బడిలో కామాందులా? అసలు అది బడేనా…! రాయడానికి అక్షరాలు సిగ్గుపడుతున్నాయి…పసిపాపల గోడు విని రౌద్రాలౌతున్నాయి… బడి…గుడి కన్నా పవిత్రమైనది. భవిష్యత్తు తీర్చిదిద్దబడే ఆలయమది. పిల్లల జీవితాలకు అక్షరమనే చైతన్యాన్ని నింపే జ్యోతిలాంటిది. అక్కడ అక్షరాలకు తప్ప, అసమానతలకు, అకృత్యాలకు తావులేనిది. పసిపిల్లలు దేవళ్లుతో సమానం. అన్నెం పుణ్యం ఎరగని కల్మషం లేనిది బాల్యం. ఆ నవ్వుల్లో ప్రపంచం వుంది. ఆ పసి నవ్వుల్లో జీవితమే వుంది.

అలాంటి ఓ పసి నవ్వును ఓ పాపాత్ముడు చిదిమేశాడు…పవిత్రమైన స్ధలంలో పాపపు పనులు చేశాడు…! అందుకు పాఠశాల యాజమాన్యంలో కీలకమైన వ్యక్తి ప్రిన్సిపాల్‌ ఆ క్రూరుడికి ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం. వాడు చేసిన పాపపు పనికి సమాజం కన్నెర్ర చేస్తోంది. కన్న తల్లిదండ్రుల కడుపుకోతలో నుంచి పెల్లుబికిన శోకం శాపమై వాడిని దహించివేయాలి. శిక్షకు గురిచేయాలి. కాని ఇంతటితో జరిగిన సంఘటన సమాజం మర్చిపోతుంది. వ్యవస్ధ మర్చిపోతుంది. కాని ఎక్కడో అక్కడ మళ్లీ ఏ వెధవో ఇలాంటి పని చేస్తూనే వుంటాడు…అంత దాకా ఎందుకు 2014లో డిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం విషయంలో దేశమే కదిలింది. దేశ రాజధాని అట్టుడికింది. అప్పటి ప్రభుత్వం కఠినమైన చట్టం తెచ్చింది. ఇక దేశంలో అరాచకాలకు, అకృత్యాలకు తావుండదని అనుకున్నాం. కాని జరిగిందా? ఆగిందా? లేదు…ఇంకా అంతకు మించి అనేక సంఘటనలు జరుగుతూనే వున్నాయి. అమ్మాయిల జీవితాలు ఆగమౌతూనే వున్నాయి. ఆడ పిల్లల జీవితాలు చిన్నాభిన్నమౌతూనేవున్నాయి. మృగాడి చేతిలో ఆహుతౌతూనే వున్నాయి. వీటికి అంతం లేదా? ఆడపిల్లను కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తామని పాలకులు చెప్పినా, భయం కల్పించినా ఎందుకు ఆగడం లేదు…దుర్మార్గాలకు అంతు లేదా? ఆఖరుకు దిశ కేసులో ఎన్‌ కౌంటర్‌ చేసినా భయం లేకుండాపోతోందా? ఓ వైపు ప్రేమించమని వేధింపులు…మరోవైపు ఎత్తుకెళ్లి పాడు చేయడాలు…ఎన్ని..ఎన్ని… జరుగుతున్నాయి…వరంగల్‌లో ప్రణీత అనే అమ్మాయిని ప్రేమించమని వెంటపడుతూ, వేధిస్తూ, చివరికి తన మాట వినడంలేదుని ఆసిడ్‌ దాడి చేసిన ఘటనతో ఒక్కసారి సమాజమంతా ఉలిక్కిపడిరది. ఆ దుండగులను చంపేయాలని, తక్షణ శిక్ష పడాలని సమాజామంతా కోరింది. అప్పుడు ఆ ఉన్మాదుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. దాంతో ఇక ఆడపిల్లల వైపు చూడాలంటే ఎవడైనా భయంతో వణిపోతాడని అనుకున్నారు. కాని ఆ తర్వాత కొద్ది రోజులే విజయవాడలో పరీక్ష రాసేందుకు వెళ్లిన శ్రీలక్ష్మిని పరీక్ష హాల్‌లోనే చంపేశాడు…కత్తి తెచ్చి మరీ శ్రీలక్ష్మిని ఆ ఉన్మాది పెట్టన పెట్టుకున్నాడు. వాడినీ ప్రభుత్వం శిక్షించింది. అయినా మగ మృగాల వేట ఆగడం లేదు… ఆ మధ్య గుంటూరులో ఓ ఐదేళ్ల అమ్మాయిని ఓ అరవై ఏళ్ల వృద్దుడు అత్యాచారం చేసి చంపేశాడు… వరంగల్‌లో తొమ్మిది నెలల పసిపాపపై ఓ దుర్మార్గుడు అగాయిత్య ం చేశాడు…ఆ మధ్య నగరంలోనే సైదాబాద్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయిని తీసుకెళ్లి ఓ వెదవ అత్యాచారం చేసి చంపేశాడు..! ఆ మధ్య జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు…ఇంకా మర్చిపోనేలేదు…! ఇలా ఎన్ని దారుణాలు…ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఆగడంలేదు. విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగే అప్పటికప్పుడు వేసే శిక్షలకు మన దేశంలో అమలు చేసే శిక్షలకు తేడా వుంది.

అదే దుర్మార్గుల పాలటి వరంగా మారుతోంది.జూబ్లీహిల్స్‌ లాంటి ఏరియాలో నడిచే పాఠశాల అంటే అందరూ ఎంతో గొప్పగా ఊహించుకుంటారు… లక్షలకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుంటే…ఎంతో గొప్ప సౌకర్యాలు..విద్యాబుద్దులు చెప్పేంత గొప్పదని అనుకుంటారు..కాని అలాంటి స్కూల్‌కు ప్రిన్సిపల్‌ ఓ మహిళ. ఆమె ఆధ్యర్యంలో స్కూల్‌ నడుస్తుందంటే అందరికీ ఓ భరోసా…ఆ నమ్మకమే విద్యార్థుల పాలిట నరకమైంది. తల్లిదండ్రుల పాలిట శాపమైంది. అసలు ప్రిన్సిపాల్‌ కారుకు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి తరగతి గదిలో ఏం పని…! ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ,అదే స్కూల్‌ స్కూల్‌ బస్సుకు డ్రైవర్‌ నుంచి ప్రిన్సిపల్‌ కారుకు డ్రైవర్‌ గా మారి పసిపిల్లలను పాడు చేసే దాకా ఎలా మారాడు? ఆ విషయం చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రిన్సిపల్‌కు లేదా? పైగా ప్రశ్నించేందుకు వెళ్లిన మహిళలను ప్రిన్సిపల్‌ కుమారుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తలిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి.తమ పిల్లలు ఎంతపెద్ద స్కూల్‌లో చదివితే తమకు అంత పెద్ద హోదా అనుకుంటున్నారే గాని, ఆ స్కూల్‌లో తమ పిల్లలు ఎలా వుంటున్నారని ఆలోచిస్తున్నారా? పైన పటారం చూసి, అప్పులు చేసి, లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి, పసిపాపల జీవితాలు ఆగమౌతుంటే ఏం చేస్తున్నారు…తల్లిదండ్రులుగా పిల్లలకు ఫీజులు చెల్లిస్తే చాలన్న బాద్యత దగ్గరే ఆగిపోతున్నారా? ఇటీవల జరిగిన సంఘటనకు ముందు కూడా అనేకం వినపడ్డాయంటున్నారు..అప్పుడే ఇతర తల్లిదండ్రులు స్పందిస్తే ఇంత దాకా వచ్చేది కాదు…కదా? ఆ మృగం ఆగడాలు ఆగిపోయేవి కదా? మహిళా రూపంలో వున్న ఆ ప్రిన్సిపల్‌ ఎప్పుడో శంకరగిరి మాన్యాలు పట్టేది కాదా? తల్లిదండ్రుల స్పందన ఆలస్యం కారణంగా ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆలోచించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!