ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల చికిత్సలు?
`టెస్ట్ లకు అందుబాటులో పరికరాలు, మిషన్లు?
`జిల్లా స్థాయిలో స్కానింగ్ మిషన్లతో సహా , ఉచిత అనేక సదుపాయాలు.
` ప్రైవేటుకన్నా మెరుగైన వైద్యం!
`జిల్లాలలో మరింత అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు?
`పెద్ద ఎత్తున వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు
`భూపాలపల్లి లాంటి ఆసుపత్రుల్లో కూడా మోకాలి ఆపరేషన్లు
`మంత్రి హరీష్ రావు చొరవతో ఆసుపత్రులకు పూర్తి సౌకర్యాలు
`రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే….
`వరంగల్ లో రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మాణ దశలో…
` ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ….
` ప్రభుత్వ వైద్యం అందరికీ అందుబాటులోకి…
`హైదరాబాదు చుట్టూ నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులు…
`ఇప్పటికే వందలాది బస్తీ దవఖానాలు…
` ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ వైద్యం…
`తప్పని పరిస్థితి ప్రైవేటు వైద్యానికి ఎల్ ఓసి సాయం..
` సిఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు మరో వరం…
`తెలంగాణ ప్రభుత్వంలో పేదలకు మేలైన ఉచిత వైద్యం.
హైదరాబాద్,నేటిధాత్రి:
మందులు గోలీలు మంచి సూదులు ఇస్తున్రంట..అత్తోపోదాం రావే…మన ఊరి దవఖానకు అన్న పాట వచ్చి నలభై ఏళ్లవుతోంది. ఆ పరిస్ధితి ఇప్పుడు తెలంగాణలో నిజమౌతోంది. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా జిల్లా స్ధాయి ఆసుపత్రులలో కూడా అందుతోంది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యం ఎంతో వేగంగా అందుబాటులోకి వచ్చింది. ఒకనాడు ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఎలా వుండేవో గుర్తు చేసుకుంటే గగుర్భాటు కలగకమానదు. మండల కేంద్రాలలో పశు వైద్యశాలలు పనిచేసినంతగా , ప్రజలకు వైద్య సేవలు అందేవి కాదు…! అందుకే అప్పట్లో ప్రభుత్వ వైద్యం అన్నది అందని ద్రాక్షగా వుండేది. ఒక దశలో ప్రభుత్వ వైద్యం ప్రజలు ఉచితంగా అందించిడం సాధ్యం కావడంలేదన్న మాట కూడా ప్రభుత్వాలనుంచి వినపడిరది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో అందించాలంటే కొంత ఫీజు వసూలు చేయాలని నిర్ణయించి, అమలు చేసిన రోజులున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అలా ఉచిత వైద్యానికి మంగళం పాడారు. ప్రజలు, ప్రతిపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తెల్ల కార్డు దారులకు మినహాయించి, మిగతా ప్రజల నుంచి ప్రభుత్వ వైద్యసేవలకు ఫీజులు వసూలు చేసిన సందర్భం కూడా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యమే అంతంత మాత్రమంటే, పేదల నుంచి సైతం ఫీజులు వసూలు చేసిన దుర్మార్గం ఆనాటి పాలకుల ఘనకార్యం. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యం దూరం చేశారు. ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. దానికి చంద్రబాబు నాయుడు హయాంలో బీజంపడిరది. ఇది రాజకీయంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉపయోగపడిరది. కాని వైఎస్ కూడా అదే దారిలో నడిచారు. ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన మరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో ప్రభుత్వ వైద్యం ఐసియూకి చేరేదారా వెళ్లింది. ఆరోగ్య శ్రీ అనే పధకం తెచ్చి, పేదలకు కార్పోరేట్ వైద్యం అందించారు. లక్ష్యం మంచిదే కాని, అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే బాగుండేది. కాని ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు వేలాది కోట్ల రూపాయలు దోచిపెట్టారు. అదే సొమ్మును ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి, వైద్యుల నియామకాలకు, సౌకర్యాల కల్పనకు వినియోగిస్తే ఇప్పటికే మరింత ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చేది. కాని అలా చేయలేదు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేయడానికే ప్రాదాన్యమిచ్చారు. ఒక్క రూపాయికే వైద్యం చేసినట్లు చెప్పుకున్న వైఎస్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను పక్కనపెట్టి, ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలిసేందుకు మార్గం వేశారు. ఆరోగ్య శ్రీ సేవల పేరుతో కోట్లాది రూపాయల బిల్లులు వసూలు చేసుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర వైద్య సేవలకు ప్రజలనుంచి జలగల్లా వసూలు చేసుకొని, బ్రాంచిల మీద బ్రాంచీలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రావడం, కేసిఆర్ ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ ప్రజా వైద్యానికి మంచి రోజులొచ్చాయి.
ప్రతి జిల్లాకు ఒక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తోంది. వరంగల్ లో సుమారు 2వేల పడకల ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయి. త్వరలో వాటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో కరోనా సమయంలో టిమ్స్ అందుబాటులోకి తెచ్చారు. కరోనా ఉచిత వైద్యం పేదలకు అందించారు. కొన్ని వందలాది బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారు. పేదల కాలనీలకే వైద్యం తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్దాసుపత్రి నిర్మాణం జరిగింది. ఇప్పటికే అనేక జిల్లాలో వైద్య శాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నియోకవర్గ స్ధాయిలో ముప్పై పడకల ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. పేదలకు ప్రభుత్వ వైద్యం ఎంతో అందుబాటులోకి వచ్చింది. తాజాగా భూపాల పల్లిలో ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యానికి వెళ్లిన గర్భిణీకి బస్సులో పురిటి నొప్పులు వస్తే, ప్రభుత్వ వైద్యులు ప్రసవం చేసి, తల్లి బిడ్డను రక్షించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలకు ఒక మార్గ దర్శకంగా మారాయి. ప్రజలకు వైద్య సేవల్లో ప్రభుత్వ వైద్యులు ఎంత అంకితభావంతో పనిచేస్తున్నారో ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది. ప్రజల్లో భరోసా నింపింది. తెలంగాణలో ప్రభుత్వ వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ వైద్యం పేదలకు మరింత అందుబాటులోకి వస్తోంది. పల్లెలతోపాటు, మండల, నియోకవర్గ, జిల్లా స్ధాయిల్లో మెరుగైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి తోడు మాతా శిశుసంరక్షణ కేంద్రాల పేరుతో ఏర్పాటైన ఆసుపత్రుల్లో గర్భిణీలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో మహిళ గర్భం దాల్చిన నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు నెల నెల పరీక్షలకు వెళ్లేవారు. అవి జలగల్లా ఫీజులు వసూలుచేసేవి. పైగా నార్మల్ డెలివరీ చేస్తే, ఫీజులు వసూలు చేయడం కుదరదని, ప్రజలను డెలివరీ కష్టమౌతుందని చెప్పి, సిజేరియన్లు చేసేవారు. వేలాది రూపాయలు వసూలు చేసేవారు. కాని ఇప్పుడు పరిస్ధితి మారింది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లేవారే కరువయ్యారు. నెల నెల వైద్య పరీక్షలకు కూడా గర్భిణీలు ప్రభుత్వాసుత్రికే వెళ్తున్నారు. ప్రతి నెల రికార్డు స్ధాయిల్లో డెలివరీలు చేస్తున్నారు. తల్లి బిడ్డలను సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ అయితే తప్ప, అన్నీ నార్మల్ డెలివరీలే చేస్తున్నారు. దాంతో మహిళకు మరింత ఆరోగ్య భద్రత చేకూరుతోంది. కేసిఆర్ కిట్‌తోపాటు, అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడిత రూ.13వేలు నగదును అందజేస్తోంది. కేసిఆర్ కిట్‌లో బేబీ ఆరోగ్య సంరక్షణ కోసం ఏడాదికి అవసరమైన వస్తువులన్నీ అందజేస్తారు. డెలివరీ అయిన వారిని ఉచిత రవాణ సౌకర్యం ఏర్పాటు చేసి, ఇంటికి చేర్చుతున్నారు. ఇలాంటి వైద్య సేవలు కనీసం ఊహించామా?
వైద్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాద్యతలు స్వీకరించిన నుంచి వైద్య రంగంలో వినూత్నమైన మార్పులే కాదు, ఊహించని విజయాలు చూస్తున్నాం. సహజంగా హరీష్‌రావు అంటేనే పరి రాక్షసుడు అని ముద్దుగా పిలిచుకుంటారు.ఆయన కాలుకు బలపం కట్టుకొని తిరడం అన్నది అందరికీ తెలిసిందే. అలాంటిది వైద్యం రంగం రూపు రేఖలు మార్చకుండా ఆయన ఊరుకుంటాడా? ప్రతి జిల్లా తిరుగుతున్నారు. ఆసుపత్రులు సందర్శిస్తున్నారు. పర్యటనలు సాగిస్తూ, రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటున్నారు. ప్రత్యక్షంగా ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ప్రజలనుంచి వ్యక్తమౌతున్న విషయాలను అమలు చేస్తున్నారు. ఆసుపత్రులకు అవసరమైన సౌకర్యాల కల్పన చేపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు మరింత అందుబాటులోకి తెస్తున్నారు. ప్రతి జిల్లాలో వంద పడకల ఆసుపత్రుల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఆసుపత్రికి 23 మంది డాక్టర్లు,అందులోనూ స్పెషలిస్టులను నియామకం చేశారు. మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ స్కానింగ్ సెంటర్లు, ఇతర అన్ని రకాల పరీక్షల పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. టెస్టులకు , చికిత్సలకు అవసరమైన ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ప్రజలు రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల టెస్టులను కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉచితం చేస్తున్నారు. త్వరలో జిల్లాల్లోనూ కూడా కార్డియాటిక్ వైద్య సేవలు, మోకాలు శస్త్ర చికిత్సలు, ఈ అండ్ టీ సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. అందుకు వైద్యుల నియామకాలు కూడా పూర్తి చేశారు. చాలా చోట్ల ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి ఇలా వుంటే ప్రభుత్వాసుపత్రిలో వైద్యం విషయంలో ఏదైనా ఇబ్బంది ఎదురై, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వారికి ఎల్‌వోసి రూపంలో లక్షలాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలా ఎంతో మందికి వైద్య సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. అంతే కాకుండా అప్పో,సొప్పో చేసి, ప్రైవేటు వైద్యం చేయించుకున్న పేదల జీవితాలకు మళ్లీ చేయూత నందించేందుకు పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి గతంలో ఎన్నడూ చూడని విధంగా సాయం అందిస్తున్నారు. ఓ వైపు పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో మేలైన వైద్యం అందుబాటులోకి తేవడమే కాకుండా, ప్రైవేటులో వైద్యం అవసరమైన సందర్బాలలో కూడా ప్రజలను ఆదుకుంటూ, ప్రజారోగ్యానికి , జీవితానికి భరోసా కల్పించడం అన్నది గతంలో ఎన్నడూ లేదు. ప్రభుత్వ డాక్టర్లూ…ఈ ఒక్క పనిచేస్తారా? ప్రజల్లో ప్రభుత్వ వైద్యం మీద మరింత నమ్మకం కలగాలంటే ఒక్క పనిచేయండి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే కేవలం పేదలే కాదు, అన్ని వర్గాల ప్రజలు రావాలి. అప్పుడే ప్రజలకు మరింత భరోసా కల్గుతుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎప్పుడో అప్పుడు అరుదైన చికిత్సలు చేయాల్సిన అవసరం రావొచ్చు. వాటిని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేయొచ్చు. వ్యక్తుల ప్రాణాలకాపాడొచ్చు. అలాంటి అరుదైన సంఘటనల విజయాలపై ఎప్పటికప్పుడు కనీసం మీడియాకు సమాచారం అందించండి. దాంతో మన ప్రభుత్వాసుపత్రిలో అలాంటి వైద్య సేవలు కూడా అందుతున్నాయన్న భరోసా ప్రజల్లో కల్గుతుంది. ప్రభుత్వం మీ మీద పెట్టుకున్న ఆశలకు న్యాయం జరుగుతుంది. పేద ప్రజలకు మరింత ప్రభుత్వ వైద్యం అందుతుంది. ప్రైవేటు ఆసుపత్రులు నడుపుకునే వైద్యులు కూడా మేం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తామని ముందుకొచ్చేందు వీలుపడుతుంది. ప్రైవేటు దోపడి ఆగుతుంది. పేదల జీవితాలకు అండగా నిలిచినట్లౌతుంది. ఇప్పుడున్న కాలంలో వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి సామాన్యుడు వెళ్తే జీవితంలో సంపాదించుకున్నదంతా ఊడ్చుకోవడం తప్ప మరేం లేదు. వైద్యులు దేవుళ్లు… ప్రభుత్వ వైద్యులు అంతకన్నా ఎక్కువ అని కొలువబడాలి. అందుకు మీరే ప్రభుత్వాసుపత్రులను కాపాడాలి. ప్రజలకు ప్రాణాలు పోయాలి.