ఎన్టీఆర్ అభిమానులను తన్నిన లోకేష్ అనుచరులు.
చదువుకున్న మందబుద్దులు.
అమెరికా చేరినా మానని చిల్లర చేష్టలు?
ఆధిపత్య పోరులో తెలుగుదేశం రాజకీయాలు
హైదరాబాద్,నేటిధాత్రి:
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నారా లోకేష్ అభిమానులు అమెరికా లో ఆటా వేధిక వేడుక సాక్షిగా తన్నకున్నారు. చొక్కాలు చించుకున్నారు. వీధి రౌడీల్లా బిహేవ్ చేశారు. రాయాలంటే సిగ్గనిపిస్తోంది. చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇంతేనా మీ తెలివి అని తిట్టాలనిపిస్తోంది. అంత దూరం వెళ్లినా కురచ మనస్తత్వాలుగా మిగిలిపోవడం విచిత్రంగా వుంది. విడ్డూరంగా వుంది. చదివేస్తే వున్న మతి పోతుందని పెద్దలెందుకన్నారో ఆటా వేధికగా అమెరికా ప్రవాస తెలుగు వాళ్లు నిరూపించారు. ఎంతో సరదాగా, సందడిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా , వేడుకల్లా సాగాల్సిన సభలలో వివాదాలేమిటి? అసలు అక్కడ రాజకీయాలేమిటి? అందనంత దూరంలో వున్నారు. ఏడాదికోసారి కూడా మాతృ భూమికి రాలేరు. ఇక్కడ బతకడం కష్టమనే వెళ్లారు. ఉపాధి వెంట పరుగులు పెట్టారు. విలాసవంతమైన జీవితం కోరుకున్నారు. ఇక్కడ ఓటు హక్కు చాలామందికి లేకపోవచ్చు. అలాంటి వారికి రాజకీయాలతో పనేంటి? అందులోనూ హీరోల కోసం కొట్టుకోవడం ఏమిటి? రాజకీయాల కోసం తన్నుకోవడం ఏమిటి? ఇక్కడ నారా కుటుంబం, నందమూరి కుటుంబం కలిసే వుంది. వాళ్ల బంధుత్వం బాగానే సాగుతోంది. దేశం కాని దేశంలో బతుకు దెరువు కోసం వెళ్లిన తెలుగు వాళ్లు ఆప్యాయత, ఐక్యత మర్చిపోయి, ఎవరికోసమో.. కొట్టుకోవడం ఏమిటి? చిన్నతనం అనిపించడం లేదా? అక్కడ కూడా ఇదే ఆధిపత్యం, తెలుగు పౌరుషం అనుకుంటే అమెరికా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగండి. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అలా కొట్టుకోకండి. దేశ ప్రజలు తెలుగువారంటే అసహ్యించుకుంటారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి.