దళిత బంధు మేసిన రాబందులెవరు?

`ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశలు, ఆశయాలు వమ్ము చేసిందెవరు?

`హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిరదెవరు?

`దళిత బంధును పప్పు బెల్లాలు చేసుకొని పంచుకొని మింగిందెవరు?

`ప్రతిపక్షాలకు మాటలకు కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులెవరు?

`ప్రతిపక్షాల మాయలో పడి దళితబంధు లబ్ధి దారులను దోపిడీ చేసిందెవరు?

`అమాయకపు దళితుల జీవితాలను ఆగం చేసిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందేమిటి? 

`అధికారులు ఆచరించిందేమిటి?

`ఎస్సీ కార్పొరేషన్‌ చేసిన ఘన కార్యమేమిటి?

`లబ్ధి దారులను పక్కదారి పట్టించడంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల పాత్రేమిటి?

`జిల్లా స్థాయి అధికారుల పంపకాల మాటేమిటి?

`ఉత్తుత్తి ట్రేడర్స్‌ కు సొమ్ము కట్టబెట్టడమేటి?

`కార్లు ఇచ్చిన ఏజెన్సీకి అదనంగా మరో లక్షన్నర కలపని అధికారుల ఆదేశాలలో ఆంతర్యమేమిటి?

`దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లు దళిత బంధు లూటీ మాటేమిటి?

`వందల కోట్లు మింగి, కరిమింగిన వెలగపండు చేస్తిరి?

`ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చితిరి?

`లబ్ధి దారులను మోసం చేసి, నిండా ముంచితిరి?

` ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తిరి?

`అసలు దొంగల చేత తిన్నది కక్కిస్తే గాని దళిత బంధు లక్ష్యం నెరవేరదు?

`రొయ్యలు తిని మూతి నాకినంత సులువుగా కోట్లు కొట్టేసి చేతులు దులుపుకుంటిరి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబం కళకళలాడాలి. ప్రతి దళితుడు లక్షాదికారి కావాలి. ఆత్మగౌరవంతో బతకాలి. ఆర్ధికంగా ఉన్నత స్ధితికి చేరుకోవాలి. సమస్యలు లేని జీవితాన్ని గడపాలి. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. ఆపసోపాలు లేని జీవన యానం కావాలి. తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అన్ని వార్గాలు ఆనందంగా బతకాలి. అందులో దళితులు మరింత సంతోషంగా బతికే రోజులు రావాలి. తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురౌతూ, సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోతూ, ఆర్ధిక అసమానతలతో వెనుకబడిన దళితుల జీవితాల్లో మార్పులు రావాలి. వారు కూడా సమాజంలో ఉన్నతంగా బతకాలి. అందుకు వారికి ఆర్ధిక చేయూత కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. ఉన్నతమైన ఉచిత విద్యావకాశాలు అందించాలి. రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చదిద్దాలి. అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి. వెనుబాటు తనం పోవాలి. అది సామాజిక పరంగానైనా, ఆర్దిక పరంగానైనా అందరూ ఏకతాటిపైకి వచ్చే సమాజ నిర్మాణం జరగాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన..ఆచరణ. 

 సమాజంలో దళిత వార్గల అభ్యున్నతి గురించి గొప్పగా కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న మాటే…మనం వింటున్న మాటే…కాని ఆచరణేది…ఆచరించిన వారేరీ..  

ఇన్నేళ్లయినా ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతూ వచ్చాయి. అందుకే కేటాంచిన సొమ్ము మూటలు మాయమైపోతూ వచ్చాయి…దళితులకు చేయూతనందించిన వారేరీ…గొప్పగా బడ్జెట్‌లో లెక్కలు చూపించి మోసం చేసిన వారే…అలా కాకుండా నేరుగా దళితులకు మేలు జరిగేలా, ఆర్ధికపరమైన లబ్ధి జరిగేలా, ప్రతి దళితుడు లక్షాదికారి అయ్యేలా చేయాలని ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైన, విప్లవాత్మకమైన దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టారు. తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించింది ముఖ్యమంత్రి ఒక్క కేసిఆర్‌ మాత్రమే…గతంలో చాలా మంది నాయకులు, చాల మంది ముఖ్యమంత్రులు చాలా చెప్పారు. కాని ఏది ఆచరించి చూపించలేదు. బడ్జెట్‌లలో కేటాయింపులు, తర్వాత వాటి మళ్లింపులు. ఇవే కాదా…మొన్నదిదాకా చూసింది…కాని నేడు ఆ పరిస్ధితి లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న తరుణమిది. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో తీసుకోవడం జరిగింది. ఆ నియోకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షలు అందించే కార్యక్రమం మొదలైంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఉన్నతమైన ఆశయాలు…ఆలోచనతో…ఆచరాత్మక దృక్పధాన్ని మేళవించి ఒక విప్లవాత్మక ధోరణితో దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. కాని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులకు చెవికెక్కలేదా?… లేక సరిగ్గా వినిపించుకోలేదా? ముఖ్యమంత్రి ఆదేశాలూ పూర్తిగా అవగాహన చేసుకోలేదో? ఏమో గాని దళిత బంధు అమలులో అధికారుల తీరు వివాదాస్పదమౌతోంది. పెద్దఎత్తున చర్చనీయాంశమౌతోంది. దళిత బంధు ఆశయాలకు తూట్లుపొడిచారన్న విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పై స్ధాయి అధికారులు చేసిన అవకతవలపై, కింది స్ధాయి అధికారుల మెడకు చుట్టుకునే పరిస్దితులు రానున్నాయి. ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి దళితుడిని లక్షాధికారి చేయాలన్న గొప్ప సంకల్పంతో చేస్తున్న యజ్ఞానికి తూట్లు పొడిచి, పైలెట్‌ ప్రాజెక్టులోనే పెద్ద కుంభకోణానికి అధికారులు తెరతీసినట్లు స్పష్టమౌతోంది. 

 ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అన్నవి కనీస అవసరాలు..

.అవి తీరాలంటే పని చేయాలి. కష్టపడాలి. డబ్బు సంపాదించాలి. అందుకు ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏదో ఒక రూపకంగా అందాలి. దాన్ని ప్రతి వ్యక్తి ఆచరించాలి. అనుసరించాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇది మనిషి ఫిలాసఫీ…అనుసరించి…ఆచరించాల్సిన ప్రాక్టికాలిటి…కాని సమజాంలో ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలు మారినా తలరాత మారని, జీవితాలు మార్పులు రాని దళిత సమాజం పట్ల గత ప్రభుత్వాలు సానుభూతి మాత్రం చూపిస్తూ వచ్చేవి. కాని వారి జీవితాల్లో వెలుగులు నింపే పని జరగలేదు. కాని ఇప్పుడు మొదలైంది. దళిత బంధుతో ఆ యజ్ఞం ప్రారంభమైంది. అందుకు ప్రతి దళితకుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఆర్ధికపరమైన సాయం అందిస్తోంది. ఆ సొమ్ముతో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది. హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సుమారు 18వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టింది. గొప్పగా ఆ పథకం అమలుకు మార్గం వేసింది. కాని అధికారుల తీరుతో ఆ పధకం అసలు లక్ష్యాలకు తూట్లు పడేలా చేసింది. నిజానికి ప్రభుత్వ లక్ష్యం వేరు…అధికారులు అనుసరించింది వేరు…అందులోనూ కుంభకోణానికి తెరతీశారు…దాంతో ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో చేపట్టిన పధకాన్ని అధికారులు నీరు కార్చుతున్నారు. దళిత బంధు అమలుకు ఎవరి రెకమెండేషన్‌ అవసరం లేదు…దళితుడైన ప్రతి వ్యక్తికి ఆర్ధిక చేయూత కల్పించబడాలి. ఇదే అధికారులకు వరంగా మారింది. లబ్ధిదారులైన ప్రతి దళితుడికి ముందు రూ.5లక్షలతో వారు కోరుకున్న యూనిట్‌ అందజేయాలి. లేదూ..కొంత మంది కలిసి ఏర్పాటు చేసుకొనే సంయుక్త యూనిట్‌ను అందించాలి. ఇవన్నీ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఎవరెవరు ఏ ఉపాధి కావాలనుకుంటున్నారు…వారికున్న నైపుణ్యాన్ని బట్టి ఆయా యూనిట్లను అందించాల్సిన బాధ్యత ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులది. కాని ఇక్కడ జరిగింది వేరు…పథకం అమలులో సొమ్ములు ఖర్చు చేశారు..కాని లక్ష్యాలకు తూట్లు పొడిచారు…దళితుల జీవితాలను ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్నట్లు తయారు చేశారు…

దళిత బంధు అమలులో అందించిన యూనిట్ల జాడేది అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

పెద్దఎత్తున ఎస్పీ కార్పోరేషన్‌ అధికారులు పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా వాటాలు పంచుకున్నట్లు లెక్కలేసి, దళిత బంధు సొమ్మును దానంగా ఇస్తున్నట్లు ఇచ్చింది తీసుకోండన్నట్లు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. దళిత బంధు సొమ్ము ప్రతి దళితుడి అక్కంట్లో వున్నప్పటికీ వాటిని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఎంతో చాకచక్యంగా వాటిని మళ్లించే ప్రయత్నం చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారికి, నగదు ఆశ చూపించి మోసం చేశారు… 

 ప్రతిపక్షాల తీరు…అధికారుల పనితీరు… రెండూ కలిసి దళిత బంధు అమలుకు తూట్లు పొడిచేలా చేశాయి. 

అసలు దళిత బంధు అన్నది అమలుసాధ్యం కానిదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పధకమంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. అంతే కాకుండా ప్రభుత్వం దళితుల అక్కంట్లో వేసిన డబ్బులు తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం విసృతంగా చేశాయి. ఆ మాటలే నిజమన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరించారు. లబ్ధిదారుల బలహీనతలను అధికారులు సొమ్ము చేసుకున్నారు. ప్రెండ్లీ ఎంప్లాయిస్‌ అని ప్రభుత్వం చెబితే..దళిత బంధులను ఊడ్చుకుతిన్నారు…వాటాలేసుకొని పంచుకుతిన్నారు. లబ్ధిదారులను మోసం చేశారు…

  మేం వేలు పెడితే రాజకీయమౌతుందని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్‌ నేతలు ఈ విషయంలో వేలు పెట్టలేదు.

 దళితులందరికీ సాయం అందుతున్నప్పుడు వాటిని రాజకీయం చేయకుంటనే మేలని బిఆర్‌ఎస్‌ నేతలు ఎంతో హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్షాలేమో…దళిత బంధు ఫెయిల్‌ కావాలని కుయుక్తులు పన్నాయి. గందరగోళం సృష్టించారు. ప్రజలను రెచ్చగొట్టారు. అమాయకులైన వారికి లేనిపోనివి కల్పించి చెప్పారు. దళిత బంధు డబ్బులు వాడుకోకపోతే, ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం సృష్టించారు. ప్రతిపక్షాలు సృష్టించి ఈ గందరగోళం ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల పాలిట వరమైంది. పట్టించకునే నాధుడు లేడు…అడిగే దిక్కులేదనుకున్నారో ఏమో ఇష్టారాజ్యం చేశారు. దళిత బంధులో దక్కించుకోవాల్సినంత దక్కించుకున్నారు. విస్తరిలో మిగిలిన మెతుకులు విధిల్చినట్లు లబ్ధిదారులకు సున్నం పెట్టారు. ఆకు వక్కలు మాత్రం అధికారులు తిన్నారు. నోరు పొక్కినా ఏదో రుచి నాలుకకు అంటిందే పరమన్నామ్మన్నట్లు అధికారులు ఇచ్చింది లబ్ధిదారులు పుచ్చుకున్నారు. పుణ్యానికి వచ్చింది ఎంతైతే అంత అని సరిపెట్టుకోమన్నారు. తమకు చెందాల్సిన సొమ్మును ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు కాజేస్తున్నారన్న సత్యం తెలుసుకోలేకపోయారు. లబ్ధిదారుల బలహీనతే అధికారులు అప్పనంగా వాడుకున్నారు…దోచుకోవాల్సినంత దోచుకున్నారు…(ఉత్తుత్తి ట్రేడర్ల మాయాజాలం…దళిత బంధు నిధులు మాయం) రేపటి మీ నేటిధాత్రిలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!