టిఆర్‌ఎస్‌ నుంచి పోటీకి ఆరుగురు రెడీ!

`కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎవరో మరి!

`బిజెపి మురిసినంత పండగ కాదు…మునుగోడు!

`ప్రతిపక్షాల అత్యుత్సాహం అసలుకే మోసం?

`రాజగోపాల్‌ కు బిజెపి శ్రేణుల సపోర్ట్‌ ఎంత అన్నది స్పష్టత లేదు?

`అనుచరులెవరూ రాజగోపాల్‌ తో రావడానికి సిద్ధంగా లేరు?

`కాంగ్రెస్‌ శ్రేణులు అసలే రారు!

`కాంగ్రెస్‌ లో సై అన్న ధైర్యం కనిపించడం లేదు?

`పోటీకి ఎవరున్నారో అభ్యర్థిని వెతకడం కష్టం?

`నేనంటే నేనే ఆరుగురు రెడీ!

`అందరూ అందరే!

`మునుగోడులో బలంగా గులాబీ..

`ఎవరికిచ్చినా టిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అడుగేసేటప్పుడు అందరూ ఆచితూచే వేస్తున్నామనుకుంటారు…కాలు జారితే గాని పడిన సంగతి తెలుసుకోలేరు…హెచ్చరించినా వినిపించుకోరు…తమ మంకు పట్టు వదులుకోలేరు…బొక్క బోర్లా పడేదాకా వాళ్ల ఆలోచన మానుకోరు. అలా ఎవరి చేతనో కూడా ప్రభావితమై కూడా తప్పటడుగులు చాలా మంది వేస్తారని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి వారిలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి… అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనకు టిక్కెట్టు ఇచ్చిన గెలిపించుకున్న పార్టీ వెళ్లొద్దని వారిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే రోధిస్తోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ని దూషించినా సరే…ఆయన వైపే సీనియర్లు ఆలోచనలు చేస్తున్నారు…రాజగోపాల్‌ రెడ్డి ని ఎలాగైనా ఆపాలన్న దృఢ నిశ్చయంతో అందరూ వెళ్లి కలుస్తున్నారు…ఎక్కడ రాజగోపాల్‌ రెడ్డి నిర్ణయం మార్చుకుంటాడో అన్న ఆందోళనలో బిజెపి వుంది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి అదిగో, వచ్చే ఇదిగో వచ్చే అంటున్నారు. బిజెపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి వస్తున్నారని ప్రకటన కూడా చేసేశారు. తాంబూలాలిచ్చుకోవడమే తరువాయి అని టైటిల్స్‌ వేసి వదిలేశారు. సినిమా వస్తుందా? రాదా? వచ్చినా నడుస్తుందా? అన్నది రాజగోపాల్‌ రెడ్డి చేతిలో మాత్రం వుంది. 

ఇదిలా వుంటే మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన క్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేయడానికి అరుగురు నాయకులు మేం రెడీ అంటున్నారు. వారిలో ఉద్యమ కారుడు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌. టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు. ఉద్యమ కాలంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు. 2014 ఎన్నికలలోనే టిఆర్‌ఎస్‌ టిక్కెట్టు ఆశించాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచనతో పాటు, సముచిత స్థానం వుంటుందని ఆశించాడు. అందుకు ఎమ్మెల్సీ అయ్యాడు. కాకపోతే ఎమ్మెల్యే కావాలన్న బలమైన కోరికతో వున్నాడు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలే వున్న మాస్‌ లీడర్‌…కొన్ని మండలాలను ప్రభావితం చేయగల నాయకుడు. 

ఇక కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి. టిఆర్‌ఎస్‌ నుంచి 2014లో మునుగోడు నుంచి గెలిచాడు. ఉద్యమ కారుడు. నియోజకవర్గం మొత్తం పట్టున్న నాయకుడు. ఎంత పట్టున్నా ఒక్కసారి పట్టుజారితే రాజకీయాలలో మళ్లీ అందుకోవడం కష్టం. అందుకే ఈ తరం నాయకులు ఎప్పుడూ పదవి చేజారకుండా చూసుకుంటుండాలి. లైమ్‌ లైట్‌ లో వుండాలి. అందులోనూ పార్టీ అధికారంలో వున్నప్పుడు పదవి చేజార్చుకోకుండా వుండాలి. కానీ గత ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ సెట్టింగులంతా మరింత మెజారిటీతో గెలిస్తే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. దాంతో ఒక వేళ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తే, ఉప ఎన్నిక వస్తే మరో సారి అవకాశం వస్తుందని తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. టిక్కెట్టు తనకే వస్తుందని నమ్ముతున్నాడు…పార్టీ ఊపులో వున్నప్పుడే పదవి జార్చుకున్నాడు…ఇప్పుడు సంపాదించుకుంటాడా? అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమౌతోంది. మరో నాయకుడు కంచర్ల కృష్ణా రెడ్డి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి సోదరుడు. ఉమ్మడి జిల్లా ప్రజలకు మంచి సుపరిచితమైన నాయకుడే…కాకపోతే టిఆర్‌ఎస్‌ లో చేరి ఎంతో కాలం కాలేదు…. అయినా పోటీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. జిల్లాలో తమ కుటుంబానికి వున్న స్థానం పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అవకాశం కోసం తన ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు. గత ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. మునుగోడు లో అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధం అంటున్నాడు. 

మునుగోడు నియోజకవర్గం విషయానికొస్తే ఓటర్లలో ఎక్కువ శాతం పద్మశాలి, ముదిరాజ్‌ సామాజిక వర్గం ఉంది.ఒక వేళ మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన పక్షంలో తమకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గ నేతలు కోరుతున్నారు. వారిలో కర్నాటి విద్యాసాగర్‌ పద్మశాలి వున్నారు. ఇక మిగిలిన నాయకుడు నారబోయిన రవి. మునుగోడు జడ్పీటీసి స్వరూపారాణి భర్త. రియలెస్టేట్‌ వ్యాపారంలో వున్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన ముదిరాజ్‌ ల ఓట్లు గుండుగుత్తగా కొల్లగొడతానంటున్నాడు. మునుగోడులో తనదైన శైలిలో చక్రం తిప్పి బిజెపి లో తనదైన ముద్రను చాటాలనుకుంటున్నాడు ఈటెల. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో ఈటెల రాజేందర్‌ కొంత కాలంగా రాజగోపాల్‌ రెడ్డి వెనుక వుండి నడిపిస్తున్నాడని సమాచారం. మునుగోడులో రాజగోపాల్‌ రాజీనామా చేస్తే గెలిపించుకునే క్రమంలో ముదిరాజ్‌ ల ఓట్లు కొల్లగొట్టేలా చూసే బాధ్యత నాది అని ఈటెల అంటున్నారట. 

ఇదంతా గతంలో ఓసారి డిల్లీ పర్యటన సమయంలో ఎంపి.కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కారులో ఈటెల రాజేందర్‌ ప్రత్యక్షమయ్యారు. దాంతో అందరూ ఈటెల కాంగ్రెస్‌ వైపు చూస్తున్నాడా! అన్న ప్రచారం మరోవైపు చేసి, కోమటి రెడ్డి కుటుంబంతో ఈటెల రాజకీయం ఇటు మలపాలని చూశాడు. మొత్తం మీద రాజగోపాల్‌ రెడ్డి బిజెపి చేరేలా ఈటెల రాయబారం జరిపినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి రాజగోపాల్‌ భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఒక రకంగా రాజగోపాల్‌ ఒత్తిడిలో వున్నట్లు మాత్రం స్పష్టమౌతోంది. 

ఇంతకీ రాజగోపాల్‌ ఏదీ సూటిగా చెప్పడం లేదు…డైలమాలో వున్నట్లు స్పష్టమౌతున్నా క్లారిటీగా వున్నా అనుకుంటున్నాడు. తాను రాజీనామా చేసే విషయాన్ని ఏకంగా ప్రజలనే అడుగుతానంటాడు. ప్రజలు వద్దంటారా? తమ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటే కాదంటారా? హుజూరాబాద్‌ లాగా హుటాహుటిన పనులు జరగాలని ప్రజలు కోరుకోరా! ప్రజలు కూడా ఎప్పుడు రాజీనామా చేస్తాడా? రాజగోపాల్‌ అనే చూస్తున్నారు. ఈ సంగతి రాజగోపాల్‌ రెడ్డికి అర్థమైపోయింది. దాంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు ముందుకు పోతే ఎలా వుంటుందో ఇప్పటికిప్పుడు ఎవరూ ఏదీ చెప్పలేము. మునుగోడు లో బిజెపికి పెద్దగా బలం లేదు. గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఆరువేలు. రాజగోపాల్‌ రెడ్డికి గత ఎన్నికలలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకుని గెలిచాడు. ఇప్పుడు బిజెపి ఒంటరి పోరు. అసలక్కడ క్యాడర్‌ లేదు. కనీసం తన క్యాడరైనా రాజగోపాల్‌ తో వస్తుందా! అన్నదాని మీద క్లారిటీ లేదు. పది మందో, మందో వస్తే సరిపోతుందా? ఇక రాజగోపాల్‌ రెడ్డి తో కాంగ్రెస్‌ క్యాడర్‌ వచ్చే అవకాశమే లేదంటున్నారు. ఇక కాంగ్రెస్‌ కు ఏడుపొక్కటే మిగిలింది…. మేఘాలు, ఉరుములు లేని తుఫాను తమ పార్టీ ద్వారా వస్తుందని, తమ పార్టీ ని బలిస్తుందని ఎవరూ కలలో కూడా కలగలనలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!