`ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరి నిందలు?
`నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సిందెవరు?
`పన్నుల గుది బండను తగ్గించాల్సిందెవరు?
`2014లో సిలిండర్ ధర ఎంత?
`ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పుడెంత?
`ఎందుకింత పెరిగింది?
`సిలిండర్ సబ్సిడీకి మంగళం పాడిరదెందుకు?
`జిఎస్టీ వసూళ్ళు పెరిగితే చాలా?
`సంక్షేమ పథకాలు ప్రమాదకరమా?
`ప్రజలను మభ్యపెడుతున్నదెవరు?
`ధరల మద్దెల వాయిస్తూ నడ్డి విరుస్తున్నదెవరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా ముందుగా మునిగేది మధ్య తరగతి ప్రజలే…అమ్మో ఒకటో తారీఖు అని నిత్యం ఆగమౌతూ, నెలంతా భయపడుతూ బతికేది వాళ్లే…నెలలో ఒక్క రోజు వచ్చే ఒకటోతారీఖును కూడా కళ్లకద్దుకోలేని జీవితాలు మధ్య తరగతి వాళ్లవే…మన దేశంలో మెజారిటీ ప్రజలు మధ్య తరగతి ప్రజలే…అలాంటి ప్రజల జీవన ప్రమాణాలు నానాటికీ ఎందుకు దిగజారిపోతున్నాయి? ఈ గడచిన ఎనమిదేళ్ల కాలంలో మరీ ఎందుకు భజారునపడుతున్నారు. బతుకంటే ఎందుకు భయపడుతున్నారు…దినదిన గండంగా ఎందుకు బతుకులీడుస్తున్నారు. ప్రభుత్వాల మీద నమ్మకం ఎందుకు సన్నగిల్లుతోంది. ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న విశ్వాసం ఎందుకు లేకుండపోతోంది….స్వాతంత్య్రం వచ్చిన కాలం నుంచి ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుంటున్నా, ఇంతగా ధరల పెరుగుదలలో మోతను మాత్రం ఎప్పుడూ చూసింది లేదు. కారణం ఏమిటి? మనది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజా స్వామ్య దేశం. సామ్యవాద బావాలను అమలు చేసే దేశం. మిశ్రయ ఆర్ధిక వ్యవస్ధకు పునాదులు పడిన దేశం. ఇలాంటి దేశంలో ప్రజలు నిత్యం సుఖ శాంతులతో జీవనం సాగాలి. ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనప్పుడు బతుకు ఆగమైనా కాపాడుకున్న రోజులున్న దేశం మనది. అన్ని సమయాల్లో ప్రభుత్వాల సంక్షేమం వారిని కాపాడుతూ రావాలి. కాని ప్రజలు ఎందుకు ఇప్పటికీ అల్లాడుతున్నారు. సామాన్య జనం ఎందుకు విలవిలలాడుతున్నారు. మధ్య తరగతి బతుకులకు భరోసా ఎందుకు లేకుండాపోతోంది. దీనంతటికీ బాధ్యులు ఎవరు? అన్నది సామాన్యలకు కూడా అర్ధం కాని పరిస్ధితిలోకి ప్రభుత్వాలు నేట్టేస్తున్నాయి.ఇంతకీ సామాన్య ప్రజలు కోరుకునేది ఏమిటి?
తమకు నిత్యావసర వస్తువులు అందుబాటులో వుండాలి. చేసే పనికి సరైన వేతనం అందాలి. దోపిడీ వ్యవస్ధ పోవాలి. సమ సమాజ నిర్మాణం జరగాలి. అందరకీ కూడు, గూడు, గుడ్డ అందేలా జీవనం సాగాలి. ఇంతకన్నా ప్రజలు సహజంగా ఎక్కువ ఏదీ కోరుకోరు. ఇవన్నీ సరిపోయినంతగా వుంటే, విలాసవంతమైన జీవితం కోరుకుంటారు. అసలు బతకడమే కష్టంగా వున్న ఈ సమయంలో విలాస జీవితం గురించి కల కూడా కనలేని పరిస్ధితి ఎదురౌతోంది. దేశంలో జీఎస్టీ తీసుకొస్తే దేశమంతా ఒకే పన్ను విధానం అమలౌతుందని దేశ ప్రజలంతా ఆశించారు. కాని ఏమౌతోంది. తినే తిండి నుంచి మొదలు ప్రతి వస్తువు మీద జిఎస్టీ బాదుడుతో సామాన్యుడు కుదేలౌతున్నాడు. ఒకనాడు రూ.70 రూపాయలు వున్న వంటనూనే ఎందుకు ఇలా సలసలా కాగుతోంది. రెండు వందల యాభై రూపాయలదాకా ఎందుకు చేరింది? కారణం ఎవరు? మన వ్యవసాయ రంగం ఎటు పోతోంది? ఎరువుల ధరలు పెరుగాయి? విత్తనాల ధరలు పెరిగాయి? రైతులకు ఇచ్చే సబ్సిడీలకు మంగళం పాడారు? దాంతో వ్యవసాయం కూడా భారమైపోయే పరస్ధితి నెలకొన్నది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్ నిత్యావసర వస్తువులైనా సరే జిఎస్టీ వడ్డించడంతో సామాన్యుడి మీద పడే భారం గురించి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోంచకపోవడం విడ్డూరం. ప్రజలకు ప్యాకేజ్డ్ నిత్యావసర వస్తువులు ఆయా కంపనీలు అలవాటు చేశాయి. గతంలో కిలో గోధుమ పిండి కొనుగోలు చేయాలన్నా విడిగా అమ్మేవారు. అందులో ఎంత కల్తీ జరిగిదో తెలియదు. ఇప్పుడు మార్కెట్‌లో కొన్ని కంపనీలు తమ వ్యాపారంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు అవసరమైన కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తున్నాయి. అందులో శుధ్దమైన, శుద్ది చేయబడిన నిత్యావసర వస్తువులను ప్యాక్ చేసి మరీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. వాటిపై కూడా జిఎస్టీ వేసి సామాన్యులకు అది కూడా భారం చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే గాని, సామాన్యుడిని గాయం కావడంలేదా? తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఉచిత పధకాలు అలవాటు చేయడం అంత మంచిది కాదన్నంతగా మాట్లాడుతున్నారు.
ఇది ఎవరూ సమర్ధించాల్సిన అంశం కాదు. ప్రభుత్వాలున్నవి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అన్నది మర్చిపోవద్దు. ప్రజా సంక్షేమం కాంక్షించకపోతే ప్రభుత్వాలు వున్నది ఎందుకు? పాలన చేస్తున్నదెందుకు? ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వహించడం అన్నది వ్యాపారంగా ప్రభుత్వాలు భావించొద్దు. కాని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యాపారం చేయదల్చుకోలేదు అంటూ వ్యాఖ్యానించిన సందర్భం వుంది. దాంతో ఎల్‌ఐసి లాంటి సంస్ధను కూడా ప్రైవేటు పరం చేయజడం జరిగింది. ఒకనాడు ఎల్‌ఐసి ప్రైవేటు వ్యక్తులు మొదలు పెట్టిందే. 19955లో మొదటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఎల్‌ఐసిని ప్రభుత్వం పరం చేశారు. ప్రైవేటు బాగస్వామ్యం తగ్గించారు. ప్రభుత్వ రంగ సంస్ధగా తీద్దిద్దారు. దాంతో ఇప్పుడది సుమారు రూ.40వేల కోట్ల రూపాయల ఆస్ధులను కలిగివున్న సంస్ధగా గుర్తింపు పొందింది. ప్రజలకు ఒక భరోసా నింపుతోంది. అలాంటి సంస్దలను కూడా అమ్మకాలకు పెట్టి ప్రభుత్వాలు పాలన సాగించడంలో అర్ధమేమిటో సామాన్యులు కూడా తెలుసుకోవాల్సిన అసవరంవుంది. త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బిజేపికి కేంద్రంలో ఆప్ పార్టీ ఒక గుదిబండగా మారింది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలోనూ పోటీ చేస్తోంది. అక్కడ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం గురించి పెద్దఎత్తున ప్రచారం సాగిస్తోంది. ఇది మొదటికే మోసం వచ్చేలా వుందన్న ఆలోచన చేసిన ప్రధాని మోడీ ఉచితాలు ప్రజలకు అలవాటు అంత మంచిది కాదన్న మాటలు చెప్పడంతో ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాలను విస్మరిస్తే, కేంద్రం వాటిని హెచ్చరించాల్సిందిపోయి, కేంద్రమే సంక్షేమాలకు కోత పెట్టాలని ఒత్తిడి చేయడం అన్నది ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్ధకం చేస్తుందని చెప్పడంలో సందేహంలేదు. సేవా రంగాన్ని విస్మరించడం అన్నది పాలకులు చేసే అతి పెద్ద తప్పు. ఉచితాలు అమలు వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని అనడంలో సత్యం లేదు. అభివృద్ధి అంటే ఒక్క రోడ్లే కాదు…! ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం. ప్రజలు ఆరోగ్యంగా జీవించడం. మూడు పూటలా మూడు ముద్దలు తినగలగడం. నిరుద్యోగిత లేని సమాజం. వారానికి కనీసం 48 గంటల పని లభించడం. పేదలకు ప్రభుత్వ విద్య అందడం. ఉచిత వైద్య సేవలు అందించడం. మన దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ముడిపడి వుందే వ్యవసాయ రంగంతో…దాని సమృద్ది అవసరం. సమ్మిళిత అభివృద్ది అంటే అన్ని రకాలైన ఆహార పదార్ధాలను రైతులు పండిరచేలా ప్రోత్సహించడం. ఇంత పెద్ద మన దేశంలో ఎన్నో నీటి వనరులున్నా, ఇప్పటికీ నూనె గింజల మీద మలేషియా లాంటి దేశాల మీద ఎందుకు ఆధారపడుతున్నాం? అన్నది పాలకులు ఆలోంచిడం లేదు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలన్న నిర్ణయాలు ఎందుకు చేయడం లేదు. ధరల పెరుగుదలకు కారణం ఎవరు?
అన్నదానిపై కూడా ప్రజల్లో ఒక అవగాహనం లేకపోవడం కూడా విపరీత పరిణామం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మూలంగానే నిత్యావస వస్తువుల ధరల పెరుగుతున్నాయని ప్రజలు భ్రమపడుతున్నారు. అందుకే ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న ప్రతి చోట బిజేపి పాగా వేయగలుతోంది. కాని అది కేంద్రం వల్ల జరుగుతోందన్న సంగతిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఆ పార్టీలకు మొదటికే మోసం వస్తోంది. తెలంగాణలో కూడా మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగనున్నది. సోషల్ మీడియా పెద్దఎత్తున ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ధరల పెరుగుదలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్‌ఎస్ అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే వారికి జరుగుతున్నదానిపై అవగాహన లేదు. సంక్షేమ పధకాలు అందిస్తోంది టిఆర్‌ఎస్ అని తెలిసినా, ధరలు కూడా మరో పక్క పెంచుతోందన్న భ్రమల్లో ప్రజలుంటున్నారు. దాన్ని టిఆర్‌ఎస్ నేతలు గమనించడం లేదు. ప్రజల్లో చైతన్యం కల్గించాలన్న సోయిలో వారు లేరు. ఇప్పటికైనా మేలుకోండి. సామాన్యుల ఆలోచనల్లో మార్పును గమనించండి. వారిలో వున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయండి. లేకపోతే ధరల పాపమంతా టిఆర్‌ఎస్‌దే అన్న ఆలోచనలో సామాన్యులున్నారు. అది ఉప ఎన్నిక మీద తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు. ఏ గ్రామంలోని టిఆర్‌ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ఈ విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. పెరుగుతున్న ఉప్పు, పప్పు, నూనెల ధరలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్న సంగతి చెప్పుకోలేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ముందు టిఆర్‌ఎస్ నేతలు మేలుకోండి. ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం ముందు చేయండి. ఆ తర్వాత ప్రచారం చేసుకోవచ్చు.