రేవంత్ తర్కం రమ్మన్నట్టా!
వద్దన్నట్టా!!
`రండి..రండి అంటున్నట్లా?
`మీ ఖర్మ అని జాలిపడినట్లా?
`రేవంత్ వ్యాఖ్యలెవరి కోసం?
`కమలం నుంచి హస్తానికి క్యూ..నిజమేనా?
`ఒక్క సీటిస్తాం..పది సీట్ల ఖర్చు అప్పగిస్తాం!
`ఆప్షన్ లేదు…ఈటెలకూ బిజేపి మీద నమ్మకం లేదు?
`రెడ్డి రాజకీయంలో రేవంత్ వింత పోకడ?
`బిజేపి రెడ్డీలంతా కాంగ్రెస్ గూటికా!
`గుండుగుత్తగా జంపా!?
`జూపల్లి రావడం ఇష్టం లేకనా?
`పొంగులేటి రాకుండానే పొగబెట్టడమా?
`పది మెట్లు దిగుతా అన్నది ఇందుకేనా?
`పాపం పొంగులేటి..జాలి పడేవారు లేకుండా పోయిరి?
`అయినా కాంగ్రెస్ తప్ప దిక్కులేకుండా చేసుకుంటిరి?
`ఈటెలకు ఉమ్మడి కరీంనగర్ ఖర్చులు?
`పొంగులేటి కి ఖమ్మం లెక్కలు?
`నల్గొండ వెంకటరెడ్డికి అప్పగింతలు?
`బోనస్ ఎల్ బి.నగర్ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి?
`రంగారెడ్డి ఎవరికి?
`జితేందర్ రెడ్డికి దిక్కేమిటి?
`రాములమ్మ కూడా కాంగ్రెస్ గూటికి…?
`భబ్రాజమానం భజగోవిందం!
`ఆలస్యం కొంప ముంచుతుందేమోనని భయం!
`తట్టా బుట్టా సర్థుకొని అంతా సిద్ధం?
`బిజేపిలో మొదలైన అంతర్మధనం!
`ఈటెల అందుకే ఈ మధ్య దూరం.. దూరం.
హైదరబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసే రోజులు. అలాంటి కాలంలో కూడా నాయకులు ప్రజలను మభ్యపెట్టాలని, తాము పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు తెలియకుండా పోతుందా? తాజా రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బిజేపి, కాంగ్రెస్ పార్టీలు విచిత్రమైన వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ఎటు పోతున్నామో తెలియని దారిలో పయనిస్తున్నాయి. ఎవరు తోడు వస్తారో తెలియని వైపు అడులేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్ నుంచి ఎవరు వస్తారో అని ఎదురుచూస్తున్నాయి. గతంలో ఇలాంటి రాజకీయాలు ఎన్నడూ విన్నది లేదు. చూసింది లేదు. ఎన్నికల తరుణం వచ్చేసిందటే ప్రతిపక్షాలు బలంగా వున్నట్లు కనిపించేవి. ప్రజలు కూడా ముందే సంకేతాలిచ్చినంత పనిచేసేవారు. కాని టెక్నాలజీ పెరిగిన తర్వాత నాయకులు వేసే వింత వేషాలు చూసి, ప్రజలు కూడ తమ తమ పాత్రను బాగానే పోషిస్తున్నారు. నొప్పింపక తానోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లు ప్రజలు అందరినీ ఆదరిస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఊపు మీద వుందన్న ప్రచారం జోరుగా సాగింది. కాని ఏమైంది? బొక్కా బోర్లాపడిరది. మళ్లీ కోలుకోలేనంత దెబ్బ పడిరది. అయినా ఆ పార్టీలో వచ్చిన ఊపు లేదు. కొత్త బలం లేదు. బిఆర్‌ఎస్ నుంచి ఎవరొస్తారా? లేక బిజేపి నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది. అదేవిధంగా బిజేపికూడా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారా? బిఆర్‌ఎస్ నుంచి ఎంత మంది వస్తారా? అన్నదానిపై ఆశలు పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. కర్నాకట ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌తో బిజేపికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక కోలుకోలేకపోతోంది. అదలా వుంటే వచ్చినవారు వుంటారా? లేదా? అన్న ఆందోళన బిజేపిలో మొదలైంది.
ఉన్న ఫలంగా బిజేపిలో చేరిన నేతలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న పెద్దఎత్తున జరుగుతున్న ప్రచారం.
మరో వైపు బిఆర్‌ఎస్ బహిషృత నేతలు ఖమ్మం మాజీ ఎంపి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరుకు చెందని మాజీ మంత్రి జూపల్లికృష్ణారావులు బిజేపి వైపు అడుగులేస్తున్నారన్న వార్తలు, కాస్త మాయమై, కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికీ ఆ ఇద్దరు నేతలు ఎటు వెళ్తారన్నదానిపై వారికే స్పష్టత లేదు. కాకపోతే కాంగ్రెస్ , వామపక్షాలు ఐడియాలజీలున్న నాయకులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. బిజేపిలో చేరి తమ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించుకొని, ఇంకా అక్కడే వుంటే ప్రజలు కూడా మర్చిపోతారని భయపడుతున్న నేతలంతా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారన్న వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. వారిలో బిజేపిలో చేరి ఆ పార్టీలో కొంత కాలం సంచలనంగా మారిన ఈటెల రాజేందర్ కూడా తీవ్ర అసంతృప్తిలో వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా మూటా ముళ్లె సర్ధుకునేందుకు సిద్దంగా వున్నారని ప్రచారం. ఆయన ఒక్కడు బిజేపినుంచి వెళ్తే ఆయనతో వచ్చిన వారంతా కూడా వెళ్లిపోతారనేది సహజంగా వచ్చే అనుమానమున్నదే. .ఈటెల వెంటే వాళ్లంతా వెళ్తారన్నది జగమెరిగిన సత్యమే. ఈటెలతో సంబంధం లేకుండా బిజేపిలో చేరి సొంత గూటికి చెరినట్లు, పుట్టింటికి చేరినట్లుందని చెప్పిన రాములమ్మ ( విజయశాంతి) కూడా బిజేపిపై తీవ్ర అసంతృప్తితో వున్నట్లు చెబుతున్నారు. కనీసం కాంగ్రెస్‌లో వున్నప్పుడు అడపా దడపానైనా మీడియాలో వుండే అవకాశం వుండేది. కాని బిజేపిలో చేరిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారన్నది ఆమెకు అర్ధమైంది. అందుకే మళ్లీ కాంగ్రెస్‌వైపు చూస్తోందని సమాచారం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డి.కే . అరుణ కూడా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సంసిద్దతమౌతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రియాంకా గాంధీ పర్యటన సందర్భంగా ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక జితేందర్‌రెడ్డి లాంటి మాజీ ఎంపి, కొండా విశ్వేశ్వరెడ్డిలు కూడా త్వరలో కాంగ్రెస్ తీర్ధంపుచ్చుకుంటారని అంటున్నారు.
ఇక ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక రకంగా తెలంగాణలో రాజకీయ దుమారాన్నే సృష్టించాడని చెప్పొచ్చు.
ఆయన ప్రకంపనలు సృష్టిస్తాడని కూడా చాలా మంది ఊహించారు. కాని తానే ఎటుకాకుండా చౌరస్తాలో నిలబడాల్సి వస్తుందని మాత్రం ఆయన కూడా కలలో ఊహించి వుండకపోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రభంజనమైపోతా? అన్నంతగా పొంగిన పొంగులేటి పాల పొంగు చల్లారినంత సేపు కూడా ఆయన రాజకీయం సాగలేదన్నది వాస్తవం. ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కొంత కాలం క్రితం వరకు మా పార్టీకి పొంగులేటి వస్తున్నాడు? అని కాంగ్రెస్…లేదు..లేదు మా పార్టీకే వస్తున్నాడంటూ బిజేపి చెప్పుకున్నాయి. కాని ఈటెల రాజేందర్ చెప్పిన ఒక్క విషయంతో అటు బిజేపి, ఇటు కాంగ్రెస్‌లతోపాటు, ఆఖరుకు పొంగులేటి కూడా తన పరవు తాను తీసుకున్నాడు. ఈటెల రాజేందర్ రాజకీయాన్ని ఒక్కసారి దెబ్బతీశాడు. తాను బిజేపిలో చేరడం కాదు. నువ్వొస్తే మరో వేధిక ఏర్పాటు చేద్దామంటూ తనకే కౌన్సిలింగ్ ఇచ్చారని ఎప్పుడైతే ఈటెల చెప్పారో అప్పటి నుంచి ఆయన మనసు కూడా చెదిరినట్లే వుంది. బిజేపిలో ఇన్ని తలనొప్పులు భరించడం తన వల్ల కాదన్న నిర్ణయానికి కూడా ఈటెల వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఈటెల కాంగ్రెస్‌లోకి వస్తానంటే మాత్రం కళ్లకు అద్దుకొని తీసుకుంటారనేది మాత్రం వాస్తవం. మరి ఊగిసలాడుతున్న పొంగులేటి వ్యవహారాన్ని మాత్రం కాంగ్రెస్ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది.
తాజాగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొంగులేటికి ద్వారాలు మూసినట్లా? తెరిచినట్లా? అన్నది అర్ధంకాకుండాపోయింది.
పచ్చగా వున్న చోట తిని, వెచ్చగా వున్న చోట పందామని చూస్తున్నట్లునున్నారు…అంటూ పొంగులేటి, జూపల్లి ల గురించి చెప్పినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఓ వైపు తాను పది మెట్లు దిగుతానంటూ ఓ వైపే రేవంత్‌రెడ్డి ప్రకటిస్తూనే మరోవైపు ఇలా చురకలంటిండంలో ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అర్ధంకాకుండావుంది. అయితే ఇదంతా పొంగులేటి ఇక తప్పని పరిస్ధితుల్లో కండువా కప్పుకున్నా, ఖమ్మంలో ఒక్క సీటు తప్ప మరే సీట్లు ఇవ్వమని పరోక్షంగా ఇచ్చిన సంకేతంగా భావించొచ్చన్నది కొందరు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్న మాట. అంతే కాదు ఒక్క సీటిచ్చి, ఖమ్మం పది సీట్లు గెలిచే ఖర్చు కూడా పొంగులేటే పెట్టుకునేలా షరతు కూడా పెట్టేందుకు కాంగ్రెస్ సిద్దంగా వున్నట్లు సమాచారం. అయితే ఒక్క పొంగులేటితోనే కాకుండా కాంగ్రెస్‌వైపు చూస్తున్న ఈటెలకు కూడా ఉమ్మడి కరీంనగర్ బాధ్యతలు అప్పగించి, ఖర్చు బాధ్యతుల కూడా ఆయనకే అప్పగించాలని చూస్తున్నారట. నల్గొండ బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకున్న కోమటి రెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మనసు మళ్లీ కాంగ్రెస్ వైపు మళ్లిందని సమాచారం.. అందుకే ఆయనకు ఎల్‌బినగర్ టిక్కెట్ ఇస్తే, ఉమ్మడి నల్లగొండ ఖర్చులు చూసుకునేందుకు ఆ సోదరులు కూడా సిద్దమైనట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా జరిగుతుందా? లేదా? అన్నది ఇప్పటికప్పుడు తేలకపోయినా, జూన్ లో రావాల్సిన రుతుపవనాలు ఎలా ఊరిస్తున్నాయో? నాయకులు కూడ అలాగే ఆలస్యం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా ఎండలు మండిపోతున్నట్లు, రాజకీయాలు వేడెక్కిస్తున్నారు…మరి చినుకులెప్పుడు పడతాయో? ఈ నాయకులంతా ఎప్పుడు పార్టీలు మారుతారో..అని మాత్రం మీడియా ఎదురుచూస్తోంది. ఎందుకంటే మీడియా హడావుడి లేకపోతే…రాజకీయాలే సప్పగా వుంటాయి.