తెలంగాణలో ఆంధ్రా బ్రోకర్లు?

`బండ్లు, బర్రెలు ఏవీ వదలరు?

`లబ్ధిదారులే లక్ష్యంగా తెలంగాణలో తిష్టవేశారు.

`తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.

`కొందరు అధికారులు వెనకుండి నడిపిస్తున్నారు.

` ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు.

`దళితుల జీవితాలను బ్రోకర్లు దోచేస్తున్నారు.

`దళారుల పాలౌతున్న దళిత స్కీమ్‌ లు!

`దళితుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

`తాజాగా దళితులపై దళారుల దౌర్జన్యం!

`బర్రెలను లాక్కునేందుకు భేరం?

` పై అధికారుల అండతోనే రైతులకు బెదిరింపుల పర్వం.

`చెప్పినట్లు వింటే మంచిది…లేకుంటే ఆగం చేస్తం.

`బర్రెకు రూ. 60వేలు ఇస్తాం!

`మూసుకొని తీసుకోండి?

`మాకు డబ్బులొద్దు…యూనిట్లే కావాలి: రైతులు

` బిక్కు, బిక్కు మంటున్న రైతులను తీసుకెళ్ళిన అధికారులు.

`యూనిట్లు మాకు, ఫోటోలు మీకు అంటున్న దళారులు

`మీ దిక్కున్న చోట చెప్పుకొమ్మని బెదిరింపులు.

`అధికారులకు కూడా దళారుల హెచ్చరికలు.

`ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయమంటున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులే ఇదంతా చేయిస్తున్నారు?

`ఆంధ్రా దళారులతో దందా సాగిస్తున్నారు?

`మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు?

మిలీనియం ట్రైన్లో ఏం జరిగింది?

`మధురలో దిగిందెంత మంది?

`హర్యానాలో ఏం జరుగుతోంది?

`దళారులు ఉచ్చులో చిక్కిన రైతులెక్కడ?

`దళారులు సృష్టించిన దొంగ వీడియోల మతలబేమిటి?

హైదరాబాద్‌,నటిధాత్రి: 

అది వరంగల్‌ రైల్వే స్టేషన్‌. దాదాపు ముప్పై మంది రైతులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారంతా నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల రైతులు. వారికి తోడుగా ఓ ఇద్దరు ప్రభుత్వ అధికారులు కూడా వచ్చారు.ఒకరు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారి, మరొకరు వైద్యురాలు. ఇంతలో చెన్నై నుంచి న్యూ డిల్లీ వెళ్లాల్సిన మిలీనియయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ వచ్చింది. రైతులంగా ట్రైన్‌ ఎక్కేశారు. రైలు కదిలింది. రైతులకు కేటాయించిన సీట్లలో అందరూ కూర్చున్నారు. ఎక్కడికక్కడ అందరూ కుదట పడ్డాక కొందరు కొత్త వ్యక్తులు రైతుల వద్దకు వచ్చి పలకరించడం మొదలుపెట్టారు. ముందు వాళ్లను వాళ్లు పరిచయం చేసుకున్నారు. రైతులతో మాటలు కలిపారు. మెల్లిగా రైతులకు కొత్త తరహా విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో బల్లార్షా రానే వచ్చేస్తోంది. రైతులను మీరేం తింటారు? అంటూ ఆ కొత్త వ్యక్తులు అడగడం మొదలుపెట్టారు. మీరెవరు? మాకు భోజనాలు చెప్పడానికి? మా బోజనాలు మేం తెచ్చుకున్నాం..అవసరమైతే అధికారులు వున్నారు. వారు మా అవసరాలు తీర్చుతారిన కొందరు రైతుల మొహమాటం లేకుండా చెప్పేశారు. కాని కొంత మంది రైతుల అమాయకత్వం..వారి బలహీనతలు తెలుసుకున్న అపరిచిత వ్యక్తులు అందులో కొంత మంది రైతులను మెప్పించి వారు కోరిన భోజనాలు తెప్పించారు. దాంతో వారికి, అపరిచితులైన వారికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చే గెదెలు తీసుకొని మీరేం చేస్తారు? వాటిని కాయడం, నిత్యం దానా ఖర్చు భరించడం, పొద్దు, మాపు వాటిని సంరక్షించుకోవడం, రాత్రి పగలు తేడాలేకుండా కాపాడుకోవడం, జీవితాలకు ఎలాంటి సంతోషం లేకుండా వాటితోనే జీవితం గడపడం అవసరమా? అంటూ ముందు ఆలోచనలో పడేశారు. తర్వాత భయపెట్టారు. నిజమే కదా..? గేదెలుంటే ఊరు దాటి వెళ్లలేము… పెళ్లి పేరంటాలకు వెళ్లలేము..సంతోషంగా బందువుల ఇంటికి వెళ్లలేము..ఎక్కడికి వెళ్లినా మూగ జీవాల గురించి ఆలోచనే తప్ప, వెళ్లిన సంతోషం కూడా వుండదు..ఇదీ అక్కడ మొదలైన చర్చ. చెప్పుకోవడానికి బాగానే వుంటుంది కాని, గేదలను కాపుకాయడం అంటే అంత సులువేం కాదు..! అంటూ మాటలు కలిపారు. దాంతో మరేం చేయమంటారు? అని రైతులు ఆ అపరిచిత వ్యక్తులను అమాయకంగా అడిగారు. అప్పుడు మీకు గేదెకు రూ.60వేలు ఇస్తాము..గేదెలతో ఫోటోలు దిగి..వాటిని అధికారులకు అందజేయండి? అంతే సరిపోతోంది? అన్నారు. దాంతో కొందరు రైతులు కంగారు ప డ్డారు. కొందరు సరే అన్నారు. అయితే ఇంతా చేస్తే కొద్ది మంది రైతులు ఒప్పుకుంటే మనకేం లాభమనుకున్నారో…ఏమో? దళారులు..అందరు రైతులు ఒప్పుకునేలా చేయాలని అనుకున్నారు. రైతులందరినీ ఒప్పించాలని దళారులు చూశారు. కాని కుదర లేదు. దాంతో నయానో, భయానో అయినా సరే రైతులను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. అయినా కొంత మంది దళితులు ససేమిరా? అన్నారు. తమ వద్దకు వచ్చిన అపరిత వ్యక్తులు చెబుతున్న విషయాలను రైలులోనే వున్న అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు రైతులతోపాటు వచ్చిన దళారులను నిలదీశారు. తెగించిన దళారులు పై స్ధాయి అధికారులతో సదరు అధికారులను బెదిరించడం మొదలుపెట్టారు. కాని సదరు అధికారి ప్రభుత్వ లక్ష్యాన్ని రైతులకు వారి జీవితాలలో మార్పుల గురించి విరవించారు. అయినా కొంత మంది అమాయక దళిత రైతులు దళారులనే నమ్మారు. వారి మాయ మాటలు విన్నారు. వారు ఏర్పాటు చేస్తామన్న సౌకర్యాలపై ఆసక్తి చూపారు. దళారులు చెప్పినట్లు విని వారితో మధురలో దిగారు. ఇంతటితో ఆగకుండా అదే రైతులతో దళారులు వీడియోలు సృష్టించి, అధికారులు తమకు సహకరించ లేదని, తమకు సదుపాయల కల్పన చేయలేదని నెపం అధికారుల మీద నేట్టేసే ప్రయత్నరం చేశారు. అక్కడున్న రైతులు ఆ వీడియోలు చూసి, అది వాస్తవం కాదంటూ నేటిధాత్రికి వివరాలు అందించారు. కొందరు రైతులు తమ ఎమ్మెల్యేలకు పిర్యాధు చేస్తామంటే కూడా దళారులు మేం ఏ ఎమ్మెల్యేలకు, మంత్రులకు భయపడం అంటూ రైతులను బెదించారని తెలుస్తోంది. దాంతో కొందరు రైతులు మరింత డైలామాలో పడినట్లు సమాచారం. దళారులకు తోడుగా మహారాష్ట్రలో కూడా కొంత మంది రౌడీలు ట్రైన్‌ ఎక్కినట్లు రైతులు చెబుతున్నారు. ఆ రైతులు ఇప్పుడు హార్యానా రాష్ట్రంలో మేలైన గేదెలను ఎంచుకుంటున్నారు.

దళారులతో వెళ్లిన రైతులు అధికారులతో లేకుండా, తోటి రైతులతో కాకుండా వేరే దగ్గర వున్నారని తెలుస్తోంది. ఇలా రైతులను మోసం చేస్తున్న వారిని ఇలాంటి సమయంలోనే గుర్తించి తగిన శాస్తి చేస్తే తప్ప మరోసారి ఇలాంటి తప్పులు జరిగే అవకాశం లేదు. వాళ్లంతా దళితులు..దళిత రైతులు. కొద్దో గొప్పో వున్న భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కూలీ నాలి చేసుకుంటూ కుటుంబం పోషించుకుంటున్నారు. కానీ వారి జీవితాల్లో ఎదుగూ లేదు..బొదుగూ లేదు. శ్రమ దోపిడీ సమాజంలో వారి కూలీ గిట్టుబాటు కాక, సంపాదన సరిపోక అవస్ధలు పడుతున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశయం. ఇదే కొందరు బ్రోకర్ల పాలిట వరమౌంతోంది. అసలు ఇలాంటి పధకాలు అందాల్సిన వారికి పండగ కావాలి. వారి జీవితాలు పండాలి. వారి ఆకలి బాధలు తీరాలి. సమాజంలో వారికి గుర్తింపు రావాలి. ఆర్ధిక స్ధితిగుతుల్లో పెరుగుదల కనిపించాలి. ఆర్ధిక స్వాలంబన దిశగా దళితుల జీవితాల్లో వెలుగులు నిండాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. ఆచరణ. కాని క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో వివరంగా నేటిధాత్రి అందిస్తున్న ఆసక్తికరమైన నిజం..

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంత కాలానికి దళితుల జీవితాలలో మార్పులు తీసుకురావడానికి సాగులో పంటతోపాటు, పాడి జతైతే వారి జీవితంలో పాలు పోసినట్లే అనుకున్నారు. దాంతో వ్యవసాయ భూమి కలిగి వున్న దళితులకు స్వయం ఉపాధి కింద నాలుగు గేదెలు( బర్రెలు) అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. అమలులో బాగంగా కొన్ని మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేసింది. ఈ పధకం విసృతంగా అమలు జరిగింది. ఇంతలో కరోనా విస్తరించడంతో ఈ పథకం అమలులో కొందరికి జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ దళితులకు గేదెలను అందిచే కార్యక్రమం మొదలైంది. ఇదే ఇప్పుడు దళారుల పాలిట వరమైంది. అనాదిగా దళితులు దగా పడుతూనే వున్నారు. కాదు..కాదు దళితులను దగా చేస్తూనే వున్నారు. మొదటి సారి దేశంలోనే దళితుల సంక్షేమం కోసం తెలంగాణలో విప్లవాత్మకమైన పధకాలు అమలౌతున్నాయి. దళిత సమాజం మిగత వర్గాలతో సమానమైన ఆత్మగౌరవమే కాదు, ఆర్ధిక స్వాలంబలన సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేకంగా కొన్ని పధకాల రూపకల్పన చేశారు. వాటిని అమలు చేస్తున్నారు. కాని కొంత మంది అధికారుల మూలంగ ఆ పధకాల అమలుతో కొంత ఇబ్బంది జరుగుతోంది. వారి మూలంగా ఆ పథకాల అమలు పక్కదారి పట్టేందుకు దళారులు రంగంలోకి దిగుతున్నారు. అది కూడా పక్కరాష్ట్రం నుంచి వచ్చి తెలంగాణ సంక్షేమంలో వేలు పెడుతున్నారు. దళితులను మోసం చేస్తున్నారు. ఆర్ధికంగా సుస్దిరపడాల్సిన సమయంలో మళ్లీ అస్ధిరతలో పడేస్తున్నారు. దళితుల సంక్షేమం కోసం అందుతున్న పధకాలలో దళారులు చేసి దోచుకుపోతున్నారు. గద్దల్లా వారికి అందిన వాటిని ఎత్తుకు పోతున్నారు. డబ్బు ఆశ చూపి, దళితుల జీవితాలతో కొంత మంది బ్రోకర్లు తెలంగాణ దళితుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారు. పధకాలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వలక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అయితే ఇక్కడే అసలు లొసుగు దాగి వుంది. పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చొని దళితుల జీవితాలను తీర్చిదిద్దేందుకు దోహపడాల్సిన అధికారులు దళితులకు అందిన సొమ్ముకు ఆశపడడంతోనే ఇదంతా జరుగుతోంది. దళితుల జీవితాలు దగా పడుతున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!