నగరంలో.. “దొంగలు బాబోయ్”.

రెండు రోజులు,.. ఆరు చోరీలు…

వరుస చోరీలు, చోద్యం చూస్తున్న పోలీసులు?…

వరసపెట్టి రెచ్చిపోతున్న నేరగాళ్లు..

పట్టపగలే వరంగల్ నగరంలో భారీ చోరీలు

రెండు రోజులు, ఆరు దోపిడీలు, వెరసి రూ.1లక్ష నగదు, 98 తులాల బంగారం దుండగుల పాలైనట్లు సమాచారం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో జరిగిన నేరాల ముఖ చిత్రమిది

గొలుసు దొంగతనాలు, చిన్నాచితకా తస్కరణలు వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి

వరుస దొంగతనాలతో భయబ్రాంతులకు గురి అవుతున్న నగర వాసులు

 

వరంగల్, నేటిధాత్రి

నగరంలో పోలీసులు ఏం చేస్తున్నారు? అసలేం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? పెట్రోలింగ్ పోలీస్ ఏమైంది? సగటు జీవి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.

నేరగాళ్లు, అసాంఘిక శక్తులపై పోలీసులు నిఘా ఉంచడం అందరికీ తెలిసిన విషయమే

ఇది ఎంతవరకు పక్కాగా అమలవుతోందనేదే సందేహాస్పదం

ప్రస్తుతం నగరంలో వరుసగా రెండు రోజుల పాటు చోటు చేసుకుంటున్న ఉదంతాలను పరిశీలిస్తే,..

వరంగల్ మట్టెవాడ లోని గాయత్రి రెసిడెన్సీలో ఫ్లాట్ నెం.504లో 8తులాల బంగారం, రూ.18,000/- నగదు చోరీ

వరంగల్ మట్టెవాడ లోని వద్దిరాజు ఇన్ఫ్రాలో ఫ్లాట్ నెం.101లో 30తులాల బంగారు ఆభరణాల చోరీ

హనుమకొండ నయీంనగర్ లోని మారుతి, కల్లెడ, లహరి మూడు అపార్ట్మెంట్లలో దొంగలు పడినట్లు తెలుస్తోంది, సుమారు 60తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు సమాచారం

నిన్న కొన్ని అపార్ట్మెంట్లో చోరీ మరవకముందే..

వరంగల్ పుప్పాలగుట్ట ముత్యాలమ్మ గుడి దగ్గర మూడు ఇండ్లలో చోరీ..

ఈ రోజు మధ్యాహ్నం లేబర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఓరుగంటి రామకృష్ణ ఇంటి ముందున్న తన ద్విచక్ర వాహనం (టిఎస్03ఇఆర్3340) చోరీ చేసిన దొంగలు

దొంగలే, పోలీసుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు అదును చూసి పంజా విసురుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. పోలీసుల చర్యలను నిశితంగా గమనిస్తున్న దొంగలు దానికనుగుణంగా వారి ‘కార్యక్రమాలను’ మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు రోజుల్లో అపార్ట్మెంట్ ల లోకి కార్లలో వచ్చి తాళం వేసిన ప్లాట్ లే టార్గెట్ గా బంగారం, నగదు ఎత్తుకుపోయారు.

###-###

ప్రత్యేక గ్యాంగ్ ‘చొరం’ గేట్రం
ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది అని అంటున్నారు పోలీసులు. త్వరలోనే వీరిని పట్టుకుంటాం అని అంటున్నారు. అయితే పెరుగుతున్న బంగారం ధరలు, పోలీసుల శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగానో, మీడియా ద్వారానో చూస్తున్న అనేక మంది జల్సారాయుళ్లూ ఈజీ మనీ కోసం చోరుల అవతారం ఎత్తుతున్నారు. వీరిలో కాలేజీ విద్యార్థులు సైతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. జల్సాల కోసం విద్యార్థులు, విద్యాధికులు కూడా చోరబాట పడుతున్నారు. ఈ కారణంగానూ నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయి. వీరికి ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కేవలం విలాసాలకు అవసరమైన ఖర్చులు, సాటి విద్యార్థుల మాదిరి డాబు దర్పాల కోసం నేరబాట పడుతున్నారు. కొత్తగా చోరుల అవతారం ఎత్తుతున్న వారిలో ఇతర నేరాలు చేసే వారికన్నా, ఒకప్పుడు చైన్ స్నాచింగ్స్ చేసేవారే ఎక్కువగా ఉండేది, కానీ వీరిని ఉక్కుపాదంతో కట్టడి చేశారు నగర పోలీసులు.

##-###

కొనే వాళ్లకు కొదవలేదు

చోరీ వాహనాలు, సొత్తును కొనుగోలు చేసే మారు వ్యాపారులకు వరంగల్ నగరంలో కొదవలేదు

అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ దుకాణ యజమాని, కొందరు నగల తయారీదారులు సైతం ఈ బంగారంపై మక్కువ కనబరుస్తున్నారు అని తెలుస్తోంది

వరంగల్ చౌరస్తా నడిబొడ్డున ఉన్న కొన్ని బంగారం దుకాణాల్లో అసలు వ్యాపారానికి పోటీగా మారు వ్యాపారం నడుస్తుంటుందనేది ‘ఖాకీ’ లెరిగిన సత్యం

అసలు ధరలో 50శాతానికే బంగారం వస్తుండటంతో యథేచ్ఛగా కొనుగోళ్లకు పాల్పడుతుంటాడట ఈ “యజమాని”

ఈ తరహా వ్యాపారాలు సాగించే దుకాణదారుల జాబితాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉన్నాయి. వీరిని కట్టడి చేసి, అమ్మే అవకాశం లేకుండా చేస్తే చోరీలు తగ్గొచ్చు. పోలీసులకు మాత్రం ఇది పట్టదు. ఓ పక్క దొంగలు ఈ స్థాయిలో రెచ్చిపోతుంటే పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే సిబ్బంది, మౌలిక వసతుల కొరతకు తోడు, అనునిత్యం వెంటాడే బందోబస్తు, ప్రొటోకాల్ డ్యూటీల ఫలితంగా అనేక కేసులు కొన్నాళ్లకు అటకెక్కుతున్నాయి. కేజీల లెక్కన చోరీ, దోపిడీ అయిన భారీ ఉదంతం జరిగినప్పుడు పోలీసులు చూపించే శ్రద్ధ, మామూలు మధ్య తరగతి వ్యక్తి ఇంట్లో గ్రాముల్లో పోతే చూపించరు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఓ దొంగ దొరికినప్పుడు చిట్టా విప్పాల్సిందే తప్ప, సాధారణ కేసులపై ప్రత్యేక దృష్టంటూ ఉండదు.

నైబర్‌హుడ్ వాచ్ ఉత్తమం..
ఏళ్ల క్రితం నాటి సిబ్బందితో పోలీసు వ్యవస్థ ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికీ పోలీసులపై ఆధారపడకుండా విదేశాల్లో మంచి ఫలితాలనిచ్చిన నైబర్‌హుడ్ వాచ్ వంటివి ఇక్కడ కూడా అమలులోకి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఏం జరుగుతోందనే అంశంపై కన్నేసి ఉంచి అవసరమైన సందర్భాల్లో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, నేరగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేయడమనే సూత్రాలతో కూడిన నైబర్‌హుడ్ వాచ్ ఇక్కడా అభివృద్ధి చేయాలని పోలీసు విభాగాన్ని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!