చెప్పుడు మాటల చే(వే)టు!?

` బండి పదవికి వచ్చిన గండం!

`కిషన్‌ రెడ్డికి ఇష్టం లేని కష్టం!?

` సాఫీగా సాగుతున్న రాజకీయానికి గుదిబండ కట్టడం!

`చెవులు కొరక్కోవడమే అసలు సిసలు రాజకీయం!

` గోడలకు చెవులుంటాయంటే ఇదే!

` బండిని దించి సాధించిందేమిటి?

` దించే దాకా అందరూ ఎప్పుడూ అని ఎదురుచూసిన వాళ్లే!

` బండి దిగితే గాని తత్వం బోధపడలే?

` ఊపు, ఊపనుకున్న వాళ్ల వాపు పోగొట్టుకున్నారు?

` చే’జేతులా కమలం వాడగొట్టుకున్నారు!

` చేతికి లేని బలం కల్పించారు.

` కర్నాటక మాదే…మాదే అని చేతికి వశం చేశారు.

`తెలంగాణలో చేతులెత్తేశారు?

` కమలం కకావికలం చేసుకున్నారు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

బిజేపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఒక్క మాట ఆ పార్టీ డొల్లతనాన్ని బైటపెట్టింది. ఆయన కావాలని అన్నా, ఆచాచితంగా అన్నా, తనకు కలిగిన బాధను మాత్రం వ్యక్తం చేశాడు. ఇంత కాలం తనలో దాచుకున్న ఆవేధన బైటపెట్టుకున్నాడు. గత మూడు రోజుల కిందట ఆంతరంగికులతో చెప్పుకుంటూ బండి సంజయ్‌ మధనపడుతున్నాడంటూ వచ్చిన వార్తను నిజం చేసినంత పనిచేశాడు. సరిగ్గా కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమం రోజున ఆయనను కలచివేసిన సంఘటన గురించి నోరు విప్పాడు. అంటే బిజేపిలో చెప్పుడు మాటలు, అటు మాటలు, ఇటు మాటలు అటు కూడా చెల్లుతాయన్నది సంజయ్‌ మాటలతో తేలిపోయినట్లైంది. ఈ విషయంలో మీడియాలో ఎన్ని రకాల వార్తలు వచ్చినా ఏదో బలమైన కారణం వుంటుందనే అందరూ అనుకున్నారు. కాని పార్టీకి ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ లాంటి నాయకుడిని సమయం వస్తే పార్టీ పక్కన పెడుతుందని తెల్చిచెప్పినట్లైంది. ఇందులో రెండు రకాల కోణాలు చూడొచ్చు. ఎంతటి వారైనా సరే పార్టీయే సుప్రిం అని చెప్పడం ఒకటి అయితే, పార్టీ వద్దనుకుంటే ఎంతటివారినైనా పక్కన పెడుతుందని సంకేతాలు పంపినట్లైంది. అయితే ఇది ఒక రకంగా బండి సంజయ్‌కు శిక్ష కాకపోయినా, పార్టీ శ్రేణులు పడుతున్న ఆవేదన మాత్రం క్షక్షగానే చూస్తున్నారు. బండి సంజయ్‌ లాంటి నాయకుడు బిజేపిలో ఎంత మంది వున్నారన్నదానిపై కూడా చర్చ జగాల్సిన అవసరం వుంది. అసలు బండి సంజయ్‌ వల్ల ఎవరు నష్టపోయారు? ఎలా నష్టపోయారు? ఎంత నష్టపోయారు? అన్నది కూడా ఇక్కడ చర్చించాల్సిన అంశమే..అయితే బండి సంజయ్‌ అధ్యక్షుడిగా వున్నంత కాలం ఆయన ఎప్పుడు దిగిపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లు కూడా కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో ఒక రకంగా మొసలి కన్నీరు కార్చారనన్న అపవాదు కూడా వినిపించింది. అసలు బండి సంజయ్‌ ఆ మాట ఎందుకన్నారు? ఎవరిని ఉద్దేశించి అన్నారు? అన్నదానిపై రాష్ట్రంలో చర్చ జోరుగా సాగుతోంది. అదేంటో గాని పార్టీలో చేయాల్సినంత చేవారు. తర్వాత అన్ని వేళ్లూ ఈటెల రాజేందర్‌ వైపు చూస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరిన వాళ్లు అంటే మొదటి నుంచి పార్టీలో వున్నవారు అంటూ ఎవరూ లేరు. నిజామాబాద్‌ ఎంపి. ధర్మపురి అరవంద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో సహా అందరూ కొత్త వాళ్లే. కాకపోతే పార్టీని పట్టుకొని కొన్ని దశబ్ధాలుగా వున్నవారు మాత్రం పెద్దగా తెరమీద లేరు. అంటే బండి సంజయ్‌ మీద ఎంత మంది నివేదికలు ఇచ్చారన్నదానిపై పెద్దగా లోతైన చర్చ అవసరమేలేదు. ఆయన అధ్యక్షుడుగా వున్న సమయంలో మొదట్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రతిసారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నాడు. బండి సంజయ్‌ తనకు ప్రాధాన్యతనివ్వడం లేదన్నది కూడా పలుమార్లు మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమానికి కూడా రఘునందన్‌ రావును ఆహ్వానించలేదన్నది కూడా భహిరంగ రహస్యమే..అయితే బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసే సమయంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికలో రఘునందన్‌ రావు పేరు బలంగా వినిపించింది.

ఎందుకంటే రఘునందర్‌ రావు కూడా మంచి వక్త. అందరూ రఘునందర్‌రావుకు పదవి దక్కుతుందని అనుకున్నారు. కాని అనూహ్యంగా బండి సంజయ్‌ పేరు తెరమీదకు వచ్చింది. నిజానికి అప్పటికి బండి సంజయ్‌ సమర్ధత ఎవరికీ తెలియదు. కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే కరీంనగర్‌ ఎంపిగా గెలవడంతో ఆయన ఒక్కసారిగా దూసుకొచ్చారు. వచ్చీ రావడంతో రాష్ట్రపార్టీ అధ్యక్షుడయ్యాడు. అలా పార్టీ పగ్గాలు చేపట్డాడో లేదో..తనేంటో చూపిస్తూ వచ్చాడు. పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతే కాదు ఇంతలో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందర్‌ రావుకు సెంటిమెంటు రాజకీయం నెరిపి, బండి సంజయ్‌ తనదైన శైలిలో ప్రచారం నెరిపారు. సిద్దిపేటలో పోలీసులు ఎన్నికల ప్రచారంలో కొడుతున్నట్లు, కారులో పిడుగుద్దులు గుద్దినట్లు అరవడం మొదలుపెట్టాడు. అది పెద్దఎత్తున వైరల్‌ అయ్యింది. పార్టీకి మైలేజ్‌ తెచ్చిపెట్టింది. పార్టీ మీద సానుభూతి పెద్దఎత్తున పెరిగింది. దుబ్బాకలో రఘునందన్‌ రావు వైపు ప్రజల మొగ్గు మరింత పెరిగింది. కాకపోతే దుబ్బాక కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే గెలిచినట్లు ఇటీవల డిల్లీలో రఘునందన్‌ వ్యాఖ్యానించడం జరిగింది. ఆఫ్‌ది రికార్డు చెప్పిన మాటలును వృత్తి దర్మానికి వ్యతిరేకంగా ఎలా ప్రసారం చేస్తారంటూ మీడియాకు కూడా రఘునందన్‌ నీతి సూత్రాలు చెప్పాడు. కాకపోతే తాను కూడా పార్టీ అధ్యక్ష రేసులో వున్నానని మరోసారి స్పష్టం చేశారు. అంటే బండి ఎప్పుడు దిగిపోతాడా? అని ఆయన కూడా ఎదురుచూసినట్లే లెక్క? 

 బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడైన సమయంలో నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌పేరు ప్రముఖంగా వినిపించింది. 

వస్తూ వస్తూనే ఆయన ఎంపి అయ్యారు. పైగా రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం కావడం. చిన్నప్పటి నుంచి దగ్గరుండి రాజకీయాలను చూస్తూవుండడం ఆయనకు ప్లస్‌ అవుతాయని అందరూ అనుకున్నారు. కాని పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్‌ను నియమించారు. ఆయన ఆశలు ఆవిరైనట్లున్నాయి. కాని ఇటీవల కల్వకుంట్ల కవిత విషయం వచ్చే దాకా ఆయన ఇంత కాలం బైట పడలేదు. బండి సంజయ్‌ నిజామాబాద్‌ మాజీ ఎంపి, ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అది నానుడి వాడినట్లు వాడినా మహిళల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది బండి సంజయ్‌ మర్చిపోయాడు. ఈ విషయంలో అరవింద్‌కు సంజయ్‌ అడ్డంగా దొరికనట్లైంది. నిత్యం తెల్లారిలేస్తే కల్వకుంట్ల కవితను తూర్పారపట్టే అరవింద్‌ బండి సంజయ్‌ వ్యాఖ్యలను తప్పు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పార్టీ పరమైన చర్యలు వుంటాయని కూడా ఆయన ఆనాడే ప్రకటించాడు. కాలం మూడు నెలలు గడిచింది.. అంతే బండి సంజయ్‌ పదవి పోయింది. కాకపోతే ఇటీవల వరకు కూడా కేంద్ర పెద్దలు ఎవరు వచ్చినా, సందర్భం వచ్చిన ప్రతీసారి బండిని మార్చే ప్రసక్తి లేదంటూ వచ్చారే గాని, చూద్దామని అనలేదు. కాని మార్చేశారు. అందుకు కారణం ఇటీవల పార్టీలో చేరిన ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్ది రాజగోపాల్‌రెడ్డిలు పనిగట్టుకొని, సంజయ్‌ మీద పిర్యాధులు చేశారన్న వార్తలు మాత్రం ఇప్పటికీ చెక్కర్లు కొడుతూనే వున్నాయి. అది నిజమా? కాదా? అన్నది బండి సంజయ్‌ వ్యాఖ్యల్లో కూడా నర్మగర్భంగా వెలుగులోకి వచ్చింది. వాళ్లే అని ఆయన నేరుగా చెప్పకపోయినా, అంతటి సమర్ధులు వాళ్లే అన్నది మాత్రం పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. బండిని దింపేసి, ఈటెలకు మరో కొత్త పదవి ఇవ్వడంతో ఆయన డిల్లీ నుంచి వస్తూ, వస్తూనే హడావుడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరీ ఆలోచింపజేసేవిగా వున్నాయి. అంటే ఒక రకంగా ఆశ్యర్యపోయేట్లుగా చేశాయని చెప్పొచ్చు. బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించారని తెలియగానే ఏడ్చేశాను అని స్వయంగా ఆయనే చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యచతుకిల్ని చేసింది. ఏది ఏమైనా రొయ్యలు మాయమయ్యాయి. ఎవరు తిన్నారన్నది మాత్రం అర్ధం కాకుండా వుంది. బండి పదవి కరిమింగిన వెలగపండైనది. కాకపోతే బండి తెచ్చిన ఊపు మాత్రం బిజేపికి ఎప్పుడూ గుర్తుంటుంది. గుర్తు చేసుకుంటుంది. కిషన్‌ రెడ్డి వల్ల పార్టీకి ప్రయోజనం జరగక్కపోతే మాత్రం బండిని అనవసరంగా దించేశామని మధనడతుంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. బడుగుల పట్ల రాజకీయ పార్టీలన్నీ ఒకేలాగా వుంటాయన్నది మాత్రం నిజమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *