‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి?

`ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే!

`ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం.

`ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌?

`అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం!

`మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత.

`మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి…

`వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు.

`తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు.

`వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల గోల?

`గత ఎన్నికలలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్న కొందరు సీనియర్లు?

`ఈసారి కూడా సీనియర్లకే అనడం వారసులకు నిరాశే!

` ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇవ్వడం కుదరదు?

`తలలు పట్టుకుంటున్న సీనియర్లు.

`బలంగా వున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే సీనియర్లే కీలకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: రాజకీయాల్లో రాను రాను వారసత్వాలు పెరిగిపోతున్నాయి. ఇది వాంఛనీయం కాకపోవచ్చు. కాని వారసత్వ రాజకీయాలు తప్పుకాదు. రాజకీయ నాయకుల వారసులు రాజకీయాలను ఎంచుకోవడంలో తప్పులేదు. ఎటొచ్చి ఎల్లకాలం వాళ్లేనా…మాకు అవకాశం రావొద్దా? అని ఎదురుచూసే నాయకులు కూడా వుంటారు. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని, ఎంపి కావాలని, మంత్రి కావాలన్న కోరిక చాలా మందికి వుంటుంది. అత్యున్నత పదవులు పొందాలన్న లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నవారు కూడా వుంటారు. అయినా కొన్ని సార్లు అలాంటి వారికి జీవితాంతం అవకాశం రాకపోవచ్చు. కొందరికి అనుకోని వరంలా అవకాశాలు కలిసిరావొచ్చు. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నవారు..వారి వారసులను రాజకీయాల్లోకి చేర్చినవారు కొన్ని వందల మంది వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన తెలుగుదేశం మూలంగా కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. కొత్త తరం నేతలు రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ఆనాడు రాజకీయాలకు పరిచయం అయిన నేతలు ఇంకా క్రియాశీలక రాజకీయాలలో తమదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో వారి వారసులకు రాజకీయ భవిష్యత్తును సృష్టించిన వారు వున్నారు. కొన్ని కుటుంబాలలో ఒకటి రెండు తరాలు మారినా, వాళ్లే రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వున్నవాళ్లు కూడా వున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అందరూ అర్హులే. కాకపోతే రాజకీయ నాయకుల స్ధాయిని, హోదాను బట్టి ఆయా ప్రాంతాలో వారసులు కూడా తమ భవిష్యత్తు రాజకీయాలను తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. వారి వారి ప్రాంతాలలో రాజకీయాలను చేతిలోకి తీసుకొని నాయకత్వ పటిమ ప్రదర్శిస్తూ వుంటారు. ప్రజల ఆశీస్సులు వుంటే ఎవరైనా ప్రజా ప్రతినిధి కావొచ్చు. వారసత్వం అన్నది ఒక మెట్టు ఎక్కడానికో, రాజకీయాలకు పరిచయం చేయడానికో మాత్రమే పనికొస్తుంది. ఎల్ల కాలం ఉపయోపగపడదు. తనకు ప్రజా ప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఆ యువ నాయకుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్నది కూడా ప్రజలు గమనిస్తూ వుంటారు. ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్‌ అయితే మళ్లీ, మళ్లీ అవకాశం కల్పిస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే అభివృద్ధి చేస్తేనే, ప్రజలకు అందుబాటులో వుంటే, తమ సమస్యలు నాయకుడు తీర్చగలడన్న నమ్మకం వుంటేనే ఓట్లేస్తారు..గెలిపిస్తారు..అంతే కాని వారసులు అన్న ఒకే ఒక్క పదం మాత్రమే నాయకుడిని చేయదు…చేసినా అది ఎల్ల కాలం నిలబడదు..అలా రాజకీయాలు చేయలేక నిష్క్రమించిన వాళ్లు కూడా చరిత్రో అనేక మంది వున్నారు. 

 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది.

కాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ పార్టీ అంత ధైర్యం చేసే పరిస్దితి కనిపించడం లేదు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి, మూడోసారి గెలిచి హాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న అధికార బిఆర్‌ఎస్‌ పార్టీతోపాటు, ప్రతిపక్షాలు కూడా కొత్త తరం నాయకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంలేవు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ సీనియర్లదే హవా కొనసాగుతోంది. ఆ పార్టీలో కూడా మరోసారి అవకాశం కోసమే పాత తరం నేతలంతా ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశమే లేదు. పాతవారికే టిక్కెట్లు సర్ధలేక కాంగ్రెస్‌ పార్టీ తలలు పట్టుకునే అవకాశం వుంది. ఇక బిజేపిలో కూడా దాదాపు అంతే…ఇతర పార్టీలనుంచి వచ్చిన సీనియర్లు, గతం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల కొత్త తరానికి అక్కడా అవకాశం లేకుండాపోయింది. కాకపోతే అధికార బిఆర్‌ఎస్‌లో పోటీ మాత్రం విపరీతంగా వుంది. ఆ పోటీ మాత్రం విచిత్రంగా వుంది. ఈసారి టిక్కెట్లు మాకు కాకుండా మా వారసులకు ఇవ్వాలన్ని డిమాండ్‌ బిఆర్‌ఎస్‌లో బాగానే వుంది. తాము నాయకులుగా బలంగా వున్నప్పుడే, పార్టీ పటిష్టంగా వున్నప్పుడే తమ వారసులను రంగంలోకి దింపి ఎన్నికలలో గెలిపించుకోవాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. అందులో కూడా చాలా మంది గత ఎన్నికల్లోనే తమ వారసుల భవిష్యత్తును నిర్ధేశించుకోవాలనుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో ఆ అవకాశం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇవ్వలేదు. ఒకరికో, ఇద్దరికో అవకాశం ఇచ్చారు. కాని ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమకు కాకుండా టిక్కెట్టు తమ వారసులకు కావాలని కోరుకునే నేతలకు సీరియస్‌గానే సిఎం. కేసిఆర్‌ చెప్పనున్నారట. మీరు మాత్రమే పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం వుందన్నది తెలుస్తోంది. కాదూ, కూడదు అని ఎవరు నసిగినా వాళ్లకు కూడా టికెట్‌కట్‌ అన్న సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. అంటే ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ వారసులకు టిక్కెట్లు లేవు. ఇప్పుడున్న సీనియర్లే మళ్లీ పోటీ చేయాలి.. అందులో కూడా కొందరిని మార్చే అవకాశం వున్న చోట కొత్తవారికి అవకశం కల్పించనున్నారు. అంతే కాని నాయకుల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఎందుకుంటే ఇటీవల ఓ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాకతాళీయంగా అన్నా, అవే సీరియస్‌ సంకేతాలుగానే పరిగణించాలని నాయకులకు అర్ధమైపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఇండికేషన్లు వున్న తర్వాత కూడా టిక్కెట్‌ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు.

 ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం.

 అధికార బిఆర్‌ఎస్‌కు మరీ ముఖ్యం. ఎందుకంటే బిఆర్‌ఎస్‌దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన నాయకుల నాయకత్వమే ఎంతో అవసరం. వారికి వున్న అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నాయకులకు నియోజకవార్గల మీద, జిల్లా మీద పూర్తి పట్టు వుంటుంది. అదే వారసులకు అంతగా వుండకపోవచ్చు. పైగా ప్రజల్లో కొత్త వారసత్వ నాయకుల ప్రభావం కూడ పడొచ్చు. రెండుసార్లు అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలకు పూర్తి స్దాయి నమ్మకం, భరసా వున్నాయి. ఆయన నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. కాని కొందరు నాయకుల పనీతీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాంటి చోట్ల బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల స్దానంలో వారి వారసులకు అవకాశం కల్పిస్తే, మొదటికే మోసం రావొచ్చు. కొత్త తరానికి అవకాశం రావాలి. కాని దానికి కూడా సమయం సందర్భం వుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పును చూశాం…నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో తీర్పును చూశాం…రామలింగారెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తితో వుండడంతో మళ్లీ ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరించలేదు. సానుభూతి కూడా పనిచేయలేదు. అదే నాగార్జున సాగర్‌లో సానుభతి పనిచేసింది. నోముల నర్సింహయ్య నాయకత్వం ప్రజలకు వున్న నమ్మకంతో భగత్‌ను గెలిపించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో ముక్కొణపు పోటీ అనివార్యం. ప్రతిపక్షాలు కూడా కొంత బలపడ్డాయనే చెప్పాలి. గత ఎన్నికల పరిస్ధితి ఇప్పుడు లేదు. అందువల్ల ఆ పార్టీలను ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా సీనియర్‌ నాయకులనే మళ్లీ ఎంపిక చేయాల్సిందే..వారికే టిక్కెట్లు ఇస్తేనే సీనియర్‌ నాయకులపై వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న విశ్వాసంతో బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అందుకే ఈసారి వారసులకు టిక్కెట్‌ నో…!కాదూ..కూడదు…అంటే సీనియర్లకు కూడా కట్‌…!! ఇది ఫిక్స్‌…!!! అని సమాచారం. వారసులను రాజకీయాల్లోకి దింపాలన్న నాయకుల లిస్టు పెద్దగానే వుంది…అందుకే అందతా కాన్సిల్‌…? ఇదే ఫైనల్‌!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!