టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఘన విజయం తథ్యం:ఎంపీ రవిచంద్ర
వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ప్రశంసనీయం: మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపులకు కోకాపేటలో కోట్ల విలువైన భూమి ఇచ్చారు:చల్లా హరిశంకర్
మునుగోడులో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు
నమ్మిన ప్రజలను వంచించి బీజేపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఎమ్మెల్యేగా గెలిపిస్తే నాలుగేళ్ల పాటు మునుగోడు ముఖం చూడలేదని, ప్రజలకు ఏనాడు అందుబాటులో లేరని,వాళ్లను ఏ మాత్రం కూడా పట్టించుకోలేదని రాజగోపాల్ వైఖరిని దుయ్యబట్టారు.మునుగోడులో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నూరుకాపులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ఉన్నతికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనమందరం సంపూర్ణ మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు.కృత్రిమమైన ఈ ఉప ఎన్నికను తెచ్చిన రాజగోపాల్ కు ఘోరమైన ఓటమి తప్పదని,కేసీఆర్ పంపిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి అఖండ విజయం తథ్యమని రవిచంద్ర ధీమాగా చెప్పారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ,వద్దిరాజు రవిచంద్ర సేవాభావం ప్రశంసనీయమన్నారు.గుళ్లుగోపురాల నిర్మాణాలకు ఎన్నో గుప్త దానాలు చేశారని,పేద విద్యార్థుల చదువులకు, పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు,తన సొంత గ్రామం ఇనుగుర్తి అభివృద్ధికి ఎంతగానో సాయపడ్డారని,అడిగిన సహాయాలు చేస్తూనే ఉన్నారని వివరించారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్లా హరిశంకర్ మాట్లాడుతూ,మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ సమ్మేళనంలో మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,వాసుదేవుల వెంకటనర్సయ్య, సకినాల రవికుమార్, రామస్వామి వెంకటేశ్వర్లు,జెన్నాయికోడే జగన్మోహన్,పాశం కిరణ్,మాజీ గుండ్లపల్లి శేషగిరిరావు,పర్వతం సతీష్,భిక్షమయ్య,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జడిగం సతీష్ తాను టీఆర్ఎస్ చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో ఎంపీ రవిచంద్ర ఆయన మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.