https://epaper.netidhatri.com/
` జగన్ పంతం…చంద్రబాబు పతనం!
`అందుకు ఆధ్యుడే చంద్రబాబు?
`జగన్ కల నెరవేరిన వేళ!
`కలలో కూడా కలగనని బాబు చుక్కలు చూసిన వేళ!
`జైలు, ఎన్నికలు ఈసారి ఎవరికి లాభం!
`ఆగి, ఆగి అదును చూసి….
`గురి చూసి గూడుకు దూరం చేసి..
`పంతం నీదా…నాదా…సై!
` కక్ష పూరిత రాజకీయాలు మొదలు.
హైదరబాద్,నేటిధాత్రి:
కుట్రలతోనే మొదలైన రాజకీయం కుట్రలతోనే ముగుయనుందా? అన్న సందేహం చంద్రబాబు విషయంలో నిజమౌతుందనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ఆది నుంచి కుట్ర రాజకీయాలే ఆయనకు కాలం కలిసొచ్చాలా చేశాయని, చివరకు పతనం కూడా కుట్రతోనే ఇంత దూరం తెచ్చాయని అనుకుంటున్నారు. ఏ కుట్రలైతే ఆయనను ఉన్నతికి కారణమయ్యాయో…అవే చంద్రబాబు రాజకీయ పతనానికి దారి వేస్తున్నాయంటున్నారు . యూనివర్సిటీలో విద్యార్ధి దశలో వున్నప్పుడే ఆయన కుట్ర రాజకీయాలను నేర్చుకున్నారని అంటారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఆయనను ఎమ్మెల్యేను చేస్తే, ఆ పార్టీనే నిండా ముంచడంతో తొలి కుట్రకు నాందిపలికాడు చంద్రబాబు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయిన చంద్రబాబు ఆదే సమయంలో మంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు మంత్రి కావడం మూలంగానే ఎన్టీఆర్ తన కూతరు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లిచేశారు. తదనంతర కాలంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌లో వున్నాడు. ఏకంగా ఎన్టీఆర్ మీదనే పోటీ చేస్తానని సవాలు విసిరారు. 1983 ఎన్నికల్లో ఓడిపోయాడు. దాంతో కాంగ్రెస్‌కు హాండ్ ఇచ్చి తెలుగుదేశంలో చేరాడు. ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదేండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్ చంద్రబాబుకు బాగా కలిసి వచ్చింది. పార్టీని కాపాడే యత్నంలో చంద్రబాబు ఆనాడే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. అప్పటి వరకు రాజకీయాల్లో క్యాంపుల పర్వం లేదు. దానికి ఆద్యుడు చంద్రబాబే. అలా పార్టీ మీద పూర్తి ఆధిపత్యం సాధించగలిగాడు. ఎన్టీఆర్ తర్వాత స్ధానానికి ఎదిగాడు. ఎన్టీఆర్ అల్లుడుగానేకాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కావడంలో అందరూ చంద్రబాబు పెత్తనం బాగా సాగుతూ వచ్చింది. అనూహ్యంగా 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అన్నది అప్పట్లో ప్రచారం. అయితే 1989 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందని మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసిన ఎన్టీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. తిరిగి సారా నిషేదంతో మొదలు పెట్టి మద్యనిషేదం ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లాడు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టించి, మూడోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో లక్ష్మిపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో నందమూరి కుటుంబం పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కాని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, పార్టీలో చంద్రబాబు పెత్తనం తగ్గి, లక్ష్మి పార్వతి ప్రాభవం పెరిగిపోయింది. అది చంద్రబాబుకు కంటకింపుగా మారింది. ఎప్పుడైనా ఎన్టీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి అన్న ఆలోచన చంద్రబాబుది. అనుకోండా మధ్యలో లక్ష్మిపార్వతి వచ్చి చేరడంతో, ఆయన ఆశలు ఆదిలోనే గండిపడినట్లైంది. భవిష్యత్తులో తన కల నెరవేరకపోవచ్చన్న అనుమానం ఆ క్షణమే మొదలైంది. ఆదిలోనే లక్ష్మిపార్వతి పెత్తనం ఆపకపోతే, మొదటికే మోసం వస్తుందని ఏకంగా ఎన్టీఆర్‌నే పదవీచ్చుతుడిని చేశాడు . కుట్రల రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమర్ధి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్‌రావు, ఆఖరుకు చంద్రబాబు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు, అటు తెలంగాణకు, ఇటు కమ్మూనిస్టులకు, బిజేపికి, అమరావతి రైతులకు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై చేయాల్సినన్ని కుట్రలుచేశాడు. కుట్రల రాజకీయంతోనే రాజకీయ పబ్బం గడుపుతూ వచ్చాడు.
అదేంటో గాని కొన్ని అనుకోకుండా జరుగుతాయో?
కర్మ ఫలాలను గుర్తు చేసేందుకు జరుగుతాయో గాని, ఎన్టీఆర్‌ను పదవీచ్చుతుడిని చేసిన నాడు ఆయన వయసు 73 సంవత్సరాలు. చంద్రబాబు జైలు దాకా వెళ్లింది కూడా సరిగ్గా అదే వయసు. 2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పటి ప్రతిపక్ష వైసిపినుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపిలను తీసుకున్నాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచింది కూడా అదే సంఖ్య. ఇలా చంద్రబాబు కాలం తిరగబడుతుందని ఊహించలేదు. ప్రతి సారి తాను నిప్పు అంటూ చెప్పుకుంటూ, నలభై ఏళ్ల రాజకీయం గురించి గొప్పగా చెప్పుకునే చంద్రబాబు తనను ఎవరూ ఏం చేయలేరంటూ బీరాలు పలికేవాడు. అసలు చంద్రబాబు రాజకీయ జీవితంలో అందర్నీ ఏడిపిస్తూ వచ్చాడు. తెలంగాణను గోస పుచ్చాడు. చివరకు జగన్ మూలంగా వెక్కి వెక్కి ఏడవాల్సిన పరిస్ధితి వచ్చింది. అప్పుడే చంద్రబాబు పతనం మొదలైంది. తన రాజకీయ పబ్బం గడవడానికి ఎంతకైనా దిగజారడం చంద్రబాబుకు మాత్రమే తెలుసు. తన రాజకీయ అవసరం కోసం పార్టీలతో జత కట్టడం మళ్లీ దూరం చేసుకోవడం కూడా ఆయనకు అలవాటు. అయితే తన కొడుకు వయసు వున్న జగన్ విషయంలో చంద్రబాబు ఆది నుంచి అనుసరించిన విధానమే నేడు ఈ పరిస్ధితికి కారణమైంది.
ముఖ్యమంత్రిగా వైఎస్. రాజశేఖరరెడ్డి పాలన మొదలైన సమయంలో జగన్మోహనరెడ్డి రాజకీయాల్లో లేరు.
బెంగుళూరులో ఆయన తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. 2005లో అనంతపురం జిల్లాకు చెందని పరిటాల రవీంద్ర హత్య జరిగింది. దానికి ప్రధాన సూత్రదారి జగనే అంటూ చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో లేవదీశారు. అసలు అప్పటి వరకు జగన్‌కు తెలుగు రాజకీయాల్లో లేరు. కాని రాజకీయాల్లోకి లాగి లేనిపోని ఆరోపణలు చేసి, జగన్‌ను వివాదాస్పదమైన వ్యక్తిగా చిత్రీకరించిందే చంద్రబాబు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ సిబిఐ ఎంక్వయిరీ వేశారు. ఆ దర్యాప్తు జగనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక దాంతో జగన్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు దొడ్డిదారిన కాంగ్రెస్ రాజకీయాల్లో తలదూర్చారు. కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి, జగన్‌ను జైలుకు పంపడంలో కీలక భూమిక పోషించాడన్నది అందరూ చెప్పుకునే మాట. అదే కోపం జగన్‌కు కూడా వుంది. కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా జగన్‌ను జైలు పాలు చేసినప్పటినుంచి జగన్‌ను అనేక రకాలుగా చంద్రబాబు వేదిస్తూ వచ్చారు. ఆర్ధిక నేరగాడు అంటూ, ఏవన్ ముద్దాయి అంటూ హేళన చేసేవారు. అసలు జగన్ పదో తరగతి చదివిన సమయంలో పేపర్ లీక్ చేశారంటూ ప్రచారం చేశారు. ఇలా అడుగడుగునా జగన్‌ను ఇబ్బందులుకు గురి చేశారు. తన కొడుకు వయసులో వున్న జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డాడు. జగన్ రాజకీయ జీవితాన్ని చిదిమేసే కుట్రలు చేశాడు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతిలో రైతుల చేను తలబడిపోయిన సమయం నుంచి ఆఖరుకు జగన్‌కు అసెంబ్లీకి రాకుండా చేసేదాకా వదిలిపెట్టలేదు. దాంతో జగన్ జనంలోకి వెళ్లాడు. పాదయాత్ర చేపట్టి, అధికారంలోకి వచ్చాడు. ఒంటరిగా పోటీ చేశాడు. తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి అదును కోసం జగన్ ఎదురుచూస్తూ వున్నాడు. చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి నుంచి మొదలు అన్నీ తవ్వితీస్తున్నాడు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డే ఏం చేయలేకపోయాడు? నువ్వెంత? అంటూ చంద్రబాబు ప్రతీసారి తన అహం ప్రదర్శిస్తూ వచ్చాడు. దాంతో స్కిల్ డెవలప్ మెంటు ప్రోగ్రామ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది జగన్ తన లక్ష్యం నెరవేర్చుకున్నట్లైంది. పదహారు నెలల పాటు జైలు జీవితం జగన్ అనుభవించడానికి కారణమైన వారిలో ఒకరైన చంద్రబాబుపై ప్రతికారం తీర్చుకున్నట్లైంది. అసలు రామోజీరావు లాంటి వారిపై రాజశేఖరరెడ్డికూడా ధైర్యం చేయలేదు. తానెంత మొండి ధైర్యవంతుడో జగన్ అక్కడ కూడా నిరూపించుకున్నాడు. మార్గదర్శిని మూసేయించేదాకా తెచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు జైలు జీవితం రుచి చూపించాడు. ఒక్క రోజైనా సరే చంద్రబాబుకు చుక్కలు చూపించాలనుకున్నాడు. అయితే ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టిన చంద్రబాబు, అదే ప్రతికార రాజకీయాలను చూడాల్సి వస్తుందని ఊహించలేదు. ఇదే కాలమహిమ అంటే…