స్టడీ టూర్ లో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు
గోవాలోని ప్రఖ్యాత శిక్షణా కేంద్రం సందర్శన
ఖమ్మం, జనవరి, 23:
ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో చమురు సంస్థల స్థాపనలో భద్రత, రక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని.. వీటి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని రాజ్యసభ ఎంపీ, పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా సూచించారు. పెట్రోలియం సహజవాయువు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యయన యాత్రలో భాగంగా చివరి రోజు కమిటీ సభ్యులు గోవాలో పర్యటించారు. కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి నేతృత్వంలో సభ్యుల బృందం గోవాలో ప్రతిష్టాత్మక ఓ ఎన్ జీసీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రఖ్యాత IPSHEM శిక్షణా కేంద్రాన్ని సందర్శించింది. అక్కడ పలు చమురు కంపెనీల ప్రతినిధులు, వాటి నిపుణులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని చమురు సంస్థల్లో ఇప్పటికే అమలవుతున్న భద్రత, రక్షణా చర్యలపై సమీక్షించారు. అనంతరం కమిటీ సభ్యులు పలు సూచనలు చేసి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యయన యాత్ర ముగించుకుని ఎంపీ రవిచంద్ర రాత్రికి హైదరాబాద్ నగరం చేరుకున్నారు.