సీఎం కేసిఆర్ ఆదేశాలిస్తే 200 కుటుంబాల్లో వెలుగులు
` పోయిన కొలువులు వస్తాయని ఎదరుచూపులు
` మంత్రులందరినీ కలిసి కన్నీళ్లు పెట్టుకున్న హోంగార్డులు
` కనిపించిన నాయకుల కాళ్లు పట్టుకుని వినతులు
` ఉద్యోగ సంఘాల నాయకులతో మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం
` కుల సంఘాల నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు
` ఆత్మగౌరవంతో బ్రతాకాలనే కోరిక చావక ఇబ్బందులతో తనువు చాలిస్తున్న అభాగ్యులు
` ఇప్పటికే పలు కారణాలతో నలుగురి మృతి
` హామీ నేరవేర్చి బ్రతుకు భరోసా ఇవ్వాలని వేడుకుంటున్న కుటుంబాలు
హైదరాబాద్ , నేటిధాత్రి :
పోయిన కొలువుల కోసం వాళ్లు ఎక్కని మెట్టు లేదు. మొక్కని దేవుడు లేడు. తెలంగాణ సాధన కోసం ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో మందిని కలిశారు. ఎన్నో పార్టీలతో ఉత్తరాలు రాయించారు. ఎక్కే గడప,దిగే గడప అన్నట్లు ఆయన తెలంగాణకోసం ఎంత కష్ట పడ్డాడో అందరికీ తెలిసిందే…అలాగే ఉద్యోగాలు పోయిన హోంగార్డులది కూడా అలాంటి పరిస్ధితే. తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడా ఇంత కాలం పాటు కోల్పోయిన ఉద్యోగాల కోసం చరోక పక్షుల్లా ఎదురుచూసిన వాళ్లు లేరు. వాళ్లేం అన్యాయం చేయలేదు… అక్రమాలు చేయలేదు….కొలువులు ఎందుకు పోయాయో కూడా తెలియని అమాయకులు…. డిపార్టుమెంటులో ఎవరి కోపమొచ్చినా హోంగార్డుల మీదే ప్రతాపం చూపిస్తారని చెప్పడానికి ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవితాలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు మోసం మూలంగా బలైన జీవితాలు. ఆ పెద్దలు చేసిన తప్పిదం, అన్యాయం మూలంగా వీరి జీవితాలు ఎందుకు బలికావాలి? వారి జీవితాలకు ఎవరు భరోసా కల్పించాలి. ఆనాడు జై తెలంగాణ అన్నందుకు ఉద్యోగాల నుంచి తొలగించడం ఒక కారణమైతే…వీళ్లకు అప్పాయింటు మెంటు లెటర్లు ఇవ్వకుండా పని చేయించుకున్నారు. వెట్టి చారికీ చేయించుకునేందుకు ఉద్యోగాలు ఇచ్చినట్లు మోసం చేశారు. అన్నీ ఇస్తున్నామని నమ్మించారు. ఐడి కార్డులిచ్చారు. యూనిఫారమ్స్ ఇచ్చారు. సర్సీసు రూల్స్ ప్రకారం జీతాలు కూడా చెల్లించారు. ఆఖరకు ఉద్యోగాలనుంచి తొలగించారు. వెట్టిని సహించలేకే తెలంగాణలో మొదటి సారి తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల కోసమే ఉద్యమం మరోసారి వచ్చింది. కాని ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే అవకాశం వచ్చింది. దాంతో మాపై కనికరం చూపండని హోంగార్డులు కోరుతున్నారు.. కనీసం మానవతా దృక్పధమైనా చూపించమని వేడుకుంటున్నారు.
` కొలువు లేకపోతే……..
సహజంగా ఏ కుటుంబంలోనైనా ప్రభుత్వ ఉద్యోగం అన్న పేరు చాలు. ఒక భరోసా. ఒక ధైర్యం. అది నాలుగో తరగతి ఉద్యోగమైనా సరే…కుటుంబానికి ఆసర అనుకుంటారు. ప్రైవేటు ఉద్యోగంలో అంతకన్నా జీతం ఎక్కువ వచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఒక స్టేటస్ పాయింట్. ఎంతో కష్టపడితే గాని కొన్నిసార్లు ఉద్యోగాలు రావు. కొన్ని సార్లు ఆదృష్టం తోడై కూడా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తుంటాయి. కాని వాటికి భరోసా లేకపోతే ఎలా? ఆశల పెట్టుకున్న వారి జీవితాలు మధ్యలో ఆగిపోతే, కొలువులు పోతే ఎలా వుంటుంది? ఆ కుటుంబానికి ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు? పెద్ద పెద్ద ఉద్యోగులను ఇలా ఎలాంటి కారణాలు లేకుండా తీసేయగలరా? చిన్న ఉద్యోగులు…? అంటే అంత చిన్న చూపా? ఇది తెలంగాణ రాకముందు జరిగినందును వారిపై కనికరం అందరకీ వుండాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నిత్యం కొన్ని వందల సమస్యలను వింటుంటారు. వాటిలో ప్రాధాన్యతా క్రమంలో అధికారులు సూచించే వాటిపై దృష్టిపెట్టాల్సివుంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలో ఉద్యోగాలు కోల్పోయిన హోంగార్డుల న్యాయం చేస్తామని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి నోటనుంచైనా ఒక మాట వస్తే అది జీవోతో సమానమంటారు. ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లాల్సింది అధికారులు. నాయకులు. వాళ్లు హోంగార్డులను మర్చిపోయారా? వదిలేశారా? ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
` హోంగార్డుల బాధ వర్ణణాతీతం…….
వాళ్లంతా బడుగులే… ఒక్క మాటలో చెప్పాలంటే హోం గార్డు లాంటి ఉద్యోగాలకు ముందుకు వచ్చేది అత్యంత పేదరికంలో మగ్గుతున్నవాళ్లే. అందులోనూ ఎస్సీ, ఎస్టీలు, బిసీలు, ఉన్నత వర్గాలలో వున్న పేదలు మాత్రమే హోంగార్డుల ఉద్యోగాలలో చేరుతుంటారు. ఉద్యోగాల్లో చేరేప్పుడే వారికి పరిస్థితి తెలుసు. సహజంగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ స్ధాయి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు వుంటాయో! ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది హోంగార్డుల జీవితాలు ఎలా వుంటాయో అర్ధం చేసుకోవచ్చు. అయినా అన్నీ భరిస్తారు.. అధికారులు చీ..అన్నా పడతారు. చీదరించుకున్నా పడతారు. తిట్టినా పడతారు. ఆఖరుకు కోపం వచ్చి…ఏంచేస్తారో తెలుసు. అయినా వాళ్లు మౌనంగానే వుంటారు. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం. కన్నీళ్లను దిగమింగుకొని బతికేస్తుంటారు. అలాంటి చిన్న వేతన జీవులైన హోంగార్డులు ఉద్యోగాలు కోల్పోయి దశాబ్ధకాలమైనా ఖాకీ దుస్తులు వేసుకోవాలన్న తపనతో బతుకుతున్నారు. పదేళ్లు చేసిన ఉద్యోగాలను తిరిగి చూసుకోవాలన్న ఆశతో బతుకులు వెళ్లదీస్తున్నారు. చిన్నా, చితకా పనులు చేసుకుంటున్నా, దేశం కోసం, సమాజం కోసం వారు తక్కువ జీతమైనా పనిచేశారంటే వారి అంకితభావం ఎంత గొప్పదో ప్రభుత్వాలు గుర్తించాలి. హోంగార్డు ఉద్యోగాలు అంటే కత్తిమీద సాములాంటిది. ఎవరు వచ్చి బెరించినా పడాలి? రాత్రిళ్లు డ్యూటీ చేస్తే కొన్ని సార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాలి. ఇలా సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నప్పుడు వారిని ఉద్యోగులుగా కాకుండా, సామాజిక సేవకులుగా గౌరవించుకోవాల్సిన అసవరం వుంది.
` దండం పెట్టని నాయకులు…మొక్కని దేవుడు లేడు
పన్నెండేళ్లయినా వారిది ఒకటే జపం. తమ ఉద్యోగం. ఆ ఉద్యోగంతో ఇప్పుడేదే సాధిస్తారని కాదు. సాంపాదించుకుంటారని కాదు. ఆత్మగౌరవం కోసం… అంతే తప్ప వేలకు వేలు జీతాలు వచ్చి, కుర్చీలో కూర్చునే ప్రమోషన్లు వస్తాయని కాదు. అదే జీవితం. అదే ఉద్యోగం. ఎండనక? వాననక? పని చేయాల్సిందే. ట్రాఫిక్‌లలో పనిచేసి ఊపిరి తిత్తులు పాడు చేసుకోవాల్సిందే..అయినా వారు వెరవకుండా పనిచేస్తారు. ఉద్యోగ నిర్వహణ బాధ్యత నిర్వర్తిసారు. అలాంటి కొలువుల కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు ఎంత మంది నాయకులను కలిశారో లేక్కే లేదు. మా ఉద్యోగాలు మాకిప్పించడని కనిపించిన ప్రతీ నాయకుడిని వేడుకున్నారు. వారికి వినతి పత్రాలు అందించారు. మంత్రులు,ఎమ్మెల్యేలు ఎక్కడికి వచ్చినా వారి వద్దకు వెళ్లి వారి కాళ్లావేళ్లా పడ్డారు. నాయకుల ప్రసన్నం కోసం ప్రదక్షిణాలు చేశారు. ఏడ్చారు? ఏదో ఒక సానుకూల ప్రకటన వస్తుందని తెలిసిన ప్రతీసారి పాలాభిషేకాలు చేశారు. కనిపించిన దేవతలందరినీ మొక్కారు. ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి కలిసి కళ్లు కాయలయ్యలా ఎదురుచూస్తున్నారు. ఎవరు ఎదరైనా, తమను కనికరించేలా చూడమని కోరుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రతి నియోజకవర్గంలోనూ వున్నారు. వారందరికీ వీరి బాధలు తెలుసు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో తొలగించిన ఉపాధి హమీఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అలాగే తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని వీరికి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.