చెరుకువైపే కాంగ్రెస్‌ మొగ్గు!

బడుగుల రాజకీయాలే మునుగోడులో మేలు

ఉద్యమ కారుడు, పిడి ఆక్ట్‌ ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన నాయకుడు చెరుకు

గౌడ్‌లను అణచి వేశారన్న చోటే నిలబెట్టాలని రేవంత్‌ నిర్ణయం

బడుగుల ఐక్యతతో గట్టెక్కాలని రేవంత్‌ తాపత్రయం!

సరికొత్త రాజకీయానికి తెరతీయాలని ఆలోచన

హుజూరాబాద్‌ లో ఈటెల ఆత్మ గౌరవం ఇక్కడ చెరుకుతో కాంగ్రెస్‌ కు అనుకూలం…

రెడ్డి, రెడ్డి మధ్య బిసితో గెలవాలని పద్మవ్యూహం పన్నుతోన్న కాంగ్రెస్‌

టిఆర్‌ఎస్‌, బిజేపిలు పునరాలోచన పడేలా కాంగ్రెస్‌ ఎత్తు!

టిఆర్‌ఎస్‌ అన్ని సర్వేలలో మొదటి వరుసలో వుంది…కూసుకుంట్లకు ఇవ్వకుంటే..నే!?

కాంగ్రెస్‌ నిర్ణయం తో మునుగోడు ఎటు మలుపు తిరిగేనో…

హైదరాబాద్‌,నేటిధాత్రి: ఓ వైపు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్నా, మరో వైపు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముందు బిజపి, టిఆర్‌ఎస్‌లను రెచ్చగొట్టి, తమకు తామే ఏదో సంక్షోభంలో వున్నట్లు వాతావరణం సృష్టించి, మునుగోడులో పద్మవ్యూహం పన్నేలా వుంది. అందుకు మునుగోడులో బడుగుల రాగం అందుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌పార్టీలో పిపిసి. అధ్యక్షుడు రేవంత్‌ సమక్షంలోనే తన ఇంటిపార్టీని సైతం విలీనం చేస్తూ, చెరుకు సుధాకర్‌ గౌడ్‌ చేరారు. అప్పటికే ఆయనకు ఒక ముందస్తు హమీ కూడా లభించినట్లే కనిపిస్తోంది. అయితే తాజాగా మూడు నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మాజీ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్‌ సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశానికి చెరుకు ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సమయంలోనే తన భావాలను కూడా చెరుకు సుధాకర్‌ మీడియాతో పంచుకున్నారు. పరోక్షంగా తనకే సీటు అన్నది ఒక రకంగా చెప్పకనే చెప్పేశారు. ఆ మరునాడే చెరుకు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చురకలు కూడా అంటించారు. అంటే తనను పార్టీ గుర్తించిందని చెప్పకనే చెప్పినట్లైంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే బడుగులు ఏకతాటి మీదకు రావాలన్న సమావేశాలు కూడా ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మొత్తంగా నల్లగొండ కాంగ్రెస్‌ రాజకీయమంతా ఓ వైపు వెంకటరెడ్డికి ప్రాధాన్యతనిస్తున్నట్లే పైకి కనిపిస్తున్నా, లోలోన ఎలా ఆయనకు చెక్‌ పెట్టాలన్నదానిపై ముమ్మర కసరత్తు జరుగుతోంది

రాజగోపాల్‌రెడ్డి వెళ్తున్నాడని తెలిసినా, ఆయన గత మూడేళ్లుగా బిజేపిపాట పాడుతున్నప్పటికీ వెంకటరెడ్డి ఏనాడు ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం తమ్ముడికి సూచించినట్లు కూడా దాఖలాలు లేవు. ఇదిలా వుంటే దేశమంతా కాంగ్రెస్‌ పార్టీ గత కొంత కాలం నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతోంది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోపాటు, రాహుల్‌ గాంధీని సైతం ఈడి. గంటల కొద్దీ కూర్చోబెట్టి విచారణ చేపట్టింది. దీనిపై దేశం మొత్తం కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమన్నది. ఎక్కడిక్కడ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు జరిపింది. సాక్ష్యాత్తు డిల్లీలో కూడా కాంగ్రెస్‌ పార్టీపెద్దఎత్తున నిరసన చేపట్టింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిల్లీలో వున్నా, పార్లమెంటు సమావేశాలకు హజరౌతున్నా, కాంగ్రెస్‌తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎక్కడా ఆయన కనిపించలేదు. కాని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసినేందుకు నిత్యం ఆయన పడిగాపులు పడ్డాడని మాత్రం తేలిపోయింది. ఇటు రాష్ట్రానికి వచ్చాక కూడా ఆయన కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించలేదు. కాంగ్రెస్‌ శ్రేణులు చేపట్టిన ర్యాలీలలో ఆయన పాల్గొనలేదు. కాని తమ్ముడి విషయంలో తనను రకరకాలుగా కాంగ్రెస్‌ శ్రేణులు తిడుతున్నాయంటూ, తాను మనస్తాపానికి గురైనట్లు మాత్రం ప్రకటించుకుంటూ వస్తున్నారు. అసలు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అన్నది ఒక్క కోమటి రెడ్డి సోదరులకేనా అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం తాను వెంకటరెడ్డి విషయంలో మాట్లాడిన ప్రతి మాటను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. పైగా భేషరుతుగా క్షమాపణ కూడా చెబుతున్నట్లు వెల్లడిరచారు. తాను కరోనాతో బాధపడుతున్నా, పార్టీలో జరుగుతున్న చర్చకు పుల్‌ స్టాప్‌ పెట్టాలని, వెంకటరెడ్డి పార్టీ కోసం పని చేయాలని కోరుకుంటున్నట్లు కూడా రేవంత్‌ చెప్పాడు. ఇక ఆయనతోపాటు చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, క్షమించమని అద్దంకి దయాకర్‌ ఇప్పటికే పలు మార్లు చెప్పడం జరిగింది. అయినా మనసు కరగని వెంకటరెడ్డి తెగేదాకా లాగుదామనే చూస్తున్నాడు. ఇక్కడ తెగిపోతే గాని ఆయన పార్టీ మారేందుకు అవకాశం రాదు…సందర్భం కనిపించదు. అందుకే తాను పార్టీలోనే వుంటానంటూ ఓ వైపు సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరో వైపు పార్టీ గురించి శల్య సారధ్యం వహిస్తున్నాడు. కాంగ్రెస్‌పార్టీకి దళితులను దూరం చేసే కుట్రను చేస్తున్నాడు. ఇది కాంగ్రెస్‌ పార్టీ గమనించింది. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డికి కూడా తత్వం బోధపడిరది. అద్దంకి దయాకర్‌ వెంట పెద్దఎత్తున మాల మహానాడు నాయకులు వున్నారు. ఆ వర్గం ఆయనకు అండగా నిలబడిరది. అలాంటి నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేస్తే దళితులు దూరమౌతారన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుగడ. అది పరోక్షంగా అటు బిజేపికిగాని, ఇటు టిఆర్‌ఎస్‌కు గాని ఉపయోపడితే చాలు అన్నంతగా ఆయన రాజకీయం చేస్తున్నారన్నది అర్దమౌతోంది. అందుకు రేవంత్‌ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాడు. మునుగోడులో ఎలాగైన కోమటిరెడ్డి బ్రదర్స్‌ చేతిలో రాజకీయంగా బలైన కులంగా గౌడ సామాజికవర్గ నేతలంతా వారిపై కత్తికట్టారు. ఇదే సరైన అదును అనుకొనే రేవంత్‌ కొత్తగా మునుగోడు బరిలో చెరకు సుధాకర్‌ను తెరమీదకు తేవాలని చూస్తున్నట్లు స్పష్టమౌతోంది. ఎక్కడైతే గౌడ్‌లను కోమటిరెడ్డి సోదరులు గౌడ్‌ల నాయకత్వాన్ని అణచి వేశారో అక్కడే ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే, కోమటిరెడ్డి సోదరుల హవాను పూర్తిగా తగ్గించినట్లౌవుంది. వెంకటరెడ్డికి కూడా పొగ పెట్టినట్లౌతుంది. వెంకటరెడ్డి నోటి దూల కూడా ఎంత దూరం తేవాల్నో అంత దూరం తెచ్చి ఒంటరిని చేసేస్తుంది. దాని వల్ల పార్టీలో చాలా మంది నేతలు సంతోషిస్తారనేదికూడా ఓ చర్చ జోరుగానే సాగుతోంది. 

చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఒకప్పుడు టిఆర్‌ఎస్‌లో కీలకభూమికపోషించిన ఉద్యమ కారుడే. ఆ పార్టీ పోలిట్‌ బ్యూరోసభ్యుడుగా కూడా కొనసాగాడు. కాకపోతే ఆయనపై పిడియాక్ట్‌ నమోదు చేసిన తర్వాత ఆ పార్టీ తనపై చూపించాల్సినంత శ్రద్ద చూపించలేదన్న మనస్తాపం చెరుకు సుధాకర్‌ గౌడ్‌లో గూడుకట్టుకొని వుంది. వరంగల్‌ జైలులో కఠినమైన కాగారాశిక్షను అనుభవించారు. ఏడాదికి పైగా ఆయన జైలు జీవితం గడిపారు. ఆగష్టు 31 1961లో జన్మించిన చెరుకు సుధాకర్‌ ఎబిబిఎస్‌ చేశారు. విద్యార్ధి దశలోనే ఆయన తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు. 1997 నుంచి మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి మరింత ఉద్యమానికి తోడుపడ్డాడు. అయితే టిఆర్‌ఎస్‌ తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన సొంతంగా ఇంటిపార్టీ పెట్టుకున్నారు. 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. మొదట హైదరాబాద్‌లో తన వైద్య సేవలు మొదలుపెట్టిన చెరుకు సుధాకర్‌ తర్వాత నకిరేకల్‌, నల్గొండ, చౌటుప్పల్‌లలో నవ్య సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. మొదట పార్శిగుట్టలో పీపుల్స్‌ క్లినిక్‌ మొదలుపెట్టి, బర్కత్‌ పురాలో మరో క్లినిక్‌ ఏర్పాటు చేసి, తర్వాత తన వైద్య సేవలు జిల్లాలకు విస్తరించారు. నల్లగొండలో పేదల వైద్యుడిగా పేరు గాంచాడు. అలాంటి నేత తెలంగాణ ఉద్యమపోరాటంలో నిమగ్నమయ్యాడు. తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉద్యమం కోసం పనిచేశారు. ఇప్పుడు ఆయనను మునుగోడులో కాంగ్రెస్‌పార్టీ బరిలో దింపాలని చూస్తోంది. 

హుజూరాబాద్‌ ఈటెల రాజేందర్‌ పోషించిన ప్రచార పర్వం ఇప్పుడు చెరుకు సుధాకర్‌ చేత కాంగ్రెస్‌ పార్టీ అదే ఆత్మగౌరవాన్ని అడ్డంపెట్టుకొని ఎన్నికలను ఎదుర్కొవాలని చూస్తోంది. ఉద్యమకారుడైన చెరుకుకు టిక్కెట్టు ఇవ్వడం వల్ల కాంగ్రెస్‌లో ఇప్పటికే ఆశావహులను ఒక్కసారిగా చల్లార్చినట్లైవుంది. కోమటిరెడ్డి సోదరులు బిసిలను అణచివేస్తే, రేవంత్‌ నాయకత్వంలో అదే బడుగులకు ఆత్మగౌరవం నిలుపుతున్నారనే సంకేతాలు వెళ్లేలా చూసుకుంటున్నారు. చెరకు సుధాకర్‌కు టిక్కెట్టు ఇవ్వడం వల్ల ఆ నియోజకవర్గంలో వున్న మొత్తం బిసిల ఓట్లు గుంపగుత్తగా కొల్లగొట్టొచ్చనేది కాంగ్రెస్‌ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే బిజేపి ఎలాగైనా రాజగోపాల్‌రెడ్డికే టిక్కెట్టు ఇవ్వాల్సివుంటుంది. టిఆర్‌ఎస్‌ ఇప్పటికే కూసుకుంట్లకు ప్రకటించినంత పనిచేస్తోంది. కాని ఆయనకు నియోజవకవర్గంలో పెద్దఎత్తున వ్యతిరేకత కనిపిస్తున్నట్లు కూడా రాజకీయ వాతావరణం తయారైంది. దాంతో టిఆర్‌ఎస్‌కూడా అంతర్మధనంలో పడేలా కాంగ్రెస్‌ ఎత్తుగడలకు శ్రీకారం చుట్టినట్లు అర్దమౌతోంది. మరి టిఆర్‌ఎస్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక కూసుకుంట్ల వైపు మొగ్గు చూపుతుందా? అన్నది కొంత కాలం ఆగితే గాని స్పష్టత రాదు. కాకపోతే కాంగ్రెస్‌ వేసే బిసి పాచిక మాత్రం పారుతుందన్న నమ్మకం చాలా మంది వ్యక్తంచేస్తున్నారు. ఈ మధ్య ఆత్మ సాక్షి అనే ఓ సంస్ధ నిర్వహించిన సర్వేలో టిఆర్‌ఎస్‌కు 44శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వుందని తేల్చింది. అది కాపాడుకోవాలంటే టిఆర్‌ఎస్‌ తన నిర్ణయంలో మార్పు తీసుకుంటే , మాత్రం కారు జోరుకు అడ్డుకట్ట ఎవరూ వేయలేరు. లేకుంటే హస్తం పాచిక పారొచ్చు. బిజేపి కథ కంచికి చేరొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!